జీవితాన్ని అర్ధవంతం చేసేదే నిజమైన చదువు

తరుణి ముఖాముఖిలో గట్టు రాధిక మోహన్

అమ్మ రూపం ఊహకందని చిత్రం,
నాన్న ప్రేమ అందని ద్రాక్షే అయ్యింది. అయితేనేం అమ్మలోని అ, నాన్నలోని నా కలిసిన “అన్నయ్యలు, అక్కలు కంటికి రెప్పలా చూడడమే కాకుండా అతి చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా ఆమెను ప్రోత్సహించారు. భర్త ప్రోత్సాహంతో ఉన్నత విద్యను పూర్తి చేశారు. సాహిత్య అభిలాషతో భావావేశాన్ని కవితలుగా మలిచారు. సామాజిక అంశాలపై చైతన్యం కల్పించేలా “పోయిరాళ్ల”ను పేర్చి అనుభవాలను వండి షడ్రుచులతో అందిస్తున్నారు. ఆమే ప్రముఖ కవయిత్రి, సినీ గేయ రచయిత గట్టు రాధిక. ఈవారం తరుణి ముఖాముఖి లో రాధిక గారి గురించి తెలుసుకుందాం….

తరుణి: మీ బాల్యం, అతిచిన్న వయసు తో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం, ఉన్నత చదువుల గురించి చెప్పండి?
 రాధిక: నా పేరు గట్టు రాధిక మోహన్. పుట్టి పెరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ లో ప్రస్తుతం అది జనగాం జిల్లాలో ఉంది. నేను సుమారు ఆరునెలల పసిబిడ్డగా ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఆ రోజుల్లో ఫోటో తీయించుకోవడమంటే ఇప్పుడు అంతరిక్షానికి పోయొచ్చినట్లుగా ఉండేదేమో..!
అందుకే నాకు అమ్మ ఊహకందని రూపంగా ఉండిపోయింది. నాన్న నా తొమ్మిదేండ్ల వయసులోనే అకస్మాత్తుగా మరణించాడు. మా అమ్మ నాన్నలకు మేము ఆరుగురు సంతానం.నేను చిన్నదాన్ని కావడం వల్ల నన్ను అన్నలు అక్కలు అల్లారుముద్దుగా చూసుకున్నారు. ఆస్తులు, అంతస్తులు ఏమీలేని నిరుపేద కుటుంబం మాది…నేను కష్టపడలేదు. కాని, మా వాళ్లు పూట తిండికోసం పడే కష్టాలను చూస్తూ పెరిగిన.అన్నలిద్దరూ చదువుకున్నరు. కానీ ముగ్గురక్కలు ఏమీ చదువుకోలేక పోయారు చదువుకునే పరిస్థితులు లేక.నన్ను మాత్రం చదువుకోవడానికి చాలా ప్రోత్సహించారు. వాళ్లిచ్చిన ప్రోత్సాహ బలం వల్లనే 19 ఏండ్ల వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొదటి అమ్మాయిగా మా ఊరిలో గుర్తింపు పొందాను. ఇంటర్ టిటిసి తోనే జాబ్ రావడం వల్ల ఎంతో చదువుకోవాలనుకున్న నా ఆశలకు బ్రేక్ పడ్డది. జాబ్ వచ్చిన సమయంలో నేను కాకతీయ యూనివర్సిటీ లో బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. కానీ వచ్చిన జాబ్ కాదన లేని పేదరికం. దాంతో ఉన్నత చదువును కంటిన్యూ చేయలేకపోయాను. సైలెంట్ గా చదువు ఆపేసి జాబ్ లో చేరిపోయాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఆడపిల్లలు పదోతరగతి వరకు చదవడమే కష్టంగా ఉండేది. అలాంటిది మా అన్నలు నన్ను నా ఇంట్రెస్ట్ ప్రకారం చదివించారు …చాలా సపోర్ట్ చేశారు. మంచి గైడెన్స్ ఇచ్చి అతిచిన్న వయసులోనే మెరిట్ ర్యాంకు సాధించి గవర్నమెంట్ జాబ్ వచ్చేలా చేసిండ్రు…వాళ్లు ఇంకా నా వల్ల ఇబ్బంది పడొద్దని చదువు ఆపేసి జాబ్ లో చేరిపోయాను. ఆ వెంటనే మ్యారేజ్ అయ్యింది.
మా వారి పేరు వలుగుల రాంమోహన్. మేం ఇద్దరం గవర్నమెంట్ టీచర్స్ గా 24 ఏండ్ల నుండి పనిచేస్తున్నాం. పెండ్లి తర్వాత పిల్లలు, ఉద్యోగం లో మునిగిపోయాను కానీ చదువును మాత్రం ఎక్కడ ఆపలేదు. దూరవిద్య ద్వార డిగ్రీ ,బీఎడ్,డబుల్ పీజీ చేసినా. ఇప్పుడు నా క్వాలిఫికేషన్స్ ఎం.ఎస్సీ (ఫిజిక్స్), ఎం.ఏ.(సోషియాలజీ), బి.ఎడ్.ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్ గా హన్మకొండలో పనిచేస్తున్నాను.
మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి సంహిత. ఈ మధ్యనే ఎంబిబిఎస్ పూర్తి చేసి పీజీ ప్రిపరేషన్ లో ఉంది. అబ్బాయి సాయివర్షిత్ ఐఐటీ ఖరగ్‌పూర్ లో కంప్యూటర్ సైన్స్ లో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.
నేను చదవలేక పోయిన చదువులను నా పిల్లలు చదివేలా ప్రోత్సహించాం. వాళ్ళు కూడా అర్థం చేసుకొని చాలా కష్టపడి ఉన్నత చదువుల్లోకి వెళ్లిండ్రు. మా కుటుంబంలో నేను చదువుకొని జాబ్ చేస్తున్న మొదటి తరమైతే. ఇప్పుడు మా పిల్లలు ఉన్నత చదువుల్లో మొదటి తరం.

