లాలుదర్వాజ బోనాలు

ఆషాఢ బోనాల పండుగ సందర్భంగా

                      రూపా

ఉత్సవాలు అంటే ఇష్టపడని మనుషులు ఉంటారా..?! అందులోనూ హైదరాబాదీలు ?! అందులోనూ పాతబస్తీ వాసులు ?! అందులోనూ బోనాల ఉత్సవాలు?! బోనాల పేరు తలవంగానే పాతబస్తీ ప్రజల మొహాల్లో వెలుగు నిండి పోతుంది. ఇక్కడ బోనాలు భలే వైభవంగా జరుగుతాయి.

పండగలు ఆ ప్రాంతపు సంస్కృతికి అద్దం వంటివి. పండగలు జరుపుకునే తంతు (విధివిధానం) ఆయా సమాజపు సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. తెలంగాణాలో హైదరాబాదు సంస్కృతి ప్రత్యేకమైనదైతే హైదరాబాద్ మొత్తంలో పాతబస్తీ రీతి రివాజు ప్రత్యేకమైనవి. అందువల్ల ఇక్కడ జరుపుకునే బోనాల పండగ కూడా ప్రత్యేకమైనది.
ఆషాఢమాసం తొలి ఆదివారం గోల్కొండ లోని జగదంబికా ఆలయంలో అట్టహాసంగా ప్రారంభమై , అటునుంచి లష్కర్ బోనాలుగా బయలుదేరి రెండో ఆది వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం మీదుగా మూడో వారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం మీదుగా చివరి ఆదివారానికి లాలుదర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం చేరుకుంటుంది బొనాల పండగ.

పాతబస్తీలో ఆషాఢ నవరాత్రులుగా బోనాల పండుగ జరుపుకుంటారు. చివరి ఆదివారానికి ముందు మూడో శుక్రవారం నుంచే నవరాత్రుల సందడి మొదలౌతుంది.
పాతబస్తీలోని లాలుదర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంతో పాటు, హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయం, ఉప్పుగుడ మహంకాళీ ఆలయం, గౌలిపురా భరతమాత మాతేశ్వరీ మహంకాళీ దేవాలయం, సుల్తాన్ షాహి రేణుకా ఎల్లమ్మ ఆలయం. ఆలియాబాద్ దర్బార్ బంగారు మైసమ్మ ఆలయం, బేలా మాతేశ్వరీ ముత్యాలమ్మ దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, మేకలబండ నల్లపోచమ్మ ఆలయం, మీర్ ఏ ఆలం మండి మహాకాలేశ్వర స్వామి ఆలయాలు రంగులు, విద్యుత్ దీపాలు, పూల తోరణాలతో అందంగా ముస్తాబు చెయ్యబడతాయి.

నవరాత్రులు మొదటి రోజైన మూడవ శుక్రవారం ఉదయం ఆలయంలో గణపతి హోమం, సప్తశతి పారాయణము, దేవీ అభిషేకం, ద్వాజారోహన , శిఖర పూజ నిర్వహించి సాయంత్రము ఘట స్థాపన (కలశ స్థాపన) తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఘట స్థాపన కోసం సాయంత్రం శాలిబండ కాశీ విశ్వనాథ ఆలయం నుంచి అమ్మవారి రూపాల్లో అలంకరించబడిన ఘటాలు అంగరంగ వైభవంగా, బజంత్రీలు, డప్పు మోతలనడుమ సాగిన జూలుస్ గా సాగి ఆయా గుడులకు చేరుతాయి. గుడిలో ఉత్సవ విగ్రహాలుగా ప్రతిష్ట చేస్తారు.


తరవాతి రోజు నుంచి అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి తొమ్మిదవ రోజు మహ తొట్టెలను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. పదవ రోజైన చివరి ఆదివారం అమ్మవారికి బోనాల సమర్పణ చేసి, రాత్రికి గుడిలో శాంతి కళ్యాణం నిర్వహిస్తారు.

