ఎప్పుడో ముప్పై ఏళ్ల కిందట ఈనాడు బుక్ లో ఖజురహో కవర్ స్టోరీ చదివాను. అప్పటి నుంచి అక్కడకు వెళ్లాలని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ కుదరలేదు. చివరికి ఇన్నేళ్లకు నాకోరిక తీరింది. నేను, నా ఫ్రెండ్ అరుణ, వాళ్ల అమ్మాయి ముగ్గురం వెళ్లాలని అనుకున్నాము. వెంటనే IRCTC ఆఫీసుకు వెళ్లడం, వివరాలు కనుక్కోవడం, ఫిబ్రవరి 24 వ. తేదీకి బుక్ చేసుకోవడం వెంట వెంటనే జరిగి పోయింది. ప్రయాణానికి వారం రోజుల సమయం ఉంది.
అనుకున్న రోజు రానే వచ్చింది. కాచిగూడా రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం ఐదు గంటలకు సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లో బయలుదేరాము. తెల్లవారి మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్వాలియర్ లో దిగాలి. మా కొరకు ఏర్పాటు చేసిన టాక్సీ డ్రైవర్ కపిల్ మాకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. షరా మామూలే…… సాయంత్రం ఏడు గంటలకు మేము గ్వాలియర్ చేరుకున్నాము. కపిల్ అప్పటికే సిద్ధంగా ఉన్నాడు. ట్రైన్ ఆలస్యం కావడం వలన ఆ రోజు చూడవలసిన యోగిని టెంపుల్ చూడలేక పోయాము. ఆ రాత్రి స్థానిక ఆహారం పావ్ బాజీ, చాట్ రుచి చూసి గదికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాము.
ఆ తెల్లవారి ఆదివారం ఉదయమే బయలుదేరి గురుద్వార చూసుకొని అక్కడి నుంచి గ్వాలియర్ ఫోర్ట్ కు వెళ్లాము. ఇది ఎత్తైన కొండ మీద ఉన్నది. కోట పై నుంచి గ్వాలియర్ నగరం కనిపిస్తుంది. దీని నిర్మా ణం ఇసుక రాయి సున్నపు రాయితో జరిగింది. కోట లో మన్మందిర్, గుజారి మహల్ అనే రెండు ప్రధాన భవనాలు ఉన్నాయి. 1486- 1516 లో పాలించిన తోమర్ రాజ్పుత్ పాలకుడైన మాన్ సంగ్ తోమర్ దీనిని నిర్మించాడు. గుజారి మహాల్ మహారాణి మృగనయని కొరకు నిర్మించ బడింది. తరువాత 1916 లో సింధియా పాలకుడు ఈ కోటను పునరుద్ధరించాడు. దాదాపు రెండు మూడు గంటలు కోట పైభాగం కింది భాగం అంతా చూసి, కోట ప్రాంగణంలో ఉన్న మరో రెండు ఆలయాలను చూసాము. వాటి నిర్మాణ కౌశలం చూసి తీరవలసిందే కానీ మాటల్లో చెప్పలేము. అక్కడి నుంచి జై విలాస్ ప్యాలెస్ కు వెళ్ళాము. దీనిని 1874 లో జయాజీరావు సింధియా నిర్మించారు. నిర్మాణ శైలి ఇటాలియన్ మరియు టస్కాన్ శైలిని పోలి ఉన్నది. భవన వైశాల్యం 124,771 చదరపు అడుగులు. దర్బారు హాలు చాలా పెద్దది. వెండి బంగారాలతో నగిషీ చేయబడింది. భారీ శాండిలేయర్స్ తో అద్భుతంగా ఉంటుంది. గ్లాస్ తో చేసిన టేబుల్స్, కుర్చీలతో కూడిన అతిపెద్ద డైనింగ్ టేబుల్ హాలులో మరో ప్రత్యేకత. వాళ్లు వాడిన వంట సామాగ్రిని ఒక గదిలో ప్రదర్శించారు. వెండి, బంగారాలతో నగిషీ చేయబడిన పల్లికీలు, ఎత్తైన వెండి శిల్పాలు, ఫర్నీచర్ మొదలైనవి ఆయా గదులలో ప్రదర్శనకు ఉంచారు. సమయాభావం వలన ప్రాముఖ్యత లేని కొన్ని గదులు చూడకుండా వెనక్కి మళ్ళాము. మార్గమధ్యలో భోజనం చేసి సాయంత్రానిల్లా ఓర్చా చేరుకున్నాము. గ్వాలియర్ నుంచి ఓర్చాకు ఒక గంట