ఎర్రరంగు బురద

ధారావాహిక నవల 10వ భాగం

జ్వలిత

జరిగిన కథ: పుష్ప పద్మ హాష్టల్ పిల్లలు. హోలీ పండుగ సమయంలో బళ్ళె పుష్పకు ఫిట్స్ వస్తయి. డాక్టర్ తండ్రిని పిలవమంటే. తండ్రి చచ్చిపోయిండని. తాత వస్తడు. డాక్టర్ పద్మను వివరాలు అడిగితే.. తండ్రితో కలిసి వచ్చి లావుపాటి నోట్స్ ఒకటి చేతికిచ్చి. “మా నాన్న చెపుతుంటె, నేను రాసిన, ఇదొక జాతి చరిత్ర” అంటది పద్మ. డాక్టర్ కథ చదవడం మొదలు పెడతాడు. తండ్రి స్వార్ధానికి బలైన ఏదులు.. తన తల్లి మరణానికి కారణమైన తండ్రిని ద్వేషిస్తాడు. సవతి తల్లి కొడుకు అతనిని రెచ్చగొడుతుంటాడు.

ఏదులు తండ్రి సంగడు ఏదులు అక్కను బొంబాయికి పంపిండు. తనను చెల్లెను పట్టించుకోలేదు మేనమామ సాది పెద్ద చేసి పెండ్లి చేసిండు. ఏదులుకు ముగ్గురు పిల్లలు. వాళ్ళ పై కుట్ర చేసి ఏదులు భార్య నాంచారికి కరెంటు షాక్ తగిలిస్తారు. రత్నం సేటు చికిత్స చేయిస్తాడు. నష్టపరిహారం కొంత డబ్బు ఇవ్వాలనుకుంటడు సేటు. ఆడబ్బు కోసం ఏదులు తండ్రి సంగడి ఆలోచన తెలిసి సేటు. ఏదులు భార్య పిల్లల పేరు మీద చెక్కులిస్తడు. వాటితో ఇల్లు బాగుచేసుకుని. మామ ఊర్ల భూమి కొనాలనుకుంటడు ఏదులు. కొడుకు తన డబ్బులు దక్కనియ్యలేదని పగబట్టిండు ఏదులు తండ్రి.  ఒకరోజు పగటిపూట ఇంటికొస్తూ దారిల మందను సరిచూసుకుంటన్న ఏదులు మీద పడ్డరు ఆయుధాలతో.. ఏదులును చంపి కూడా తప్పించుకున్నరు తండ్రికొడుకులు. నాంచారి ఒంటరిదైంది. ఏదులు కొడుకులతో ఎట్టి చేయించుకోవాలని అనుకున్నడు సంగడు…

————ఇక చదవండి——–

అట్లట్ల నిమ్మలంగ నిలదొక్కుకుంటంటే..

పోరల మీద కళ్ళు పడ్డయి సంగనికి. ఒకడికి ఆరేండ్లు రెండోడికి నాలుగేండ్లు…

ఒకనాడు సేటు దుకనం కాడ పనిసేసుకుంటన్న నాంచారి కాడికొచ్చి..

పందుల కాపల కాయాలె  పిల్లలని పంపమన్నడు.

“చిన్నోడు మరీ చిన్న పోరడు. పెద్దోడ్ని తోలకపో..” అన్నది నాంచారి.

“నేను పోను..” అని ఏడ్చింటు వాడు..

పోవాలె కొడక ఆ ఈరన్న తాతెట్టనో ఈ తాతట్టనే.. సెల్లె అక్కడ ఆ తాత దగ్గరున్నది.. నువ్వు ఈ తాతతో పో.. ఊల్లెనేగదా నేనొస్తనే ఉంట చూసెటందుకు..” అన్నది. “మరి తమ్ముణ్ని తోలియ్యి.. నాతోడు..” అన్నడు వాడు.

“తమ్ముడు సిన్నోడు నాతోనుంటడు నాకు సాయం.. వచ్చే ఏడాది తమ్మడు సుత వస్తడు తియ్..” అని నాంచారి కొడుకును బుదగరిచ్చింది..

సరెనని తాతతోటి పొయ్యిండువాడు..

ఎంకులు గుర్రుగ చూసిండు తండ్రెమ్మటొచ్చిన పోరన్ని…

ఆ రాత్రి అన్నం తిని పండుకున్నరు.. పొద్దున్నే లేపింది. ముసల్ది వాడ్ని.