చేసే విధానం
బోనానికి రెండు రోజుల ముందునుంచే బంధు మిత్రులు రాకతో ఇళ్ళల్లో సందడి మొదలౌతుంది.
ఈ రెండురోజులు బోనంతయారీ, బోనం బైలెల్లడం, తొట్టెలు సమర్పణ బోనం సమర్పణ, పడి, విందు భోజనం, మరునాడు రంగం, ఘటం నిమర్జనం వంటి వివిధ క్రతువులతో పండగ జరుగుతుంది.
బోనాల మొదటి రోజు ఉదయం జానపదులు ఇంటి మధ్యభాగంలో బోనం స్థాపన చేస్తారు. గతంలో కండ్ల కుండ(రంధ్రాలు కుండ) లో బోనం సమర్పించేవారు. కానీ ఈ రోజుల్లో కొత్త కుండను సున్నము పసుపు కుంకుమతో అలంకరించి, వేప రెమ్మలు కట్టి అందులో తెల్ల అన్నం లేదా బెల్లం అన్నం ఉంచి దానిపై చిన్న కుండలో పచ్చి పులుసు లేదా పెరుగు లేదా ఉల్లిపాయ ఉంచి కంచుక పెట్టి దానిమీద దీపాన్ని వెలిగిస్తారు.
ఇంటి ఆడపడుచులు, స్త్రీలు, చిన్నారుల పట్టువస్త్రాలు, పువ్వులు గాజుల అలంకారాలతో ముస్తాబై బోనాన్ని నెత్తిన పెట్టుకొని, విడిగా ఓ కుండలో వేపాకులు వేసిన నీళ్ళు లేదా కల్లు, లేదా బెల్లం నీళ్లు తీసుకుని, మరో కుండలో పసుపు నీళ్ళను తీసుకొని, సంతాన మొక్కు చేసుకునే వారు తొట్టెల మోస్తూ డప్పు మోతలతో, పోతరాజు దరువులు (ఎర్ర వస్త్రం మొలకు కట్టుకొని, ఒళ్ళంతా పసుపు, మొహానికి కుంకుమ రాసుకొని, జులపాలు విరబోసుకుని, నిమ్మకాయల దండ ధరించి, శర్లకోల(కొరడా) కొట్టుకుంటూ మహా భీకరంగా కనిపించే పోతరాజు గజ్జె కట్టి వేసే చిందులు) చేస్తూ, గుగ్గిలం మైసాచి పొగల నడుమ బంధుమిత్ర సమేతంగా ఇంటింటి నుంచీ వచ్చిన బోనం జులుస్(ఊరేగింపు)గా అమ్మవారి ఆలయం చేరుకుంటారు. బోనం కుండ ఆలయంలోకి ప్రవేశించే ముందు బోనం ఎత్తిన వాళ్ళను అమ్మవారు ఆవహించినట్టుగా భావించి తమతో తెచ్చుకున్న పసుపు నీళ్ళను వాళ్ళ పాదాలపై గుమ్మరించి మొక్కుతారు. ఆలయ లోకి ప్రవేశించాక వెంట తెచ్చిన వేపాకు నీళ్లు లేదా కల్లు లేదా బెల్లం నీళ్లు అమ్మవారి ముందు సాకం పొస్తారు, బోనంకుండ అన్నంలో కొంత తీసి ‘పడి’ (బలిఅన్నం కుప్పగా పోయడం) తీసి పాకం సమర్పిస్తారు.


తొట్టేల గుడి వద్ద ఉండే చెట్టుకు లేదా గుడి పక్కన పాతిన గుంజకు కడతారు. అమ్మవారికి నివేదన తరవాత మిగిలిన బోనంతో బంధుజన పరివారంతో కలిసి విందుభోజనంతో మహా ప్రసాదంగా ఆరగిస్తారు.
ఆ రాత్రి జనాలు నిద్రపోయాక 12 గంటల తరవాత బలి అన్నాన్ని(పడి) వీధి వీధిలో చల్లుతారు. దీనివల్ల దుష్టశక్తులు పారిపోతాయని నమ్ముతారు.
రెండోరోజు ఆలయం వద్ద రంగం కార్యక్రమంలో పెళ్ళికాని ఓ స్త్రీ అమ్మవారిని ఆవాహన చేసుకుని పచ్చికుండపై ఎక్కి భవిష్యవాణి చెబుతుంది. (పూర్వం గావు పెట్టడం వంటి క్రతువులు జరిగేవి. నిషేధించడం జరిగింది)
ఆ తరవాత ఘటాన్ని పలహార బండ్లు, డప్పు, పోతరాజు సందడిలో జులూస్ తీసి నాయాపుల్ దగ్గర ముసిలో ఘటాల నిమర్జనం చేస్తారు. దీనితో పండగ తంతు పూర్తి అవుతుంది.

