తరగతి గదిలో

కథ

లక్ష్మి మదన్

అరుణకు బడి అంటే చాలా ఇష్టం … తన పుట్టి పెరిగింది అదే ఊర్లో అందుకే ఊరంటే కూడా చాలా ఇష్టం… సెలవులు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరూ వారి సొంత ఊర్లకు వెళ్లే వా రు..కానీ అరుణకు మాత్రంఏ ఊరికి వెళ్లాలని ఏమాత్రం అనిపించేది కాదు.. ఇంట్లో ఏదో ఒక పని చేసుకోవడమో ,లేదా పెరట్లో మొక్కలు దగ్గర కాలక్షేపం చేయడము.. లేదా చుట్టుపక్కన ఉన్న స్నేహితుల ఇళ్లకు వెళ్లడం దిన చర్య గా ఉండేది.

అయినా ఇళ్లల్లో అప్పుడు కాలక్షేపానికి ఆటలు తక్కువా? ఓన గుంటలు.. చింత గింజలు కుప్పలుగా పోసి ఆడే ఆట ,కాంటాలతో ఆడే ఆట, విరిగిపోయిన గాజు ముక్కలతో ఆడుకునే ఆట, పచ్చీసు ,అష్ట చమ్మ, కచ్చకాయలు ఇలా ఒకటేమిటి నీడ పట్టున ఆడుకునే ఆటలు ఎన్నో ఎన్నెన్నో…

ఎటు తోచకుంటే సాయంత్రాలు చెరువు వైపు వెళ్లి స్నేహితులతో ముచ్చటించుకోవడము ఆ గట్టు మీద కూర్చొని చల్లని గాలి పీల్చుకుంటూ సాయంత్రాలని గడపడము ఇలా ఎంతో బాగుండేది.

అరుణ, దేవి ,ఉష వీళ్ళ ముగ్గురి ఇళ్ళు దగ్గరగా ఉండేవి… రోజు బడికి ముగ్గురు కలిసి వెళ్లేవాళ్లు.

ముందుగా దేవి ,ఉష అరుణ ఇంటికి వచ్చేవాళ్ళు… ఎప్పుడూ అరుణకు కొంచెం ఆలస్యం అయ్యేది ఎందుకంటే ఇంట్లో మడి ఆచారం ఉన్న నాయనమ్మ… వచ్చే బంధువులు ..చదువుల కోసం వచ్చిన పిల్లలు.. వ్యవసాయం పనులు ఇలా ఇల్లంతా హడావుడిగా ఉండేది…

దేవి ,ఉష ఇద్దరూ వాకిట్లో నిలబడి..

“అరుణా! ఓ అరుణా! ఇంకా తయారైనవా లేదా ఇవాళ లేట్ అయితే కనుక మన ఇంగ్లీష్ సారు మహా ముక్కోపి బడితే పూజ చేస్తాడు” అని అన్నారు.

” ఆగండి వస్తున్నా మా నాయనమ్మ తొందరగా నాకు అన్నం పెట్టడం లేదు ఏమన్నా అంటే దేవుడు నైవేద్యం అంటుంది అమ్మకేమో బయట పనులతోనే తీరిక ఉండదు రెండు నిమిషాల్లో వచ్చేస్తా” అని గబ గబా పుస్తకాలు చేతిలో అందుకొని బయటకు వచ్చింది.

ముగ్గురు లంగా జాకెట్లు వేసుకొని ముచ్చటగా ఉన్నారు.. అలా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు.

“నడవండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది” అని వెనక నుండి వచ్చే వాళ్ళ తెలుగు సారు చెప్పారు.

” సరే సార్” అంటూ నడక వేగం పెంచారు… దారిలో పోలీస్ స్టేషన్ కూడా వచ్చేది.. వీళ్ళు రోజు ముచ్చటగా స్కూల్ కి వెళ్తుంటే వాళ్ళు చక్కగా పలకరించేవాళ్ళు..

“ఏంటి పిల్లలూ! ఇవాళ ఆలస్యమైందా?” అని అడిగాడు పోలీసు వెంకటస్వామి… “అవును సార్ లేట్ అయింది” అని చిన్న నవ్వు నవ్వి పరుగు పెట్టారు ముగ్గురు.

ఇంటి నుండి స్కూలుకు చాలా దూరమే మరి అయినా కూడా ప్రార్థన సమయానికి అందుకున్నారు.

