ఆషాఢంలో మైదాకు ( గోరింటాకు )

లక్ష్మి మదన్

ఆషాఢ మాసం వచ్చింది మొదలు మా నాయనమ్మ సనుగుడు మొదలయ్యేది…”వానలు వడుతున్నయి మైదాకు వెట్కొండి ఓ పిల్లలూ ” అనేది. వానలు పడుతుంటే గోళ్లకు చేతులకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది మైదాకు. మాకు కూడా చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అని చూసే వాళ్ళము.

ఇక మా పాట్లు మొదలయ్యే వి…మా ఇంటికి దూరంగా ముస్లిం ఇళ్ళు ఉండేవి. రెండు ఇళ్లలో చెట్లు ఉండేవి. ఇద్దరం ముగ్గురం పిల్లలం కలిసి వాళ్ళింటికి పోయే వాళ్ళము. పాత ఇళ్లు..కులి పోయేలా ఉన్న గోడల నడుమ చెట్లు. తలుపులు గట్టిగా గొల్లెం పెట్టీ ఉంచే వాళ్ళు. మెల్లిగా తలుపు కొడితే తీసి ” మీకి ఏమి కావాలి..ఎందుకు తలుపు కొట్టినయి ” అని అడిగితే..భయం భయంగా ” కొంచెం మైదాకు తెంపుకుంటాము ” అని అడిగితే… నయి నయ్ అని ధడెలున దర్వాజా పెట్టుకునే వాళ్ళు. ఇక బిక్క మొహాలు పెట్టుకుని మరో ఇంట్లో మా అదృష్టం పరీక్షించుకునేందుకు పోయే వాళ్ళము. దేవుడి దయ వాళ్ళ ఆ ఇంట్లో అనుమతి దొరికింది…మెల్లగ ముల్లు గుచ్చు కోకుండా కొంచెం తెంపుకుని సంబరంగా ఇళ్ళకి పోయే వాళ్ళము.

ఇంటికి వెళ్ళాక అమ్మని పోరు పెట్టీ ఇప్పుడే రుబ్బు అని రుబ్బించుకుని తొందరగా అన్నాలు తిని రెడీ అయ్యే వాళ్ళము. అమ్మ చామంతి ఆకులు లేదా బంతి ఆకులు కోసుకొచ్చి చేతి మధ్యలో పరచి రెండు చేతుల నిండా గోరింటాకు పెట్టీ బట్టలకి అంటే కుండా చిన్న బట్టలు కట్టేది. ఓ పక్క పెద్ద వర్షం పడుతుంటే విపరీతంగా చలి పెట్టేది… ఈ ఆకు ముద్దలు మరింత చలి ని పెంచేది. అయినా ఆకు మీద మక్కువతో అలాగే ఉంచుకునే వాళ్ళము. రాత్రంతా కలలే..ఎర్రగా పండి నట్లు…

తెల్ల వారి లేవగానే చేతులు విప్పి చూసుకుని ఎర్రగా పండిన చేతులను చూసుకుని ఎంత మురిసి పోయే వాళ్ళము. తర్వాత చేతులు కడిగి కొబ్బరి నూనె రాసి అందమైన చేతులను అందరికీ చూపెట్టి సంబర పడే వాళ్ళము. స్కూల్ కి వెళ్ళాకా పెద్ద చర్చలు జరిగేవి…అన్ని తరగతుల వాళ్ళము ఒకరికి ఒకరం చూపించుకుని నెమళ్ళ లా నర్తించే వాళ్ళము.

చిన్న చిన్న సరదాలు ఎంత బాగుండేవి. ఎన్ని కోట్లు పెట్టినా అంత సంతోషం ఈ నాడు దొరకదు..ఇప్పుడు కోన్లు తెచ్చి పెట్టుకుని మమ అనిపించు కుంటున్నాము. ‘ మైదాకు‘ అనే మాటనే మరచిపోతూ మెహిందీ అనే నామజపం చేస్తున్నాము. కాలాన్ని ఒడిసిపట్టి లేని మనుషులం. అందాల ఆషాఢ మాసం మైదాకు ముచ్చట్లలో పండిపోదామంటే ఏం చేయాలో….!!

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రచనలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి – డా. పులిగడ్డ విజయలక్ష్మి

ఆపాత మధురాలు part-10