అన్ని రోజులూ అమ్మవే

13-5-2023 శనివారం తరుణి సంపాదకీయం

డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి సంపాదకురాలు

ఈ సృష్టి ఇంత విచిత్రమైంది అంటే, సృష్టికే సృష్టి అయినటువంటి తల్లి స్థానాన్ని పదిలపరుచుకోవడానికి తనదైన అస్తిత్వాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా కన్నతల్లి స్థానం అత్యుత్తమమైందని ఎందుకంటారు? ఎందుకంటే నువ్వు,నేను ,అతడు ,ఆమె వారు ,వీళ్లు ,వాళ్ళు అనే ఈ సర్వ నామాలు , మనకంటూ పిలువుచుకోవడానికి పెట్టుకున్న పేర్లు, ఈ నామవాచకాలు అన్ని కూడా అమ్మ జన్మనిచ్చినందుకే !నువ్వుగా నిలబడినందుకే !నిన్ను నవమాసాలు మోసి కని నిన్ను నిలబెట్టినందుకే! ఇదే ఓ పెద్ద కారణం. నీ ఒంట్లో రక్తం ప్రవహించిన ప్రతిసారీ, నీ గుండె లబ్ డబ్ అని కొట్టుకున్న ప్రతిసారి అమ్మ పేగు బంధం తో ముడిబడి ఉన్నదన్నది మరవకూడదు అని ఒకసారి మళ్ళీ గుర్తు చేయడానికి నిలబడ్డదే ‘మాతృ దినోత్సవం ‘ !!
కడుపులో పడ్డ క్షణం నుంచి తన శరీరంలో వచ్చే మార్పులకు పొంగిపోతూ తన చేతుల్లో నిన్ను లాలించాలని తపనపడిన అమ్మ కు సాటి మరి ఎవరు లేదని చెప్పడానికి ఆమె అనుభూతి చెందిన ఆ ఒక్క క్షణం చాలు! అమ్మ చేతిలో నువ్వు పడ్డప్పుడు నీ పుట్టుకతో పాటు ఆమె కూడా మళ్లీ పుడుతుంది. ఇది సత్యం బిడ్డకు కాన్పునివ్వడం అనేది జీవన్మరణ సమస్య అని తెలిసి తనుగా కోరుకుని మరి కంటుంది .ఇది చాలదూ ఆజన్మాంతం రుణపడి ఉండడానికి. అమ్మ మరణం వరకు ఆమె వెంట ఉండడానికి.
సరే అమ్మకంటుంది పెంచుతుంది తనతోనే ఉండమని కోరుకోదు. నీదైన అభివృద్ధి కొరకు, నువ్వు చదువుకోవాలని వేరే ఊరికి పంపించినా ఉద్యోగం కొరకు ఎక్కడున్నా, పెళ్ళంటూ చేసి ఇంకో అమ్మ చేతిలో పెట్టినా, ఇంకో అయ్య చేతిలో పెట్టినా అంతా నీ జీవిత సాఫల్యం కోసమే ఆమె తపన! ఇది చాలదు అమ్మను ఒక్కనాటికీ మరవకుండా ఉండడానికి!
ఎప్పటికీ అమ్మ వెంటనే ఉండాలి అని ఎవరు కోరుకోవడం లేదు. కానీ అమ్మని మరవకూడదు అని కోరుకుంటున్నారు. అంతే ఈ చిన్న గీత వంటి ఒక లైన్, ఒక స్లాష్ ,ఇన్వర్టర్ కామాస్ లో పెట్టుకుని గుర్తు చేసుకోవాల్సినటువంటివి.
మాతృ దినోత్సవం అనే ఒక దినోత్సవం అనేది అమెరికాలో ప్రారంభమైంది 1914 మే 9 న. ఫ్రెండ్స్ దేశంలో 19వ శతాబ్దం నుంచి ,1918 నుండి జరుపుకుంటున్నారు. జపనీలు మార్చు నెలలో జరుపుకుంటూ ఉంటారు, యూకే లో ఒకరోజు మదర్ రింగ్ సండే ను జరుపుకుంటుంటారు. ఇలా కో దేశం ఒకో విధంగా అమ్మ కోసం జరుపుకోవడం అనేది మనం చూస్తున్నాం. మన భారతదేశం లో అమ్మను ఆదిదేవతగా కొలవడం దాదాపు అన్ని కులాలలో మతాలలోనూ అనాదిగా ఉన్నటువంటి విశేషమైనటువంటి విషయం. అయితే ఈ ఆధునిక కాలంలో, ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలకి ఏ ఒక్క చిన్న విషయం కొత్తగానో మంచి గానో అనిపించగానే దాన్ని పాటించాలి అని అనుకుంటుంటారు .అందుకే ప్రపంచమంతా ఒక ఇల్లు అయినట్టుగా ఉన్నటువంటి ఈ సమయంలో ‘మదర్స్ డే ‘అనే పేరుతో మే నెలలో రెండవ ఆదివారాన్ని పండుగ గా జరుపుకోవాలని నిర్ణయానికి మనమూ వచ్చాం. మంచి ఎక్కడున్నా ఆదరించడంలో తప్పులేదుగా!!

