‘ఎర్రరంగు బురద’

ధారావాహిక నవల

జ్వలిత

జరిగిన కథ: పుష్ప పద్మ హాష్టల్ పిల్లలు. హోలీ పండుగ సమయంలో బళ్ళె పుష్పకు ఫిట్స్ వస్తయి. డాక్టర్ తండ్రిని పిలవమంటే. తండ్రి చచ్చిపోయిండని. తాత వస్తడు. డాక్టర్ పద్మను వివరాలు అడిగితే.. తండ్రితో కలిసి వచ్చి లావుపాటి నోట్స్ ఒకటి చేతికిచ్చి. “మా నాన్న చెపుతుంటె, నేను రాసిన, ఇదొక జాతి చరిత్ర” అంటది పద్మ. డాక్టర్ కథ చదవడం మొదలు పెడతాడు. తండ్రి స్వార్ధానికి బలైన ఏదులు.. తన తల్లి మరణానికి కారణమైన తండ్రిని ద్వేషిస్తాడు. సవతి తల్లి కొడుకు అతనిని రెచ్చగొడుతుంటాడు.

ఏదులు తండ్రి సంగడు ఏదులు అక్కను బొంబాయికి పంపిండు. తనను చెల్లెను పట్టించుకోలేదు మేనమామ సాది పెద్ద చేసి పెండ్లి చేసిండు. ఏదులుకు ముగ్గురు పిల్లలు. వాళ్ళ పై కుట్ర చేసి ఏదులు భార్య నాంచారికి కరెంటు షాక్ తగిలిస్తారు. రత్నం సేటు చికిత్స చేయిస్తాడు. నష్టపరిహారం కొంత డబ్బు ఇవ్వాలనుకుంటడు సేటు.

————ఇక చదవండి——–

7వ భాగం

నీ ఇష్టం పది పదిహేను రోజుల్ల కట్టుబడి మొదలు పెడదాం అనుకుంటున్నా.. వానలు కూడా తగ్గినయి కదా… పని మొదలు పెట్టే లోపు మీకు ఇవ్వాల్సినయి ఇస్తే.. నాకు ప్రశాంతంగా ఉంటది. ఈ ఎండాకాలంలో కట్టుబడి పూర్తి చేయాలి, షాపింగ్ మాల్ మొదలు పెట్టాలి” అన్నడు సేటు.

 మళ్లీ సేటే “ఏమి సంగతి ఏదులు నువ్వు పనికి వస్తావా.. ఎవర్నన్నా చూసుకోవాలా..?” అని అడిగిండు. “అదేంది దొర నేనే వస్త. నేను ఉండంగ ఇంకొకల్లు ఎందుకు..?” అన్నడు ఏదులు.

“సరే సర్పంచ్ గారు.. నేను వస్తా మరి. మీరు ఎటో బయల్దేరినోళ్లను ఆపినట్టున్న. మీ పని చెడిందేమో..” రత్నయ్య సేటు.

“గియన్ని నాకు మామూలే.. మరేం పర్వాలేదు.. ఏదులు సేటు చెప్పినట్టు ఆ పనులు పూర్తి చేసుకోండి.. ఏమన్న రాతకోతల సాయం కావాలంటే అడగండి. నేను పట్నం పోవాలె..” అనుకుంట సర్పంచ్ కూడా బయటికి బయిలెల్లిండు.

“సరే దొర మేము సుత పోతం..” అనుకుంట మామా అల్లుళ్లు బయల్దేరిన్రు.

***

    అనుకున్నట్టే పది రోజుల్లో పిల్లల పేర్ల మీద ఈసేవ కేంద్రంల నుండి ఆధార్ కార్డులు తీసిండు ఈరన్న. తర్వాత బ్యాంకు ఖాతాలు తెరిసిండు. బ్యాంకు ఖాతాలు తెరవడానికి ముగ్గురికి ఐదొందల చొప్పున ఈరన్నే డబ్బులేసి కాతా రాయించిండు. అన్ని తీసుకొని పోయి సేటుకిచ్చిన్రు.

  “రెండు రోజుల్లో మళ్ళీ రండి, కానీ ఈసారి ఒక కాయితం రాయాలె..” అన్నడు సేటు.

“ఏం కాయితం సేటు. ఏమని రాయాలె..” అడిగిండు ఈరన్న.