తరుణి : సాహిత్యం పై ఆసక్తి ఎలా కలిగింది?
రాధిక: నిజం చెప్పాలంటే చిన్నప్పుడు నేను ఎలాంటి కథల పుస్తకాలను కానీ, సాహిత్య పుస్తకాలను చదవలేదు. పాఠ్య పుస్తకాలను, జనరల్ మ్యాగజైన్స్ ని, సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాసాలను, కాంపిటేటివ్ బుక్స్ ని బాగా చదివేదాన్ని. మాది గర్ల్స్ కాలేజ్. ప్రతిరోజూ స్టడీ అవర్స్ లో బోర్ కొట్టినప్పుడు నేను, నా ఫ్రెండ్స్ ఏవో తోచిన రాతలను నోట్ బుక్స్ వెనకాల రాసి ఒకరిదొకరు చదువుకొని మాకు కవిత్వం బాగా వచ్చన్నట్టు ఫీలైపోయేవాళ్ళం. అట్ల మొదలైన నా రాతలు నాలోని భావోద్వేగాల మీద పూసే లేపనంగా మారిపోయింది. ఆ రోజుల్లోనే ఒక నోట్ బుక్ నిండిపోయింది. అది కవిత్వమో కాదో తెల్వదు గానీ నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో చిన్నగా రాయడం మొదలైంది. ఇప్పుడు ఆ నోట్ బుక్ తెరిచి చూసినప్పుడల్లా నవ్వును ఆపుకోలేను. ఓసారి బి.ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు కాలేజీ నోటీసు బోర్డు లో మొదటి సారి నా కవితను చూసుకున్నప్పుడు చాల గర్వంగా అనిపించింది. తర్వాత రాయడం క్రమక్రమంగా తగ్గిపోయింది. గవర్నమెంట్ టీచర్ గా జాబ్ రావడం, వెంటనే పెండ్లి అవ్వడం పిల్లలు, వారి చదువు లు, సంసారం లొల్లిలో పడి రాయడమే మరిచిపోయాను.

తరుణి: ఇప్పటివరకు మీరు ఏయే ప్రక్రియల్లో రచనలు చేశారు? “ఆమె తప్పిపోయింది” కవితా సంపుటి గురించి చెప్పండి.
రాధిక: మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో జరుగుతున్న ఘోరాలను తట్టుకోలేక మనసును ఓదార్చుకోడానికి మళ్లీ రాయడం మొదలుపెట్టినా.. ఇక సీరియస్ గా సాహిత్య లోకంలోకి దూకింది మాత్రం 2017 లోనే‌. ఆ తర్వాత ఏడాది కాలంలో రాసిన సీరియస్ పోయెట్రీతో “ఆమె తప్పి పోయింది” అనే కవితా సంపుటిని 2019 లో రిలీజ్ చేసాను. సామాజిక అంశాల మీద కొనసాగిన ఈ కవిత్వ సంపుటి ‌నాకంటూ సాహిత్య ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కవిత్వమే గాకుండా కథలు, సాహిత్య సమీక్షలు చాలా రాసాను.

