ముళ్ళ పొదలో గులాబి

కథ

తాటికోల పద్మావతి

కోర్టు హాలంతా నిశ్శబ్దంగా ఉంది. బోనులో ముద్దాయి లక్ష్మి నిలబడి ఉంది. జడ్జి గారు ఆమెకి ఎలాంటి శిక్ష విధిస్తారోనని అందరూ ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.
లక్ష్మి ని కాపాడేందుకు ఎవరూ ముందుకు రారు.
చందూలాల్ అనే వ్యక్తిని ఆమె రాత్రి నిర్ధాక్షిణ్యంగా హత్య చేసింది. తెల్లవారేసరికల్లా పోలీసులు మీడియా వాళ్ళు ఆమె ఇంటి ముందు గుమిగూడారు. ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కూడా ఈ విషయం అప్పటిదాకా తెలియలేదు.
హత్య చేసిన తర్వాత లక్ష్మీ లో భయం మొదలైంది. పోలీసులకు తెలిస్తే తనని వదిలిపెట్టరు.. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదనుకొని చేతికి అందినంత డబ్బు పర్సులో పెట్టుకుని ఎవరూ చూడకుండా తలుపులు తీసుకుని బయటికి వచ్చింది.
గేటు కి తాళం వేసి ఉండడంతో ఒక్క క్షణం అక్కడే నిలబడింది. అప్పుడే వాచ్ మెన్ నాగరాజు లేచాడు. తాళం తీస్తూ ఆమె వంక అనుమానంగా చూశాడు.
ఆ లైట్ వెలుతురులోనే ఆమె చీర మీద అక్కడక్కడ రక్తం మరకలు కనిపించాయి. నాలుగు రోజుల నుంచి ఆమె ఇంట్లోంచి పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తున్నాయి.
అమ్మగారు! ఈ టైములో ఎక్కడికి బయలుదేరారు అనుమానంగా అడిగాడు నాగరాజు.
మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది త్వరగా వెళ్లాలని బయలుదేరాను అన్నది లక్ష్మి.
నాగరాజుకి నమ్మబుద్ధి కాలేదు! మనకెందుకులే ఈ విషయాలన్నీ అనుకొని గేటుకి తాళం తీశాడు.
లక్ష్మి గబగబా బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయింది.
ఆ ఉదయం 10 గంటలకల్లా అందరికీ చందూలాల్ హత్య విషయం తెలిసిపోయింది. పనివాళ్ళు పాలవాళ్ళు రావడంతో విషయం బయటకు పొక్కింది. నాగరాజు లోపలికి వెళ్లి చూసేసరికల్లా చందులాల్ రక్తపు మడుగులో నేల మీద పడి ఉన్నాడు. అందరినీ పిలిచి పోలీసులకు ఫోన్ చేశారు.
లక్ష్మి నాలుగేళ్లుగా అదే అపార్ట మెంటు లో ఒక్కతే ఉంటున్నది. పిల్లా జెల్ల ఎవరూ లేరు. అప్పుడప్పుడు చందులాల్ కాక ఇంకా ఎవరెవరో వస్తూ పోతూ ఉంటారు.
లక్ష్మీ తెల్లగా అందంగా ఉంటుంది. ఆమె వయసు 40 ఉంటాయి సుమారు. పొదిగిన అంగ సౌష్టవం, నల్లటి కాటుక కళ్ళు. చూసేవాళ్ళకి అందంగా కనిపిస్తుంది. అలాంటి లక్ష్మి హత్య చేసిందంటే ఎవరికి నమ్మబుద్ధి కావడం లేదు.
“చందూలాల్ని పోస్టుమార్టంకి తీసుకొని వెళ్లారు. పోలీసు బలగాలు లక్ష్మీ కోసం అంతా గాలిస్తున్నాయి. అన్ని రైల్వే స్టేషన్లకు, బస్సు స్టేషన్లకు, కంట్రోల్ రూమ్ లకు ఫోన్ కాల్స్ పంపించారు.
అప్పటికే లక్ష్మీ మద్రాసు రైలు ఎక్కేసింది. గుండెల్లో భయం చోటుచేసుకుంది. ఎప్పుడు ఎవరు తన కోసం వస్తారో నని బిక్కుబిక్కుమంటూ కూర్చుంది.
మైసూర్ స్టేషన్లో దిగగానే పోలీసులు ఆమెని గుర్తుపట్టి అరెస్టు చేశారు.
చందులాల్ గొప్ప పారిశ్రామికవేత్త! సినీ పరిశ్రమలో మంచి పేరుంది. ఇటు బిజినెస్ లోను అటు ప్రొడ్యూసర్ గాను కోట్లు గడించాడు.
