ఇది ఎక్కడిది?

10-6-2023 తరుణి పత్రిక సంపాదకీయం

డాక్టర్ కొండపల్లి నీహారిణి సంపాదకురాలు.

మన ఉనికి మనకు ప్రశ్నార్ధకంగా మారడానికి కారణం ఏమిటని లోలోపల ఒక ఆత్మ విమర్శ చేసుకోవడం అవసరం.ఈ సృష్టిలో ఉన్నటువంటి, ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులకు మనకు ఉన్న తేడాలు భాషోచ్ఛారణ,భావవ్యక్తీకరణ. అటువంటి భావాన్ని,అటువంటి భాషని ఎంత పొదుపుగా,ఎంత జాగ్రత్తగా, ఎంత మంచిగా ఉపయోగిస్తే మన ఉనికికి అంత ప్రమాదం లేకుండా ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించరా? గ్రహిస్తారు! తెలియదా?తెలుసు! అయినా వీటిని అధిగమించి మును ముందుకు మనల్ని తోసేసేది ఏంటి అంటే మన లో ఉన్నటువంటి అహం. అహంభావం వల్లనే కుటుంబాలలో,వ్యక్తులలో,సమూహాలలో, గొడవలు పంచాయతీలు మనస్పర్ధలు వస్తుంటాయి. ఇవ్వేవీ తొందరగా రావు. వచ్చిన వాటిని రెక్టిఫై చేసుకో వడం,అంటే తరచూ తరచి చూడడం చెయ్యాలి. కానీ చెయ్యరు ముందుకు రారు. ఇవి గ్యాప్ ను తీసుకొస్తాయి, మనస్పర్ధలు సృష్టిస్తాయి దీనివలన జరగవలసిన నష్టమంతా ముందే జరిగిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకొని సవరించుకుంటారు కొందరు. కొందరు అది తన తప్పు కాదు అనుకోని వదిలేస్తుంటారు. కొందరు తప్పు అని తెలిసినా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. ఈ కారణాలు మనుషుల మధ్యన దూరాలను పెంచుతుంటాయి, మనసుల మధ్యన అగాధాలను సృష్టిస్తుంటాయి.
కార్యశాలలలో ఆఫీసులలో యజమానికి, క్రింది స్థాయి ఉద్యోగికి, ఆఫీసర్ కి సబార్డినేటర్ కి మధ్యన జరుగుతుంటాయి. ఇంట్లో కుటుంబాల మధ్యన బంధుత్వాల మధ్యన ఇదే జరుగుతుంది ఉదాహరణకు ఒక మామగారు ఇరువైపులా ఒక అత్తగారు ఇరువైపులా తల్లిదండ్రులు ఇంకా చాలామంది ఇతర తోబుట్టువులు ఉంటారు బంధువులు ఉంటారు ఆత్మీయులు ఉంటారు . వీళ్లందరి విషయం కాదు కేవలం తల్లిదండ్రుల విషయం చర్చకు తీసుకున్న చాలు ఇదే అందరి విషయంలో కూడా అప్లై చేయడానికి ఉంటుంది.
చాలా ఏళ్ళుగా పెళ్ళి ల్లల్లోఆడపిల్లల తల్లిదండ్రుల్ని,వారివైపు ఉన్న బంధువుల్ని మగ పిల్లవాడి తల్లిదండ్రులు,వాళ్ళ బంధువులూ చులకనగా చూడటమనే చెడు అలవాటున్నది.ఈ కాలంలో దీన్ని సహించలేక ఇదే చర్యని తామే ముందే అందిపుచ్చేసుకొని, ఒకప్పుడు మగ పిల్లవాని సైడు ఉన్న వాళ్ళు చేసినటువంటి తప్పులను ఇప్పుడు వీళ్లు ఆడపిల్ల సైడు ఉన్నటువంటి వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు. డామినేటింగ్ మనస్తత్వంతో మాట్లాడుతున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు.అయితే,ఇది ఇలా ఎందుకు జరిగింది అని ఒకసారి మనము ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రస్తుతం ఇదే ముఖ్యమైనటువంటి అంశం.
ఒకప్పుడు భర్త సంపాదనకు వెళ్తే భార్య ఇంట్లో ఉండేది కాబట్టి,ప్రయాణాలు చేయడం లో,బయట పనులు చేసి డబ్బులు సంపాదించేవాడు. అంటే పనులన్నీ చూసుకునేవాడు.కాబట్టి ఆడవాళ్లు చదువు లేక బయటకు వెళ్ళక ఇంటి పట్టుననే ఉండేవాళ్ళు.కాబట్టి ఇది వాళ్ళ ఉద్యోగం అయితే ఇది మా ఉద్యోగం అని అనుకోని, వంట చేయడమూ పిల్లల్ని కనడమూ ఇంటి పరిసరాల శుభ్రత వంటి బాధ్యతలు అన్నీ కూడా వీళ్లు తీసుకున్నారు.దీనివలన ఇదే బాగుంది ఇప్పుడు ఆడవాళ్లకు చదువులే వద్దు అని అనడమంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఆడవాళ్ళు చదువుకుంటారు. చదువుకున్నా కూడా ఇంటిపట్టునుంటే ఏం సమస్యలు రావు మేము పురుషులం మేము ఉద్యోగాలు చేస్తాం వీళ్ళు ఆడవాళ్లు ఇంట్లో ఉంటే చాలు ఒకప్పుడు సజావుగా సాగినట్టు ఇప్పుడు కూడా సాగుతుంది ఇంకేంటి ?ఇదే కదా సమస్య !ఈ సమస్యకు పరిష్కారం ఆడవాళ్ళు ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని కని పనులు చూసుకోవడమే కదా ఇంత చేస్తే చాలు , అని అనడం మరింత మూర్ఖత్వం.

