“చచ్చానురో!” పొలికేక వేసింది , వెంకులు తోసిన తోపుకు గుడిసె మూలకు విసురుగా పడ్డ సుబ్బులు. లంబాడి గూడెం లోని ఇరుగుపొరుగు గుడిసెలో ఉన్న జనం గుమిగూడారు ఆ అరుపుకి.
పాము ! పాము! పెద్దగా అరుపులు. ఆ వీధిన పోతున్న వాళ్లెవరో అరిచారు. అంతే అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ వీధి కి చలనం వచ్చింది .
అది మిట్ట మధ్యాహ్నం. ఆకలి సమయం. ఒక పాము కప్పను నోటకరచుకొని మింగడానికి ప్రయత్నం చేస్తున్నది .ఆ సమయంలో ఆలిండ్ లో పని చేస్తున్న కా మ్మయ్య గారు భోజనం చేయడానికి సైకిల్ మీద ఇంటికి వస్తున్నారు. డోయేన్స్ కాలనీ పాష్ గా ఉన్న చుట్టూతా బంజరు కావడం చేత అక్కడే నివాసముంటున్న అనేకానేక ప్రాణులు వదిలి వెళ్లలేక అక్కడే ఉంటున్నాయని చెప్పొచ్చు . ముఖ్యంగా పాములు. తరుచు దారిన పోయే వారికి దర్శనమిస్తుంటాయి.
“పాముని చూస్తే మనిషికి భయమో లేక పాముకు మనిషంటే భయమో “చెప్పలేని విషయం. మధ్యాన్నం పూట పడుకునే అలవాటు లేని నేను పేపర్ ముందేసుకుని కిటికీ దగ్గర గా మా ఇంట్లో కూర్చొని ఉన్నాను. “పాము పాము” అన్న అరుపులు నన్ను కూడా కదిలించాయి నా జడత్వం నుండి. బయటకు వెళ్ళాను .
“సచ్చినోడా! నీకేం పోయే కాలమొచ్చిందిరా పెళ్ళామని కూడా చూడ కుండ దాన్ని ఒక్క తోపు తోసినావు”, ఓ ముసల్ది వెంకులుకు శాపనార్థాలు పెట్టింది.
“ఓసి ముండా ! నువ్వు నీ మొగుడి చేతిలో తన్నులు తినలేదేటి ! కొత్తగా చెప్పొచ్ఛావు ! మొగుడు పెళ్ళం మద్దెన నీకెందుకంటా, పోవే పో!”అంటూ వెంకులు గుడ్డ్లురిమి ముసలిదాన్నే కాదు, గుంపుగా చేరిన అందరి వంక తీక్షణంగా చూస్తూ , గుడిసెకున్న తడికే తలుపు ని కాలితో ఒక్క తోపు తోసి లోపలకెళ్లి దగ్గరలో ఉన్న రోకలి బండ ను తలుపుకి అడ్డుగా నిలబెట్టాడు. బాగా తూలుతున్నాడు .
వెంకులుని చూస్తే సుబ్బులు కి భయమేసింది .బుసలు కొడుతున్నాడు తాగిన మైకంలో. ఏ క్షణంలోనైనా మీద పడి రక్కేసేటట్టు న్నాడు.
పాము కప్పను మింగడానికి చేసే ప్రయత్నం మానకుండా పరిసరాలు గమనించుకుంటున్నది . ఒకరు , ఇద్దరు నలుగురు ఇలా పిల్లలు పెద్దలు చేరిపోయారు . ధైర్యమున్న మగవాళ్ళు, ఆడవాళ్ళు మరి రెండు అడుగులు ముందుకు వేసి పామును పరకాయించి చూస్తున్నారు. పాము కప్పను మింగడానికి చేసే ప్రయత్నం లో కదిలినప్పుడల్లా నాకు ఒళ్ళు గగుర్పొడుస్తోంది . “వాచ్మాన్ డేవిడ్ ని పిలవండి “ అని అంటూ ఉత్సాహంగా అరిచాడొక పెద్దమనిషి . “వాడెక్కడ తగలడ్డాడో “! అని అంటున్నది మరొకావిడ. ఎవరేమి మాట్లాడిన పాముకు పది అడుగుల దూరం నుంచి చెబుతున్నారు. ఎవ్వరికి ధైర్యం చాలడం లేదు. “కప్ప ను తినే పాము చాల వేగంగా మసలుతుం ది. దానికి కొంచెం విషం ఎక్కువే”, అని గోపయ్య గారు అక్కడ చేరిన జనానికి జ్ఞానాన్ని పంచుతున్నారు. పాము కప్పను వదలాలని లేదు . మరింతగా సాగింది. “అమ్మో! ఇది నాలుగు అడుగులు ఉంటుంది అని దాని పొడవును అంచనావేస్తున్నాడు మరొక యంగ్ ఫెలో. కొందరు ధైర్యముగా ఇంకొంచెం ముందుకు నడిచారు.