కానీ, అన్ని రోజులు అమ్మవే కదా ఒక్క ప్రత్యేకమైన రోజు ఎందుకు అని ఒక ప్రశ్న తప్పకుండా ఉదయిస్తుంది. కానీ అన్ని రోజులు అమ్మవే అయినా కానీ, మన పుట్టిన రోజును జరుపుకున్న విధానం లా అమ్మ కోసమని ఒక ప్రత్యేకమైన రోజున కేటాయించడం అవసరమే అనిపిస్తుంది ఈ తరాన్ని చూస్తుంటే.

అమ్మలకు విశ్రాంతి అనేది ఉండదు.సరే కనడం, పెంచడం వంటి బాధ్యతలు చాలా సహజంగా జరిగిపోతుంటాయి. పెరిగి పెద్దవాళ్ళయ్యి ఏదో గుర్తింపు తీసుకురావాలి అనుకోని కనిపెంచరు తల్లిదండ్రులు. భార్యాభర్తల అనురాగానికి చిహ్నమైన సంతానంగా పిల్లలు పెరుగుతూ ఉంటారు ప్రేమ ఆప్యాయతలతో!!

కానీ, ఎక్కడో ఆకాశం నుండి ఏదో ప్రాణాపాయ స్థితి తనకు బిడ్డలకు రాబోతుందని గమనించి ఆ డేగ కన్నుకు దక్కనివ్వకుండా తన రెక్కల చాటున పిల్లల్ని పొదువుకుని రక్షించే తల్లి కోడి అమ్మ అని తెలుసుకుంటే చాలు. తను తిన్నా తినకపోయినా పిల్లల కడుపు చూసే తల్లి,
తన కూతురుకో, కొడుకుకో పెళ్లి చేసి పంపించినా, వాళ్ళు పిల్లల్ని కని పెంచుతుండే క్రమంలో కూడా అమ్మమ్మగానో నానమ్మగానో అనుక్షణం వాళ్ళ కోసం తపిస్తూనే ఉంటుంది.
ఎందరో పిల్లలు వాళ్ళ అమ్మ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు. అమ్మ అంటే ప్రాణం పెట్టేవాళ్ళూ ఉన్నారు. తల్లిదండ్రులను ప్రేమగా గౌరవంగా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు .ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా మంచి చెడు చాలా సహజంగా కనిపిస్తూ ఉంటాయి బొమ్మ మంచిదా బొరుసు మంచిదా అనే వితండవాదం పక్కనపెట్టి,ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ తో ఆలోచన చేయాలి.ఎప్పుడైనా చెడుని విస్మరించాలి . మంచిని గ్రహించాలి . కాసింత అనురాగం, కాసింత ఆదరణ ఇవి చాలు తల్లిదండ్రులకు అనే సత్యాన్ని గ్రహిస్తే, ఈ సత్యమే నువ్వు అమ్మవో నాన్నవో అయినా, నానమ్మవో తాతయ్యవో అమ్మమ్మవో తాతయ్యవో అయినా ఈ సత్యమే నీ వెంట వస్తుంది అని గ్రహిస్తే చాలు.ఈ ‘అమ్మల రోజు’ మన అందరి రోజు కావాలి ‘అన్ని రోజులు అమ్మవే కావాలి’ సెలవు!!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అందమైన కళా

ఎర్రరంగు బురద