మీరు ముందు వాళ్ళు వెనుక

 (20-5-2023 తరుణి సంపాదకీయం)

 ఎవరెన్ని చెప్పినా కాలమైతే ఆగదు.ఈ ప్రవాహం లో బ్రతుకు నా పరుగెట్టాల్సిందే. ఈ తత్వం తెలిసీ మనదైన అభిజాత్యం తో ఎదుటి వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుంటాం.ఇదే మానవ ప్రకృతి అయికూర్చున్నది.

డ. కొండపల్లి నీహారిణి

ప్రకృతి ఒడిలో జీవించే ఎన్నో జీవరాశుల విషయాన్నే తీసుకుంటే, మనకు నూతనమైన భావాలు  ఉదయిస్తాయి.

  దాదాపు 3.5 బిలియన్ల ఏళ్ల పరిణామాన్ని పరిశీలిస్తే ఎన్నెన్నో జాతులు కనుమరుగై పోయాయి. దీనికి ప్రధాన కారణం పర్యావరణ కాలుష్యం. దీనితోనే కదా జీవవైధ్యం అనేది దెబ్బతింటున్నది. ఈ కారణం వల్లనే ఎన్నో జంతువులు, పక్షులు , వృక్ష జాతులు అంతరించిపోతూ మన శాస్త్రవేత్తల ముందు పెను సవాళ్లు గా నిలుస్తున్నాయి.

 దీనికి ప్రధాన కారణం మనుషులే అంటే కాస్త ఆశ్చర్యం కలుగకమానదు. ఈ క్రమంలో చూస్తే పిచ్చుకల పరిస్థితి మరీ దయనీయం. పిట్టలు  పోతున్నాయి,మెల్లి మెల్లిగా తగ్గిపోతున్నాయి.

  అడవులూ, నీటి నిలువలూ, నీటి జాలుల వంటి మానవావసరాలకు అవసరమైన ఈ ప్రకృతి సంపదలు నశింపజేసి ఇప్పుడు బాధపడుతున్నాము. ఏమున్నది విపరీతమైన రసాయనాల వాడకం, విపరీతమైన పెట్రోలు ఉత్పత్తుల వాడకం వాటి నుంచి వచ్చే చెడు గాలులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నవి.

ఈ కాలుష్యాన్ని మనుషుల జీవితంలోనూ చూస్తే కుటుంబాలు కూలిపోతున్న సందర్భాలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.

ఇళ్లల్లో కాలుష్యాలు ఎన్నో!మాట కాలుష్యం, మనసు కాలుష్యం ,భావ కాలుష్యం ఇవే కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఇక్కడ కూడా జీవవైవిద్యం దెబ్బతింటున్నదని చెప్పుకోవాల్సిందే. స్వల్ప కాలంలోనే విడిపోవడానికి మార్గాలు వెతుకుతున్నారు. దీనికి కారణం ఏమిటి అని ఎవరికి వాళ్లు ప్రశ్నించుకుంటే, ఏమంత భయంకరమైన ఉదాహరణలు కనిపించడం లేదు. చాలా చిన్నవిషయాలనే పెద్దగా చేసుకుంటూ గొడవలు సృష్టించుకుంటున్నారు. సృష్టి లోపల జీవరాశుల ఏకత్వం కోసం పర్యావరణ పరిరక్షకులు పాటుపడుతున్నారు. అదేవిధంగా ప్రకృతి హితంగా కుటుంబాల పర్యావరణ పరిరక్షణ కోసం యువతరం పాటుపడాలి. ముందుతరంవాళ్లు పెద్దవాళ్లు సహనాన్ని కోల్పోయినప్పుడు యువశక్తి రేపటితరం మనుగడ కోసం లేని ఓపికను తెచ్చుకోవాలి. దీనికి స్త్రీలే ముందుండాలి.

ఆర్థిక స్వాతంత్ర్యం లేని అత్తగార్ల పరిస్థితిని వాళ్లకు ఆర్థిక స్వాతంత్ర్యం లేదనీ అర్థం చేసుకోవాలి. వాళ్లు ఏమైనా అంటే కోపాన్ని పక్కనపెట్టి, వాళ్లు పడ్డ వేదన వలన ఇలా తయారయ్యారు అనే ఒక విశాల భావాన్ని తమది చేసుకొని కాస్త కొత్తగా ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది.

పెద్దరికానికి మరికొంచెం పెద్దరికం అద్ది, నోరును అదుపులో పెట్టుకొని, కోడళ్లను కూతుర్లలా చూస్తే కుటుంబాలు నిలుస్తాయి. లేకుంటే తరిగిపోతున్న పిచ్చుకల్లా మనుషులు అవుతారు. ఎందుకంటే పిల్లలను కనడం కష్టం అనే తరం రాబోతున్నది. భూమిపై జీవరాశులలో మనుషులూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త!!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

One Comment

Leave a Reply
  1. తరుణి పత్రిక సంపాదకీయాలు సంక్షిప్తంగా ఉంటూ విస్తృతమైన ఆలోచనలకు ప్రేరణగా ఉంటున్నాయి. ఎడిటర్ డాక్టర్ కొండపల్లి నీహారిణి మేడమ్ గారికి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పుట్టినిల్లు

అక్షయపాత్రగా అక్షరయాన్