చాలా వరకు పేపర్, వెబ్ మ్యాగజైన్, సోషల్ మీడియా గ్రూప్ లలో వచ్చినవి. సాహిత్యం అనేది మహా సముద్రం లాంటిది. అందులో దూకితే దాహం తీరదు. ఎన్నో ఎన్నో చేయాలనిపిస్తుంటది. ఎన్నో నేర్చుకోవాలి అనిపిస్తుంటది. ఆ దాహాన్ని తీర్చుకోడానికే లిరిక్స్ రాయడం ప్రారంభించిన పేరున్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నా లిరిక్స్ కి ప్రాణం పోయడం వల్ల అయిదు పాటల రూపంలో ప్రజల ముందుకొచ్చి నన్నొక లిరిక్స్ రైటర్ గా గుర్తింపు తెచ్చింది. అంతటితో ఆగిపోకుండా కోవిడ్ లాక్డౌన్ సమయంలో తెలంగాణ భాషా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్, డైరెక్షన్ కోర్సులు పూర్తి చేసాను. నేర్చుకున్న విద్యను సాధనలో పెట్టాలన్న ఉద్దేశంతో లైక్ మైండ్ ఫ్రెండ్స్ ఇద్దరితో (అనురాధ కోవెల & ఉత్కర్ష) కలిసి #పొయ్యిరాళ్లు అనే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి సామాజిక అంశాల మీద చిన్న చిన్న స్క్రిప్ట్ లను రాసుకొని మొబైల్ తో షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టాము.
అలాగే ఒక సినిమాకి స్క్రిప్ట్ వర్క్ ఫస్ట్ కాపి కావాలంటే రాసిచ్చిను.

ఇప్పటివరకు మీరు ప్రచురించిన పుస్తకాలు?

2019 లో ఆమె తప్పిపోయింది అనే కవిత్వ సంపుటిని తీసుకురావడం జరిగింది. ఇదొక భావావేశ కవిత్వం. ఈ పుస్తకం మంచి పేరుతో పాటు సాహిత్య ప్రపంచంలో ఒక స్థానాన్ని ఇచ్చింది. మరొక కవితల సంపుటిని తీసుకొద్దామనుకునే సమయంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం వల్ల బుక్ ని వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే కొత్త కవిత్వాన్ని మీ ముందుకు తీసుకొస్తాను.

టీచర్ గా అందుకున్న అవార్డులు?

మనపని మనం చేస్తూ పోతుంటే వచ్చేవి అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయని నమ్ముతాను. వృత్తి పరంగా ఇప్పటి వరకు వచ్చిన అవార్డులు… “గణిత జ్యోతి  అవార్డు Telangana Maths Forum

– లయన్స్ క్లబ్ వారి బెస్ట్ టీచర్ అవార్డు , రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అవార్డులు చాలా నే ఉన్నాయి.

తరుణి: ప్రవృత్తి పరంగా వచ్చిన అవార్డులు…
రాధిక: నేను రాసిన బతుకమ్మ – 2021 పాట ఆ ఏడాదిలో వచ్చిన బతుకమ్మ పాటలన్నింటిలో టాప్ 10 లో స్థానాన్ని సాధించి రవీంద్రభారతి లో పైడిరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రదర్శించబడింది. ఈ పాట “కాళోజీ టీవి యూట్యూబ్ ఛానల్ ” వారి ఆధ్వర్యంలో తీసుకురాబడింది. ఇదే ఛానల్ నుండి దీనికి ముందు వచ్చిన ఉగాది పాట కూడా మంచి గుర్తింపునిచ్చింది. పేరొందిన ప్రముఖ సింగర్ రవివర్మ గారి భజన్ దర్బార్ భక్తి ఛానల్ నుండి వచ్చిన నా మొదటి పాట వెంకటేశ్వర స్వామి మీద కొత్త ట్యూన్ లో సరికొత్త వర్షన్ గా వచ్చింది. ఆ పాట విన్న ఎంతో మంది పెద్దవాళ్ళ నుండి మంచి ప్రశంసలు పొందాను.

అలాగే నేను దివ్యాంగుల మీద తీసిన “హీరో” షార్ట్ ఫిల్మ్ కి డైరెక్షన్ లో “ది బెస్ట్ అప్రిసేషన్ స్పెషల్ జ్యూరీ అవార్డు” లభించింది. మన భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రి బాయి పూలే గారి మీద “విజ్ఞానదర్శిణి” వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన 120 సెకండ్ల షార్ట్ ఫిల్మ్  పోటీలో నేను చేసిన షార్ట్ ఫిల్మ్ “మాతృ హృదయం”  మొదటి స్థానాన్ని పొంది పదివేల రూపాయల క్యాష్ ప్రైజ్ లభించింది.

