1978 వ. సంవత్సరంలో విడుదలైన ‘ లంబాడోళ్ళ రాందాసు ‘ అనే చిత్రంలోని గీతం ఇది . గీత రచయిత సి.నారాయణరెడ్డి , సంగీతం ఎస్ రాజేశ్వరరావు , గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి . సుశీల , తారాగణం రోజారమణి , చలం గార్లు .
ఇక పాట విశ్లేషణలోకి వెళితే
కొత్తగా వివాహ బంధంలో ఇమిడిన రెండు హృదయాలలోని ఆనందమే కాకుండా పలు రకాల ఆలోచనలు , భయాలు , అభద్రతాభావాలు వంటి ఎన్నో విషయాలకు సంబంధించిన వివరణను ఈ పాటలో మనము గమనించవచ్చు .
పల్లవి : “ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో ఇద్దరూ ఉన్నారూ ఎవ్వరూ వారెవరూ”
ఆరు బయట వెన్నెల రేయిలో చిత్రీకరించిన పాట ఇది . కథానాయకుడి కంటిపాపల్లో కనిపించే తన ప్రతిబింబాన్ని చూసి ఆ ఇద్దరూ ఎవరని అమాయకంగా కథానాయిక అడుగుతూ ఉంటుంది.
ఇక్కడ మనం కాస్త విశ్లేషణలోకి దిగితే, తనకు మాత్రమే సొంతమైన ఆ స్థానాన్ని ఎక్కడ ఇంకొకరు ఆక్రమిస్తారో నన్న భయం ఆమెలో తొంగి చూస్తూ ఉంటుంది.
ఈ విశ్లేషణను మనము ఇంకాస్త లోతుల్లోకి వెళ్లి చూస్తే గనుక ఇది ఒక న్యాయమైన స్వార్థం , అందమైన అభద్రత . హృదయానికి కళ్ళు అద్దం పడతాయి అంటారు . అతని కంటిపాపల్లోని రెండు ప్రతిబింబాలు నూటికి నూరుపాళ్ళు సారూప్యాన్ని కలిగి ఉన్నప్పటికీ , అతని హృదయంలో ఇంకెవరైనా ఉన్నారేమోననే అభద్రత . అతను తనకు మాత్రమే సొంతమవాలనే స్వార్థం . ఇది స్వార్థమే అయినప్పటికీ ఇందులో చక్కని న్యాయం ఉంది . ఇది అభద్రతనే అయినప్పటికీ ఇందులో చాలా నిజాయితీ ఉంది.
అభద్రతాభావం మనసులో ఉన్నప్పుడే ఆ వ్యక్తి అన్ని వైపుల నుండి అప్రమత్తుడై ఉంటాడు . తనది తాను కాపాడుకోవాలన్న భయం అతనిని కర్తవ్య నిర్వహణలో సమర్థవంతంగా ఉండేలా సన్నద్ధం చేస్తుంది . తనది అనే ఆ భావన వస్తువైనా, బంధమైనా ఏదైనా అయి ఉండవచ్చు.
కాకపోతే ఈ భావోద్వేగాలనేవి మనిషి నియంత్రణలో ఉన్నప్పుడే, హద్దు దాటనంతవరకే సత్ఫలితాలనిస్తాయి . ఇవి ఒక్కసారి అదుపు తప్పితే గనుక , ఆ మనిషి జీవితమే కాకుండా మొత్తం కుటుంబమే చెల్లాచెదురవుతుంది.
“ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నీవేలే ” అంటూ ఆ ఇద్దరు వ్యక్తులు వేర్వేరు కాదు ఒక్కరే అనీ, అది కూడా నువ్వే అనీ,నేను నీకు మాత్రమే సొంతం అంటూ అతను ఆమెలో భరోసా కల్పించడం శ్రోతలను ముగ్ధులను చేస్తుంది .
చరణం 1:
“చుక్కలే నిను మెచ్చీ పక్కనే దిగివచ్చీ మక్కువే చూపితే నన్ను మరిచేవో “
ఇంకెవరైనా నిన్ను ఇష్టపడి వస్తే నన్ను మరిచిపోవద్దంటూ ఆ అమ్మాయి మళ్లీ అదే అభద్రతను వ్యక్తపరుస్తుంది.
సాధారణంగా భర్త తనకంటే అన్ని రకాలుగా అధికుడై ఉన్నప్పుడు , అంటే అందంలో గానీ , తెలివితేటల్లో గానీ, స్థాయిలో గానీ అతను తనకంటే అన్ని రకాలుగా పై స్థాయిలో ఉన్నాడన్న భావన ఆమెలో ఉంటే గనుక , ఆమె ఒక విధమైన ఆత్మన్యూనతకు లోనవుతుంది . తాను అతనికి సరైన జోడి కాదనీ, తాను కాలంతోపాటు పరిగెత్తలేదన్న భావం ఆమెలో ఉంటే గనుక ఆమె మనసులో పలు రకాల భయాలు గూడుకట్టుకునే అవకాశం ఉంటుంది . ఆ కారణంగా ఎక్కడ అతనికి తన పట్ల అసంతృప్తి ఉందోనననీ, ఆ అసంతృప్తి అతనిని ఏ వైపు ఆకర్షణకు గురి చేస్తుందోనననే భయం ఆమెను వెంటాడుతూ ఉంటుంది .ఈ రకమైన మనుషులు మనలో చాలామందికి ఎదురు పడుతూ ఉంటారు.