“పందుల గూడు బండ తీసి వాకిల్నూకు పో…” అన్నది. కళ్ళు నలుసుకుంట పోయి, పంది గూడు గుమ్మానికి అడ్డు పెట్టిన బండ దొల్లిచ్చిండు… బండ గుండ్రంగ తిరిగి కాలి మీదికి వచ్చింది.. ఒక్క సారి ఎగిరి కాలు కాపాడుకున్నాడు.. రాయి తీసినా పందులు బయటికి రాలే..

“ఆకిలి నూకినావురా…” అనుకుంట వచ్చింది ముసలిది. “పొరక దొరకలే..” అన్నడు.

“మోతుబరి రైతుకు పొరకొకడు అందిచ్చాలె.. పందుల గూడు పక్కనుంది సూడు..” అన్నది.

కందికట్టెతో కట్టిన పొరక వానికంటె పొడుగున్నది. అయినా తీసి ఊడ్చిండు…

తన ఇంటికాడ లెవ్వంగనే “బొగ్గుకశికతో పండ్లుతోముకో..” అనేది తల్లి…

ఏదన్న పని సెయ్య బోతె “సిన్న పిలగాలినివి నీకెరక లేదు” అనెటోడు తండ్రి.

ఇక్కడిట్ల పని సెయ్య మనుడు సంబురంగున్నది. ఉన్నట్టుండి పెద్దోడయిన అనుకున్నడు వాడు.

ఆకిలూడిసి కసువెత్తినంక “గోలెంల నీళ్ళు నింపు..” అన్నది ముసలిది..

“అన్ని పనులు ఒక్కనాడే చెప్పకు, పోరడు భయపడ్తడు..” అన్నడు సంగడు పెండ్లంతో..

అప్పుడే పక్కలకెల్లి లేసి బయిటి కొచ్చుకుంట.

“యాడికెల్లి తేవాలి నీల్లు..” అని అడిగిండు ముసలిదాన్ని.

“మీ అవ్వేడికెల్లి తెస్తది… ” అన్నదామె.

“మా అవ్వ సెయ్యి కాలింది కద మా అయ్యే తెస్తడు..” అన్నడు వాడు.

“ఓ మరిసిన.. మీ అవ్వ తొంటది కదా అందుకే మీ అయ్య తెస్తడు.. సర్లె బాయిలకెల్లి చేదాలె నీల్లు… ” అన్నదామె.

తన తల్లిని తొంటదనడం నచ్చలేదు వానికి… “బాయిల నీల్లు చేదుడు రాదు నాకు…” అన్నడు మొగం ముడుసుకొని.

“సరె సరె పందుల్ని గూట్లె కెల్లి బయిటికి తోలుపో..” అన్నడు సంగడు.

మొగం కడిగేందుకు గోలెం కాడికి పోవుకుంట.

పొడుగాటి కర్రతీసుకొని గూట్లెకు పెట్టి కదిలిచ్చుకుంట.. డుర్ర్ డుర్ర్ అనుకుంట.. బయిటికి తోలిండు..

అప్పటి దాక ఎచ్చగ పన్నయన్నీ.. గుర్రు గుర్రు అనుకుంట గునగున బయిటికొచ్చి చెల్లాచెదురుగ రోడ్డెక్కినయి..

“రా మొగం కడుక్కో..” అన్నడు తాత. “ఆని మొగానికేం తొందరొచ్చె గూట్లె పెంట ఎత్తురా పొల్లగా..” అన్నది ముసల్ది.

గూట్లె దూరిండు వాడు.. ఒక్కసారి ఊపిరాడనట్టయింది… ఇంతకు ముందెప్పుడు గూట్లెకు పోలేదు.. తన తల్లిదండ్రులు పోనియ్యలేదం. అట్టాంటి గబ్బు పనులు సెయ్యినియ్యలేదు.. అసలు ఏ పని చెయ్యనియ్య లేదు.. బయిటికురుకొచ్చిండు ఆ వాసన బరించలేక.. సితం సేపుండి మల్ల దూరిండు కంది పొరక తిరగ లేదు అండ్ల ఊడ్సెటందుకు.. కాళ్ళతో నెట్టుకుంట పెంటంత బయటకి నెట్టిండు.. పక్కనే

ఉన్న గుల్లలకు ఎత్తిండు…

“ఇగ మొగం కడక్క రాపో అన్నది.. ” బోల్లు తోముకుంట..