ప్రయాణం. ముందుగా ఓర్చా కోట లోకి వెళ్ళాము. రాజ భవనాలు, దేవాలయాలు, ఇతర భవనాలతో కూడిన విశాలమైన ప్రాంగణం. చాలావరకు శిథిలమైయ్యాయి. చతురస్రాకారంలో ఉన్న ఒక రాజభవనం లోకి వెళ్లి అంతా తిరిగి చూసాము. రవళి అంత పైకి ఎక్కి తన ఆత్మ విశ్వాసాన్ని చాటి చెప్పింది. నిజంగా నాకు సంతోషం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే తను ప్రత్యేకమైన ( డౌన్ సిండ్రోమ్ ) అమ్మాయి. భవనం పైనుంచి కోట ప్రాంగణం, ఓర్చా నగరం కనిపిస్తుంది. చీకటి పడకముందే అక్కడ చూడవలసిన ప్రదేశాలు చూడాలని లోకల్ ఆటో చేసుకొని బయలు దేరాం. ముందుగా లక్ష్మి నారాయణ దేవాలయానికి వెళ్లాము. ఇది కోటనుంచి రెండుమైళ్ల దూరంలో ఉన్నది. 1622 బీర్సింగ్ డియో ఈ ఆలయాన్ని నిర్మించి, లక్ష్మీదేవికి అంకితం చేశాడు. సరైన నిర్వహణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నప్పుడు 1793 లో ప్రుత్వీసింగ్ దీనిని పునర్నిర్మించాడు. పూజలు జరుగుతున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డ్ మీద ఈ వివరాలు ఉన్నాయి. ఇక్కడి నిర్మాణంతోపాటు చిత్రకళ ప్రత్యేకమైంది. అద్భుతమైన కుడ్య చిత్రాలు మనను చూపు మరల్చనివ్వవు. రామచరిత మానస్ చిత్రాలు, ప్రథమ స్వాతంత్య్ర సమర సంఘటనల చిత్రాలున్నాయి. వీటితోపాటు అజంతా చిత్రాలను పోలిన స్త్రీల చిత్రాలు కనిపించాయి. అక్కడి నుంచి టెంపుల్ అంబ్రెల్లాకు వెళ్ళాము. సమయం దాటిందని అప్పుడే గేట్ మూస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చామని, త్వరగా చూసి వచ్చేస్తామని రిక్వెస్ట్ చేస్తే లోపలికి పంపించారు. ఆ భవనం మధ్యలో చిన్న జలాశయం లో శివలింగం ఉన్నది. అందులోని నీళ్లను జనం నెత్తిన చల్లుకుంటున్నారు. నేను మాత్రం విద్యుత్ దీపాల కాంతిలో వెలిగి పోతున్న భవన నిర్మాణ అందాలను చూస్తూ మైమరచి పోయాను. చుట్టూఉద్యానవనం తో చక్కటి నిర్వహణ ఉన్నది. అప్పటికే చీకటి పడడంతో పక్కనే ఉన్న బెత్వా నదిలో పడవ విహారం చేయలేక పోయాము. మా కార్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్. అక్కడి నుంచి మాకు వసతి ఏర్పాటు చేసిన హోటల్ గదికి చేరుకున్నాము. చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. కారణం అది ఒక చారిత్రాత్మకమైన భవనంలో ఏర్పాటుచేసిన హోటల్.
తెల్లవారితే మా అసలు గమ్యం ఖజురహోకు ప్రయాణం. ఆ ఉద్వేగంతో నిద్రకు ఉపక్రమించాము. ఓర్చాలో ఉదయం పడవ విహారానికి అవకాశం ఉన్నా దానిని రద్దు చేసుకొని ఖజురహో వెళ్లాలని నిర్ణయించాం. ఓర్చా నుంచి ఖజురహో 172 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మూడు నాలుగు గంటల ప్రయాణం. సోమవారం ఉదయం హోటల్ లోనే అల్పాహారం ముగించి ఎనిమిది గంటలకు బయలుదేరి పదకొండు గంటలకు ఖజురహో చేరుకున్నాము. వీల్ చైర్ రవళి కొరకు ఏర్పాటు చేసుకున్నాము. కానీ ససేమిరా దానిని వాడుకోలేదు రవళి. తన స్వశక్తితోనే ఖజురహో మొత్తం తిరిగి చూసింది బంగారుతల్లి. తన ఆత్మవశ్వాసానికి మరో మారు అబ్బుర పోయాను.
యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపదలో ఖజురహో కూడా ఉన్నది. ఇక్కడ హిందూ, జైన మతాలకు చెందిన దేవాలయాలున్నాయి. క్రీ. శ. 900-1000 మధ్య చెందేలా రాజవంశస్థులు వీటిని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. పన్నెండో శతాబ్దం నాటికి ఇరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎనభై ఐదు ఖజురహో దేవాలయాలు ఉన్నట్లు చారిత్రక రికార్డులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇరవై ఐదు దేవాలయాలు ఉన్నట్లు అక్కడి వాళ్లు చెపుతున్నా పదకొండు దేవాలయాలు మాత్రమే చూడడానికి వీలుగా ఉన్నట్లు గైడ్ చెప్పాడు. ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేము స్వయంగా తిరగడం సాధ్యం కాదని ఎనిమిది వందల రూపాయలకు గైడును ఏర్పాటు చేసుకున్నాము. 1838 లో బ్రిటిష్ ఇంజనీరు టి.ఎస్. బర్ట్ అనే వ్యక్తి ఖజురహో దేవాలయ సముదాయాన్ని గుర్తించి వెలుగులోకి తీసుక వచ్చాడట. అంతకు ముందు వరకు ఏపుగా పెరిగిన వృక్షాలతో ఆ ప్రాంత మంతా ఒక అడవి లాగా ఉండేదట. పెద్ద వృక్షాలతో, చక్కటి పచ్చిక బయళ్లతో ఆ ప్రాంగణమంతా చల్లగానే ఉన్నా దేవాలయాల వద్ద మాత్రం ఎండ వేడిమి ఎక్కువగానే ఉన్నది. పూజాదికాలు లేకపోయినప్పటికీ బూట్లవేసుకొని లోనికి వెళ్లడాన్ని నిషేధించారు. అక్కడక్కడా తాగునీటి వసతి, రెస్ట్ రూములు శుభ్రంగా ఉన్నాయి. విదేశీ యాత్రికులు ఎక్కువగా ఉండడం, తరచూ ఏవో కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించడం వలన కాబోలు నిర్వహణ బాగుంది.
ఖజురహోలో శృంగార శిల్పాలు ఉంటాయనేది బయటి సమాజపు నమ్మకం. ఇది మీడియా కల్పించిన భ్రమ కూడా…… కానీ ఖజురహో శిల్ప సంపదలో పది శాతం మాత్రమే ఇవి ఉన్నాయి. శృంగారం కూడా ఒక కళనే అనుకునే వాళ్లకు ఏమీ ఇబ్బంది ఉండదు. పురాణ కథలకు సంబంధించిన శిల్పాలు, సంగీత, నాట్య భంగిమలు, ఆ కాలంలోని సామాన్య ప్రజల దైనందిన జీవితంలోని సంఘటనలు శిల్పాలుగా మలచబడ్డాయి. ప్రతి శిల్పాన్ని పరిశీలనగా చూస్తే ఆ కాలంలోని ప్రజల జీవన విధానం మనకు తెలుస్తుంది. శ్రామిక సౌందర్యంతో పాటు అలంకరణ విధానాన్ని గమనించాము. నాటి పనిముట్ల స్థానంలో నేడు యంత్రాలు వచ్చాయి కానీ ఆభరణాలు మాత్రం అవే పునరావృతమై యాంటిక్ మోడల్ ఫ్యాషన్ గా ఈనాడు చలామణిలో ఉన్నాయి. హిందూమత దేవాలయాలు అన్నీ శివాలయాలు. దాదాపు అన్ని దేవాలయాలు ఇసుకరాతి కట్టడాలే…. ఖజురహో దేవాలయాలలో చాలా ఎత్తైనది, పెద్దది కిందారియా మహాదేవ టెంపుల్. ఆలయ బాహ్య కుడ్యాలలోనే కాకుండా లోపల వైపుకూడా అద్భుతమైన శిల్పాలు మనను దృష్టిమరల్చనీయవు. దాదాపు ప్రతి ఆలయంలో ఒక పెద్ద శివలింగం ఉంటుంది. లోపల కూడా చుట్టూ డానికి, తిరగడానికి వీలుగా ఉంటుంది. బయట మాత్రమే చూసి వెళ్లిపోతే మనం చాలా మిస్ అవుతము. లోపల చీకటిగా ఉంటుంది. ఫోన్ టార్చ్ లైటు వే సుకొని ఆ చీకట్లో చుట్టూ తిరుగుతూ ఆ శిల్ప సౌందర్యాన్ని వీక్షిస్తే కలిగే ఆనందం ఎవరికి వారు అనుభవించ వలసిందే……. దాదాపు మధ్యాహ్నం రెండుగంటల దాకా కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగి ఖజురహో శిల్ప సౌందర్యాన్ని మదిలో పదిలపరచుకొని, అప్పటికే చాలా అలసిపోయి ఉన్నందున భోజనం ముగించుకొని గదికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాము. అంతకు ముందురోజు వరకూ శిల్పకళా వారోత్సవాలు నిర్వహించి నందువల్ల…… సాయంత్రం విద్యుత్ దీపాల కాంతిలో మరొకమారు ఖజురహో శిల్ప సౌందర్యాన్ని వీక్షించే అవకాశం కోల్పోయాము. వాకబు చేస్తే వారం రోజుల వరకూ లైట్ షో ఉండదని తెలిసింది.
