డేంకిణీపుర శ్రీమతి జయలక్ష్మి గారు రచించిన ఈ శ్రీ బాలకృష్ణ లీలలు ఇది భక్తితో, అనురక్తితో రచించారు. సంప్రదాయ పరంగా వినాయక స్తుతి,పలుకులమ్మకు ప్రార్ధన, శ్రీహరిని తన చరిత్ర రాస్తున్నాను గనుక జయప్రదంగా కావ్యం రాసేలా దీవించమని కోరుతూ… వారి ఇష్ట దైవం ఆఖేటనాధుని స్తుతించి, శేష శాయిగా
మనకు దర్శింప చేస్తూ కథను ప్రారంభించారు.
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే యాదవ వంశం లో పుట్టిన శ్రీకృష్ణుడి జననం చక్కని సీసమాలిక లో
* వసుదేవ దేవకికి వైవాహికము కాగ* అని మొదలుపెట్టి ,వారి బిడ్డ వల్ల కంసునికి ప్రాణగండం ఉందని,అశరీరవాణి మాటలు వినిపించడం… దేవకీ వసుదేవులను చెరలో పెట్టించడం మొదలైన అంశాన్ని సులువుగా అర్థమయ్యేలా రాశారు.
భోగేంద్ర శయనుడు అనే సీస పద్యం లోఈ పదంతో ఈ పద్యం చాలా అందంగించింది. సందర్భానికి తగినట్లుగా వర్ణించారు కవయిత్రి. అలా పుట్టిన ప్రతి శిశువును చంపి వేస్తూ ఏడవ గర్భంలో యోగమాయ ప్రవేశం , మరియు దేవకి వసుదేవులు వేడుకోగా తనకు ప్రాణభయం ఏమీ లేదని* భయము మానుడి మీరు* ఎంతో సహజంగా తల్లీబిడ్డల సంభాషణల వలె రచన సాగింది.
బాలకృష్ణుడిని మధుర కు తరలించే దృశ్యాన్ని సీసమాలిక లో* అంతట వ్రేపల్లె యందు విచిత్రమై*
అంటూ ఒక దృశ్య కావ్యం వలే రచించి ఆ ఘట్టాన్ని చదువరులకు చూపించారు. మరొక సీసమాలిక లో పూతన సంహారం, గర్గముని వచ్చి నామకరణ మహోత్సవం చేయడం కూడా… మన ఇంట్లో జరుగుతున్న ఒక శుభకార్యం వలె భావన కలిగింది.
శకటాసుర వధ* పిడుగునిం బోలు శబ్దంబు* అంటూ, తృణావర్తుని సంహారం సుడిగాలిని చక్కగా కనులకు కట్టినట్టు రాశారు. ఇక్కడ* మీన
కేతుని తండ్రి* అనే పదప్రయోగంఎంతో బాగుంది.
* విశ్వరూప సందర్శనం* ఘట్టం లో రచయిత్రి అందరినీ యశోదా మాతలను చేసింది.
92వ పద్యంలో* సుదతులు అందరూ వచ్చి* అనే పద్యం పోతన గారి* ఓయమ్మ నీ కుమారుడు* అనే పద్యాన్ని గుర్తుచేసింది.
ఇక వత్సాసుర వధ 112వ కందపద్యం* గొల్లర బాలుర తోడను* ఎంతో అందంగా ఉంది.
శ్రీశు అనే పదం అనేక చోట్ల ప్రయోగించడం గమనిస్తే ఈ పదం అంటే మాతృమూర్తి రచయిత్రి జయలక్ష్మి గారికి ఎంతో ఇష్టమైన పదం వలె తోచింది.
118 వ పద్యం* నమ్మినట్టి వారి కెల్లా సొమ్ము
హరియు* చక్కని ఉపమా సూక్తి ఉపయోగించి ఈ పద్యానికి మంచి భావం చేకూర్చారు.
వృషభాసుర వధ తోపాటు, కాళింగ మర్ధనం, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుట అనే భాగవతంలోని అంశాలే కాకుండా…. రచయిత్రికి నచ్చిన పురందరదాసు కీర్తన ఆధారంగా… వృశ్చికములను మాలగా ధరించుట, ముత్యాల గిడము, నేరేడు పండ్లు, రత్నాల రాశి మొదలైన జానపద కథలను జోడించారు. అంటే రచయిత్రికి పురాణ అవలోకనే కాకుండా జానపద సాహిత్యం లోనూ, సంగీతంలోనూ ప్రవేశం ( ఎరుక)ఉందని ముఖ్యంగా జానపదుల భావంలోనూ శ్రీకృష్ణుని దర్శించారు.
ఇక తన మనోగతం తెలుపుతూ… ఈ తన రచనను చదివినవారికి పంచ మహా పాతకములు తొలగిపోతాయని ఫలశ్రుతి చెప్పారు.
సర్వేజనాః సుఖినోభవంతు.