ఎదుగుతున్న పిల్లల్ని చూసి సంతోషపడని తల్లిదండ్రులు ఎవ్వరూ ఉండరు. పిల్లలకు అడుగడుగునా జాగ్రత్తలు చెప్పుకుంటూ వారికి ఎలాంటి కష్టాలు కలగకుండా ఉండేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. పసితనమంతా
అల్లరి, సరదాలు, ఆటల, పాటలు సంతోషాలు కేరింతలతో గడిచిపోతుంది.
కానీ పిల్లలకు వయసు పెరిగే కొద్దీ అవగాహన వారిలో మెరుగవుతున్న కొద్దీ తల్లిదండ్రులకి వారి భవిష్యత్తు పట్ల తెలియకుండానే కాస్తంత ఖంగారు, భయం ఏర్పడతాయి. అందుకు కారణం వారి వారి చిన్నారుల పట్ల వారికి ఉన్న ప్రేమ వాత్సల్యాలే. తాము పడ్డ కష్టాలను తమ పిల్లలు పడకూడదు అని కోరుకునే తల్లిదండ్రులే ఎక్కువ శాతం మంది. పిల్లల చదువుల విషయానికొస్తే ఏ తల్లిదండ్రులైన మా పిల్లలు బాగా చదువుతారు అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు.
వారి పిల్లలు చదువులో కాస్తంత వెనుకబడినా ట్యూషన్ పెట్టి వారి వారి ప్రయత్నాలను వారు చేస్తారు. తల్లిదండ్రులు అలా ఉన్నారు కాబట్టే పిల్లలు ఇంతగా ఒత్తిడికి లోనవుతున్నారు అందులో ఎలాంటి అనుమానం లేదు.
ర్యాంకుల, గ్రేడ్ల కాలం నడుస్తుంది ప్రస్తుతం సమాజంలో. చదువుల విషయాన్ని పక్కన పెట్టి కాస్తంత పిల్లల ప్రవర్తన గురించి చర్చిద్దాం. అడోల్సీన్స్ పీరియడ్ అంటే అందరికీ అవగాహన ఉంది కదూ.
ఉండే ఉంటుంది లేనిది ఎందుకంటే అందరం ఆ అధ్యయనాన్ని దాటి వచ్చిన వాళ్ళమే కదా. సాధారణంగా 10 నుంచి 19 సంవత్సరాల వయసు ను అడోల్సీన్స్ ఫేస్ అని అంటారు. నేషనల్ యూత్ పాలసీ ప్రకారం 13 నుంచి 19 ఏళ్ల వయసు కాలాన్ని అడోల్సీన్స్ అని వివరిస్తున్నారు. దీనినే యుక్త వయసు అని అంటారు. యుక్త వయసు అంటే పిల్లలు పెద్దవారుగా అవతరించబడే కాలం. మబ్బులు చెదిరిపోగా ఆకాశం నిర్మలమైనట్టు వీరి దృష్టి సమాజం పట్ల మెరుగవుతూ వస్తుంది. మనం కాస్త లోతుగా ఆలోచించి చూస్తే
ఈ వయసులో వారికి విషయాల పరిశీలన శక్తి అనేది మొదలవుతుంది కానీ అర్థం చేసుకునే సహనం, అర్థం చేసుకోగలిగిన అనుభవం లేవు కనుక సందిగ్ధతతో
తికమక పడుతూ తప్పటడుగులు వేస్తూ ఉంటారు. ఒకప్పుటి కాలంతో పోలిస్తే నేటి వ్యవహారాలు భిన్నమైనవి. ఒకప్పుడు మనుషులు పెద్ద వాళ్ళకి, సమాజానికి గౌరవాన్ని ఇచ్చేవారు వారి వ్యవహారాలను మితపరచుకుంటూ వారికి వారే కంచెలను కట్టుకుంటూ భయభక్తులతో మెలిగేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.
సమాజం కన్నా సోషల్ మీడియా ప్రభావం మనపై ఎక్కువ శాతం లో ఉండడం వల్ల ఎన్నో విషయాలు ముందుగానే అవగాహనకు రావడం. దాంతో ఎవరికి వారు సొంత నిర్ణయాలను తీసుకోవడం షరామాములైపోయింది. ఫస్ట్ లవ్ అంటూ చిన్న వయసులోనే ప్రేమించడాలు,
పెద్ద పెద్ద ఆలోచనలు చేయడం, మితిమీరి పరిమితులను దాటడం వల్ల
అనుకోని ఆపదలను కొని తెచ్చుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మన యువకులు. పిల్లల ప్రవర్తనను కట్టడి చేయలేక కొట్టినా తిట్టినా వారు తెగించి ఆత్మహత్య లాంటివి చేసుకుంటారేమో అని భయపడుతూ క్షోభకు గురి అవుతుంటారు తల్లిదండ్రులు. అయితే ఈ యుక్త వయసు వారిని ఎలా దారిలో పెట్టాలి అనేది పెద్ద ప్రశ్న ఇక్కడ?
జీవితం పూర్తిగా అవగాహన లేదు కనుక వారు అలా ప్రవర్తించడంలో తప్పులేదు.
పిల్లలది మూర్ఖత్వమే సరే, కానీ పెద్దలు వ్యవహరించేది సమంజసమేనా అనేది కూడా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఈ వయసు పిల్లలతో ఓపికగా వ్యవహరించాలి. వారి నడవడి ద్వారా తల్లిదండ్రులకు ఖచ్చితంగా అర్థమవుతుంది వారేదో తప్పుదారిలో పయనిస్తున్నారని అప్పుడు వెంటనే వారిని కొట్టడం, వారికి ఆంక్షలు విధించడం, మాటలతో వారిని గాయపరచడం ద్వారా వారి ప్రవర్తన మరింత దిగజారే అవకాశాలు ఎక్కువ. అందుకే పిల్లలు చెడ్డ సావాసాలు, చెడు మార్గంలో
నడుస్తున్నప్పుడు తల్లిదండ్రులే కాస్తంత సహనంతో వ్యవహరించి వారిని దారికి తెచ్చుకోవాలి. చాలా వరకు తల్లిదండ్రులు పిల్లలతోవారి వారి ప్రేమ వ్యవహారాల గురించి చర్చించడానికి ఇష్టపడరు. పిల్లలకు చెప్పకూడని విషయాలే అయినా చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చెప్పి తీరాలి.
ఎందుకంటే సినిమా, జీవితం ఒకటి కాదు అన్న విషయం వారికి తెలిసేలోగా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. కనుక తల్లిదండ్రులే చొరవ తీసుకుని వాస్తవాలను అర్థమయ్యేలా వివరించగలిగితే వారి రేపటి జీవితాలు సుఖంగా ఉంటాయి అనడంలో ఇలాంటి సందేహాలు లేవు.