సంగీతం – స్వరరాగఝరి

ప్రపంచ సంగీత దినోత్సవం (జూన్ 21) ను పురస్కరించుకొని

పద్మశ్రీ చెన్నోజ్వల

” శిషుర్వేత్తి పశుర్వేత్తి – వేత్తి గానరసం ఫణి ”
శిశువు , పశువు , పాము సంగీతానికి వశమవుతున్నాయి అని అర్థం. మానవులు , పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాలు , సరీసృపాలు మొదలుకొని సమస్త జీవరాశులు సంగీతాకర్షణకు మినహాయింపు కాదు అంటున్నారు. భారతీయ సంగీతానికి మూలం సామవేదం . మన కళలే మన సంస్కృతికి పట్టుకొమ్మలు. భారతీయ తత్వం సత్యం – శివం – సుందరం . ఇందులో సత్యం – సాహిత్య రూపం శివం – సంగీత రూపం సుందరం – నృత్య ప్రతీక.

” సమ్యక్ – గీతమ్ , సుష్టు గీతమ్ – సుగీతమ్ ”
శ్రావ్యమైన, మనోహరమైన గేయమే సంగీతం అని అర్థం. దీనికి రసానంద జనక క్రియా లాలిత్యమే పరమావధి. సంగీతము సాహిత్యము సరస్వతీ దేవికి స్తనద్వ యమనీ , అందులో సంగీతం మధురాతి మధురమైనదనీ , భావము , భాష తెలియకపోయినప్పటికీ ఇది జనుల హృదయాలను రంజింప చేసే స్వభావాన్ని కలిగి ఉంటుందని పెద్దల అభిప్రాయం. నాదము లేనిదే గీతము లేదు , గీతము లేనిదే స్వరము లేదు , స్వరము లేనిదే రాగము లేదు అంటే ఈ ప్రపంచమంతా నాదమయం అని అర్థం. సంగీతం ఒక మహత్తర ప్రవాహం . ఆ తరగల ప్రవాహ వేగం మనిషి మదిని రంజింపజేసి అనిర్వచనీయమైన ఆనందాన్ని అందించే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది.

భారతీయ సంగీతం అనేక సాంప్రదాయ రీతులలో ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ అందులో కర్ణాటక, హిందుస్తానీ సంగీత రీతుల ప్రధానమైనవిగా పేర్కొనబడినవి.

కర్ణాటక సంగీతం : ఇది దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందినది. ‘దక్షిణాత్య సంగీతం ‘ అని ఇంకొక పేరు కూడా ఉంది . ఇందులో శాస్త్రీయ సంగీతం పండిత రంజకంగా ఉంటే ఇతర సంగీతాలు పామరరంజకంగా అభివృద్ధి చెందాయి.
దక్షిణ భారతదేశంలో అచ్చమైన భారతీయ సంగీతం దాని యొక్క సహజమైన నమూనాలో భద్రపరచబడి మరియు పోషింపబడి వర్తమాన తరానికి అందజేయబడింది . ప్రస్తుతం ఇది దక్షిణాది సంగీతం లేదా కర్ణాటక సంగీతం గా ప్రసిద్ధి చెందింది.

హిందుస్తానీ సంగీతం : అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ నగరాన్ని పాలిస్తున్న కాలంలో ‘ అమీర్ ఖుస్రు’ గా పిలువబడే పర్షియా దేశానికి చెందిన సంగీతవేత్త రాజ్యాధినేత ఆహ్వానంపై భారతదేశానికి వచ్చి ఆ కాలంలో ఇక్కడ వ్యాప్తిలో ఉన్న సంగీతాన్ని బాగా ఆపోసన పట్టి, తన స్వర రచనకు అనుకూలంగా మలుచుటకు పెక్కు అంశాలలో మార్పులు చేసి వారి యొక్క ఆలోచనలను ప్రతిబింబిచేలా పెక్కు స్వర రచనలు చేసి భారతీయ మరియు పర్షియా దేశ సంగీత రీతుల మేళవింపుతో ఒక నూతన రీతిని ప్రవేశపెట్టి, దానిని అత్యంత ప్రజాదరణ , కీర్తి చెందే విధంగా కృషిచేసిరి . అనంతర కాలంలో ఇది ‘హిందుస్తానీ ‘ (ఉత్తరాది )సంగీతం అని పిలవబడింది.

