నా ఈ ఆలోచనల్లో
పగటి కలలు లేవు
సంఘర్షించిన గుండెతో
కమ్మరి నిప్పుల కొలిమిలో
నన్ను నేను కాల్చుకుంటూ
పదును తీరిన వజ్రకాయమవుతా
నా భావనల వలయంలో
సుడులు తిరుగుతూ
అందమైన కుమ్మరి ఆకృతినవుతా
నేతకు వూపిరినిస్తూ, ఆసుపోస్తూ
నాలో నవ చైతన్యాన్ని
రంగులుగా పులుముకుంటా….
వడ్రంగి చేత మెరిసే రంపమై
హంసతూలికా తల్పంలో
మధుర జ్ఞాపకాన్నవుతా
కర్షకుని చెమట చుక్కల్లో
తడి విడువని మట్టిలో
సేదతీరే నిద్దుర నేనవుతా…
విరామమెరుగని కొడవలి పిడినై
ఆకలి కేకలకు అమృత హస్తాన్నవుతా
అనేక శ్రమజీవన అలుపుల్లో
మానవీయ విలువలతో
ఈ నేలకు నేనవుతా..
శ్వాసించే చేతనంలా..!!!