ఆహా!!! నాకు చాలా ప్రియాతి ప్రియమైనది.. ఒకప్పుడు. కొన్ని వంటల్లో అది లేనిదే ముద్ద దిగేది కాదనుకోండి. కొన్ని కాలాల్లో దాని ధర అరవై లేదా వంద అయ్యేది. అయినా సరే, పట్టు వదలని విక్రమార్కురాలిలాగా, నాన్నా! కొందాం అని కొనిచ్చేదాన్ని. అప్పట్లో ఎవరితో అయినా దీని గురించి మాట్లాడితే, వంద రూపాయలైనా కొoటామండి అని చెప్పుకోవడమంటే అదో గొప్ప. (కాదు తిక్క)
ఏవిటో opposite poles అట్ట్రాక్ట్ అని, మా పెళ్ళి అయ్యాక, మా అత్తగారింట్లో ఉల్లిపాయ అనే పదం అస్సలు వినపడకూడదు. ఎవ్వరిమాట వినడు సీతయ్య లా అనమాట. ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, సొరకాయ , బీరకాయ ఇలా ఎన్నో మా అత్తగారింట్లో నిశిద్ధాలు. ఇలా కొన్ని ఇంట్లో ఉంటే, మా వారు సరే సరి, బంగాళాదుంప తప్ప వేరేవి ఏవీ ఆయన కళ్ళకి కనిపించి కనిపించవు. పెళ్లికి ముందు, పాట అంటే చెవులు కోస్కునట్టు, వంట అంటే చేతులు కాల్చుకున్నా, మరీ చేసేదాన్ని. అంత ఇష్టం అనమాట! ఇప్పుడు ఇలా ఏం తినాలో, ఏం చెయ్యాలో తెలియని ఇదో స్థితి
అయినా సరే, నేను మా వారు ఉద్యోగాల వల్ల వేరే ఊర్లో ఉన్నందుకు, ఒకసారి నా గుండెల నిండా ధైర్యం నింపుకుని నాకోసం తెచ్చుకున్నాను చేద్దామని .(మా ఆయనకి తెలియకుండా)
వివాహ భోజనంబు! వింతైనా వంట కంబు! అని చాలా హుషారు గా పనీర్ కర్రీ లో వేద్దామని, చాలా కష్టమైనా, కళ్ళలో నీళ్లు జలపాతాల్లా కారుతున్నా తుడుచుకుంటూ మరి తరిగేసాను. హమ్మయ్య అని, బాండ్లి లో నూనె వేసి, జీలకర్ర వేసి, అంత సాహసం చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి, గరిటతో ఇలా తిప్పానో లేదో అలా మా ఆయన వంటింట్లో కి పరిగెత్తుకుని వచ్చి ఏం చేస్తున్నావ్? అని అడిగాడు మొహం ఒకలా పెట్టి. నేను ఎం తెలియని అమాయకురాలిలా ఎమన్నా అయ్యిందా! అని అడిగాను. ఏమి అనలేక ఏమి లేదు లే! అని వెళ్ళిపోయాడు.
రొట్టెల పిండి తడిపేటప్పుడు పిండి ఎలా ఫీల్ అవుతుందో మా అయన మొహం లో భావం కనిపించింది.
అలవాటు లేదు కదా పాపం మరి తనకి, ఆ వాసనకి కడుపులో బాగా తిప్పేసింది. కడుపుతో ఉన్న వారిలా, వాసన పడక. వాంతులు ఒకటే తక్కువ అనుకోండి.
“త్యాగశీలి వమ్మా మహిళా” లలా నేను ఆ సంఘటన తరువాత మా అయన మీద ఇంకెప్పుడు ప్రతిఘటన చేయొద్దని నిర్ణయించుకున్నాను. మన్మథుడు లో Alda లా, “తెలుగు లో నాకు నచ్చని ఒకే ఒక పదం “, నా ప్రియాతి ప్రియమైనది కావాల్సొచ్చింది.
అప్పుడే పెళ్ళి, ఇప్పడు ఏం రాసానో పదిహేను నిమిషాల తరువాత గజిని లా మరచిపోయే కోడింగ్ చేసే ఉద్యోగం, సాహసం లో సుమన్ లా ఎంతసేపు నడిచినా రాని మా ఆఫీస్ లో cubicle తో ఇరవై మూడేళ్ళకే విసిగెత్తి పోయిన
నేను, పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఉండాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను.
పెళ్లికి ముందు stress buster లా ఉండే వంట పెళ్లి అయ్యాక stress master లా మారింది.ఓపిక లేని కూరగాయలను వంటల్లో వాడడం అలవాటైంది.
ఏలూరు యాసలో, మా పెద్దమ్మ, ఏవిటే ఏడుస్తున్నావ్ అని అడిగితే, ఏమి లేదు పెద్దమ్మ ఉల్లిపాయలు తరిగాను .అని సంజాయిషీ చెప్పుకునే బాధ, ఇలా ఎన్నో తప్పాయని చాలా పాజిటివ్ గా దీన్నీ తీసుకుని ఊరట కలిగించుకున్నానమాట.