ఆవేశంతో రొప్పుతూ తాగిన మత్తు దిగక ముద్దగా మాట్లాడుతూ అన్నాడు వెంకులు. “ఒసేయ్! సుబ్బులు! తీయవే ఆ బొడ్లో దాచిన కాసులు!. నా కిస్తావా లేదా?”
“నేనియ్య” మొండికేసింది సుబ్బులు.
ఆ దగ్గరలో ఉండే కాలనీ లో అంట్లు తోమి , బట్టలు ఉతికి నెలకు కొన్ని రాళ్లు సంపాదిస్తుంది సుబ్బులు. ప్రతి నెల వెంకులు దాన్ని వేధించి కొంత రొక్కం పట్టుకుపోతాడు. ఈ నెల వాడెంత వేధించిన సుబ్బులు డబ్బులు ఇవ్వదలుచుకోలేదు.
తన ఒక్కగానొక్క కూతురు లచ్చిమిని బళ్ళోవేయాల, పలక పుత్తకాలూ కొన్నియ్యాల . రోజు బడికి పోయేటప్పుడు అప్పుడప్పుడైనా ఒక పావలా కాసు దాని చేతిలో పెట్టాలా.
ఈ ముదనష్టపొడికి తాగి తగలెయ్యడమే తప్ప కూతురున్నదన్న ఇంగితం లేకపోయే .
“ఓరి సచ్చినోడా! అది బిడ్డ కోసం దాసాను రా! నేనియ్య !నన్ను సంపినా సరే!”ఇంకా మొండికేసి తెగేసి చెప్పేసింది సుబ్బులు. వెంకులు రెచ్చిపోయాడు. సుబ్బులు మీద పడి కొట్టడం మొదలు పెట్టాడు సుబ్బులు బాధతో, నొప్పితో పెట్టె అరుపులు ఆగటంలేదు.
“కొట్టండి! చంపండి”జనం అరవడం మొదలు పెట్టారు. కప్పను నోట్లో ఉంచుకునే కొద్దిగా తల ఎత్తి చుట్టూ చూసింది పాము. కొద్ది దూరంలో ముళ్ళ చెట్టు గుబురు , ఆ వెనకే వర్షాలకు నిలబడిన నీళ్ళు కనిపించాయి. “అమ్మయ్య “అనుకోంది . వేగం పెంచింది. నోట్లో పెట్టుకున్న కప్పను వదలాలని లేదు. అందుకే వేగంగా కదలలేకపోతున్నది.
ముందుకి వెనక్కి జరగడం మొదలు పెట్టింది . తోకను వెన్నక్కు వేసింది ఆ తర్వాత మిగిలిన భాగాన్ని కూడా కదిలించింది . నోటితో కప్పను వదలకుండానే ఆత్మ రక్షణార్థం వెనక్కి వెనక్కి జరగడం మొదలుపెట్టింది.
నాకు మళ్లీ అనుమానమొచ్చింది “పాము మనిషిని చూసి భయపడుతున్నదా లేక మనిషి పాము ని చూసి భయపడుతున్నాడా” అని.
వెంకులు కొడుతున్న దెబ్బలకి సుబ్బులు వళ్ళు హూనమవుతున్నది, కళ్ళు తిరిగి పోతున్నాయి, కడుపులో నరాలు మెలి పెడుతున్నాయి. గుండెలు అవిసేలా ఏడుస్తూనే ఉన్నది. అరుస్తూ నే ఉన్నది. సోయా న అత్తా కొడుకని ప్రేమతో మనువాడింది . ఇప్పుడేమో పెళ్ళాం బిడ్డని కూడా సూడకుండా సంపాదించిందంతా తాగుడికి తగలేస్తున్నాడు. ఈడి నెల మార్చాలి రా దేవుడా ! నన్నెందుకు పుట్టించావురా అని సుబ్బులు పెళ్ళైన కాడ నుంచి ఏడుస్తూనే ఉన్నది.
“అమ్మా” అంటూ లచ్చిమి అప్పటి వరకు ఎక్కడి కెళ్లిందో లగెత్తు కుంటూ వచ్చింది. ఆ మూసిఉన్న గుడిసె తలుపు ను బలంగా తోసింది . ఆ తోపుడికి తలుపు కి అడ్డంగా పెట్టిన రోకలిబండ దొర్లుకుంటూ సుబ్బులు వై పుకి పడింది.
వెంకుల్లొ ఆవేశం తగ్గల. లచ్చిమిని చూశాడు , కసిపెరిగింది. అంతే ఉన్నపళ్లంగా ఆ బక్క పిల్లను ఎత్హేసాడు పైకి.