ప్రార్థన గీతం ఆలపించి తరగతి గదిలోకి వెళ్లారు ముగ్గురు పిల్లలు. వారి వారి బెంచీల మీద కూర్చున్నారు. ఈమధ్య బెంచ్ డ్రాలో చేయి పెట్టాలంటే భయంగా ఉంది అరుణకు… మొన్నటికి మొన్న ఒక రోజు చేయి పెట్టగానే ఒక గులాబీ పువ్వు దొరికింది గులాబీ పువ్వు కదా అని చేతిలోకి తీసుకున్నది ..పువ్వు కాడకి ఒక చిన్న పేపర్ చుట్టి ఉంది “ఏంటా పేపర్” అని కుతూహలంగా తెరిచి చూసింది చూస్తే ఎవరో పోకిరి రాసిన ప్రేమ లేఖ.. ఒక్కసారి ఒళ్ళు భయంతో కనిపించింది అరుణకి…

” ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా! చదువు ఆపేసి ఇంట్లో కూర్చోబెడతారు అసలే నాన్నకి చదవంటే ఇష్టం.. ఇలాంటివి తన తప్పేమీ లేకున్నా కూడా పెద్దవాళ్లలో భయం ఉంటుంది కదా! అందుకే ఆ ఉత్తరాన్ని చేతితో నలిపేసి పడేసింది అరుణ. అదేంటో చూసిన దేవి మరియు ఉష అడిగారు.

” ఏంటే అది ఉత్తరమా? ఎవరు రాశారు ?”అని ప్రశ్నల పరంపర కురిపించారు.

“ఎవరో సోదిగాళ్లులే !నేను చదవని కూడా చదవలేదు చింపి పడేసాను అయినా ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు” అని చెప్పింది అరుణ ..కానీ !మనసులో భయం భయంగానే ఉంది.

ఆ రోజు కూడా బుక్స్ పెట్టుకోవడానికి డ్రాలో మెల్లిగా చేతులు పెట్టింది అరుణ. అంతే.  మళ్ళీ చేతికి గులాబీ పువ్వు తగిలింది.. పామును తాకినంత భయం వేసింది అరుణకి… వణుకుతున్న చేతులతో మెల్లిగా ఆ పువ్వు చేతిలోకి తీసుకుంది ఈసారి ఎవరూ చూడకుండా జాగ్రత్త పడింది. ఒక పుస్తకంలో పెట్టేసుకుంది… ఏముందో అనే కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అలాగే ఇక్కడ కుతూహలం తో పాటు భయం కూడా ఉంది ఇలాంటివి తెలియని ఒక మామూలు ఆడపిల్లకి ఇది ఒక పరీక్ష నే కదా!

మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లడమే అలవాటు ఆ రోజుల్లో.. లంచ్ బాక్స్ ఎవరూ తెచ్చుకునే వాళ్ళు కాదు.. మళ్ళీ పరుగు స్టార్ట్ చేశారు ముగ్గురు ఫ్రెండ్స్…

ఇంటికి వెళ్ళగానే అరుణ పుస్తకాలు టేబుల్ మీద పెట్టేసి కాళ్లు కడుక్కోవడానికి పెరట్లోకి వెళ్ళింది మెల్లిగా వణుకుతున్న చేతులతో గులాబీ పువ్వుకున్న ఉత్తరాన్ని విప్పింది… అదే చెత్త రాత..

” నువ్వంటే ఇష్టమని నిన్ను ప్రేమిస్తున్నానని” అందులో ఉన్నది ఇదే.

ఉత్తరాన్ని చింపి పడేసి భోజనం కోసం లోపలికి వచ్చింది అరుణ. అప్పటికే అమ్మ కంచంలో అన్నం వడ్డించి పెట్టింది. ఒక పక్క మనసు బాగా లేకపోవడం వల్ల తినాలని అనిపించలేదు.. అప్పట్లో ఇలాంటివి ఎవరికైనా చెప్పుకునే అవకాశం కూడా ఉండేది కాదు ,దాన్ని ఏ విధంగా చూస్తారో అర్థం కాని పరిస్థితి.. అసలే అరుణకు చదవంటే ఇష్టం ..చదువు ఎక్కడ మధ్యలో ఆగిపోతుందో అనే భయం కూడా లేకపోలేదు.

ఏదో తిన్నానని అనిపించి బయటకు వచ్చింది,.వీధి చివరి నుండి దేవి ..ఉషా వస్తూ కనిపించారు… మళ్లీ బయలుదేరారు. ఈసారి పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ వెంకటస్వామి “పిల్లలూ! స్టేషన్లోఎవరూ లేరమ్మ! నాకు అగ్గిపెట్టె కావాలి కొంచెం తెచ్చి పెట్టారా!” అని అడిగాడు. అసలే చిరాకులో ఉన్న అరుణకి మళ్లీ ఇదొక సోదా అనిపించింది. కానీ ఏమనుకుంటాడో అని “సరే “అని అతని దగ్గర డబ్బులు తీసుకుని ఆ పక్కనే ఉన్న షాపులో కొనుక్కొచ్చి ఇచ్చి మళ్ళీ బయలుదేరారు.

బడికి వెళ్లినా ఈ ఆలోచనలు పోవడం లేదు…

ఇలా వరుసగా మూడు రోజులు జరిగింది. తర్వాత నాలుగవ రోజు స్కూలుకు వెళ్ళింది ఆనాడు సోమవారం ముందు రోజు ఆదివారం సెలవు కదా.

వెళ్ళగానే మళ్లీ భయంగా లోపల చేయి పెట్టింది ఈసారి ఒక పేపర్ పొట్లం దొరికింది. ఆ పొట్లం పట్టుకోగానే మిర్చి బజ్జి వాసన రాసాగింది… “ఏముంది ఈ పొట్లంలో”అనుకొని అనుకొని పక్కనే ఉన్న దేవికి చూపించింది .