ఆ గబ్బు.. గొంతుల దాక పోయింది.. గోలెం కాడికి పోయి లోటాతోటి నీల్లు ముంచి చేతులు రుద్దిరుద్ది కడిగిండు. నోట్లె నీల్లు పోసుకొని పుక్కిలిచ్చి ఊసిండు. జాలరు పక్కన ఉన్న బూడిద కుప్పల నుంచి బొగ్గు ముక్క తీస్కొని

నములుకుంట.. జలారు పక్కన బూడిద చేతులకు తీస్కొని చేతులు పిస్కి పిస్కి కడిగిండు.

సంగడు వాన్ని ఒక కంట కనిపెడతాండు. ఇగరమంతుడె పోరడు అనుకున్నడు.

రాతెండి గ్లాసుల సాయి పోసుకొచ్చి.. ఇంక కాలేదా నీ మొగం కడుగుడు.. ఇగొ సాయి ఈడ పెట్టిన తాగు అనీ సూరు కింద అరుగు మీద పెట్టింది..

ఎత్తు బల్ల మీద కూసున్న సంగడికి స్టీలు గ్లాసందిచ్చింది.

మొగం కడుక్కుని వచ్చిన ఆ సిన్నోడు తన గలాసును.. తాత గలాసును మార్చి మార్చి రెండుసార్లు చూసి, సాయి గలాసు పక్కన కూసున్నడు. రెండు చేతులతో దాన్ని పట్టుకో బోయిండు.. చేతులు సురుక్కుమన్నయి అమ్మా! అని గ్లాసుని అక్కడే వదిలిండు.. సాయి నిండ లేదు గనుక కింద పోలేదు.. గాని కొంత కింద ఒలికింది.

“ఆత్రమెందుకురా.. ఏం మామ్ల పీకుతవు, నిమ్మలంగా తాగు అనుకుంట..” లోపటికి పోయింది ముసలిది..

అంతా అయోమయం అందుల కొంత సంబరం కొంత భయిం.

రోజులు గడుస్తున్న కొద్ది మెసలకుంట పనులు చెప్పేది మసలిది. ఏదన్నా జాగైనా… సరిగ్గా చెయ్యి లేక పోయినా ముసల్ది కొట్టేది.

అప్పుడప్పుడు సంగడు కూడ కొట్టెటోడు… మొదట్ల నేత్రి ఒక్కడే పండుకొండు భయమయ్యేది.. తర్వాత అలవాటయింది…

ఉన్న ఊరేకాబట్టి ఏదన్న తెమ్మని ఊళ్ళెకి పంపినప్పుడు తల్లిని సూసొచ్చెటోడు.. అప్పుడప్పుడు తమ్ముడే అన్నను సూడటానికి తాతింటికి వచ్చెటోడు. దడి చాటుకుండి సూసుకుంట నిలబడేది… వీడు పనొదిలిపెట్టి తమ్ముడి దగ్గరికి పొయ్యేది… ఇద్దరు కాసేపు ఒకల్ల సేతులు ఒకల్లు పట్టుకొని నిలబడేది.. ఈలోపు ముసలిది అరిసేది… “ఏడ సచ్చినవురా.. పొల్లగా…” అని..

గబుక్కున “ఇగ నువ్వుపో..” అని, ఇంట్లకురుకొచ్చేది… ఒకొక్క సారి తమ్ముడు జేబులు పెట్టుకొనొచ్చి బిస్కోట్లు పిప్పర మెంట్లు అన్నకిచ్చేది.. అన్న జేబుల నించి మామిడి పిందెలు, చింతకాయలు తీసితమ్ముడి చేతుల పెట్టేది… సేటిచ్చిన బిస్కెట్లు .. పందులు కాసేందుకు పోయినప్పుడు ఏరుకున్న మామిడి పిందెలు, చింతకాయలు… వారి ప్రేమలకు ప్రతీకలుగా చేతులు మారేయి…

ఒక సంవత్సరం గడిచినా తమ్ముడిని తాత దగ్గరికి పంపొద్దని సెప్పెటోడు పెద్దోడు.. వాడిని బడిల ఎయ్యే అవ్వా అని సలహా చెప్పెటోడు..

నాంచారి మీద వెంకులు కన్ను పడింది… సందుకోసం. ఎదురు సూత్తాండు….. ఒకసారి దసరా పండక్కి అమ్మగారింకి పోయింది. పెద్ద పిల్లగాన్ని కూడ తాతకి చెప్పిరమ్మని తీసుకొని పోయింది..

పండగయినంక చిన్న పిలగాడు ఈరన్న కాడనే ఉంటున్నడు. వాని చెల్లెను బడిలేసిన్రు. ఈరన్న సిన్న బిడ్డ హాస్టల్లో సదువుకుంట.. అక్క బిడ్డను కూడ హాస్టల్లో చేర్చిచ్చింది వాళ్ళను సూసి చిన్న పిల్లగాడు కూడ బడికి పోతా, సదువుకుంట అన్నడు.