ఎందుకు అంటే,కాలాన్ని బట్టి మనుషులు మారాలి అదేంటో చూద్దాం…
ఒకళ్ళనో, ఇద్దరినో పిల్లల్ని కంటున్నారు. లేదా మాక్సిమం ముగ్గురు పిల్లల్ని కంటున్నారు . ఆడపిల్లలకు మగపిల్లలకు సమానంగా చదువును చెప్పిస్తున్నారు.అమ్మాయిలు ఎంతో కష్టపడి,పోటీ తత్వంతో తన బంధువుల్లో చాలా మంది కి లేని చదువు తన తల్లిదండ్రులు కల్పించారు కాబట్టి, మా నాన్న మా అమ్మ ఇంత కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు నేను బాగా చదువుకోవాలి అని కష్టపడి చదివి,మంచి మార్కులు సాధించి చేతిలో సర్టిఫికెట్ పట్టుకుని వస్తున్నారు. వీళ్ళని ఇంటికి పరిమితం చేయడం ఏం సబబు? ఎక్కడి న్యాయం?ఎందుకు ?ఎంత చదివినా తర్వాత పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి కదా ఇంక ఇంట్లోనే ఉండు అని అనడం అది న్యాయమా? ధర్మ మా ? చదువుకున్నందుకు వాళ్ళు కూడా సార్ధకత చూపించడం కోసం ఉద్యోగాలు చేయాలి. చేస్తారు . అలాంటప్పుడు, ఇంత చేస్తున్నా పెళ్లి చేసుకొని పిల్లల్ని కని సేవలు చేస్తూ ఉన్నా కూడానూ ఇంకా ఏదో అసంతృప్తిని వ్యక్తపరిస్తే ఎందుకు భరించాలి వాళ్ళు ? అవసరమేముంది అనే ప్రశ్న వేసుకుని ఏం చేస్తున్నారంటే, తమకి ఎక్కడ ఈ బాధ ఎదురవుతుందో అని ముందే అగ్రెసివ్ గా మాట్లాడాల్సి వస్తుంది. దీనికి కారణం అంతా కూడా ఒకప్పుడు మనం చేసిన తప్పులే అని గుర్తు చేసుకోవాలి.

అత్తగారు స్థానంలో ఉన్న వాళ్ళు సూటి పోటీలు మాటలు మాట్లాడడాలు,పెత్తనాలు చలాయించడాలు ,ఈ రెండు చేస్తే, మామగారు ఒక రకమైనటువంటి గర్వభావంతోటి అధికారంతో పెత్తనం చేసి పరిస్థితులను చూశాం , కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి అవేం లేవు,అయినా ఆడపిల్లలే తొందరపడి మాట్లాడుతున్నారు, ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అని అంటున్నారు.