కర్ణాటక సంగీతంలోని వివిధ రచనలు:

గీతములు :  సంగీతాభ్యాసంలో మొదటగా సాహిత్యాన్ని పరిచయం చేసే రచన . దీనిలో పల్లవి, అను పల్లవి, చరణం అనే ఖండికలు ఉండవు . సరళీ స్వరాలు , జంట స్వరాలు , దాటు స్వరాలు , అలంకారాల తర్వాత నేర్పబడే సరళమైన సంగీత రచన.

స్వరపల్లవి : అభ్యాస రచనలో గీతాల తర్వాత నేర్పతగినది . జతి స్వరము లేక స్వరపల్లవి అని అంటారు . ఇందులో సాహిత్యం కనిపించదు . అక్కడక్కడ మృదంగ శబ్దాలుంటాయి. ఇది రూపంలో స్వరజతిని పోలి ఉన్నప్పటికీ రాగం భావం లయ సౌరభాన్ని వెలువరించే చక్కని రచన.

స్వరజతి: ఇది గీతము , స్వరపల్లవుల తరువాత నేర్చుకోతగినది . చాలా మాధుర్యమైనది . ఇది గాన ప్రక్రియలో వర్ణం వలె కనిపించినప్పటికీ స్వర సాహిత్యం , భావం, రాగతాళ సమన్వయం రంజింప చేస్తుంది.

వర్ణము:

అభ్యాసగాన రచనలన్నింటిలో వర్ణం అతి ముఖ్యమైన రచన . దీనిని గీతములు, స్వరపల్లవులు , స్వరజతులు నేర్చుకున్న తర్వాత నేర్చుకోవాల్సి ఉంటుంది. వర్ణం బాగా నేర్చుకుంటే వేరే రచనలు పాడటం తేలిక అవుతుంది . దీన్ని నేర్చుకోవడం వలన గాత్ర సాధకులకుగానీ,వాద్యసాధకులకుగానీ సంగీతంపై పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది పూర్వాంగం , ఉత్తరాంగం అని రెండు భాగాలుగా ఉంటుంది . పూర్వాంగంలో పల్లవి, అను పల్లవి , ముక్తాయి ఉత్తరాంగంలో చరణం, చరణ స్వరాలుంటాయి. వీటిని ఎత్తుగడ స్వరాలు లేక చిట్ట స్వరాలు అంటారు.

కీర్తన: నవవిధ భక్తి మార్గాలలో కీర్తన ఒకటి. భగవంతుని వైభవములను గూర్చి పాడట మే కీర్తన. దీనిని నామ సంకీర్తన అని కూడా అంటారు .

కృతి: కృతిలో సంగీతము పలు సంగతులతో , గమకాలతో , శాస్త్ర సంబంధమైన సౌందర్యంతో కూడి ఉంటుంది . పల్లవి ,అనుపల్లవి , చరణాలు ముఖ్యమైన అంగాలు . చరణాలు ఒకటి గాని అంతకంటే ఎక్కువగానీ ఉండవచ్చు . ఇందులోని సాహిత్యం దైవ స్తుతిగానీ , రాజ స్తుతి గానీ అయి ఉంటుంది.