ఈసారి తల్లి పెద్ద కొడుకునొక్కన్నే తీసుకుని ఇంటికి తిరిగొచ్చింది.

నాంచారి కొడుకు ముందలే

నాంచారి గురించి వెంకులు ఒంకర మాటలు మాట్లాడేది.

ముసల్ది ఒద్దు అట్ల మాట్లాడుకు అనేది. కానీ వాడు ఇనెటోడు కాదు. ఆ సంగతి నాంచారితో  చెప్పిండు కొడుకు.. “గా ఎంకులు ఎట్టెట్టనో మాట్లాడుతుండే అవ్వ…” అంట.

“ఏమంటండు..” అన్నది తల్లి.

“నిన్ను సూస్తె నిద్రపడతలేదట.. నాత్రి పవులు నువ్వే కండ్లల్ల మెదులుతున్నవట.. ఇంకేందేందో అంటంటే.. వాల్ల అవ్వ తోటి”

“మరి ముసల్దేమన్నది… ”

“అట్ల మాట్లాడొద్దు… ‘ఇప్పటికే శాన సేసిన్రు.. నువ్వు మీ అయ్య కలిసి..’ అన్నదే” ఇవరంగ సెప్పిండు నాంచారి కొడుకు.

“నువ్వేం బుగులు పడకు… నాకేం కాదు.. నువ్వు నిమ్మలంగ ఉండు..” అన్నది నాంచారి.

వెంకులు వంకర సూపులు ఎప్పుడో పసిగట్టింది. ‘తల్లితాళ్ళల్ల మేస్తె పిల్ల ఈదుల్ల మేత్తదా.. తండ్రసుంటి కొడుకు.. పాపిష్టి పుటకలు..” అనుకున్నది.

నాంచారి తండ్రి “జాగ్రత్త బిడ్డా..” అంటనే ఉన్నడు. ఇన్నొద్దులు సిన్న కొడుకు మంగడు తోడుండె.. ఇప్పుడు ఒంటరిదైంది. పక్కింటి గొల్ల ముసలవ్వను నేత్రుల్లు పండుకోను తోడు పిలుసుకుంది.

ఎంకులు ఎప్పటి సందో ఎదురు సూస్తుండు… ఆ రోజు ఎట్లనన్న నాంచారి పని పట్టాలను కున్నడు. తువ్వర తువ్వర ముసుర బడ్తంది… పట్నం నించి తెచ్చిన ఇంగ్లీషు మందు తాగిన్రు తండ్రి కొడుకులు. తల్లి వట్టిచేపల కూరొండితే పీకలదాంక తిన్నడు…

‘అసలే కోతి.. కల్లుతాగింది.. దానికి తేలు కుట్టింది. ఎగురుకుంట నిప్పులు తొక్కింది…’ అన్నట్టున్నది ఎంకులుగాడి పని.

ముసురుపెట్టి సల్లంగున్నది .. మందుకొట్టిండు.. మెదట్ల పురుగు జొర్రింది .. తల్లిదండ్రి నిద్రపోయ్యేదాక సూసి.  సప్పుడు కాకుండ ఇంట్లకెల్లి బయటికొచ్చిండు.. తల తడవ కుంట ఒరుకు కాయితం నెత్తి మీదేసుకొని, అడుగులడుగేసుకుంట ముందుకు నడిసిండు.. మసక మసక ఎన్నెల కాస్తాంది. చీమ చిటుక్కుమనట్లేదు.. అద్దంనేతిరి సుత కాలేదు.. కానీ తలుపులు తడకలన్నీ బిగుసుకున్నయి. బయిట పురుగు కనపడట్లేదు.. చెట్ల నీడల్ల నడుస్తండు ఎంకులు.. దార్ల ఒకటి రెండు కుక్కలు మోరలెత్తి ఎంట పడ్డయి. వాటి మీదికి రాళ్ళసిరి ఏదులు గుడిసె కాడికొచ్చిండు… కాళ్ళు సప్పుడు చేసిండు సూరుకున్న తాటాకు గుంజిండు…

నాంచారి నిద్రపోలేదు. పక్కనే పన్న గొల్లముసలమ్మతో “చిన్నవ్వ గుడిసి ముందలకి ఎవరో వచ్చిన్రే…” అన్నది గుసగుసగ.

****సశేషం****

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

వివాహాలు— విడాకులు( విడి ఆకులు)