“జరిగిందే రాయాలె.. కరెంట్ షాక్ ప్రమాదవశాత్తు జరిగిందని, దావఖాన ఖర్చు యజమానే భరించిండని, నష్టపరిహారంగా పిల్లల పేరు మీద డబ్బులు ఏసిండని, కొంత నగదు డబ్బును మా చేతికి ఇచ్చిండని.. ముందు ముందు మేము ఏ జగడానికి రామని, రాసియ్యాలి సర్పంచ్ ముందల.. ఏమంటరు” వివరంగ సెప్పిండు రత్నయ్య సేటు..

ముందు ముందు కిరాణంతో పాటు బట్టలషాపు, మెడికల్ షాపు పెట్టాలన్నది ఆయన ఆలోచన.. పట్టణీకరణ ప్రభావంతో ఇప్పుడు గ్రామమే రేపు మండల కేంద్రం కావచ్చు.. అన్నది ఆయన దూరాలోచన. అందుకే ఏ గొడవలు రాకుండా జాగ్రత్త పడుతున్నడు.

“ఇండ్ల అనడానికేమున్నది సేటు.. కరెంటు షాకుల ఎవరి దోషం లేదు.. అయినా కట్టుబడి ఆపి మా కు

టుంబాన్ని ఆదుకుంటున్నవు.. ఇంక జగడమేమి ఉంటది.. ఏమయ్యా ఏదులు ఏమంటవు..?” అన్నడు లౌక్యమెరిగిన ఈరన్న.

“అనెటందుకేమున్నది మామ.. మా పానాల మీదికి తెచ్చినోడు మనోడే.. దేవునోలె ఆదుకున్నడు సేటు

.. అట్టనే నువ్వన్నట్టే కాయితం రాసిత్తం.. మల్లెప్పుడు రమ్మంటరు..” అడిగిండు ఏదులు.

“నేను పిలిపిస్త… సర్పంచ్ తో మాట్లాడి రేపు ఆదివారం తర్వాత రెండ్రోజులాగినంక.. అంటె బుధవారంకల్ల పనయితది..” సేటు.

“నన్ను పనికెప్పుడు రమ్మంటవు సేటు..” ఏదులు.

“మళ్లా.. సిమెంటు, ఇసక తోలిచ్చాలె.. వారం రోజుల్ల పని మొదలు పెడదామన్నడు మేస్త్రీ..” సేటు.

“మల్లెవరిని పెట్టుకోకు సేటు. పిల్లలున్నోడు గోస పడ్తండు. నా బిడ్డ మంచంల కెల్లి లెస్తలేదింకా..” ఈరన్న అం

దుకున్నడు.

 “నాకు తెల్వదా… ఇప్పుడే కాదు పెద్ద దుకాణం, మొదలైనంక కూడా మీ వోనికి నా దగ్గర పనుంటది ఫికర్ చెయ్యకండి.. పొయ్యిరండి” అన్నాడు సేటు.

“బాంచెను సేటు పోతం” అని ఏదులు మామతో కలిసి. ఇంటి వైపు కదిలిండు.

“ఊకూకె బాంచెన్ అనకు పిలగా… ఇస్వాసంగ ఉండాలె కని బాంచెగ ఉండొద్దు” అన్నడు ఈరన్న బో

ధ సేస్తున్నట్టు.

“మాటదేముంది మామ.. సేటు మంచోడు..”

“గదే సేటు మంచోడు గనక ఇశ్వాసంగుండు.. నిజాయితీగ పని చెయ్యి.. బాంచను అనకు.. మన శ్రమ కష్టం లేకుండా.. ఎవరు పైసియ్యరు.. ఇస్తన్రు అంటె అందుల ఏదో మోసముంటది. మీ  అయ్యను ఎంకుల్ని ఊకూకె తిట్టకు.. ఉరికిరికి లొల్లి సెయ్యకు.. సేటు, సర్పంచ్, ఊల్లోల్లందరికి వాల్ల సంగతెరకనే.. నువ్వే నిమ్మలంగుండు.. చరిత్రలనే నేరగాళ్లమ

ని… నేరాలు చెయ్యడం అలవాటున్న కులమని మన ఎరుకలోల్ల గురించి రాసున్నది.. మనకోసం కొట్లాడెటోడు లేడు.. మన మేలు కోరే రాజ్యం కాదు.. డబ్బున్నోలందరు చెడ్డోల్లు కానట్టే మంచోల్లు కూడా కాదు.. కొన్ని కులాలను నేరగాళ్లని.. కనపడితే కాల్చేయమని చట్టం చేసిన దేశ చరిత్రమనది. విచిత్రమైన దేశం మనది..

ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా స్టూవర్ట్ పురం దొంగల ఊరు అని ప్రచారం చేసినట్టే.. తెలంగాణల మన ఎరుకల కుటుంబాలు ఎక్కువున్న లింగాల ఊరును నేరస్తుల గ్రామమని పేరెక్కింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు దగ్గర అచ్చంపేట మండలం లింగాల అనే గ్రామం అది. కాలం మయిమ శాన గొప్పది.. లోకం తీరు తెలుసుకొని నడువాలె.. శాన సార్లు ఊకున్నంత ఉత్తమం ఇంకోటి ఉండదు..” ఇవరం సెప్పిండు.

అర్థం అయిందో కాలేదో కని ఏదులు ఈసారి ఎదురాడ లేదు.

***

సేటు అన్నట్టే మూడు రోజుల్ల పిల్లగాల్ల పేరు మీద డబ్బులేసిండు, ఇస్తన్నట్టే ఏబై వేలు చెక్కు రాసిచ్చిండు నాంచారి పేరుమీద… ముందు ముందు ఏ గోల లేకుండ మామలల్లుళ్ళతోటి కాయితం రాయించుకున్నడు.. సర్పంచ్ సాక్షి సంతకం పెట్టిండు.

వారం పది రోజుల్ల కట్టు బడి పని మొదలయింది. అల్లుడు బిడ్డకోసం ఈరన్న పెండ్లంతో కలిసి వచ్చి పోతున్నడు…. ఏదులు పనికి పోతాండు వస్తాండు. కానీ ఎంకులు చేసిన పని మనసుల మెరమెర మంటంది . రంగడు సెప్పిన మాటలు సెవుల్ల రింగు రింగు మంటున్నయి. కాని ఇంతకు ముందోలె లొల్లి సేయట్లేదు, తాగుడు కూడ తగ్గిచ్చిండు.. మామ సెప్పే ఇవరం మాటలు మనసుల నాటుకున్నయి.

సేటు డబ్బులిచ్చిన సంగతి సంగనికి తెలిసింది… ఎంకులుకు సెప్పిండు – వాళ్ళ కళ్ళు మండినయి…  ‘దరిద్రున్ని బాగు చెయ్య లేము… అదృష్టవంతున్ని చెడగొట్ట లేము’ అన్నట్టయ్యింది. వాళ్ళ పని…

“గీ సేటుగాడు మనకు సందు దొరకనియ్య లేదు. ఏడికి పోతడు ఏదులుగాడు దొరకబడత వాన్ని” అన్నడు సంగడు…

 సేటిచ్చిన పైసలు అప్పు పెట్టమను వడ్డీ ఇస్తనని. పొలం కొంటన్న డబ్బులియ్యమను అని చాకలి చంద్రని తోటి ఈరన్నకు కబురు పెట్టిండు.

“ఏదులునడిగి సెప్త” అన్నడు తన తప్పు లేకుండ..

మూడు రోజుల తర్వాత ఈరన్న తన ఊరు భీమిండి నించి మల్ల ఏదులు ఊరికి వచ్చిండు, పాద్దుగూకేల్ల. అప్పటికి ఏదులు గుడిసెకి రాలే..

నాంచారి లేసి తిరుగుతంది నిమ్మలంగ.. ఒంటి  సేత్తో అదో ఇదో చేసెతందుకు ప్రయత్నం చేస్తున్నది..

తండ్రిని సూసి నవ్వుకుంట ఎదురొచ్చింది.

పిల్లలు తాత తాత అనుకుంట సుట్టు మూగిన్రు… పిల్లల కోసం తెచ్చిన అరటి పండ్లను చేతిసంచిల కెల్లి

 తీసి ఇచ్చిండు. పిల్లలు సంబరంగ అందుకొని గుడిసె బయిటికి పోయిన్రు. సంచి అందుకున్నది నాంచారి.