పదము: సంగీత పరిభాషలో పదం అనగా నాయికా నాయకులకు సంబంధించిన శృంగార రసాన్ని వర్ణించే ప్రక్రియ . ఇది సాధారణంగా నృత్య సంగీతానికి చెందినదైనప్పటికీ చాలా మాధుర్య ప్రధానమైంది కావడం వల్ల సంగీత కచేరీల్లో కూడా ఎక్కువగా వాడబడుతూ ఉంటుంది. దీనిని సరైన పద్ధతిలో పాడాలంటే చక్కని సంగీత జ్ఞానం చాలా అవసరం. తెలుగు భాషలో పదములను రచించిన క్షేత్రయ్యకు సంగీత ప్రపంచంలో ఒక అద్వితీయమైన స్థానం ఉంది . వీరు సుమారుగా 2000 పదా లను రచించి సంగీతానికి ఎనలేని సేవ చేశారు.

జావళి: జావళి అనగా ప్రేమగీతం అని చెప్పవచ్చు. ఇది శృంగారరస ప్రధానమైన , నాయికా నాయకుల లక్షణాలకు సంబంధించిన రచన . సులభంగా ,చురుకుగా , ఆకర్షణీయంగా ఉండటం వలన చక్కని ప్రజాదరణ పొంది అనేక సంగీత కచేరిలందు వాడబడే ప్రక్రియ . తేలిక శాస్త్రీయ సంగీతానికి చిహ్నం. హిందుస్థానీ సంగీతంలోని ‘గజల్ ‘ అనే రచనకు సమానమైనది.

తిల్లానా: ఇది వివిధ రాగాలలో, వివిధ తాళాలలో చేయబడ్డ రచన . జతులు , స్వర సాహిత్యం మధ్యమ గతిలో పాడటానికి అనుకూలంగా ఉంటుంది . సజీవమైన సంగీతాన్ని కలిగి , మధ్యమ కాలంలో ఉండే చిన్న రచన . ప్రధానంగా ఇది నృత్య సంగీతానికి చెందినదైనప్పటికీ ఇందులోని సంగీతం చురుకుగా, ఆకర్షణీయంగా ఉండటం వల్ల సంగీత కచేరీల్లో కూడా ప్రదర్శింపబడుతూ ఉంటుంది.

అష్టపది : అష్టపదులను మొట్టమొదటిసారిగా జయదేవ కవి తన’ గీతగోవిందం’ అనే కావ్యంలో సంస్కృత భాషలో రచించిరి. దీనినే. ‘ శృంగార మహాకావ్యం’ అని కూడా అంటారు . ఒక్కొక్క రచనలో 8 పాదాలుండటం వల్ల దీనికి అష్టపది అని పేరు వచ్చింది . రాధాకృష్ణుల ప్రేమ తత్వంతో నిండి ఉంటాయి.

తరంగం : దీనిని ‘ శ్రీకృష్ణలీలాతరంగిణి ‘ అను పేరుతో శ్రీనారాయణతీర్థులు సంస్కృత భాషలో రచించిరి .ఇందులో 12 సర్గలుంటాయి. పల్లవి , అను పల్లవి , చరణాలు అనే విభాగాలుంటాయి. ఇవి భక్తి శృంగార రసాలతో కూడుకొని ఉంటాయి.

రాగమాలిక : వివిధ రాగాలలో రచింపబడిన రచన . రాగములమాల లేక రాగముల హారమని చెప్పవచ్చు . రంగురంగుల పుష్పాలతో కట్టబడిన మాల కళ్ళకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో అదే విధంగా ఒక సంగీత రచనలో ఒక్కొక్క అంగం ఒక్కొక్క రాగంలో రచించబడితే అంతే ఆనందాన్నిస్తుంది .ఇందులో మాధుర్యం చాలా ఉంటుంది . ఇందులోని ప్రతి అంగం మార్పుకు లోనవుతూ ఉండటంవల్ల కచేరీలోని శ్రోతలకు మొదటి నుండి చివరి వరకు ఒకే విధమైన ఆసక్తిని , ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది.