” చుక్కలు వేలు ఉన్నా నా చుక్కి ఒక్కతే కాదా లక్షల మగువలు ఉన్నా నా లక్ష్మి ఒక్కతే కాదా నా లక్ష్యమొక్కటే కాదా”
అంటూ ఆ యువకుడు ఎంతమంది ఎదురైనా తాను ఎటువంటి ఆకర్షణకు లొంగననీ, నీ స్థానం కడు పదిలెం అంటూ ఆమెకు అందించే భరోసా ముచ్చట గొలుపుతుంది.
ఇక్కడ మనము రెండు రకాల విశ్లేషణలను గమనించాల్సి ఉంటుంది .
మొదటిది: పరస్పరం ఆప్యాయతాను రాగాలు , ప్రేమాభిమానాలు , నమ్మకం ఉంటే గనుక ఆ బంధంలో మూడవ వ్యక్తి ప్రవేశం అసంభవం అని నా అభిప్రాయం.
రెండవ అంశం: ఇవి ఏవీ లేకపోయినా కూడా దంపతులు ఇద్దరు కూడా విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తులైతే కూడా వారి మధ్య మూడో వ్యక్తి రావడం అనేది జరగదని నా ఉద్దేశం .ఇద్దరిలో ఒకరు మాత్రమే విలువలకు కట్టుబడి ఉండేవారైతే ఏ విధమైన ప్రయోజనం ఉండదు . ఇవి ఏవీ లేకపోయినా కూడా అంటే ప్రేమాభిమానాలు , ఆప్యాయతానురాగాలు , నమ్మకం వివాహ చట్రంలో బందీలై జీవితాన్ని యాంత్రికంగా కొనసాగించేవాళ్లు చాలామంది ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే.
చరణం 2: “తుంటరీ చిరుగాలి కొంటెగా నను చూసి పైటనే కాజేస్తే ఏమి చేస్తావో”
అంటూ అతను ఆ అమ్మాయిని ఆట పట్టిస్తూ ఉంటే “పైటే ఏమవుతుంది నీ చేతిలోన అది ఉంటే స్వర్గం దిగి వస్తుంది నా సామి తోడుగా ఉంటే నా రాముని నీడ ఉంటే” అంటూ కథానాయక అతని సహచర్యంలో తన భద్రతకు ఏ విధమైన డోకా ఉండదనీ, అతని సమక్షంలోనే ఆమెకు స్వర్గం కనిపిస్తుంది అంటూ ఉంటుంది. ఇక్కడ స్వర్గం అంటే వారు సాగించబోయే ప్రయాణంలో ఎదురయ్యే సౌఖ్యాలు, సవాళ్లు ,కష్టనష్టాలు ,ఆనంద విషాదాలు.
ఎంతటి కఠిన పరిస్థితులైనా, ఎంతటి క్లిష్ట సమస్యలైనా అతని నీడలో అవి తనకు చాలా చిన్నవిగా, గులకరాళ్లుగా కనిపిస్తాయననీ, అతనిపట్ల , అతని తోడుపట్ల తనకెంత భరోసా ఉందన్న విషయాన్ని చాలా అందమైన , అమాయకత్వమైన మాటలతో చెబుతూ ఉంటుంది. పాటలోని సాహిత్యానికి అనుకూలంగా రోజారమణి గారి హావ భావవ్యక్తీకరణ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.
వివాహ బంధాలు ఎంతగా బీటలు వారుతున్నాయో , వివాహేతర సంబంధాలు ఎక్కడికి దారితీస్తున్నాయో మనం రోజూ గమనిస్తూనే ఉన్నాం . వాటికి గురై బాధపడే వ్యక్తులు తమకేమాత్రం సంబంధంలేని వారైనప్పటికీ మనసున్న మనుషులకు , సామాజిక బాధ్యత ఉన్నవారికి అవి తట్టుకోలేని వేదనను కలిగిస్తాయన్న విషయం నిర్వివాదాంశం. వాటి గురించి ఆలోచిస్తూ మనసు వేదనకు గురైనప్పుడు ఈ పాట ఒక చక్కని ఉదాహరణగా కనిపించడం దానిపై విశ్లేషణ రాయాలన్న ఆలోచన రావడానికి కారణం.
గీత రచయితకు , దర్శకులకు ,గాయనీ గాయకులకు, నటీనటులకు, సాంకేతిక బృందానికి అందరికీ పేరుపేరునా అభినందనలు.