పిల్లల నడవడిక ఎప్పుడైనా యుక్త వయసుకు చేరినప్పుడే బయటపడుతుంది. అప్పుడే వారిని గమనిస్తూ దారిలో పెట్టవలసిన బాధ్యత పెద్దలదే. అందుకే అన్నారు మన పూర్వీకులు” మొక్కై వంగనిది మానై ఒంగునా'”అని. వాళ్లు టీనేజ్ లో కి వచ్చినప్పటి నుంచి ఒక కంట కనిపెడుతూ ఉండాలి. నిజానికి ఆ వయసులో తండ్రి ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. తల్లి మనస్సు వెన్న. ఎన్ని తప్పులు చేసినా ” తప్పైపోయింది అమ్మ, ఇంకెప్పుడూ చేయను ” అంటే కరిగిపోతుంది. తండ్రి ప్రపంచపు పోకడ తెలిసినవాడు, అనుభవజ్ఞుడు వయసు లో కాస్త పెద్ద వాడూ కావడం వల్ల కొంచెం కఠినంగా ఉంటాడు.
ఈ కాలంలో తల్లులు కూడా విద్యావంతులు, అనుభవజ్ఞులు అవుతున్నారు. దానిని కాదనలేము. తల్లి పాత్ర వచ్చేటప్పటికి తల్లి తల్లే.
కానీ పెంపకంలో మగ పిల్లలకి ఆడపిల్లలకి కాస్త తేడా ఉంది. చాలామంది ఆడపిల్లలు కుదురుగా ఉంటారు. సమాజం కూడా ఇంకా మగ పిల్లలకు ఇచ్చినంత స్వేచ్ఛ ఆడపిల్లకు ఇవ్వలేదు. ఇది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందువలన మగ పిల్లల పెంపకంలో కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఆడపిల్ల ఎంత చదువుకున్నా రేపు పెళ్లి చేసుకుని ఒక కుటుంబాన్ని నడపవలసిన అవసరం పడుతుంది.
ఇక మగ పిల్లల విషయానికొస్తే కొన్ని కుటుంబాలు చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నారు. దానివల్ల వారి ఇంట బయట కూడా మంచి పేరు తెచ్చు కుంటున్నారు. ఇంతవరకు పరవాలేదు. కానీ చాలా శాతం మగ పిల్లలు కుటుంబము, సంఘం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇది దేశ ప్రగతికి గొడ్డలి పెట్టు. అందుకే యువకుడిని ముల్లుతో పోల్చారు.
దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మా ఇంటి వెనకాల గల్లీలో ఐలయ్య అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. అతడు అతడి పెళ్ళాం ఎంతో ఒద్దికైన వాళ్ళు. వాళ్ళ కు ఒక పాప ఒక బాబు ఉన్నారు. బాబు పేరు గోపి. వాడు వాళ్ళ అక్క మీద ఎప్పుడు పెత్తనం చెలాయించేవాడు ” నేను మొగాడిని నేను మొగాడిని అంటూ. తల్లి తండ్రి చాలాసార్లు మందలించారు ఆడపిల్లకి మగాడికి తేడా లేదు అని. కానీ వాడి కినేను మగాడినని ఒక రకమైన అహంభావం ఉండేది. ఒకసారి వాళ్ళ నాన్నను నాకు ” పాన్ పరాగ్ ” కావాలి” పాన్ పరాగ్ ” కావాలి అని వేధించసాగాడు. వాళ్ళ నాన్న అది పిల్లలు తినకూడదు అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. మా దోస్తులు అందరూ తింటున్నారు అన్నాడు పదేపదే గోల పెట్టసాగాడు. ఇక్కడ ఏమి జరిగిందో పాఠ కులారా మీరు ఊహించలేరు….. ఐలయ్య కోపంతో వాళ్ల దోస్తులు ఇంటికి తోలుకు పోయాడు. దోస్తీని బయటికి పిలిచి విషయం అడిగితే వాడు పొగరుతో రౌడీలాగ కాలరు ఎగరేసుకుంటూ ” ఆ నోరు చూడండి ఎంత ఎర్రగా ఉందో ” అంటూ చూపించ సాగాడు. ఈ గొడవ విని అబ్బాయి తండ్రి బయటికి వచ్చి ఏమిటి విషయం ఏం జరిగింది అని అడిగాడు. దానికి