చెకుముకి రవ్వా చినబోయింది ఓయమ్మా  

పాట విశ్లేషణ

             పద్మశ్రీ చెన్నోజ్వల

1976  వ . సంవత్సరంలో విడుదలైన ‘ నేరం నాది కాదు ఆకలిది ‘ అనే చిత్రంలోని పాట ఇది . గీత రచయిత సి . నారాయణ రెడ్డి గారు , సంగీతం సమకూర్చినది సత్యం గారు , నేపద్యగానం సుశీల గారు.

 ఎన్. టి. రామారావు గారు , మంజుల  గారు ముఖ్య తారాగణంగా చిత్రీకరించిన ఈ బృంద గానాన్ని తరచి చూస్తే గనుక ఇందులో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలెన్నో ఉన్నాయి అనే కంటే ఇందులోని ప్రతి అక్షరం మనిషి జీవితానికి ఉత్తేజాన్ని అందించే ఔషధంగా పరిగణించవచ్చు.

మనిషి జీవితంలోని వివిధ దశల్లో ఎదురయ్యే పరిస్థితులకు , అలజడులకు మనసు నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా, మనిషిలోని క్రియాశీలతను,  సృజనాత్మకతను దెబ్బతీయకుండా ఉండటానికి ఇది ఒక స్ఫూర్తికారకంగా పనిచేస్తుంది.

ఇక పాట విశ్లేషణ లోనికి వెళితే

పల్లవి :    ”  చెకుముకి రవ్వా చినబోయింది ఓయమ్మా అది గుప్పున మండి నిప్పై  రగిలేదె పుడమ్మా”

ఏ కారణం వల్లనో మనోవ్యాకులతకు గురైన కథానాయకుడిని తేలిక పరచడం కోసం కథానాయిక పాడే హుషారైన బృంద గానం.

జీవితంలో కాలం అన్నివేళలా మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు .కొన్నిసార్లు తానొకటి తలచిన దైవమొకటి తలచినట్లు అనీ అంటారు కదా!విజేతలందరికీ తమ తమ కృషి వల్లనే  అనుకున్నది సాధించామనే విశ్వాసం తప్పకుండా ఉంటుంది. ఇక ,హేతువాదులు  ఈ సామెతను ఏకీభవించకపోవచ్చు . మనిషి అసమర్థతకు వీరు వేసే అందమైన ముసుగు , పలాయన వాదానికి చూపించే సాకు అని వీరి భావన . కొంతవరకు , కొన్ని సందర్భాలలో ఇది సహేతుకమే అయినప్పటికీ ఎల్లవేళలా సమర్థనీయం కాదేమో అనే భావన కూడా చాలా మంది లో ఉంటుంది. ఇవన్నీ ఏవి ఉన్నా లేకపోయినా కానీ సంకల్ప బలం పరిశ్రమ ఉంటే సాధిస్తారన్నది జగమెరిగిన సత్యం.

చరణం 1 :     ” నేడు గాకున్నా రేపైనా వసంతం రానే వస్తుంది . మో డుగా ఉన్న జీవితమే పూలతో ముస్తాబవుతుంది”

మానసికంగా , ఆర్థికంగా దెబ్బలు తిని , సామాజికంగా చితికిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి తనకు తాను ధైర్యం కూడదీసుకు

నేందుకు ఈ చరణం ఎంతగానో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది . రేపు వెలుగులు విరబూస్తాయనే ఆశతో , భరోసాతో ఈ రోజుటి చీకటిని భరించే శక్తిని ఇస్తుంది . శిశిరంలో ఆకులన్నీ రాలి మో డు వారిన వృక్షాలు వసంతం రాగానే కొత్త చిగుళ్ళు తొడిగినట్లు బ్రతుకు పోరులో ఓడి , సర్వం కోల్పోయిన మనిషిలో కొత్త ఆశలు చిగురింప చేయడానికి ఈ చరణం ఎంతగానో ఉపయోగపడుతుంది.

”  గాలిలా సాగిపోతేనే గమ్యము ఎదురవుతుందమ్మా ఏరులా పొంగి పోతేనే సాగరం  చేరువవునమ్మా”

కార్యదీక్ష అనేది ఈ దశలో చాలా అవసరమనీ, దూసుకుపోయే మనస్తత్వం మనిషికి అవకాశాలను చేరువ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ చరణంలో విశ్లేషిస్తున్నారు .

చరణం 2:  “మెత్తగా ఉంటే ఈ లోకం నెత్తిపై కాళ్లు పెడుతుంది . కత్తిలా ఉన్నవాడంటే గులామై కాళ్లు పడుతుంది”

సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్లు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లకుండా , తమ పనే దో తాము చేసుకుంటూ వెళుతూ ఉంటారు . వీళ్ళ మంచితనాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక కొందరు దాన్ని అసమర్ధతగా భావించి , వీళ్ళపై పెత్తనం చెలాయించాలని చూస్తూ ఉంటారు . ఎదురు తిరిగే వాళ్లకు లొంగి ఉంటారు.        అతి మంచితనం ఎల్లవేళలా సమర్థనీయం కాదనీ, పరిస్థితులను బట్టి , ఎదుటి వ్యక్తి ప్రవర్తనను బట్టి , ప్రతి మనిషి తన ప్రవర్తనని సరి చేసుకుంటూ ,అప్రమత్తంగా ఉండాలంటూ ఈ చరణంలో మనస్తత్వ విశ్లేషణ చేస్తున్నారు.

