చలికాలం. తెల్లవారి పొద్దు సగం సగం వెలుతురులో కళ్ళు నలుపుకుంటూ ఇంటేనకకు పోతుంటే పందిరి కింద చల్లగుంజకు నిలువెత్తు చల్లకవ్వం కట్టి వెన్న తీస్తూ ఉన్న నానమ్మ నన్ను చూస్తూనే “మొకం కడుక్కుని రా. చాయ తాగి రొట్టె తిందువు” అంటుంది.
నల్లటి బొగ్గుతో పళ్ళు తెల్లగా తోమేసి, మొహం కడుక్కుని వస్తూ నడిమాకిలి నుండి తూర్పు వైపు చూస్తే
అప్పుడప్పుడే పచ్చటి సాంపి (కల్లాపి) చల్లిన మట్టి వాకిలిలో తెల్లతెల్లని ముగ్గు, ఎదురుగా గుట్టలు చెట్ల మాటున దాగిదాగని ఎర్రటి సూర్యుడు చలి మంచు చీల్చుతూ..
ఇటుగా వచ్చి నానమ్మ పక్కన అరుగు మీద కూర్చోగానే వేడివేడి పసిడిపచ్చని జొన్న రొట్టెబిళ్ళ పొగలు కక్కుతూ నా అరచేతిలో
దాని మీద అక్కడక్కడ నీటి బిందువులు జారుతూ అప్పుడే మజ్జిగలో నుండి తీసి కడిగిన వెన్నముద్ద ధవళకాంతితో మెరుస్తూ. రొట్టె వేడికి కరుగుతూ చిన్న మామిడికాయ ముక్కని ముంచేస్తుంటే..
ఆ ముగ్గేసిన సూర్యోదయపు వాకిట్లోని ప్రకృతి చిత్రపు రంగులన్నీ ఇక్కడ నా అరచేతిలో ఇమిడిపోతుంటే..
ఒక రొట్టె ముక్క సుతారంగా తుంచి వెన్న కలిసిన మామిడికాయతొక్కు కారంలో ముంచి
నోట్లో వేసుకుంటే…అది కదా ఎంతో రుచికర ఉదయం.