నమ్మకాలు: తెలంగాణ ప్రాంతంలో ఇక్ష్వాకుల కాలం నుంచీ కూడా శక్తిని వివిధ స్త్రీరూపాలలో ఎల్లలు కాపాడే ఎల్లమ్మ, పొలిమేరను రక్షించే పోచమ్మ, ఈత చెట్లల్లో ఈదమ్మ, బాలాత్రిపురసుందరిని బాలమ్మ, మహిషాసుర మర్ధిని మైసమ్మగా అనేక పేర్లతో పిలుచుకుని గ్రామ దేవతలుగా ఆరాధిస్తారు. ఆషాఢ మాసంలో దేవి పుట్టింటికి వస్తుందని, దేవిని తమ ఇంటి ఆడపడుచగా భావించి తాము ఇష్టంగా తినే పదార్థాలను బోనం వండి సకలఅర్యదలతో నైవేద్యం సమర్పించి ఆతిత్యం ఇస్తారు. చీర గాజులు పువ్వులు పెట్టీ మురిసి పోతారు. పిల్లలు లేని వారు తొట్టెలు సమర్పిస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. ఊరేగింపును నడిపించే అమ్మవారి సోదరుడుగా భావించే పోతరాజు భక్త బృందానికి రక్షకుడుగా నమ్ముతారు. బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడతారని విశ్వసిస్తారు.

హిందువులు జరుపుకునే ప్రతీ పండగకూ ఓ చారిత్రక నేపధ్యం, ఓ శాస్త్రీయత, ఓ సమాజ హితము తప్పకుండా వుంటుంది. అలాగే తెలంగాణ పండగ హైదరాబాద్ ప్రతిష్టాత్మక పండగ ఆయిన బోనాల పండుగ వెనుక కూడా చారిత్రక నేపధ్యం, శాస్త్రీయత, లోక హితం దాగి ఉన్నది
చారిత్రక నేపథ్యం:
బోనాల పండుగను దాదాపు వెయ్యి నుంచీ జరుపుకుంటున్నారు. గోల్కొండ కోట నిర్మించక మునుపు గొల్లలు పశువుకు మేపుకునే కొండ గొల్లకొండ గా పేరున్న కాలములో గొల్లలు అక్కడున్న ఎల్లమ్మ కు బోనం సమర్పించేవారట. ఆ సంప్రదాయం అలాగే కొనసాగి కాకతీయ రాజు రెండో ప్రతాప రుద్రుడు బోనాల సమయంలో గోల్కొండ ఎల్లమ్మ ఆలయంలో బోనం సమర్పించినట్లు పెద్దలు చెబుతారు. గొల్ల కొండ ముస్లిం రాజుల పాలనకు గోల్కొండ కోట నిర్మాణం తర్వాత అక్కన్న మాదన్న లు ఈ ఉత్సవం జరిపినట్టు తెలుస్తోంది. అంటే ఐదు వందల ఏళ్ళుగా అక్కడ బోనాల ఉత్సవాలు జరుగుతూనే వున్నాయి.
ఓ కథనం ప్రకారం 1908లో మూసీ పోంగి దిక్కు తోచని పరిస్థితిలో అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ దర్వాజా అమ్మవారికి బంగారు చాటలో పట్టుచీర గాజులు, ముత్యాలు, పసుపు కుంకుమలు సమర్పించి నది ఉదృతి తగ్గించమని కోరుకున్నాడట. నది ఉదృతి తగ్గిపోయిందట. నిజాం నవాబు ప్రార్థనతో ప్రాశస్త్యం పొందిన లాలూదర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వందేళ్లు గా బోనం చేస్తూ శతాబ్ది ఉత్సవాల జరుపుకుంటున్నది. అలా చారిత్రక ప్రాశస్త్యం వరుసలోనే తొలి బోనం గోల్కొండలో ఎత్తగా, చివరి బోనం లాల్ దర్వాజాలో ఎత్తుతారు.
శాస్త్రీయత:
ఆషాఢ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి. నిలిచి ఉండే వాన నీరు, నీటి తెమ్మ వల్ల క్రిమికీటకాలు, ఈగలు,దోమలు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి వృద్ది చెందుతాయి. వానాకాలంలో కలరా, మశూచి, మలేరియా వంటి అంటు వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి.
అందువల్ల బోనాల పండగలో క్రిమి నాశని అయిన సున్నము. యాంటీ సెప్టిక్ , ఔషద గుణాలు కలిగిన వేపాకు, యాంటీ బయోటిక్స్ అయిన పసుపు, కుంకుమలు వాడతారు.
బోనం కుండకు క్రిమి కీటకాలు దరిచేరకుండా సున్నము రుద్దడం, పసుపు కుంకుమ అద్దడం చేస్తారు. కుండకు వేపాకు కడతారు,
అలాగే వాన నీళ్ళల్లో నాని నాని పాదాల వేళ్ళు చెడకుండాబోనం ఎత్తే స్త్రీలు, మిగతా మహిళల కాళ్ళకు పసుపు రాసినా, భవిష్యవాణి చెప్పే స్త్రీలు మొహమంతా పసుపుతో నింపినా, పోతరాజు ఒళ్లంతా పసుపు పులుముకున్నా అందుకోసమే. ఇంటి దర్వాజలకు, గల్లీలో తోరణాలుగా వేపాకు మండలు కట్టడం వెనక అదే కారణం. బోనం కుండ పై దీపం వెలిగించడం దారి వెంట వెలుగు కనిపించడానికి.
ఆలయ ప్రవేశానికి ముందు బోనం ఎత్తిన స్త్రీ పాదాలపై నీటిని గుమ్మరుంచడం అంటే వానాకాలం బురద దారిలో నడచి రావడం వల్ల బురదతో అపరిశుభ్రంగా మారిన కాళ్ళను శుభ్రపరచడం అన్నమాట.

