మా సినిమా కథ

(కథ)

లక్ష్మి మదన్

మా పాఠశాల అంటే మాకు ఎంతో ఇష్టం ఆదివారాలు కూడా ఎందుకు వచ్చినాయా అని అనుకునేవాళ్లం అంత సంతోషంగా ఉండేది.

ఒకపక్క క్లాసులో లెసన్స్ వింటూనే ఒకపక్క అల్లరి చేసిన బాల్యం… !ఒకరు సినిమా చూసి వస్తే చాలు.. ఫ్రీ పీరియడ్లో ఆ సినిమాను చూసింది చూసినట్లుగా చెప్పుకునే వాళ్ళం. అందులో ఎప్పుడో ఒకసారి కదా సినిమాలకు వెళ్లేది ! మా ఇంట్లో అయితే బాపు అస్సలు పంపించేదే కాదు . పౌరాణిక సినిమా వచ్చినప్పుడు వాడకట్టు మొత్తం సినిమా చూడడానికి కదిలేది…

” నమో వెంకటేశా” అనే పాట ఇంటి వరకు వినిపించేది . అప్పుడే అందరం భోజనాలు చేసే వాళ్ళము.. ఆ తర్వాత సినిమాకు బయలుదేరడం.

“శాంతక్క ! ఇంకా తయారు కాలే? తిన్నావా లేదా” అని ఒకామె పలకరింపు.

” ఏ అప్పుడే తిన్ననే! ఇంట్లో గదోటి గిదోటి సగబెట్టేవరకు ఇంత సేపు అయింది” అని శాంతక్క జవాబు..

” తాళ మెయ్యి జెల్డి..ఆట షురువు అయితది ” అని రత్నక్క అడుగుడు.

” గదేం జాకేటే.. చీరకు కల్వనే లేదు” అని మరో కమల.

” గీ చీకట్ల ఎట్లుంటే ఏంది తీ!” సుగుణ జవాబు.

రాంబాయ్ మస్త్ శోకులు వడుకుంటు వచ్చింది..

” జల్ది జల్ది నడువుండ్రుల్లా…” అని

ఇట్ల అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ సినిమా హాల్ వైపు నడిచారు.

పిల్లా పెద్ద అందరూ కలిసి సినిమా హాలుకు  వెళ్లేవాళ్ళం …! చిన్న ప్రొజెక్టర్తో సినిమాలు నడిపించే వారు… అందులో సగం సినిమా తర్వాత, ‘రీలు మార్చబడును ‘అని ఒక టైటిల్ ఇచ్చి, ఒక హాఫ్ ఎన్ అవర్ కూర్చోబెట్టేవాళ్ళు.. ఎందుకంటే ఉన్న ఒక్క మిషన్కు మళ్ళీ ఇంకో రీల్ చుట్టుకొని షో స్టార్ట్ చేయాలి. ఇలా ఒక సినిమా దాదాపు నాలుగు గంటలు పట్టేది. ఒకవేళ కరెంటు పోయిందనుకోండి ఆరు గంటలు పట్టేది. ఒక్కొక్కసారి కరెంట్ అసలు వచ్చేది కాదు. అప్పుడు తెల్లవారి మళ్ళి సినిమా చూడటానికి వెళ్లాలి. ఇవి మా సినిమా కష్టాలు.

సినిమాకి అందరం కలిసి బయలుదేరామా? తర్వాతే ఉంటది సినిమా మాకు ఎందుకంటే సినిమా హాలు మా ఇంటి నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది . అప్పటి వరకు మమ్మల్ని నడిపించుకుంటు తీసుకెళ్లేవాళ్ళు . సినిమా టికెట్ తీసుకునేటప్పుడు ఒక్కరు ఒక్కరు మమ్మల్ని చంకలో వేసుకునేవారు..