ఇదంతా ఇలా ఉంటే, ఒక రోజు మా పిల్లలిద్దరికీ మార్కెట్ చూపిద్దామని సరదాగా కూరలు కొనడానికి వెళ్ళాం! సహ కుటుంబ సపరివార సమేతంగా.మా పెద్ద వాడికి పరుగు సినిమా లో అల్లు అర్జున్ లా కాళ్ళు ఒక చోట నిలవవు మరి. అందుకే, చేతులకి పని చెప్దామని, ఇవి యేరు నాన్న అని కూరగాయలని చూపించాను. మా వాడు బుద్ధిమాన్ బాలక్ లాగా ఒకటి ఏరి , అమ్మ ఇదిగో black berry అని బెండకాయలని ఇచ్చాడు. ఇది చూసి కూరలు అమ్మే ఆవిడ, మీ బాబు చాలా పని చేస్తాడమ్మా అని ఆవిడ పొగడ్తలు . అవును, అని మనసులో నవ్వుకుని ఆకు కూరలు చూస్తున్నాను.
అప్పుడే సరిగ్గా మా వాడు చెయ్యకూడని పని చేస్తున్నాడని చూసి, చేతిలో బాంబు పట్టుకున్న హీరోయిన్ ని కాపాడే హీరో లా నేను వద్దూ!!!!! అని స్లో మోషన్ లో వెళ్లి వాడి చేతిలో ఉన్న ఉల్లిపాయను తీసే ప్రయత్నం చేశాను. వాడు మాత్రం ఫ్యామిలీ సర్కస్ సినిమా లో పిల్లాడి పిడుగు లా నా మీద ఒక పెద్ద అరుపు బాంబు వేసాడు.
హతవిధి!!!! ఏమిటి ఈ పరిణామము,బయట ఉన్నాం కదా అని అనుకుని, మొదట అ యూట్యూబ్ లో O for Onion O O O అని అ వీడియో తయారు చేసిన వాడి మీద కాస్త చిరాకు వేసింది. O for ఇంకేమైనా పెడితే వీడికి subscribers రారా ఏంటి? అని అనుకున్నాను. ఇంక నా కోపపు ప్రవాహం కట్టలు తెంచుకోక ముందే, నేను తీసుకుంటున్న పేరెంటింగ్ క్లాసుల “పార్థాయ ప్రతిబోధితామ్” గుర్తొచ్చి, ఇదిగో నాన్నా! చిలకడ దుంప అని ఇచ్చాను వాడికి, వాడిని శాంతపరచడానికి. అప్పుడే సరిగ్గా, తెలుగు సీరియల్స్ లో సంబంధం లేని వ్యక్తిలా మా ఆయన, అది చిలకడ దుంప కాదు అని అనేశాడు. “ఏదో ఒక దుంప. ఇప్పుడు వీడు నా దుంప తెంచకుండా ఇంటికి వస్తే చాలు రా దేవుడా”, అని మనసులో అనుకుని మళ్ళీ ఇదిగో నీ favorite ఆలూ అని వాటిని చూపించి ఏరమన్నాను.
ఇంతలోనే, మా చిన్నవాడు మా స్కూటీ తాళం తో, అపరిచితుడు లో విక్రమ్ లా వాడి వెంట్రుకల మధ్యలోంచి కనిపించీ కనిపించని చూపు తో డిక్కీ తీసే ప్రయత్నం లో ఉన్నాడు. వాడేం చేస్తాడు పాపం మొదటి సంవత్సరం లో పుట్టువెంట్రుకలు మేము తీయించలేదు మరి!రెండో సంవత్సరంలో వెంట్రుకలు తీయించకూడదాయె .ఇక తలదువ్వి రబ్బరు బాండ్ పెడదామంటే దువ్వెనను చూసిన మరుక్షణం నుండి చాలా వేగంగా తలగుండ్రంగా తిప్పుతూ నాకు పట్టు దొరక్కుండా లాఘవంగా తప్పించుకుని కొంటె నవ్వులు నవ్వుతాడు.అందుకని అలా వదిలేయవలసి వస్తోంది.
ఇంక జరగబోయే హఠాత్పరిణామము మా శ్రీవారు గుర్తించి “ఇంక చాలు శ్రుతి పద “, అని అన్నాడు.పొద్దున్నే అయినా కొంచం ఘాటుగానే ఉన్నాడని సరే వెళ్దాం అని స్కూటీ ఎక్కి బయలుదేరాo. ఇంటికి వచ్చాక మా అత్తగారు ఎక్కడికి వెళ్లారు అని అడిగితే అప్పుడు గుర్తొచ్చింది, మార్కెట్ లో కూరలు ,ఇంట్లో మేము ఉన్నామని!!!”