క్షమయా ధరిత్రి.

కధ

తాటి కోల పద్మావతి.

తెల్లవారాక తాపీగా లేచి ముఖం కడుక్కుని కాఫీ కోసం ఎదురుచూస్తూ పేపర్ తిరగేస్తూ కూర్చున్నాడు కేశవరావు.ఎంతసేపటికి భార్య అలికిడి వినపడటం లేదు. వంటింట్లో గిన్నెలో చప్పుడు లేదు. చూస్తుంటే అంతా నిశ్శబ్దంగా ఉంది.గదిలో నాలుగు పక్కల వెతికాడు. కిందికి వెళ్లిందేమో అనుకొని మెట్లు దిగి వచ్చి చూశాడు.భార్య రాజేశ్వరి కనిపించడం లేదు. రాత్రి భార్యాభర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది.అలిగి పడుకుందా ఏమిటి? లేవకేం చేస్తుంది. ఇవాళ ఆదివారం స్కూల్ కూడా లేదు. తెల్లవారి ఏడు గంటలైనా భర్తకి కాఫీ ఇవ్వాలని తెలీదా! బొత్తిగా భర్త మీద గౌరవం లేకుండా పోయింది.ఇలాంటి గొడవలు ఎన్నిసార్లు జరగలేదు. కొట్టినా తిట్టినా ఇల్లు విడిచి వెళ్లే ప్రసక్తే లేదు. పరువు ప్రతిష్ట కోసం పాకులాడే మనిషి. ఇంతకాలం తొక్కి ఉంచబట్టి అణిగి ఉంది ఏనాడు ఎదురు తిరగలేదు. ఎందుకో కేశవరావు దెబ్బతింది.అమ్మా రాజేశ్వరి కనిపించడం లేదే అన్నాడు.ఉలిక్కిపడి లేచి మంచం దిగింది జగదాంబ.అదేమిటి రా! రాత్రి కూడా ఇంట్లోనే ఉందిగా. తెల్లవారేసరికి ఎక్కడికి మాయమవుతుంది. ఇల్లంతా వెతుకు అన్నది కాస్త కోపంగా కేశవరావు తల్లి జగదాంబ.గదిలో టీవీ దగ్గర కాగితం మడత పెట్టి ఉంటే ఆత్రంగా విప్పి చూసాడు కేశవరావు.మిమ్మల్ని భర్తగా సంబోధించడం కూడా నాకు ఇష్టం లేదు. మీ చేత మూడు ముళ్ళు వేయించుకున్నందుకు నా తల్లిదండ్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను. పిల్లల పెళ్లిళ్లు చేయాలని ఇంతకాలం ఓర్పు పట్టాను. ఎందుకంటే మీరు నా పక్కన కూర్చొని కన్యాదానం చేయాలి. ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ తీరిపోయాయి. రిటైర్మెంట్ తీసుకుని స్వేచ్ఛగా బ్రతకటానికి వెళ్తున్నాను. ఇన్నాళ్లు ఇనుప పంజరం లో ఉన్నాను. ఇప్పుడు రెక్కలొచ్చి ఎగిరిపోతున్నాను నాకోసం వెతకవద్దు. భార్య లేని జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీరు చెప్పినట్లు కోపంతో ఉత్తరం నలిపి పారేశాడు కేశవరావు. ఎంత పొగరు దీనికి. పెళ్లయి 40 ఏళ్లు కాపురం చేసింది. టీచరుగా పిల్లలకు పాఠాలు బోధించింది. ఇలాంటి తప్పుడు పని ఇప్పుడు చేస్తుందా! నలుగురిలో నా పరువు తీస్తుందా! మళ్లీ ఈ గడప ఎలా తొక్కుతుందో చూస్తాను అంటూ కోపంతో రగిలిపోయాడు.
‘అమ్మ నీ కోడలు ఇంట్లోంచి వెళ్లిపోయింది అంటూ తల్లికి జగదాంబకు చెప్పాడు.’