సమాజ హితము:
పండగ క్రతువుల నిర్వహణతో మనిషిలో ఆధ్యాత్మిక భావన పెంపొందించి శాంతి మార్గములో నడిచేలా చేస్తాయి. పండగ పేరుతో బంధు బలగంతో బంధాలు బాంధవ్యాలు, ఇరుగు పొరుగుతో సత్సబందాలు, మానవ సంబంధాలను పటిష్టంగా ఉంచబడతాయి.
ఎండాకాలం ఎండదెబ్బలకు విసిగి వేసారి నిర్లిప్తమైన జనాలలో ఉత్సవాలు నూతనోత్సాహాన్ని తీసుకు వస్తాయి. పండగ తంతులో ముఖ్య పాత్ర వహించే పసుపు కుంకుమ,
వేపాకుల అవసరం అంతర్లీనంగానే అవగాహణ ఏర్పడుతుంది.

తెలంగాణా ప్రాంతంలో మాత్రమే జరుపుకునే ఈ పండుగ ప్రత్యేకత రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వము దీనికి రాష్ట్ర పండగగా హోదా కల్పించి బోనాల సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టుచీర కానుకగా సమర్పించే ఆనవాయితీ ప్రారంభించింది. ఇప్పుడు తెలంగాణకే ప్రత్యేకమైన బోనాలు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

115 వ వార్షిక బ్ర్మోత్సవాలు జరుపుకుంటున్న లలుదర్వాజ బోనాల జాతర ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు జూలై 7 న ప్రారంభమైనాయి. జూలై 16 బోనాలు, 17 న ఘట నిమర్జనం తో ఉత్సవాలు ముగియనున్నాయి.
లాల్ దర్వాజా బోనాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం కమిటీ ఆద్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 19′ 20, 21 తేదీలలో బోనాలు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.
ఈ బోనాలపండుగను తిలకించడానికి వివిధ జిల్లాలనుంచి లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

Written by Rupa devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బంధాలు.. అనుబంధాలు

అనంత విశ్వ అద్భుతం