పెండ్లి అయినాక ఆరు నెలలు
పెనిమిటి ప్రేమలో ముర్షి పోయి
పెద్దల తో ఇంట్ల కల్షి మెల్షి
తల్లి గారు యాదికొస్తే కండ్లు తడ్షి…
ఇంతలో….
కడుపుల వికారం అనిపించే
కండ్లు చీకట్లు రావట్టే …
అన్నం చూస్తే ఓకారం అనిపించే..
అమ్మ యాది కొచ్చే ..
కండ్ల నీళ్ళ తోనీ మెత్త తడ్షే..
ఏమయితుందొ తెల్వక పాయె..
ఇంట్లున్న పెద్ద మన్షి ముసి ముసి న వ్వి..
గిది గదే అని చెప్పి పరాచకం ఆడే..
కొద్దిగంత అర్థ మాయే…
మనసు సంబరమాయే..
తల్లి గారింటికి పోవాలని గుంజి
తల్స్క తల్స్క బాధవడే..
దినాలు వోయిన కొద్దీ..
మొకమంత మెర్వ వట్టే….
నడుము వడ్డాణం సళ్లే..
రైకెలు బిగువాయే..
ఓడి నింప దొల్క పోను అన్నలోచ్చే..
పలారాలు జేశి..
పక్వాన్నలు వొండి.
పులిహోర లు గలిపిరి..
పచ్చ చీర గట్టించి…
పండ్లు పలారాలు ఒళ్లే నింపి..
చేతుల నిండా గాజులు తొడిగి..
దీవెనార్తులు ఇచ్చిరి దిష్టి తీసి..
పండోలే పిల్లలు వుట్టాలని..
పది మంది దీవించి…
తృప్తి దీర భోంచేసి..
తరలి పోయిరి..
ఆడ బిడ్డల సీమంతమే ఇంటికి శ్రీమంతమాయే!