‘ఆమె ఆశ్చర్యంగా నోరు తెరిచింది. సిగ్గు లేదురా దానికి! ఇన్నాళ్లు మన అదుపజ్ఞలలో ఉన్నదనుకున్నాం. ఈ వయసులో భర్తను వదిలేసి వెళ్ళిపోతుందా. మళ్లీ ఏ మొహం పెట్టుకొని వస్తుంది. పోతే పోయిందిలే. పీడ వదిలింది అనుకుందాం.
“ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందా. ఏదైనా జరిగితే నా పీకకు చుట్టుకుంటుంది.
“అది పోయినందుకు బాధ లేదురా! నెలకు వచ్చే జీతం కూడా పోయింది. నీ చెల్లెలు పెళ్లికి చేసిన అప్పులు ఎలా తీర్చాలి.
“అదేనమ్మా నా బాధ. రిటైర్ అయితే లక్షలు వచ్చి పడతాయి అనుకున్నాను. ఇప్పుడు ఇలా చేసింది.
“కేశవరావు కూతుళ్లు ఇద్దరికీ ఫోన్ చేశాడు.”
అమ్మ ఇక్కడికి రాలేదని చెప్పారు.
“అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు నాన్నని వదిలేసి వెళ్లాల్సిన అవసరం ఏమిటి? అర్థం కాలేదు కూతురు ఇద్దరికీ. తల్లిని తండ్రి పెట్టే బాధలు తెలుసు. ఒకవేళ మళ్లీ గొడవపడ్డారేమో!
“తెల్లవారి సరికల్లా కూతుళ్లు అల్లుళ్లు పిల్లలతో సహా ఇంట్లో దిగబడ్డారు.
“రాజేశ్వరి ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ అంతు పట్టడం లేదు.”
కేశవరావు నిప్పుతో తిరుగుతున్నాడు. ఏమిటి మీ ఆవిడ ఇంట్లోంచి వెళ్లిపోయిందా అని తెలిసిన వాళ్ళు పలకరిస్తుంటే తల తీసేసినంతగా అనిపించింది.
“రాజేశ్వరిని చూడగానే సుభద్రలో ఎక్కడలేని సంతోషం వేసింది. చేతిలో బ్యాగు అందుకని ఎన్నాళ్ళకు వచ్చావు. ఎంటకాలమైంది. కుశల ప్రశ్నలు వేస్తూనే కాఫీ మంచినీళ్లు అందించింది.
“ఇంట్లో నేను తప్ప అంతా బాగానే ఉన్నారు అన్నది నిస్పృహగా రాజేశ్వరి.”
అదేమిటి అలా అంటావు నీకు వచ్చిన కష్టమేమిటి హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నావు నెలకి 70 వేల దాకా జీతం వస్తుంది అంతకంటే ఏం కావాలి.!
“నువ్వు ఊహించి న దానికంటే విరుద్ధంగా ఉన్నాను.
“కేశవరావులో ఇంకా మార్పు రాలేదా!
ఎలా వస్తుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు.
నన్ను అమ్మానాన్న ఎలా పెంచారు నీకు తెలుసుగా! బీఈడీ వరకు చదివించారు. ఉద్యోగం ఇప్పించారు. సంబంధం మంచిదని గవర్నమెంట్ ఉద్యోగం అని నాకిష్టం లేకపోయినా పెళ్లి చేశారు. తల్లిదండ్రుల మాట కాదనలేక చేసుకున్నాను తర్వాత తెలిసింది. వాళ్లు నా ఉద్యోగం నా సంపాదన మీద ఆశపడ్డారని!
“అత్తగారు ఆడపడుచు కాలి మీద కాలేసుకుని కూర్చుంటే చీకటితో లేచి టైంకి అన్నీ వండి పెట్టి సమకూర్చి బాక్స్ సర్దుకుని స్కూలుకి పరిగెత్తే దాన్ని. సాయంత్రం ఇంటికి వచ్చాక కనీసం కాఫీ కూడా కలిపి ఇవ్వరు. రాత్రి పడుకోబోయే దాకా చాకిరి తప్పదు.
“ఉద్యోగం మానేస్తానని చెప్పలేకపోయావా?
