వివాహాలు— విడాకులు( విడి ఆకులు)

               కామేశ్వరి

వివాహం అనేది సమాజంలో ఇద్దరు భాగస్వాముల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక ఒప్పందం. ప్రధానంగా స్త్రీ పురుషుల మధ్య సన్నిహిత, లైంగిక సంబంధాలతో సంతరించుకున్న వ్యవస్థ. కుల, మత, జాతుల బట్టి వివాహం చేసుకోవడంలో భేదాలు ఉన్నాయి. అన్నిటిలో ముఖ్యం వారు ఆనాడు చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఉండటం. గట్టిగా చెప్పాలంటే వివాహం అనేది ఒక సాంస్కృతికంగా, సార్వజనీయమైన కార్యం.
మన పూర్వీకులు వివాహం ఏడేడుజన్మల బంధం అనేవారు. విదేశీయులు ” మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్” అనేవారు. హిందువులు వివాహం ఒక పవిత్ర కార్యమని భావిస్తారు. మరొక సృష్టికి మూల కారణం అంటారు. నాలుగు పురుషోర్ధాల్లో ఒకటైన కామాన్ని ధర్మబద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న మార్గం వివాహం. వివాహ ప్రక్రియలో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గానికినాంది అవుతుంది. హిందూ పద్ధతిలో గృహస్తు ధర్మపత్ని సమేతంగా పూజలు, హోమాలు, యజ్ఞ్యాలు జరపాలని నియమం ఉంది. భారతదేశంలో వివాహానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే అది ఇద్దరి మనుషులను జీవితకాలం కలిపి ఉంచే ప్రక్రియ.
. పూర్వకాలంలో వివాహాలు ఇరు వర్గాల పెద్దలు కూర్చుని, వివాహ పొంతనలు చూసిన పిదప వివాహం నిశ్చయించేవారు. ఇందులో వధూవరులప్రమేయం ఉండేది కాదు.కానీ వారి వివాహ జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోయేది. కానీ ప్రస్తుత కాలంలో మార్పులు వచ్చి వారి వారి అభిరుచులు,, అలవాట్లు, ఆర్థిక స్థితిగతులు, అందుబాటులను పరిగణలోకి తీసుకుని వివాహాలు నిశ్చయించుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆడపిల్లలు చదువుకోవడం, ఆర్థికంగా బలపడటం, ఒకళ్ళో ఇద్దరూ పిల్లలు కలిగి ఉండటం. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ యుగంలో సంఘం ఇంకా ముందుకి వెళ్లి కులాంతరవివా హాలు,మతాంతరర్వివాహాలు జోరుగా సాగుతున్నాయి. తల్లితండ్రుల ఇష్టంతో కొన్ని, లేకుండా కొన్ని. ఈ విడాకులు ఏ దశల్లో తీసుకుంటున్నారని సంగతి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజు పత్రికల్లోనూ టీవీల్లోనూ , మీ చేతిలోని షైనింగ్ టాయ్ లో కూడా చూస్తున్నారు.కానీ ఏ వివాహమైనా ఆ దంపతులు జీవితపు చరమాంకము వరకు పు త్ర, పౌత్రులతో సుఖంగా జీవించాలని కదా!
. పెళ్లి విషయంలో యువతలో చాలా మార్పు వచ్చింది.. ఒకరికి ఒకరు నచ్చితే చాలనే ధోరణి. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చితే చాలదు, నచ్చకపోతే సర్దుకు పోవడం కూడా తెలియాలి. కానీ ఈమధ్య ఆడపిల్లలు విద్యాపరంగాను, ఆర్థికపరంగాను ముందంజ వేస్తున్నారు. కానీ..వారి వైవాహిక జీవితం లో కొన్ని చోట్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి ప్రధాన కారణం పురుషులే. వీరిఎదుగుదల చూచి ఓర్వలేక, ఎందులోనూ సహకారం అందివ్వకపోవడమే కాక, వీరిని మానసికంగా హింసిస్తున్నారు. ఉద్యోగినులు కూడా సాటి పురుష కో లీగ్స్ తో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎంత ఒదిగి ఉన్న కొన్నిచోట్ల భద్రత కరువవుతోంది.