మరునాడు ఉదయమే ఎనిమిది గంటలకు హోటల్ లో అల్పాహారం ముగించుకొని ఖజురహో మందిర సముదాయంలో ఉన్న జైన మందిరాలకు వెళ్లాము. ఆధునిక కాలంలో నిర్మించిన జైన మందిరంలో పూజలు జరుగుతున్నాయి కానీ దానిని దాటుకొని ముందుకు వెళితే ప్రాచీన జైన మందిరం ఉన్నది. ఇక్కడ కూడా పూజలు లేవు కాని చెప్పులతో లోనికి వెళ్లడం నిషిద్ధం. ఖజురహో దేవాలయాల వాస్తు శిల్పం లో హిందూ దేవాలయాలకు జైన దేవాలయాలకు మధ్య తేడా కనిపించలేదు. జాతక కథా వస్తువులతో శిల్పకళ ఉన్నది. ఆలయాల ప్రాంగణమంతా తిరిగి చూసి బయటకు వచ్చి కొద్దిపాటి షాపింగ్ చేసి హోటలు గదికి చేరుకున్నాము. అప్పటికే గది check out చేసే సమయం దాటిపోయింది. గబగబా గది ఖాళీ చేసి మధ్యాహ్నం భోజనం పార్శిల్ చేయించుకొని బయలుదేరేసరికి ఒంటిగంట అయింది. అక్కడినుంచి పన్నా టైగర్ రిజర్వ్ నేషనల్ పార్కు కు మా ప్రయాణం. ముందురోజే online లో మూడుగంటల ట్రిప్ కు బుక్ చేసుకొన్నాము. ఖజురహో నుంచి అక్కడికి ఇరవై ఏడు కిలోమీటర్లదూరం. కానీ ఘాట్ రోడ్డు వల్ల అక్కడికి చేరేసరికి గంటకు పైగా పట్టింది. వెళ్లి భోజనం ముగించి రిపోర్టు చేశాము. సఫారీ సమయం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు. open Top వాహనాలలో అడవి లోపలికి తీసుకు వెళతారు. ఒక్కొక్క వాహనంలో ఆరుగురు మాత్రమే కూర్చోవాలి. ఒక్క మేము ముగ్గురం, మరో ముగ్గురి బ్యాచ్ తో కలిపి ఒక వాహనంలో కూర్చున్నాము. ఒక్కొక్కరికి ప్రవేశ రుసుము పన్నెండు వందలు, వాహనం ఐదువందలు. వాహనంలో ఆరుగురులేని పక్షంలో ఎంతమంది ఉంటే… ఆరువేలను సమానంగా విభజించుకోవాలి. ప్రతి వాహనంలో డ్రైవర్ తో పాటు గైడ్ కూడా ఉంటారు. పులులు, చిరుతపులులు, నీల్ గాయ్, సాంబార్ జింకలు, స్పాటెడ్ జింకలు, ఎలుగుబంటు మొదలైన జంతువులు ఉన్నట్లు గైడ్ చెప్పాడు. పులి మాత్రం మాకు కనిపించలేదు. ఉదయం వేళలో అయితే కనిపిస్తాయట. మాతో వచ్చిన ముగ్గురు రాత్రి అక్కడే బేస్ చేసి ఉదయం బ్యాచ్ లో మళ్ళీ రావాలని నిర్ణయించుకున్నారు. మాకు ఆ రాత్రికే తిరుగు ప్రయాణం ఉన్నందువల్ల మేము బయలుదేరక తప్పలేదు. గుంపులు, గుంపులుగా స్పాటెడ్ జింకలు, నీల్ గాయ్, సాంబార్ జింకలు, ఒక చిరుతపులి కనిపించాయి. దూరంగా ఏనుగుల గుంపు ఒకటి కనిపించింది. అయితే అవి అడవి ఏనుగులు కావని…. పెంపుడు ఏనుగులని గైడ్ చెప్పాడు. రెండువందలకు పైగా పక్షి జాతులు ఉన్నాయట. తిరుగు ప్రయాణంలో మాకు రకరకాల పక్షులు కనిపించాయి. వాటి అరుపులతో ఆ సాయంత్రం ఏదో సంగీత కచేరీలో ఉన్న అనుభూతి కలిగింది. అక్కడి నుండి సాయంత్రం ఏడుగంటలకు బయలుదేరి రాత్రి తొమ్మిదిన్నరకు సాత్నా రైల్వేస్టేషన్ చేరుకున్నాము. రాత్రి పదకొండున్నరకు రైలెక్కి, బోలెడన్ని అనుభూతులు, అనుభవాలు మూటకట్టుకొని తెల్లవారి ఉదయం తొమ్మిదిన్నరకు క్షేమంగా ఇల్లు చేరుకున్నాము.