“అదే చెప్పాను. అంత జీతం వదులుకుంటావా. ఉద్యోగం మానటానికి వీలు లేదన్నారు. ఉద్యోగం చూసి పెళ్లి చేసుకున్నారట. ఉద్యోగం మానేస్తే విడాకులు ఇచ్చేస్తానని బెదిరించారు. నువ్వు కాబట్టి అన్ని ఓర్చుకొని అణిగి మణిగి ఉన్నావు. నేనైతే ఎప్పుడో విడాకులు ఇచ్చేసి వెళ్లిపోయే దాన్ని.
“చిన్న చిన్న గొడవల మూలంగా విడాకులు తీసుకుని పిల్లల జీవితం నాశనం చేస్తామా! పురిటికి పుట్టింటికి పంపలేదు. పాప పుట్టాక నెలలోపులే ఉద్యోగానికి వెళ్లాల్సి వచ్చింది. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా బెల్ట్ తీసుకొని బాదేవారు. ఇష్టమైతే ఉండు లేకపోతే పొమ్మనే వారు. నా డబ్బులు అన్ని తాగుడుకు ఖర్చు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాను.
“ఇంకా ఎంతకాలం సహిస్తాను శారీరకంగా మానసికంగా అలసిపోయాను. నాకిప్పుడు పూర్తి విశ్రాంతి కావాలి. స్వేచ్ఛగా బ్రతకాలని ఉంది. ఓ సంగీతం వినవచ్చు, నాకు నచ్చిన సినిమా చూడొచ్చు, గుడి గోపురాలకు ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇంతకాలం ఇల్లు పిల్లలు బాధ్యత ఉద్యోగం బందిఖానా పక్షి నయ్యాను. అన్నిటిని వదులుకొని వచ్చేసాను.
“పోనీలే ఇప్పటికైనా మంచి పని చేశావు. స్నానం చేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో! మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అన్నది సుభద్ర.
“కేశవరావు నీ ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరి మటుకు వాళ్లు వండుకొని తినటం టీవీ చూడటం. ఇవన్నీ కేశవరావుకి నచ్చడం లేదు. పగలు రాత్రి తాగి వచ్చి పడుకుంటున్నాడు.
“రాజేశ్వరి కనపడటం లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నారు.
“ఉన్న కాస్త పరువు పోతుంది”వద్దన్నాడు.
“రోజులు గడిచిపోతున్న రాజేశ్వరి ఆచూకీ తెలియడం లేదు. బంధువులందరికీ ఫోన్లు చేశారు.
చివరికి రాజేశ్వరి ఒక నిర్ణయానికి వచ్చింది.
“రిటైర్మెంట్ తీసుకొని ఆ డబ్బుతో ఏదైనా వృద్ధాశ్రమంలో ఉండాలనుకొంది.
“అంత కర్మ నీకేం పట్టింది. హాయిగా ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ ఉండటం నీకు అభ్యంతరమైతే ఏదైనా రూమ్ తీసుకుని ఉండొచ్చు కదా. ఆశ్రమంలో దేనికి అన్నది సుభద్ర.
“నా కోసమైతే నేను ఎక్కడైనా ఉండొచ్చు. ఆశ్రమాల్లో నాలాంటి ఆడవాళ్లు ఎంతోమంది ఉంటారు. వాళ్లకి నా చేతనైన సాయం చేయాలి. వాళ్ల కష్టాల్లో పాలుపంచుకోవాలి. నాలాంటి బాధలు పడ్డ ఆడవాళ్ళకి సానుభూతి వాక్యాలు అందించాలి. ఎంతమంది భర్తల నుండి విడిపోతున్నారు.ఎంతమంది కొడుకు కోడలు నుంచి దూరమైపోతున్నారు. అలాంటి వారికి నా చేతనైన సాయం చేయాలనుకున్నాను.
“నీ నిర్ణయం మంచిదే రాజేశ్వరి నీ ఇష్టం అన్నది సుభద్ర. ఒకరోజు వృద్ధాశ్రమానికి వెళ్లి సుభద్ర తో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళందరిని చూసి వచ్చింది రాజేశ్వరి. భవ బంధాలను తెంచుకొని ప్రశాంత జీవితం గడపాలనుకొంది. రేపు ఆశ్రమానికి వెళ్దాం అనుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకుంది.
