కవిత్వం అందరికీ అబ్బే విద్య కాదు. స్వయంగా సరస్వతీ దేవి కటాక్షం ఉంటే తప్ప ఈ కార్యానికి పూనుకోలేము. భావాలకు, భావోద్వేగాలకు, విలువలకు, అభిప్రాయాలకు కాగితాన్ని వేదికగా చేసుకుని,
కవితలల్లడం అంత సులభమైన పనేమీ కాదు అనేది అందరికీ అవగతమైన విషయమే. ఏ కవిత్వమైనా రాయడానికి సందర్భం అనేది ప్రధానం. అంతేకాదండోయ్ కవులకు ఉండాల్సిన అతి ఉత్తమ గుణం స్పందించే హృదయం. నిజంగానే చెప్తున్నాను కొందరి దృష్టిలో కవిత్వం అంటే ప్రాసలు, ఇంకొందరికి పదాల అమరికా,
మరికొందరికి పొగడ్తల కోసం వినియోగించే అస్త్రం. అసలు కవిత్వం ఎందుకు రాస్తారు అంటే అందరికీ ఏదో ఒక అభిరుచి ఉంటుంది. కవితలు రాయడం అనేది కాలక్షేపంగా మార్చుకుని ఎప్పుడు వీలుంటే అప్పుడు తమ తమ కవనాలను కదిలిస్తుంటారు కవులు. కవిత్వం అంటే ఊహ అన్న పోకడ ఉంది. కొత్త కొత్త పోలికలను ఉపయోగించి, అరుదైన పదాలను సేకరించి, కోట్ల కొద్ది క్షణాలను వెచ్చించి అద్భుతమైన వాక్యాల నడుమ అక్షరాలను అందంగా పేర్చి
తమ భావాలకు ప్రాణం పోస్తుంటారు కవులు. అంతా బాగానే ఉంది. అయితే కవిత్వం ఎలా ఉండాలి అన్న ఒక చిన్న సందేహం నాకు కూడా ఉండేది. కవిత్వం ఇలాగే రాయాలన్న నియమాలు, నిబంధనలయితే ఏమీ లేవు.
కాకపోతే కవిత్వం ఊహాత్మకంగా ఉండాలా ప్రయోజనాత్మకంగా ఉండాలా అన్న విషయమే ప్రధాన చర్చ.
రవి గాంచనిచో కవి కాంచును అన్న మాట వినే ఉంటారు.
కవి స్పృశించని అంశం ఉండదంటే అది అతిశయోక్తి ఏమీ కాదు. తన తలపులలో మెరిసిన భావాలను అద్భుతమైన వర్ణనలతో వ్యక్తీకరించగలిగిన వరం
కేవలం కవులకు మాత్రమే సొంతం. అయితే కాలం మారుతుంది నవ నాగరికతతో
పురుడోసుకున్న సమాజ చిత్రణ కానివ్వండి, ఆధునికత కానివ్వండి, తరాల వ్యత్యాసాలు కానివ్వండి విషయమేదైనా సాహిత్యం మరీ ముఖ్యంగా కవిత్వం ఉనికిని కోల్పోయే పరిస్థితి దాపరించింది. ఏం కాదంటారా? నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఈ నవతరానికి చెందిన దానిని కనుక నేటి సమాజంలో సాహిత్యం పట్ల యువతకు ఉన్న అభిప్రాయాన్ని దగ్గరగా పరిశీలించిన పిమ్మటనే నేను ఈ అంశాన్ని చర్చకు లేవనెత్తాను. నా వరకు కవిత్వం గొప్పగా ఉన్నా దాన్ని ఆస్వాదించే హృదయం లేకపోతే కష్టమంతా వృధా అయినట్టే. అయితే కవిత్వాన్ని వినేవారే లేరా అంటే ఎందుకు లేరు ఉన్నారు. ఈ కంప్యూటర్ యుగంలో కూడా పుస్తకాల
ఆవిష్కరణలు జరుగుతున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు పాఠకుల ఉత్సాహం ఏ స్థాయిలో ఉంది అన్నది. కవిత్వంలో చాలా రకాలు ఉన్నాయి వచన కవిత్వం అని, పద్య కవిత్వం అని, నానీలు అని ఇలా రకరకాల పేర్లను విన్నాను. నాకొద్ది పాటి అనుభవంలో నేను గమనించిన విషయాన్ని మీతో చెప్తాను కొత్త కొత్త పోలికలు ఉపయోగించకుండా మీరు రాసిన దానిని కవిత్వం అని అంగీకరించని కొంతమంది పెద్ద మనుషులు మన చుట్టూ లేకపోలేదు.
అయితే నాదొకటే ప్రశ్న వాస్తవాలకు స్పందించి, ప్రజల కన్నీళ్ళకు చలించి దీనుల కష్టాలను కళ్లకు కట్టినట్టుగా వారి అక్షరాలతో దర్శింపజేసిన కవులు మన నిన్నటి చరిత్రలో కనపడలేదా…. బానిసత్వాన్ని పారద్రోలేలా, శ్రమ దోపిడీని, అవినీతిని ప్రశ్నించేలా, ఉత్సాహవంతంగా, ఉత్తేజ భరితంగా రచనలను చేసి ప్రజలను ప్రభావితం చేసిన
శ్రీ శ్రీ, గుంటూరు శేషేంద్ర శర్మ గారి లాంటి కవులు మనవాళ్ళు కాదంటారా?
రచనలు అనేవి ఉపమానాలతో, అంత్యానుప్రాసలతో అల్లకపోయినా పర్వాలేదు
సమాజంలో జరిగే దుర్మార్గాలను ప్రశ్నించే గళమై
కలాలు సాగితేనే ప్రజలకు ఎంతో శ్రేయస్కరమని నా భావన. వాస్తవాలను విస్మరిస్తూ విషయాన్ని దాచి దాచి వ్యక్తీకరించడం వల్ల, ఊహాలోకంలో విహరించడం వల్ల ఒరిగేదీ ఏమీ లేదు ఈ సమాజానికి. కవులు అనేవారు
అరాచకాలకు స్పందించకపోయినా, బాధ్యతగా వ్యవహరించక పోయినా నష్టపోయేది తనదిగా భావించిన ఈ సమాజమే.
కవి ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ ప్రతిపక్షంగా వాదించాలి. అప్పుడే మన దేశం సుభిక్షంగా
సమతా మమతలతో వర్ధిల్లుతుంది. నా ఈ మాటలను అన్యధా భావించరని ఆకాంక్షిస్తూ….