మొక్క ఏపుగా పెరిగింది
మొగ్గలు వేసింది, రెక్కలు విచ్చుకున్నాయి
బంగారు రంగుల వెలుగులతో
రంగులను నింపుకుంది
సింగారంగా నాట్యం చేసింది
ఊగింది ఊగిసలాడింది
బాహువులను నావైపుకు చాచింది
కిలకిలారావాలతో పూబాల నవ్వింది
మండుటెండలో మాడిపోయిన ఆ మొక్కకు
నిండుగా ప్రేమనందించాను
నారుపోసి నీరు జల్లి మరువకుండా ఎరువు వేసి
దాన్ని అంతదానిగా చేశాను
సుడిగాలిలో అదెక్కడ
ఒడివడి పోతోందనని మధనపడేదాన్ని
వర్షానికి తట్టుకొని నిలిచిన దాన్ని చూసి
హర్షంతో పొంగి పోయేదాన్ని
దాన్నెక్కడ వంచుకు వంచుకు తింటాయోనని
నిరంతరం దాన్ని కనిపెట్టుకొని ఉండేదాన్ని
ఏపుగా పెరుగుతున్న ఆ మొక్క
ఎన్నాళ్ళకు మొగ్గవేయలేదు, పూవు పూయలేదు.
నిత్యం దాన్నలా చూస్తూ ఉండేదాన్ని
ఏంటీ విచిత్రమని బుగ్గలు నొక్కుకున్నారు కొందరు
అది ‘మగచెట్టు’ అన్నవారు ఎందరో?
అయినా ఆశవీడకుండా అదేపనిగా దాన్ని
పోషించాను ‘పరిరక్షించాను’ నిరీక్షించాను
కన్నుల్లో పెట్టుకొని కాపాడాను
పెంచిన ప్రేమతో దాన్నిరోజు చూసుకునేదాన్ని
ఏదో ఒకరోజున అది నిండుగా పూస్తుందన్న నా ‘ఆశ’
తలకిందులు కాలేదు
నా కోరికలు చిగురించాయి
మొగ్గలు వేశాయి పూవులు పూశాయి
రెక్కలు విచ్చుకున్న అవి ఒక్కసారిగా
నన్ను పలకరించాయి
భవితలో బంగారు పూలనందిస్తామని
భరోసానిచ్చాయి
పూబాలలు కిలకిలా నవ్వాయి
పరిమళించిన నా మనసు
పరవశంతో మరో ఉద్యానవనమయింది