“అర్ధరాత్రి ఫోన్ మోగేసరికి ఉలిక్కిపడి లేచింది రాజేశ్వరి. కేశవరావుకి రాత్రి గుండె నొప్పి వచ్చిందిట హాస్పిటల్ లో చేర్పించారని పెద్ద కూతురు ఫోన్ చేసింది.”
“ఇప్పుడు వెళ్లడమా మానటమా! ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిస్తే ఏమనుకుంటారు. భర్తను వదిలేసి వెళ్లిపోయిందనే నింద వేస్తారు. ఈ సమయంలో వెళ్లకపోతే అందరి దృష్టిలో తను చెడ్డది అయిపోతుంది. తాళి బంధం తెంచుకున్న తెగిపోయేది కాదు. పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలు తనకి వర్తిస్తాయి.
“నాతి చరి తవ్య”అంటే అంటే భార్య కూడా సహధర్మచారిణిలా ఎల్లప్పుడూ భర్తని కనిపెట్టుకొని ఉండాలి. అని పెళ్లిలో చేసుకున్న ప్రమాణం ఇప్పుడు వదిలేస్తే దానికి అర్థం ఏముంది.! భర్త తాగుబోతు, కోపిష్టి వాడని కొడుతున్నాడని తిడుతున్నాడని ఇంతకాలం భరించింది. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వదిలేయడం ధర్మమా!
ఏం! భర్త భార్యని వదిలేయండి భార్య ఎందుకు వదిలేయకూడదు. పెళ్లి ఇద్దరి దృష్టిలో సమానమే!
ఆలోచన భారంతో మనసు మరింత ఎక్కింది.
సుభద్రను నిద్రలేపి జరిగిన విషయం చెప్పింది.
నీకు వెళ్లాలనిపిస్తే వెళ్ళు నేను అడ్డు చెప్పను అన్నది సుభద్ర.”రాజేశ్వరి వెంటనే బ్యాగు తీసుకుని బయలుదేరింది.
ఈ హార్ట్ ఆపరేషన్ జరిగింది. భార్య తిరిగి రావడంతో మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. జరిగినదంతా మర్చిపోయి హాస్పిటల్ లో అహర్నిశలు భర్తను కనిపెట్టుకొని చూసింది. పది రోజుల తర్వాత కేశవరావు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు.
“భార్య చేయి పట్టుకొని నన్ను క్షమిస్తావా! ఇంతకాలం నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు తెలిసింది నీ విలువ ఏమిటో? ఎంతో సహనంగా భరించావు. నీ పట్ల నేను రాక్షసుడులా ప్రవర్తించాను. నేను పూర్తిగా మారిపోయానంటే నన్ను నమ్ముతావా! రాజేశ్వరి అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు కేశవరావు.
“భర్త లో వచ్చిన మార్పుకు రాజేశ్వరి నిజంగానే సంతోషించింది. పెళ్లిరోజు మనం ఒకరి చెయ్యి ఒకరం పట్టుకున్నాం. మన బంధం శాశ్వతం కావాలని కొంగులు ముడి వేసుకున్నాం. హిందూ సాంప్రదాయాన్ని, వైవాహిక జీవితాన్ని అపహాసంపాలు చేయకూడదనే ఇంతకాలం గౌరవిస్తూ వచ్చాను. సమాజం మారినా స్త్రీ కోరుకునేది మూడుముళ్ల బంధమే నండి. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి. మనం ఎప్పటికీ కలిసే ఉందామంటూ భర్త చేతిని ప్రేమగా హృదయానికి హత్తుకుంది రాజేశ్వరి.
“నా భార్య క్షమయా ధరిత్రి”ఇంత మంచి భార్య లభించినందుకు నేను చాలా అదృష్టవంతుడిన అంటూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టారా దంపతులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ధైర్యము

ప్రేమలు—- పెళ్లిళ్లు