దీనికి కారణం ఏంటి అని ఒకసారి చూడాల్సిందే !ఏదైనా పెరుగుట విరుగుట కొరకే అనేది ఒకసారి గ్రహించాలి. ఒకప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ అన్యాయాలన్నీ ఇప్పుడు వాళ్ళే ఈ విధంగా అనుభవించాల్సివస్తుంది. తరాలు మారుతున్నప్పుడు పాత తరాలలో చేసిన తప్పుల ప్రభావం కొత్త తరం మీద పడుతుంది. కొత్త తరంలో పొరపాట్లు చేస్తే మళ్ళీ తర్వాత వచ్చే తరం పైన వాళ్ళ పై పడుతుంది. ఇది ఒక జీవన చక్రం. ఈ చక్రంలో మనం రేకులం, రెక్కలం, ముక్కలం. అతుకుల బతుకుబండి ఇది. అతుకులు ఏంటి ? అవును అతుకులే ! ఒక ఆడ ఒక మగ ,ఒక కొడుకు ఒక బిడ్డ ఒక అమ్మ ఒక నాన్న అతుకులు. ఒక అత్తగారు ఒక మామగారు ఒక వ్యక్తి కాదు కదా! కుటుంబమంటే కొంతమంది వ్యక్తుల సమూహం కదా!!అందుకే ఇవి అన్ని సమానంగా నడవాలి, సజావుగా సాగాలి అంటే కొంత సమయం, సంయమనం అవసరం!!!లేదు అలా ఆలోచించడం లేదు అంటే, అదేంటో చూద్దాం ఒకసారి…
కన్న కూతురును స్వతంత్రించి నాలుగు మాటలు అనలేని పరిస్థితులు ఎందుకొచ్చాయి అంటే అసలు ఒకళ్ళని ఏదైనా అనడమే తప్పు అనే ఒక జ్ఞానాన్ని నేర్చుకున్నాం కాబట్టి. అలాంటిది కన్న కూతురు మీదనే హక్కు అనుకొని అనకూడదంటున్నప్పుడు, పరాయి ఇంటి నుంచి తీసుకొచ్చిన అమ్మాయి కోడలుగా వచ్చినప్పుడు ఆమెను గౌరవంగా చూడాలి అనే ధ్యాస, సోయి లేకుండా ఉంటే ఎలా?

ఇది జరిగిన కథ కాదు. ఇది ఇప్పటికీ కూడా ఏ మార్పులు రాని గాథలు. చాలా ఇళ్ళల్లో ఇంకా ఇదే నడుస్తున్నది. ఆడపిల్లల పెళ్లి చేయాలి అంటే మగ పిల్లవాళ్ళను ఒక రేంజ్ లో చూడాలి ఒక గొప్ప స్థానంలో చూడాలి. ఆడపిల్లల తల్లిదండ్రులే ఆ పనులన్నీ పెళ్లి చేయాలి. అన్ని చేస్తూ ఉంటే కూడా, మగ పిల్లవాడి తల్లిదండ్రులు ఏదో ఒక మాట, పుల్లవిరుపు మాట ఒకటి అనేస్తూ ఉంటారు. ఇంత చేస్తున్నారు కదా ఏవో చిన్న లోపాలు ఉంటే ఉండని సర్దుకుపోదాం అని అనుకుంటే సమస్యలు ఉండవు . పెళ్లి చేసుకున్నప్పటినుంచి మాది ఏదో గొప్ప మా ఇంటికి మీ అమ్మాయిని పంపిస్తున్నారు అనే ధోరణితో ప్రవర్తించడం వలన ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు పిల్లలు. చూస్తారు . ఇవన్నీ చూసి అదొక యాంటీ రిఫ్లెక్షన్స్ అనేవి తన మనసులో సృష్టించుకుని ఆ అమ్మాయి అత్తగారింట్లో అడుగుపెట్టగానే విభేదాలు కలుగుతున్నాయి.గొడవలకు ప్రధాన కారణాలు ఇవే అవుతున్నాయి.
ఈ అవస్థలు కొనసాగుతున్నవి. ఇవి ముందుకు వెళ్లకుండా ఉండాలి అంటే మనం మారాలి!మనమూ మారాలి !!మనమే మారాలి అంతే!!!

