తల్లులారా ఆలోచించండి

వరిగొండ సురేఖ, న్యాయవాది

తల్లి అంటే ఒక  సాత్విక భావన, ఒక స్వాంతన , ఒక స్వచ్ఛత, ఒక ధైర్యం , ఒక తోడు … మా అమ్మ అన్ని చూసుకుంటుంది అనే భరోసా … మరి ఆ భరోసా ఇవ్వగలుగుతున్నామా మన పిల్లలకి . తల్లి అధికారం , హక్కు కేవలం తమ పిల్లల పెంపకానికే  పరిమితమా ? సరే , మరి ఆ పిల్లల పెంపకం సరిగ్గా చేస్తున్నామా ?  ఆహరం మొదలుకొని వారు జీవితంలో నిలదొక్కుకునే అతి సామాన్య విషయాల నుండి ఆర్ధిక అవసరాల వరకు మనం ఎన్ని ఆలోచిస్తున్నాము . అదేదో మనకి సంబంధమే లేని విషయంగా  , స్త్రీల హక్కులు అంటే వీటినుండి విడువడి , ప్రత్యేకమైనవిగా భావిస్తున్నాము కానీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే సమాజంలో హక్కుల గురించిన వేదనే అవసరం లేదనే ప్రాథమిక సూత్రాన్ని మరుస్తున్నాము.
స్త్రీలు తమ హక్కుల గురించి తెలుసుకునేటప్పుడు యెక్కువగా దృష్టిసారిస్తోంది తమ వ్యక్తిగత హక్కులు మరియు అధికారాలు . అవి కుటుంబ సంబంధిత మైన అధికారాలు కావొచ్చు లేదా పని చేసే చోట తమ భద్రత లేదా సాధికారత హక్కులు కావొచ్చు. అంతకుమించి వారికి మరే హక్కుల బాధ్యత లేదా ? సమాజం లో స్త్రీ పట్ల జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడే గొంతులు ఆ సమాజ నిర్మాణం లో స్త్రీ పాత్ర , కృషి మరువ కూడదు కదా. సమాజం అంటే వ్యక్తుల సమాహారమే కదా . మరి ఆ వ్యక్తులలో , నిరంతరం తమ మానసిక ,శారీరక శక్తి ని సంపూర్తిగా వినియోగిస్తూ తమ కుటింబీకుల గురించి శ్రమిస్తూ కృషి చేస్తున్నపుడు , ఆ కృషికి , సమయానికి , మేథస్సు కి , శ్రమకి తగ్గ విలువ పొందే హక్కు ఉంది కదా . అన్ని రకాల వనరులు వినియోగిస్తున్నపుడు అవి క్షామానికి , క్ష్యయ కి గురి అయితే ప్రశ్నించే హక్కు , బాధ్యత స్త్రీల కి ఉంది కదా.   తమ వ్యక్తిగత భద్రత లేదా  సౌలభ్యం కొరకు మాత్రమే స్త్రీలు  పరిమితం కాకూడదు. ఈ సమాజ నిర్మాణంలో పురుషుడి కంటే ఓ రవ్వంత ఎక్కువే కృషి సల్పుతున్న స్త్రీలు ,  తమచే నిర్మింపబడుతున్న ఈ  సమాజం ఆరోగ్యకరమైనది గా వృద్ధి చెందాలంటే  ,చాలా ప్రశ్నలు సంధించాలి.  మరి దానికి మార్గం ? ప్రశ్నించడమే…
ప్రశ్నించాలి అంటే ముందు సమస్యలు తెలుసుకోవాలి. రంగులు, మైనము అద్దుతున్న పండ్లు కావొచ్చు  , జెర్సీ ఆవుల పాలతో పంపిణి అయ్యే పాల పాకెట్స్ కావొచ్చు. తినుబండారాల పై  (ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్ ) ఉండే అర్థం కానీ శాస్త్రీయ పదాలు కావొచ్చు. పెరుగులో కలిపే యూరియా కావొచ్చు . ఇలా ఎన్నో సమస్యలు సమాజంలో ఉన్నాయి . అవన్నీ మేధావులకు లేదా మగవారికో సంబంధించిన సమస్యలు కాదు. కొంచెం లోతుగా విశ్లేషించండి అవీ  ఆడవారి సమస్యలే.  మన ఆడపిల్లలు తొందరగా పెద్దమనిషి లేదా పుష్పవతి (puberty )  అవుతున్నారు ఎందుకు ? గర్భ స్రావాలు మునుపెన్నడూ లేని విధంగా అంగీకరించడానికి వీలు లేని నిష్పత్తులో అవుతున్నాయి , ఎందువల్ల ? ఋతువిరతి  ( మెనోపాస్ ) 40 ఏళ్లకే వచ్చేస్తోంది , కారణం ? ఇవన్నీ ఆడవారి సమస్యలే గా . వీటి వల్ల శారీరక , మానసిక ఒత్తిడి అనారోగ్యమే కాక, కుటుంబపరమైన , ఉద్యోగపరమైన మరియు దాంపత్యపరమైన సమస్యలు మన ఆడపిల్లలు ఎదుర్కోవట్లేదా.?