“ ఒసే సుబ్బులు ! విను . పైసలిత్తా వ సరే సరి. లేదా!” చాలా క్రూరంగా చూస్తూ “ఈ ముదనష్టపు దాన్ని నిట్ఠానే కిందకు వదుల్తా ! కాలో చెయ్యో విరుగుద్ది . గుడి కాడ కూసోబెట్టి అడుక్కుతినిపిస్త !” వెంకులు రాక్షసుడల్లే కనిపిస్తున్నాడు. ఆ తాగుడు మైకంలో పసిబిడ్డ అనికూడా సోచాయించడంలేదు.
వాడిలో రాక్షసత్వం , ఆమెలో మాతృత్వం నిద్రలేస్తున్నాయి. వీడేమైనా సేస్తాడు ! వీడినేట్ల ఆపాల! దగ్గరలోనే రోకలి బండ దొర్లి పడి ఉంది.
పాము వెన్నక్కి వెన్నకి పోతున్నది. నోటిలో కప్పు అలాగే ఉంది నిర్జీవమై. ఎవరో ఒక రాయి ని విసిరారు. దానికి దగ్గర గా పడింది. పాముకు అర్ధమయింది. మనిషిలోని దానవాడు మేల్కొన్నాడు . తాను పడగా విప్పక తప్పదు. కానీ లోపల ఆకలి కూడా అంటే తీవ్రంగా బుసలుకొడుతున్నది. ఇంకో రాయి, ఇంకోరాయి. కానీ వేసేవాళ్ళు భయంకొద్దీ విసరడంతో అవి పాము కి అవతలగాని ఇవతలగాని పడుతున్నాయి. ఇక ఎదురుతిరగక తప్పదు . అంతే పాము హృదయం బుస కొట్టింది .రెండడుగుల దూరంలో పడగ గా విప్పింది నోటిలోఉన్న కప్పు జారిపోయింది. చుట్టూ చేరిన జనం భయంతో నాలుగు అడుగులు వెనక్కి వేశారు. నిటారుగా పడగవిప్పి జనం వంక చూసింది.
జనం నీలుక్కు పోయారు. భయంతో ప్రాణాలు పోయినట్టే ఉంది . రాళ్లు వేసిన వాళ్ళు ప్రాణాల మీద ఆశలు వదులుకున్నారు. “పాము పగ పట్టింది”, ఎవరో చివరి నుండి అరిచారు. అంతే , గగ్గోలుగా అరుస్తూ వెన్నకి తోసుకుంటూ జనం వెన్నకి వేగంగా పరిగేటట్టం మొదలెట్టారు . ఆ తోపుడు లో నేను దగ్గర లోనే ఉన్న రాళ్ల గుట్ట మీద పడ్డాను.
నాకు తప్పించుకునే దారి లేదు. అప్పటికే జనం మాయమైపోయారు. రోడ్డు నిర్మానుష్యంగా మారింది.
పాము పది అడుగుల దూరంలో- ఆకలితో ఉన్నది. భయంతో నేను బిగుసుకుపోయాను. ఒక్కళ్ళు కూడా లేరు పాము తల నా వైపుకి తిప్పింది. నాలో ఏ చలనము లేదు. రెండు, మూడు నాలుగు నిమిషాలు గడిచిపోయాయి.
వెంకులు లచ్చిమిని కింద పడేయటానికి ఊపుతున్నాడు. సుబ్బులు లేవలేక పోతున్నది. అలాగే రోకలి పట్టుకుంది. చేతు ల్లో బలం లేదు. కానీ బిడ్డను కాపాడ్డం ఎలా. వెంకులు గాల్లోకి చూస్తూన్నాడు. వాడి కాళ్ళనే చూస్తున్నది సుబ్బులు. అంతే అలాగే కూర్చుని ఉన్న సుబ్బులు పిచ్చిగా అరుస్తూ ఆ రోకలిబండతో వెంకులు కాళ్ళ మీద ఒక్క వేటు వేసింది. పె ళ్ళుమని చప్పుడు.
లచ్చిమి ని అమాంతం వదిలేసి కుప్పకూలిపోయాడు వెంకులు. లచ్చిమి సుబ్బులు నడుము మీద పడి కిందకు జారింది. నడుము కల్లుకుమన్నది సుబ్బులికి.
“నువ్వు గుడి దగ్గర కూకుని అడ్డుక్కో రా” అంటూ స్పృహ తప్పింది సుబ్బులు.
పాము నా వంక మరో సారి చూసింది . నా లో ఏ చలనము లేదు. అంతె పడగ దింపేసి చర చర పొదల్లోకి పాకి పోయింది. మళ్లీ అదే అనుమానం. “పాము నన్ను చూ సి భయపడిందా లేక నేనా!”
మాది ఒక పోరాటం. బతుకు పోరాటం.