“దా బిడ్డా ఎత్కుంట” అని

 ఎందుకంటే చిన్నపిల్లలు అని చెప్పి టిక్కెట్ ఎగ్గొట్టడానికి.. మాకేం తెలుసు పిచ్చి మొహాల్లా ఎత్తుకుంటున్నారని సంతోషపడేవాళ్ళం😧😂.. ఇక టికెట్ తీసుకోవడంలో బలపరీక్ష ఉపయోగించాలి బోలెడు జనం ..క్యూ పద్ధతి లేదు . చూసుకుంటూ తోసుకుంటూ వెళ్లి టికెట్ తీసుకోవాలి ఎక్కువ బలం ఉంటే తొందరగా టికెట్ దొరుకుతుంది.. ఎలాగైతేనే టికెట్లు సంపాదించేవాళ్ళు…

“యే  జరుగు..నేను నీకన్నా ముందొచ్చిన” అని ఒకామె..

“ఆ! వచ్చిన వ్ తీ” అని మరోకామే..

” ఇగో! మా ఆయన చెప్పిండు…సగం పైసలే ఇయ్యిమని” ఓ చిన్నది అంటే..

” ఎందుకు! మీ ఆయన నాను బామ్మర్డా” అని టికెట్ ఇచ్చేటాయిన కౌంటర్..

ఇగ లోపలికి వెళ్ళే శుభ వేళ.😊రానే వచ్చింది

 కానీ ఇక్కడ మరొక పరీక్ష మేము ఎదుర్కొనే వాళ్ళం. అదేంటంటే గేటు దగ్గర సుబ్బమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ టికెట్లు తీసుకొని లోపలికి పంపించేది.. ఆ సుబ్బమ్మ ఎలా ఉండేదంటే ఆడ యమ కింకరు రాలికి చీర కట్టినట్లు ఉండేది.. ఒక్క కోరలు మాత్రమే తక్కువ చాలా బలిష్టంగా ఉండేది. ఎవరినైనా ఒక గుద్దు గుద్దుతే అంతే !అదే కాకుండా నోరు చాలా పెద్దది నోటి నిండా వేసుకున్న కిళ్లీ నమ్ముతూ మాట్లాడుతుంటే తుంపర్లు రాలుతూ, కళ్ళు భయంకరంగా పెట్టి గర్జించేది. మాకైతే ఆమెను చూస్తే భయమేసేది. టికెట్ ఆమె చేతిలో పెట్టి లోపలికి వెళ్ళాలి. మా అమ్మ అప్పుడప్పుడు ఆమెను మంచి చేసుకోవడానికి ఐదు పైసలు పది పైసలు ఆమె చేతిలో పెట్టేది..

“సుబ్బమ్మ! ఈ 10 పైసలు ఉంచుకో” అని.

“అవును గని సుబ్బమ్మ! ఈ సినిమాలలో వేషాలు ఎట్లా వేసుకుంటారు” అని అమాయకంగా అడిగింది అమ్మ.

“వాళ్లంతా నెత్తికి బట్టలు కట్టుకొని ఎగురుతారు గదే సినిమా” అని తెలిసినట్లు చెప్పింది సుబ్బమ్మ.

అదే నిజమనుకొని నమ్మాము చాలా రోజులు.

అమ్మ పైసలు ఇచ్చిందన్న సంతోషంలో సుబ్బమ్మ

 అప్పుడు తన ఎర్రటి పండ్లు ఇవతల పెట్టి హి.హి.అని నవ్వేది. ఇక లోపలికి పంపించేది.

లోపలికి వెళ్ళాక మరో అంకం మొదలయ్యేది. అన్ని బెంచిలే నేల టికెట్ లేదు. కిక్కిరిసిపోయి బెంచీల మీద కూర్చునే వాళ్ళము. విపరీతమైన ఉక్క పోత! డబ్బాలో అందరిని వేసి మూతపెట్టినట్లు ఉండేది హాల్ .భయంకరమైన పరిస్థితి కానీ సినిమా చూడాలన్న ఆసక్తితో ఇవన్నీ మరిచిపోయి బట్టలు తడిసిపోయి చెమట కారుతున్నా అందరూ అట్లానే సినిమాను చూసేవాళ్ళు ! మరి మళ్ళీ ఎప్పటికోగానీ అవకాశం దొరకదు కదా!

 ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో ఒక చిన్న గోడ ఉండేది.దానికి  మీద ఒక నల్లని పరదా కట్టేవాళ్ళు… ఇంటర్వెల్ అవుతుంది కదా అప్పుడు మా మొద్దు సుబ్బమ్మ వచ్చి  లాగేది… అప్పటికే అటు వైపు ఉన్న మగమహారాజులు తలలన్నీ ఆడవాళ్ళ వైపు పెట్టుకొని చూస్తుండేవాళ్ళు అసలు ఆడవాళ్ళని ఎప్పుడూ చూడనట్లుగా ముచ్చు మొహాలు వేసుకుని😃… ఆ చినిగిపోయిన పరదాని గబా గబా లాగేసేది సుబ్బమ్మ.. ఇక అప్పుడు పల్లీలు సోడాలు అమ్మకానికి వచ్చేవి అమ్మో మా ఇంట్లో అవి నిషేధమేలే ! నోట్లో నాలుక వేసుకొని కూర్చోవడమే సినిమాకి తీసుకెళ్లడమే గొప్ప ఇంకా పల్లీల మా మొహాలకి!

సరే ఎలాగో సినిమా చూసి మెల్లగా బయటకు వచ్చేవాళ్ళం. మొదటి ఆట అయ్యే వరకు దాదాపు పదిన్నర అయ్యేది. ఇక గుంపులు గుంపులుగా నడుచుకుంటూ ఇళ్లళ్లకు బ్యాచులు బ్యాచులుగా వెళ్లేవాళ్లు. ఏ వాడకట్టు వాళ్ళు ఆ వాడకట్టుకు అన్నమాట… అప్పుడే కథ చెప్పుకోవడం . ఆ ముచ్చట్లు షురువు చేసుకుంటూ

” జగ్గయ్య ఎట్లా చేసిండే”

“నాకైతే సత్త నారి గాన్ని కొట్టాలనిపించింది”

” వాణిశ్రీ ఏం చీరలు కట్టింది ఒక్కొక్క చీరకు మ్యాచింగ్ బొట్టు గొలుసు గూడ ఏసుకుంది”

”  గా సూర్యకాంతం పాడుగాను వాణిశ్రీ ని మస్తు కొట్టింది, కష్ట పెట్టింది” అని అప్పుడే దుఖపడుకుంటు..మళ్ళీ వెంటనే..

” అబ్బ! రాజబాబు రమాప్రభ జోకులు అయితే మస్తున్నాయి” అని నవ్వుడు.

ఇలా మాట్లాడుకుంటూ ఇల్లు చేరుకునేవారు.. మా ఇంటికి వెళ్లేసరికి మా నాయనమ్మ, అమ్మమ్మ భోజనం చేసి, మా కోసం ఎదురుచూస్తూ కూర్చుని వాళ్ళు మా అమ్మని చూడగానే మా నాయనమ్మ…” అయినయా సినిమాలు ఇంకేటన్న పోయేది ఉందా తయ్య తయ్యపోతారు” అని ఓ వ్యంగ్యోక్తి వదిలేది. ఏమీ అనకుండా అమ్మ లోపలికి వెళ్లి రాత్రి చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకునేది. మేం మాత్రం కాళ్లు చేతులు కడుక్కొని అప్పటికే ముంచుకొచ్చిన నిద్రని ఆహ్వానించి  పడుకునే వాళ్ళం.. మరి తెల్లవారి బడికి వెళ్ళాక కథ చెప్పాలి కదా! అందరూ ఈ విషయంలో చాలా ఫాస్ట్ . కానీ లేక లేక మేము ముందు చూసిన సినిమా కథ చెప్పాలి కదా!

అలా మా సినిమా ముచ్చట్లు జరిగేవి.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చెకుముకి రవ్వా చినబోయింది ఓయమ్మా  

ఆత్మవిశ్వాసం