ఇది కూడా ఆడపిల్లలు తిరగబడడానికి కారణం. 50, 60 ఏళ్ల క్రితం విదేశీయులు విడాకులు తీసుకుంటారని వినేవాళ్ళ. ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు అని వినేవారం. ఆవిడ పిల్లలు ఈయన పిల్లలు కలిపి “మన పిల్లలు” అనుకునేవారట. ఇది కూడా మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తుంది. కోర్టులకు వెళ్లే వాళ్లు కూడా ఎక్కువయ్యారు విడాకుల కోసం. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కూడా స్త్రీకి అనుకూలంగా కొత్త చట్టాలు చేసి విడాకులు పొందడంలో సులభతరం చేసింది. చట్టం కొన్ని కారణాలు పేర్కొని, ఆ కారణాలు రుజువైన సందర్భంలో మాత్రమే విడాకులు మంజూరు చేస్తుంది.. దంపతులు కనీసం ఒక ఏడాది పైగా వేరువేరుగా జీవిస్తూ, ఇక ఉభయులు కలసి వైవాహిక జీవితం గడపడం కష్టమని అంగీకరించిన మీదట వివాహాన్ని రద్దు చేయమని కోర్టును కోరవచ్చు.
భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసే కుటుంబాలలో ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది ఈ విడాకుల ప్రక్రియ. భార్యాభర్తలిద్దరూ ఒకరి లోపాలు ఒకరు ఎత్తిచూపుకోకుండా దానికి గల కారణాలను విశ్లేషించుకుని తప్పొప్పులను సర్దుకోవాలి అహం లేకుండా . విడాకులు తీసుకున్న దంపతుల కుటుంబాల లోని” పిల్లలపై” తీవ్ర ప్రభావం పడుతుంది. వివాహ సమయంలోనే ” ముందస్తు విడాకుల పిటిషన్లు ” దాఖలవటం కూడా అక్కడక్కడ కనిపిస్తోంది. పిల్లల కోసమైనా తల్లిదండ్రులు అహం వదులుకోవాలి. భావి భారత పౌరులు అయిన వారు సక్రమ మార్గంలో నడవరు. వారి దేశానికి, వయసు ఊడిగిన తర్వాత తల్లిదండ్రులకు భారమవుతారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ, నమ్మకము, బాధ్యత కలిగి ఉండాలి. మితిమీరిన వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదకరం. భర్త సమకూర్చడంలోనూ, భార్య చక్క పెట్టడంలోనూ తప్పనిసరిగా బాధ్యత వహించాలి. భార్య కాని భర్త కాని వ్యక్తిగత విషయాలు తల్లితండ్రులతో కానీ బయట వారితో కానీ పంచుకోరాదు. దానివలన లాభం కన్నా లోకువై ఇతరులు మన జీవితాలలోకి తొంగి చూసే అవకాశం మనమే ఇచ్చినట్లు అవుతుంది. అందుకే మన పెద్దలు” సంసారానికి గుట్టు, రోగానికి రోస్టు ” అవసరమని అన్నారు. వివాహం అనేది ఒక ప్రక్రియ కాదు శాశ్వత బంధం అని భార్యాభర్తలు గ్రహించాలి. పిల్లలకు ఫాల్స్ ప్రెస్టేజ్ లో కాకుండా నైతికంగా బతకడం నేర్పాలి పెద్దలు. పాత రోజుల్లో కోర్టులు అవి లేవు. అనుభవజ్ఞులే వివాహ వివాదాలను నాలుగోళ్ళ మధ్య పరిష్కరించేవారు. మోసం చేసే వారు, మోసపోయేవారు తో కూడిన ఈ కలుష సమాజంలో పెళ్లిళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా పునరాలోచించుకోవాలి. విడాకులు తర్వాత నా జీవితం ఏమిటి అని ప్రశ్నించుకోవాలి. దానికి సరైన సమాధానం దొరికితే పరవాలేదు. కాకుంటే అధోగతే.
విడి ఆకులుగా బతకకండి — విడాకులు తీసుకోకండి
అహం వద్దు —– ఓర్పు ముద్దు
పువ్వులు, ఆకులు కలిసిన అందమైన పూల గుత్తిగా మిగలండి.

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎర్రరంగు బురద

తరుణి పాఠకుల స్పందన