ఈరన్న గోలెం కాడికి పొయ్యి కాళ్ళు కడుక్కొన్ని వచ్చిండు. సేటు పుణ్యమా ఏదులు గుడిసెల రెండు పాతకుర్చీలు సేరినయి. బిబ్డ ఇచ్చిన మంచినీళ్ళ సెంబు అందుకొని కూర్చీల కూలబడ్డడు. తండ్రికెదురగ నులక మంచం మీద కూసున్నది నాంచారి.

“అవ్వ బాగున్నాదే యయ్యి “

 “ఆఁ అంత బాగున్నరు. బిడ్డ… మీ మామ పొలం గొంటాన్నని కబురు పెట్టిండు”.

“ఆయయ్యి పొలం గొంటె నీకెందుకు కబురు చేసుడు” అర్ధం కాలె నాంచారికి..

“సేటిచ్చిన డబ్బులు నీ అల్లుని కాడున్నాయి కద యియ్యిమను అంటున్నడు కదా..”

మాట పూర్తికాక ముందే “ఆఁ అనుకుంటనే ఉన్న ఏదో ఒకటి మెలికి పెట్టి, మల్ల మంట పెడతడని.. నీ అల్లుడు ఇప్పుడిప్పుడే నిమ్మలంగా పని చేసుకుంటండు … ఇప్పుడు తండ్రి మాటకు మల్ల బగ్గు మంటడు. మల్ల మొదలయితది కొలుపు. ఏమైతదో ఏమో నాకు బుగులైతంది యయ్యి” అన్నది నాంచారి. కళ్ళకు నీళ్ళు పెట్టు కుంట..

 “నువ్వు పరేషాన్ కాకు బిడ్డా.. అందుకే అల్లుడు రాక ముందే ఇంటి కొచ్చిన, ముందుగాల నీ సెవినేసి ధైర్యం చెప్పనీకి వచ్చిన, దగడు పడకు..” ఆలోచించుకుంట అన్నడు ఈరన్న.

ఇద్దరు అదో ఇదో మాట్లాడతాంటే దూరంనించి ఏదులు కనపడ్డడు..

” అల్లుడు జర పానంబట్టిండు కదా బిడ్డ.. ” అన్నడు ఈరన్న .

 “ఆ సేటు మంచోడే యయ్యి. ఆకలి దప్పిక అరుసుకుంటాడు… తాగుడు సుత తగ్గింది…” అన్నది.

దగ్గరికొచ్చన ఏదుల్ని సూసి గుడిసె బయటకొచ్చింన్రు తండ్రి బిడ్డలు…

“ఎప్పుడొచ్చినవే.. అంతకుశాలేనా మామ… ” అనకుంట జాలర్లకు పోయి కాల్లుమొగం కడుక్కున్నడు. నేత్రి అదో ఇదో మాట్లాడత అన్నం తిన్నరు.

 “వచ్చేది ఎండకాలం, ఎండలు అదరగొడ్తయి. పందులకు తావుండదు పగలు రేయి పండెతందుకు. పందుల గుడిసె సరి సెయ్యాలంటె.. కుదరతలేదు. సేటు కట్టుబడి పని మలాసుగ నడుస్తంది..” అన్నడు ఏదులు.

“జాలారు పక్కన దడికాడ వాయిల కొమ్మలు, గింజ మీదున్న మా బీర మండలు  తెచ్చి గుంటపొడిసి గుచ్చు. వాయిల మండలు గింతంత తడికే అంటుకుంటయి. మాబీర గింజలు పేలాలోతిగ చిల్తయి గాబుకాడి పదునుకి. నెలా రెణ్ణెల్లకు మొలకలేసి రెండు మూర్లెత్తు పెరుగుతయి. ఇప్పటికే అక్కడున్న సర్కారుతుమ్మ పక్కనున్న సబ్జాచెట్లు సావకుండ సూసుకో.. సిన్నసిన్న గున్నలకు సరిపోతయి. పెద్దయి ఎక్కడన్న తిరుగొస్తయి… ఏబయి సాల్తీలు సగమయినట్టునయి కదా… ” ఇవరం సెప్పిండు ఈరన్న.

“నేత్రి పూట పందులు ఆగం కాకుండ గూడు కప్పాలె.. మొన్నటి ఆనకు ఒక పక్క గోడ దెసిలి కూలబడింది..” ఏదులు అంటుండగనే..