మన కుటుంబాలలో ఎన్ని జంటలు విడిపోవడం , ఎన్ని జంటలు సంతానం కోసం లక్షలు ఖర్చు  పెట్టడం చూస్తున్నాము .  లక్షలు ఖర్చు పెట్టినా , మన ఆడపిల్లల శరీరాలు, మనసు  యెంత వేదనకి గురి అవుతున్నాయి. ఇవన్నీ ఆలోచించే విషయాలు కావా ? మన పిల్లల భవిష్యత్తు మన హక్కు కాదా ? ఆహారం మనిషి శరీరాన్ని , మనసుని రెంటిని ప్రభావితం చేస్తుంది అన్నది నిర్వివాదం మరియు నిస్సందేహము . మరి అట్టి ఆహార నాణ్యత కానీ, అది ఎలా తయారైంది అనే విషయం కానీ , ఎక్కడ ఏ విధానంలో ఉత్పత్తి అయిందనే సంగతి మనకి అక్కర్లేని విషయమా ? మరి తల్లులాగా మన బాధ్యత ఏమిటి ? “అమ్మ ” అనే పిలుపుకి సార్థకత చేకూరుస్తున్నామా ? మనకి బాధ కలిగితేనే  మన పిల్లల భవిష్యత్తు నిర్మితం అవుతుంది.
మరి కర్తవ్యం ? చాలా సులువు . ఒక్కో అడుగు ముందుకు వేయడమే. మీ ఊరిలో ఉండే ,పంచాయితీ , మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్కలకి ఫిర్యాదు లేదా ఉత్తరం వ్రాయవచ్చు . మీ స్థానికంగా ఉండే  “ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)” సంస్థకి ఫిర్యాదు చేయవచ్చు. పేరుగాంచిన సూపర్ మార్కెట్ అయినా , చిన్న కిరాణం కొట్టు అయినా పాటించవలసిన ప్రమాణాలు పాటించకపోతే వెంటనే ఫిర్యాదు చేయండి. వారి నుంచి సమాధానము రాకపోతే విజిలెన్సు వారికి ఫిర్యాదు చేయవచ్చు. ఇవేవి కాకపొతే  ఆఖరి అస్త్రం సమాచార చట్టం కూడా వినియోగించవచ్చు .
ఇలా సత్కార్యాలు చేసేటపుడు సంఘటితంగా చేస్తే మరింత ఫలితం ఉంటుంది . కాబట్టి మనతో పాటు మన చుట్టూ పక్కలవారినో లేదా స్నేహితులనో కలుపుకొని చిన్న చిన్న సమూహంగా ఏర్పడి కూడా చేయ వచ్చు. కిట్టి పార్టీ సంస్కృతి అలవాటు ఉన్నవారు , దీనిని  అజెండా లో ఒక భాగం చేయవచ్చు.  
అయితే ఫిర్యాదు కానీ ఉత్తరం కానీ , ఎప్పుడూ రసీదు కార్డుతో రిజిస్టర్డ్ పోస్ట్  (registered post with acknowledgement card) మాత్రమే చేయాలి. మీరు వ్రాసిన లేఖ యొక్క మరొక కాపీ ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోవాలి. https://www.indiapost.gov.in/ లో మీ లేఖ యొక్క ట్రాకింగ్ మీరు తెలుసుకోగలుగుతారు. ఒకసారి వ్రాసిన లేఖకు జవాబు రాకపోతే నెల రోజుల ( విషయ తీవ్రతననుసరించి వారం లేదా  15 రోజుల తరువాత వ్రాయవచ్చు)  తరువాత  మరొక ఉత్తరం/ ఫిర్యాదు వ్రాయాలి. ఇందులో మొదట వ్రాసిన ఉత్తరం తాలూకు రిఫరెన్స్ ఇవ్వాలి.  ప్రభుత్వ సంస్థలు పనితీరు ఒక్కో సారి సంతృప్తిగా ఉండవు కాబట్టి  పట్టుదల వీడకుండా , నిరుత్సాహ పడకుండా పని అయ్యేంత వరకు ప్రయత్నించాలి.  ఆ రెండు  లక్షణాలు  పిల్లలకి అలవాడాలి అని ప్రతి తల్లీ కోరుకునేది , చెప్పడం కాక ఆచరణలో చూపిస్తే పిల్లలు ప్రభావితమై నేర్చుకుంటారు కూడా. అలాగే సమస్య వస్తే వెనకడుగు వేసి ఓటమి అంగీకరించక ఎదుర్కోవడం , సాధించడం లాంటి లక్షణాలు అలవాడుతాయి .
ఏం చేసినా పిల్లల కోసమే కదా !  విలాసవంతమైన సౌకర్యాలు , ఆడంబర జీవితానికి కావాల్సిన హంగులు ఎన్ని ఇచ్చినా ఆరోగ్యకరమైన జీవితం , ప్రశాంతవంతమైన జీవన శైలీ ఇవ్వలేకపోతే , ఇచ్చినదంతా సగం ఆసుపత్రికి మరింత అనారోగ్య అలవాట్లకు వెళ్ళిపోతుంది.  
కాబట్టి తల్లిగా మన హక్కులు , అధికారులు తెల్సుకుని , ఆ దిశగా అడుగులు వేద్దాం , మన పిల్లలకి “అమ్మ అన్నీ చూసుకుంటుంది” అన్న భరోసా ఇద్దాం

Written by Varigonda Surekha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సినిమా పాటలో సాహిత్యం..

భూమి- మనమూ