ఐలయ్య ” మీ అబ్బాయి పాన్ పరాగ్ అలవాటు చేసుకున్నాడు. మా అబ్బాయి కూడా నేర్పుతున్నాడు. వాడు ఈరోజు నన్ను పానుప్పరాగ్ కొనుక్కోవడానికి డబ్బులు అడిగాడు. మీ అబ్బాయి చెడిపోవడమే కాకుండామాఅబ్బాయిని కూడా చెడగొడుతున్నాడు అని గొడవకు దిగాడు. ఆ దోస్తు నాన్న వాడిని చితకొట్టి నీకు డబ్బులు ఎలా వచ్చాయి రా కొనుక్కోవడానికి, దొంగతనం చేసావా ” అని నిలదీశాడు. ” అమ్మ ఇచ్చింది”. అన్నాడు.ఇక్కడ గమనించారా తల్లే భర్తకు తెలియకుండా పిల్లాడికి డబ్బులు ఇచ్చి తగలేసింది. భార్యను కూడా మందలించి ” వాడిని ఒక కంట కనిపెట్టుకొని ఉండు లేకపోతే మన చేయి జారిపోతాడు ” అని హెచ్చరించాడు. గోపి కి కూడా ఐలయ్య పాన్ పరాగ్ తినడం వల్ల వచ్చే కష్టనష్టాలను వివరించి చెప్పాడు. పాన్ పరాగ్ తింటే క్యాన్సర్ వస్తుందని భయపెట్టాడు.చెడ్డవారితో స్నేహం చేయొద్దని చెప్పాడు. ఐలయ్య ఎంతో తెలివిగా వెంటనే మేల్కోవడం వల్ల తన పిల్లాడిలో మార్పుని తెచ్చుకోగలిగాడు.
ఇలాంటి సంఘటనలు కింద వర్గాలలోనే కాదు ఉన్నత కుటుంబాలలో కూడా కనిపిస్తున్నాయి. మనము ఆ మధ్య వార్తలలో డ్రగ్స్ కుంభకోణంలో సంఘంలోని ఉన్నత కుటుంబాల పిల్లలు కూడా పట్టు పడ్డట్టు చదివాము. ఉన్నత కుటుంబాల వాళ్లు రాజకీయంగా, వ్యాపార పరంగా బిజీగా ఉండటం వలన, మరియు పిల్లలకు విపరీతమైన స్వేచ్ఛ, డబ్బు ఇవ్వటం వలన ఇలా జరగడానికి అవకాశం ఉంది. వాళ్లు పిల్లలు అహంతో మితిమీరి ప్రవర్తించి, డ్రగ్స్ తీసుకోవడం, పబ్బులకు వెళ్లి మందు తాగడం, బైకులు ఓవర్ స్పీడ్ తో నడిపి యాక్సిడెంట్లు చే సు కోవ డం మనం వింటూనే ఉన్నాం. ఇదంతా ఆ పసి వారి మీద నిర్లక్ష్యం కాదా. ఇదంతా వారికి తెలియక కాదు. ఫాల్స్ ప్రెస్టేజ్ అంతే.
దీనికి ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. ఇందులో తల్లి పాత్ర ఉంది దండించడంలో. ఒక కుర్రాడు చెవి దగ్గర చేతితో ఫోను గుర్తు పెట్టుకొని ” వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం “అంటాడుతల్లిని.” ఇదేందిరా ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు, మన దగ్గర ఫోన్ లేదు కదా, ఆ ఇంగ్లీష్ ముక్కలు ఏంటి, ” అంది. ” ఇవే కావమ్మా ఇంకా ఎన్నో నేర్చుకున్నాను ” అంటూ మధ్య వేలు ఎత్తి చూపించాడు. తల్లి నిర్ధాంతపోయింది. ఇది అమెరికాలో ప్రాచుర్యంలో ఉన్న ఒక బూతు సింబల్. తల్లి” ఒరేయ్ వేళ్ళు చూపించి ఇలా మాట్లాడావో చంపేస్తా జాగ్రత్త, బయట వాళ్లతో ఇలా వేలు చూపిస్తే నీ వేళ్ళు,నాలుక కోసేస్తారు. జాగ్రత్త. చాలా తప్పు దారిలో నడుస్తున్నావు. ఇలా ఉంటే పెద్దయిన తర్వాత నీ దారి గోదారే అవుతుంది. అప్పుడు నిన్ను ఆదుకోవడానికి మేము ఉండం “అని గట్టిగా మందలించింది.
చూశారా పాఠకుల్లారా !సంఘంలో చిత్రవిచిత్రమైన మార్పులు. ఇప్పుడు ఈ ఇంటర్నెట్, ఈ ఫోను మన దయ్యాలై కూర్చున్నాయి . మొక్కగా ఉన్నప్పుడే సరైన ఊతం ఇవ్వకపోతే ఎటైనా వంగిపోవచ్చు.
తల్లితండ్రులారా…..
Beware of friends,phones&Internet.