నాంచారి అందుకొని “మన గుడిసె సుత కప్పుకోవాలె.. ఈ సారి తాడిపత్రి తీసి వరిగడ్డి తోటి సెల్లనేయించు నాయినా…” అన్నది.

“ఔ మామా తాటాకులకెల్లి ఎలకలురుకుతాంటె పురుగు బూసి రాలతన్నయి” అన్నడు ఏదులు.

ఇదే మంచి సమయమనుకున్న ఈరన్న “ఔను పిలగ మొన్న సేటిచ్చిన పైసలు ఏంజేద్దామనుకుంటున్నవ్.. భూమిచెక్కేమన్న కొంటవా…” అన్నడు.

 “ఏమోనే నేనేది సోంచాయించలే.. నువ్వె జెప్పు – ఈ ఒంటి నిట్టాడి గుడిసెను రెండు దూలాలిల్లు ఏసేతందుకు రెండేలు అడిగిండు వడ్లాయన…”

“అట్లనే సెయ్యి.. సేటు కూడ సాయం చేస్తడు. ఒక పదివేలు ఇంటికి పెట్టిన మిగిలినయి భూమి కొనుక్కొ..” అన్నడు.

ఏదులు మాట్లాడకుండ ఆలోచనల పడ్డడు.

“మీ నాయిన  పొలం కొంటడట, డబ్బులు అడిగితే ఇస్తావా మరి” అన్నడు ఈరన్న.

 చురుక్కున మామ కెల్లి చూసిండు. ఆ మాటినంగనే ఏదులు దౌడ బిగిసుకుంది.

“నా మీద కోపానికొచ్చుడు కాదు. సల్లంగ ఇచారించు. ఏది చేస్తే మంచిది అనుకుంటున్నవో..”

“ఈ ఊ‌ల్లె కొనను మామా.. మా యయ్య కన్ను పడితే పచ్చని సెట్టు కాలి బూడిదయితది, నల్లటి బండరాయి వక్కలయితది. మీ ఊల్లె కొందాము నువ్వే సూడు” అన్నడు.

“అట్ల వద్దు పిలగా కుల కట్టుబాటుంటది కదా..”

“కులాన్ని నేనెప్పుడు కాదన్న.. మా వోల్లతో నిత్తె జగడమెందుకని అన్న గని..” ఏదులు గట్టిగనే అన్నడు.

“నీకు తెలవనిదేమున్నది.. ఏ ఊరు కా ఊరి కట్టుబాటుంటది. పంచాయతయినా పండగయినా పెభుత్వమిచ్చే పథకాలైనా.. ఏండ్ల సంది ఊల్లె ఉన్నోల్లకు ఇచ్చినంకనే బయటూల్ల నుంచొచ్చినోల్లకు.. కాదంటే ఎలి.. కులమెలేస్తది.. ఊరెలేస్తది..”ఈరన్న చెప్పే మాట పూర్తికాక ముందే..

“మీ ఊల్లోల్లకు నేను పోటీ రాను మామా..

మా యయ్య డబ్బులడుగుతండని సర్పంచ్ చెప్పిండు – మీ ఊల్లనే ఏదన్న భూమి చెక్క కొను..” అన్నడు ఏదులు.

తామనుకున్నట్టు ఎగిరిపడకుండా నిమ్మలంగ మాట్లాడు తున్నందుకు తండ్రి బిడ్డలు ఒకల మొగం ఒకలు సూసుకున్నరు.

“అంటే నీకిచ్చిన డబ్బుల మీద మీ అయ్య ఆశ పడ్తండు.. పట్టుదలగనే ఉన్నడన్నమాట.. సరెలే నిమ్మలంగ సోంచాయిద్దాం. పండుకోండి పొద్దు పొయింది. నేను మొగుల్లనే బయిలెల్లుత మరి” అన్నడు.

 “అట్టనే యయ్యి… నువ్వు సుత పండుకో యయ్యి .. ” అనుకుంట లేసింది నాంచారి… గూట్లె దీపం వత్తి తగిచ్చి

పిల్లల పక్కన ఒరిగింది…

*** సశేషం***

Written by Jwalitha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దీవించు

సంసారం ఆటుపోటుల సాగరం