“దేవీ! చూడవే ఇందులో ఏముందో ఏదో వాసన వస్తుంది” అని చెప్పింది.

” విప్పి చూడు ఏముందో తెలుస్తుంది” అన్నది దేవి..

మెల్లిగా పొట్లం తెరిచింది అరుణ…

పొట్లం తెరువుగానే ఒకపక్క నవ్వు ఒక పక్క కోపం రాసాగింది.

“ఏముంది అందులో చూపించవు” అని అడిగింది దేవి.

” ఆ! చూడు కళ్లప్ప దించి చూడు ఏముందో” దేవి ముందు ఉంచింది అరుణ.
అందులో మిర్చి బజ్జి తిని ఎవరో ఉత్త తొడిమలు ఉంచారు.

దేవి కూడా నవ్వ సాగింది ఆ పక్కనే ఉన్న ఉషకు చెప్తే ఉష కూడా నవ్వ సాగింది…

మొదటి పీరియడ్లో ఇంగ్లీష్ సారు యమ స్ట్రిక్ట్…నవ్వు వచ్చినా అలాగే బిగబట్టుకొని క్లాస్ వింటూ కూర్చున్నారు ముగ్గురు.

కానీ నవ్వాపు పోవడం మాత్రం చాలా కష్టంగా ఉంది అలా నవ్వుతూనే ఉన్నారు మొహాలకి పుస్తకం అడ్డం పెట్టుకొని..

ఇంగ్లీష్ పీరియడ్ అయిపోయింది.. తరువాత తెలుగు పీరియడ్ ..తెలుగు సార్ అంటే కొంచెం చనువు. ఆయనంటే కూడా భయం ఉన్నా.. మరీ ఇంగ్లీష్ సార్ అన్నంత భయం కాదు. ఇంగ్లీష్ సార్ వెళ్లిపోయిన తర్వాత తెలుగు సార్ వచ్చారు… సార్ రాగానే మాత్రం ఇంక గట్టిగా నవ్వే సారు వీళ్ళు ముగ్గురు…

” ఎందుకు నవ్వుతున్నారమ్మా మాకు చెప్తే మేము కూడా నవ్వుతాం కదా” అన్నాడు తెలుగు సారు.

అప్పుడు ఉన్న విషయం చెప్పారు. క్లాస్ అందరూ కూడా నవ్వసాగారు. అప్పుడు తెలుగు సార్ ప్యూన్ ని పిలిచి ఆ పొట్లాన్ని తీసేయించారు… క్లాసులో అలా జరిగింది.

ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చాక ఈ విషయము ఇంట్లో చెప్పింది అరుణ… అప్పుడే అక్కడికి వచ్చిన అరుణ అన్నయ్య…

” అవునా పొట్లం మీ డెస్క్ లో ఉందా మీ క్లాస్ ఎక్కడ అసలు”? అని అడిగాడు.

చెప్పింది అరుణ వాళ్ళ క్లాస్ ఎక్కడ ఉందో…

“ఆఫీస్ రూం పక్కనే అన్నా” అని..

ఇక వాళ్ళ అన్నయ్య నవ్వడం సాగించాడు.. ఎంతకూ నవ్వాపడు..

” ఏంటో చెప్పన్నా ఎందుకు నవ్వుతున్నావు?” చిరాకు పడింది అరుణ.

అలా పొట్ట చేత్తో పట్టుకొని నవ్వి నవ్వి.. “స్కూల్లో మేము ఆదివారాలు వాలీబాల్ ఆడుకుంటాము.. అట్లా మొన్న మ్యాచ్ అయితే ఆడుకోవడానికి వెళ్ళాము ఆ బ్రేక్లో మా ఫ్రెండ్స్ మిర్చి తెస్తే కూర్చొని తిని ఆ పొట్లం డ్రాలో పెట్టేసాము వెళ్లేటప్పుడు పడేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాము.. అది పోయి నీకే వచ్చిందా .. అది నీ తరగతా”అని నవ్వుతూనే ఉన్నాడు.

అరుణకు బోలెడు కోపం వచ్చింది… వాళ్ళ అన్న వెనకాల కొట్టడానికి బయలుదేరింది అన్న పరిగెత్తడం చెల్లెలు కొట్టాలని చూడడం ఇలా ఆ సాయంత్రం సంతోషంగా గడిచింది…

ఇది చూస్తున్న అమ్మ ” ఎప్పుడూ కొట్లాటలేనా! “అని అంటున్నా..వీళ్ళ పరుగు ఆగ లేదు.

అరుణ డెస్క్ లో ఎవరో పెడుతున్న ఉత్తరాల సంగతి మరిచిపోయి ఈ మిర్చిల పొట్లంతో బాగా నవ్వుకుని మామూలుగా అయ్యింది.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆత్మీయ మినీ కవిత

నమస్కారం చక్కటి సంస్కారం