మన మహిళా మణులు

శ్రీమతి తుమ్మల కృష్ణాబాయి

ఆమె కంఠం ఖంగుమని ఈతరానికి ఇచ్చే సందేశం , ఆచరణీయం.11.5.2023 న తెలుగు విశ్వవిద్యాలయం లో అక్షరయాన్ సన్మానం పొందిన మాతృమూర్తి ఆమె.

వీరి అసలుపేరు వెంకటసుబ్బమాంబ.మేనమామ కృష్ణా బాయిగా వీరి పేరు మార్చారు.తల్లిదండ్రులు వేమూరి లక్ష్మి కాంతమ్మ ,వెంకయ్య. ఆనాటి దివి తాలూకా లోని ఘంటసాల పాలెం లో పుట్టారు.1932లో పుట్టిన ఈమె మనకు తన అనుభవాలను ఇలా చెప్తున్నారు “గ్రాంఫోన్ రికార్డు లో పాటలు వింటూ అందులో మనుషులు ఎక్కడ దాగున్నారా అని వెతికే అమాయకత్వం నాది.”చల్ చల్ రే నౌ జవాన్ ఆజా ఆజా అని కూనిరాగాలు తీసే దాన్ని.బల్లఉయ్యాల ఊగటం మహా ఇష్టం.గౌనులు తొడిగే నేను సరాసరి చీర కట్టులో కి మారాను.నగలంటే చిరాకు.బత్తాకాయలు బదులు బస్తాకాయలు అనేదాన్ని.బెజవాడలో పిన్ని దగ్గర ఉండి బడికి వెళ్ళే దాన్ని.
నేను మర్చిపోలేని సంఘటన _రాముడు అనే ఎద్దు మా నాన్న తొడపై తలపెట్టి ప్రాణం వదలటం!మా అన్నయ్య బెజవాడలో జైజై అరుణ పతాకం అని పాడుతూ తిరగడంతో నాపై కమ్యూనిస్టు పార్టీ ప్రభావం పడింది.చేతిగాజులు విరాళంగా ఇచ్చాను.1944లోఅఖిలభారతరైతు మహాసభలో సర్వశ్రీచండ్ర రాజేశ్వరరావు పుచ్చలపల్లి మొదలైన పెద్దల ప్రభావం నాపై పడింది.
నేటి బిషప్ అజరయ్యహైస్కూల్ ని ఆరోజు ల్లోడోర్నకల్ డయోసిసన్ హైస్కూల్ గా పిలిచేవారు.హెచ్.ఎం.మిస్.థామస్ ఖరోడా అంటే హడల్ మాకు.మిస్.కురువిల్లా జాగ్రఫీటీచర్ బాగా గుర్తు కొస్తారు.నాకు మాపిన్నికూతురుకి మాఅమ్మ చెవిలో లాకులు పెడితే అవి వద్దు సింపుల్ గా ఉంచాలి పిల్లలని అనేవారు చండ్ర రాజేశ్వరరావు గారు.డాక్టర్ అచ్చమాంబ ఆప్యాయంగా పలకరించేవారు.నేను నాటకాలు వేసే దాన్ని.అబ్బాస్ తీసిన ధర్తీకెలాల్ నాపై ప్రభావం చూపింది.బెంగాల్ కరువు కంటికి కట్టేలా తీసిన సినిమా ఇది.

ఘంటసాల హైస్కూల్ లో ఫిఫ్త్ ఫారం కోఎడ్యుకేషన్ చదువు.లాంగ్వేజెస్ లో నేనే ఎప్పుడూ ఫస్ట్.ఎసెల్సీ లో ఉండగా మా మేనత్త కొడుకు వేణు తో పెళ్ళి ఆపైమద్రాస్ స్టెల్లామేరీస్ లో ఇంటర్ లో చేరి అనారోగ్యం వల్ల చదువు కి టాటా చెప్పాను.నాభర్త ఇంజనీర్.కాకినాడ విశాఖ లో సంసారం చల్లగా సాగింది.మా పిల్లల చేష్టలు అన్నీ డైరీలో రాశాను.అవి ఇంకా ఉన్నాయి.మావారు అమెరికా వెళ్లడంతో కాజీపేట లో మా అమ్మ నాన్న లతో ఉండి స్కూల్ టీచర్ గా చేశాను.నాభర్త స్వదేశానికి తిరిగి వచ్చాక రాచకొండ పురిపండా మొదలైన రచయితలతో పరిచయం కలిగింది.నేను ఫిలిం అప్రిషియేషన్ కోర్సు చేశాను.ఎన్నో గొప్ప సినిమాలు చూసే అవకాశం కలిగింది.నాభర్త శరీరాన్ని విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ కి ఆయన అంతిమ కోరిక గా అప్పగించాను.నా 80వ ఏట4జులై 2013లోసాహిత్య సమాలోచనలో నా అనుభవాలు విపులంగా రాశాను.”అన్నారు . ఈ గ్రంథం లో వీరి 60 ఏళ్ళ జీవన ప్రస్థానం లోని అనుభవాలు, జ్ఞాపకాలు వ్యాసాలు గా రాసినవి నవతరానికి మార్గదర్శకంగా ఉన్నాయి. తమ జీవితాంతం కులమత రహిత సమాజం కోసం పాటుపడుతూ, ఆర్ధిక అసమానతలను ప్రశ్నిస్తూ, లింగవివక్షతని తూలనాడుతూ, తన రచనల ద్వారానే కాక ఆచరణ ద్వారా తన భావాలను, సిథ్థాంతాలనూ పరిపుష్టం చేసుకుంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ మహిళ తన తరాన్నే కాక ముందు తరాలను కూడా ఎంతగానో ఉత్తేజపరుస్తుంది. ఎక్కడ మంచి రచన కనిపించినా, వెంటనే ఆ రచయితకి తన మెచ్చుకోలు వినిపించి ప్రోత్సహిస్తుంది. అందుకే ఆమె హితులకి, సన్నిహితులకి వయోపరిమితులు లేవు. ఎలాంటి ఎల్లలూ లేవు. విరసంలో కూడా ఆమె ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.

ఈవయసులో కూడా చాలా యాక్టివ్ గా తన అనుభవాలను పంచుకున్న కృష్ణాబాయి గారు నిండు నూరేళ్ళు చల్లగా హాయిగా గడపాలని ఆశిద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మండోదరి

తరాలు అంతరాలు