దరువు: ఇది శృంగార రస ప్రధానమైన రచన . సంగీత గేయ నాటకాల్లోనూ , నృత్య నాటకాల్లోనూ కనిపిస్తుంది. మధ్యమ కాలంలో నడుస్తూ ఉంటుంది . సాహిత్య అక్షరాలు ఎక్కువగా ఉంటాయి. పల్లవి , అనుపల్లవి , చరణాలు అనే విభాగాలుంటాయి.

ప్రబంధము : ప్రత్యేకమైన ప్రాచీన రచనలు మాత్రమే కాకుండా ప్రతి సంగీత రచనను కూడా ప్రబంధము అని చెప్పవచ్చు. ధాతువు అంటే స్వరభాగము ప్రబంధానికి ప్రాణం వంటిది . దీనినే అవయవం అని కూడా అంటారు . ధాతువుల యొక్క సంఖ్యను బట్టి ప్రబంధాలు మూడు విధాలు . ద్విధా తుకాలు , త్రిధాతుకాలు , చతుర్ధాతుకాలు.

భారతీయ వారసత్వ సంపదలో సంగీతం ఒక విలువైన స్థానాన్ని ఆక్రమించుకుంది. దీని యొక్క మూలాలు పలుమార్పులకు లోనవుతూ, పలు విధాలైన అభివృద్ధిని సంతరించుకుంటూ, ఆధునిక కాలానికి చెందిన విధంగా రూపాంతరం చెందుతూ వచ్చాయి.
వివిధ సంస్కృత, తెలుగు గ్రంథాలు మరియు రామాయణ మహాభారతాలలో , కావ్యాలలో సంగీతం యొక్క ప్రస్తావన ఉన్నట్లు మనకు తెలుస్తూంది.

సంగీతం ఒక అద్భుతమైన సృజనాత్మక కళ . మానవుడి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే ఆధ్యాత్మిక సాధన. ఇది కేవలం రాగతాళలయ గురించి తెలిపే అంశం మాత్రమే కాకుండా ఒక చక్కని ఆధ్యాత్మిక భావవ్యక్తీకరణ అంశంగా కూడా పరిగణింపబడుతోంది.రాగం అనేది మానవుడి శరీరాన్ని మరియు మెదడును ఆధ్యాత్మికత వైపు నడిపించే ఒక మానసిక స్థితి. ఆధ్యాత్మిక దివ్య జ్యోతిని చూడటానికి తన యొక్క శరీరం, మనసు ఆ మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి కావలసిన సాధనాబలాన్ని అందిస్తుంది . రసహృదయుడైన వ్యక్తి తన జీవితకాలంలో ఎదురయ్యే ఆనంద విషాదాలు రెండింటిలోనూ అతని మనసు పలుమార్లు సంగీతం వైపు మొగ్గు చూపుతూ ఉంటుంది.

భారతీయ సంస్కృతి మరియు జీవన విధానంలో సంగీతం ఒక అంతర్గత భాగం . సంగీతంతో నిండిన గాలి లేకుండా ఏ సందర్భం కూడా సంపూర్ణతను పొందలేదు . మానవుడు ప్రకృతితో సదా ప్రేరేపితుడౌతూనే ఉంటాడు . వీచే గాలులు , ప్రవహించే నీరు , పక్షుల కిలకిలారావాలు, గర్జించే మృగాలు, ఉరిమే మేఘాలు వంటి అంశాలన్నీ సంగీత స్వభావంతో కూడుకొని ఉన్నవేనన్న విషయాన్ని మనం గ్రహించాలి . మనిషి తనలో దాగి ఉన్న అంతర్గత భావాలను వ్యక్తీకరించడానికి సంగీతం ఒక చక్కని మార్గం అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు . కళల కాణాచి అయిన భారతావనిలో సంగీతం పాత్ర అమోఘమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి పాఠకుల స్పందన

తట్టిలేపిన మాతృత్వం