అలాగే కోవిడ్ సమయంలో ఈనాడు పేపర్ వారు “కరోన కవితల పోటీ” ని నెల రోజుల పాటు నిర్వహించారు. అందులో ఆరవరోజున  “నా తెల్లకోటు వెనుక” అనే నా కవిత నన్ను మహిళల్లో మొదటి విజేతగా నిలిపింది(ముందు అయిదు రోజులు వరుసగా మొదటి స్థానం పురుషులదే). ఆ కవిత ఆ రోజుల్లో వైద్యులు చేసే సేవలకు, వారు పడుతున్న కష్టాలకు చలించి రాయబడింది. ఈ కవిత రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

నాన్న మీద రాసిన కవితకు గాను తానా అవార్డు లభించింది. అలాగే మరికొన్ని అవార్డులు వచ్చాయి. వాటిలో
*మిట్టపల్లి నర్సయ్య మెమోరియల్ రివార్డు
*జాతీయ సాహిత్య స్ఫూర్తి అవార్డు- శ్రీ సాయి శివాని ఆర్ట్ కల్చరల్ సొసైటీ.
*కలం భూషణ్ అవార్డు – కలం స్నేహం సోషల్ మీడియా సాహిత్య సమూహం

నేను సాహిత్యంలో రాసిన ప్రతీ ప్రక్రియ కూడా మంచి గుర్తింపు నే ఇచ్చింది.

తరుణి: ఈ మధ్య కొంత కాలంగా మీ కలానికి విశ్రాంతి ఇచ్చారు. కారణం తెలుకుకోవచ్చా?
రాధిక: దాదాపు సంవత్సరం నుండి గ్రూప్ 1 ప్రిపరేషన్ లో ఉండటం వల్ల సాహిత్యానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి సీరియస్ గా మెయిన్స్ ప్రిపరేషన్ లో ఉండగా పేపర్ లీకేజీల ఇష్యూ వల్ల ప్రిలిమ్స్ ఎగ్జామ్ ని క్యాన్సల్ చేసి మళ్లీ రీ ఎగ్జామ్ పెడుతున్నారు. నోటిదాక వచ్చిన బుక్కను లాక్కున్నట్టయ్యింది. ఈ విషయంలో వ్యవస్థలో జరిగిన లోపాల వల్లనైతే చాలా డిప్రెషన్ అయిపోయాను. రీ ఎగ్జామ్ కి మళ్లీ చదువు తున్నాను. చూడాలిక ఏం జరుగుతుందో.

తరుణి: భవిష్యత్తు ఇంకా ఏయే పుస్తకాలు పాఠకులకు అందించబోతున్నారు?
రాధిక: ముందుగా వాయిదా వేసిన రెండో కవిత్వ సంపుటిని త్వరలోనే తీసుకురావాలనుకుంటున్నాను. ఇక భవిష్యత్తులో ఒక కథల పుస్తకం, సమీక్ష సంకలనం తీసుకురావాలనే ఆలోచన ఉంది.
అలాగే నేను రాసుకున్న కొన్ని లైన్స్ కి స్క్రిప్ట్ లను రాయాలి. షార్ట్ ఫిల్మ్స్ మరికొన్ని చెయ్యాలి. అవకాశం వస్తే లిరిక్స్ రైటర్ గా కొనసాగాలనుకుంటున్నాను.

తరుణి: చదువు మీ జీవితం లో తెచ్చిన మార్పు చెప్పండి. నేటి విద్యార్థులకు మీరిచ్చే సూచన….
రాధిక: వెనుకబడిన కుటుంబాలలో చదువు పునాది గట్టిగా ఉంటే భవిష్యత్తు తరాలు సులభంగా సాగిపోతాయని నా నమ్మకం. ప్రస్తుత సమాజంలో డబ్బుతోనే సంబంధాలు ముడిపడి ఉన్నాయి. అదే విలువైన జీవితమనే భ్రమలో బతుకుతున్నారు చాలా మంది. నన్ను ఒక స్థాయిలో నిల్చుండబెట్టింది చదువు మాత్రమే అని గర్వంగా చెబుతాను. చదువు ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో కాదు జీవితాన్ని అర్ధాంతరంగా జీవించడానికి…

ఎస్. యశోదాదేవి

Written by S. Yashoda Devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పాలక్ పన్నీర్ రోటీ

మానసిక అభివృద్ధికి తోడ్పడే ప్రాథమిక విద్య