వీటికి పునాదులు ఎక్కడినుంచి ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇప్పుడేదో మంచి వాళ్ళం అయిపోయినట్టు అత్తగారు స్థానంలోనూ మామ గారి స్థానంలోనూ మేము మంచి వాళ్ళము మాకు ఇప్పుడు ఏమీ బాధలు లేవు ఖర్చులు లేవు మా సంపాదన మాకుంది మా పనులు మేము చేస్తాము మాతో ఏం రాదు అని అనుకుంటున్నా, వాళ్ళ సంతానం లో కూడా జరిగిందేమిటో ఒకసారి గమనిద్దాం. పిల్లల్ని చిన్నప్పటినుంచి పెంచినప్పుడు మగ పిల్లవాడిని ఒక దృష్టితో ఆడపిల్లల్ని ఒక దృష్టితో పెంచాం. ఇంట్లో ఒకవేళ పెంచకున్నా పరాయి స్త్రీ ల విలువల విషయం వస్తే, సమాజంలో జరిగే విషయాలు వస్తే, ఒక సినిమా చూసి వస్తేను, ఇంట్లో సీరియల్ చూస్తేనో ఇంటిపక్క వాళ్ళ ను గురించో, ఏ ఆడవాళ్ళ ప్రస్తావన వచ్చినప్పుడైనా వాళ్ళ ను అసభ్యమైనటువంటి మాటలు అనడం, చర్చలు చేయడమూ, తప్పనిసరి చెడుగానే మాట్లాడమూ ఇవన్నీ కూడా చూస్తూ , వింటూ పెరిగిన ఆ మగపిల్లలు వాళ్ల లోపల ఇమిడిపోయినటువంటి ఈ భావాలతో పెళ్లిళ్లలో బాగానే ఉంటున్నారు కానీ, పెళ్లయి సంసారం మొదలుపెట్టిన తర్వాత ఇవి ఎక్కడో ఒకచోట ప్రదర్శిస్తూనే ఉన్నారు .ఇది ఎక్కడి న్యాయం? కాబట్టి కొన్ని తరాలు ఇటువంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఎదిరించాలి చాలా తెలివిగా చాలా మెలుకువతో చాలా మెళకువతో ఎదుర్కొంటూ వాళ్ళని తమ వైపు తిప్పుకునేలాగా తమతో మంచిగా ఉండేలాగా వాళ్ళు అందరితో మంచిగా ఉంటూ ఉన్నప్పుడు కొన్ని తరాలు మారితే అప్పుడు నిజంగా సమ సమాజం ఏర్పడుతుంది . ఇది ఇంట్లో చుట్టాల విషయమే కానీ ఇంట్లో సంబంధాల విషయమే కానీ బయట కులాల విషయంలోనే కానీ ఏ కులం వాళ్ళను తక్కువ చేసి మాట్లాడినా కులాలన్నీ వృత్తి ప్రాతిపదికన ఏర్పడినవి ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు ఈ భావాలన్నీ చిన్ననాటి నుంచి పిల్లలకు అర్థమయ్యేలాగా ఇన్ డైరెక్ట్ మెథడ్ లో కనుక చెబితే వాళ్ళు అలానే పెరిగితే కొన్నేళ్లకైనా, కొన్ని తరాలకైనా మార్పు వస్తుంది. తరం అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు? ఒకప్పుడు 20 సంవత్సరాల తేడా ను ఒక తరం అనే వాళ్ళు . తర్వాత పది సంవత్సరాలకు ఒక తరమని అన్నారు . ఇప్పుడు కాదు కాదూ ఐదేళ్లే అన్నారు . ఈ తరం కూడా కాదు ఇప్పుడు మూడేళ్లకే రెండేళ్లకే మార్పులు వస్తున్నాయి ఫాస్ట్ ట్రాక్ లాగా వెళ్ళిపోతుంది సమాజం . అందరికీ ఆధునిక సౌకర్యాలైతే ఏంటి , శాస్త్ర విజ్ఞాన విషయాలైతే ఏంటి చాలా మార్పు తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు తరం అంటే నాలుగు నుంచి రెండు సంవత్సరాలు అనుకోవాలి అంత డ్రాస్టిక్ చేంజ్ లు వస్తున్నాయి. కాబట్టి వాటికి అనుగుణంగా ఆలోచనల్ని మార్పులు చేసుకోవాలి .

మనం చేయాల్సింది ఏమీ లేదు అదే తిండి తింటాము అదే చదువు చదువుతాము అదే ఇంట్లో జీవన విధానం ఉంటుంది అదే సంపాదన ఉంటుంది అంతా అదే మన ఆలోచన మారడం ఒక్కటే ముఖ్యం. ఆ ఆలోచన ఎలా వ్యక్తం చేస్తున్నామన్నది ఒకటే ముఖ్యం. మన మాట సౌమ్యంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి .మడత నాలుకతో మాట్లాడకూడదు. ఇవే వచ్చేతరాలకు కీడును చేయకుండా ఆపగలుగుతాయి! కేవలం … కేవలం … చేయాల్సింది ప్రతి వ్యక్తిని గౌరవించడం అంతే ! కోటి రూపాయలు ఇచ్చినా గౌరవించకుంటే ఆ కోటి రూపాయలు ఒక రూపాయి విలువే ! పంచభక్ష్య పరమాన్నాలు అన్నీ కూడా పళ్లెంలో పెట్టించిచినా నీ ముఖం మీద ఉండే నీ భావాలు ఆ పదార్థాలకు ఉన్నటువంటి స్వచ్ఛతను పోగొట్టేస్తాయి . అందుగురించి కావాల్సింది కేవలం గౌరవం తో చేయాలి. గౌరవం గా ఉండాలి . గౌరవాన్ని సంపాదించుకోవాలి. వ్యక్తిగా గౌరవించడం ఒక్కటే మనం చేయాల్సింది ! ఇది గుర్తుంచుకుంటే చాలు. నీకు ఓ న్యాయం వేరే వాళ్ళకు ఓ న్యాయం ఇదెక్కడిది??? తస్మాత్ జాగ్రత్త! ఇందులో మనము ఉన్నాము, మన పిల్లలు ఉన్నారు, రేపు వాళ్ళ పిల్లలు ఉంటారు , తస్మాత్ జాగ్రత్త !తస్మాత్ జాగ్రత్త!!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆపాత మధురాలు-part 7

ఎర్రరంగు బురద