“విత్తనం నేలలో ఉంటే దానికి విలువే లేదమ్మా మొక్కల చీల్చుకొస్తేనే దానికి ఫలితం ఉందమ్మా”

మనిషి జీవితాన్ని శాసించేది విద్యార్థి దశ అని నా అభిప్రాయం . ఈ అక్షరాలను గోడపై స్పష్టంగా కనిపించేలా వ్రాసుకోవాలి. అవి ప్రతిక్షణం ఆ విద్యార్థిని కార్యోన్ముఖుడిని చేయడానికి ఉత్ప్రే రకంగా పనిచేస్తాయి . నిరంతర కృషి మనిషికి అనుకున్నది సాధించగలిగే శక్తిని ఇస్తుంది.

మనిషి మస్తిష్క పొరల్లో విజ్ఞాన భాండాగారం నిక్షిప్తమై ఉన్నప్పటికీ , అది బయట ప్రపంచానికి తెలియనప్పుడు ఆ వ్యక్తి సమాజంలో నిరాదరణకు , ధిక్కారానికి గురవుతూ ఉంటాడు . అందుకే ఎప్పటికప్పుడు తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి , తన స్థాయిని నిలుపుకోవడానికి , పదిల పరుచుకోవడానికి కార్యోన్ముఖుడై ఉండాలని ఈ పంక్తులు హెచ్చరిస్తున్నాయి.

చరణం 3 :  “పచ్చని తీగ పందిరికై వింతగా పరుగులు తీస్తుంది వెచ్చని పరువం జత కోసం అంతగా ముచ్చట పడుతుంది”

శైషవంలో తల్లి హృదయ స్పందన వింటూ తానొక భద్రతా వలయంలో ఉన్నానన్న భరోసాతో ఉంటుంది శిశువు . బాల్యం ఆటపాటలతో , కౌమా ర్యం ఒకింత గందరగోళంతో గడిచిపోతుంది.

ఇక యవ్వనంలోకి అడుగుపెట్టిన మనసు భాగస్వామ్యం కోసం ఉబలాటపడుతుంది.  అది సృష్టి ధర్మం . గర్భస్థ దశ నుండి చివరి వరకు సృష్టి క్రమంలో భాగాలైన ఈ దశలను ప్రకృతి సహజంగా  జరిగే మార్పులుగా భావించాలే తప్ప ఇందులో సిగ్గు , బిడియం అనే విషయాలకు తావుండకూడదంటూ విశ్లేషిస్తున్నారు.

“కుమిలిపోతున్న గుండెల్లో తేనెలు కురిపించాలమ్మా చీకటి కమ్మిన కళ్ళల్లో వెన్నెల చిలికించాలమ్మా”

ప్రతి మనిషి జీవితంలో కాకపోయినా,  చాలా జీవితాలను ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది.  ఏ సమస్యాలేని మనిషంటూ బహుశా ఎవ్వరూ ఉండకపోవచ్చు .సమస్యలతో సతమతమైపోయే వారికి (మన సమస్యలు మనను వేధిస్తూ ఉన్నప్పటికీ, వాటిని కాసేపు పక్కన పెట్టి ) మన వంతు బాధ్యతగా కాస్త ఓదార్పును అందించాలి . శూన్యమై పోయిన జీవితాలకు మన వంతు బాధ్యతగా కాస్త సాంత్వనను అందించాలి . మానవత్వం ఉన్న మనుషులుగా ప్రవర్తించ మంటూ హితబోధ చేస్తూ ఉన్నారు.

కష్టసుఖాలు , గెలుపు ఓటములు , లాభనష్టాలు అన్నీ మిళితమై ఉన్నదే మనిషి జీవితమనీ, ఇటువంటి జీవితంలో ఎదురయ్యే పలు సవాళ్లను ఎదుర్కోవడానికి మనిషి ఏ విధంగా సన్నద్ధుడై ఉండాలో , ఏ  సందర్భంలో ఏ రకంగా ప్రవర్తించాలో ఈ పాట చక్కగా వివరిస్తుంది . పాట ఆసాతం వ్యక్తిత్వ వికాసంతో కూడుకున్నదై ఉండటం ఈ పాటపై విశ్లేషణ రాయటానికి ఒక బలమైన కారణం.

ఇంత చక్కని పాటను రచించిన గీత రచయితకు , గానం చేసిన గాయనికి ,చక్కని హావభావవ్యక్తీకరణతో పాటకు జీవం పోసిన నటీనటులకు , తెరకెక్కించిన దర్శక నిర్మాతలకు అందరికీ పేరుపేరునా అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆత్మన్యూనత

మా సినిమా కథ