హైదరాబాదులో, గుంటూరు, మద్రాసులో చాలా ఆస్తులు కొని పడేశాడు. రోజుకొక కారు మారుస్తుంటాడు. 60 ఏళ్లు నిండిన 45 ఏళ్ల వాడిలా కనిపిస్తాడు. అలాంటి చలాకీ వ్యక్తిని హత్య చేశారంటే నమ్మశక్యం కావడం లేదు ఎవరికి.
“అసలు లక్ష్మికి చందూలాల్ కి ఉన్న పరిచయం ఏమిటి?
“ఆమెకి అతని హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది”
ఏమో డబ్బు కోసం చేసి ఉండవచ్చు. కొందరి అనుమానం. ఆమెకి ఈయనతో ఎలాంటి సంబంధం ఉందో మరికొందరి ఆలోచన.
లక్ష్మిని తీసుకొచ్చి పోలీసులు కోర్టులో అప్పగించారు.
,”జడ్జి గారు రావడంతో అంతా లేచి నిలబడ్డారు. ఆయన కుర్చీలో కూర్చుంటూ ఒకసారి అందరి వంక చూశారు.
చందూలాల్ తరఫున డిఫెన్స్ లాయర్ గారు లేచి కొన్ని కాగితాలు జడ్జి గారి ముందర పెట్టారు.
‘వాటిని పరిశీలించిన జడ్జి గారు ప్రొసీడ్ అనగానే లాయర్ గారు బోనులో ఉన్న లక్ష్మీ దగ్గరకు వచ్చి భగవద్గీత మీద ప్రమాణం చేయించారు.
లక్ష్మీ కళ్ళ నుంచి ఉబికి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసింది.
“చందూలాల్ని హత్య చేసింది నువ్వేనా! డిఫెన్స్ లాయర్ గారి ప్రశ్న.
అవును నేనే ఈ హత్య చేశానంటూ నిర్భయంగా చెప్పింది లక్ష్మి.
‘ఆమె సమాధానానికి జడ్జి గారితో పాటు హాలంతా విస్తుపోయారు.
” చందులాల్ని హత్య చేయాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది. లక్ష్మి మౌనంగా తలవంచుకొని నిలబడింది.
చెప్పమ్మా అలా మౌనంగా ఉంటే సరిపోదు అన్నారు జడ్జి గారు.
అలా ఎందుకు చెబుతుందండి. ఆమె మామూలు ఆడది కాదు. బాగా డబ్బున్న వాళ్ళని చూసి వలవేసి పడుతుంది. తనకి కావలసిన అంత డబ్బు రాబట్టుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా హత్య చేస్తుంది.
లక్ష్మీ తరపు లాయర్ లేచి ముందుకు వచ్చాడు. జడ్జి గారి వైపు చూసి “యువర్ ఆనర్ క్షమించాలి. డిఫెన్స్ లాయర్ గారు ఆమెని చాలా అసభ్యకరంగా మాట్లాడారు. అసలు చందూలాల్ ని ఎందుకు హత్య చేయవలసి వచ్చిందో ముందర ఆ విషయం కనుక్కోమనండి.
“జడ్జి గారు డిఫెన్స్ లాయర్ గారికి అనుమతి ఇచ్చారు”నీకు ఆయనతో పరిచయం ఎందుకయింది. ఆయన ఒక్కరేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా! చందూలాల్ పలుకుబడి, గొప్ప పేరున్న వ్యక్తి. సమాజంలో ఒక పెద్ద మనిషి. సినీ పరిశ్రమ రంగాల్లో ఎదురులేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని నువ్వు హత్య చేశావంటే, నీ వెనక చాలా కధే ఉండి ఉంటుంది. ఒక ఆడది ఇంతటి పెద్ద మనిషిని హత్య చేసిందంటే ఈమెది రాక్షస ప్రవృత్తి. ఇలాంటి హంతకురాలిని వదిలి పెట్టకూడదు. ఈమెకి ఉరిశిక్ష సరైనదని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను.
ఇప్పటికైనా జరిగింది చెప్పమన్నారు జడ్జి గారు.
లక్ష్మీ రెండు చేతులెత్తి జడ్జి గారికి నమస్కరించింది. మీరు నన్ను క్షమించాలి. మీతో ఇలా మాట్లాడుతున్నందుకు. నాది నిజంగా రాక్షస ప్రవృత్తి అయితే ఇప్పటికీ ఐదారు హత్యలు చేసి ఉండే దాన్ని. ఇంతకాలం నా జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గులను వదిలిపెట్టాను. వాళ్లను కూడా హత్య చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తున్నది. ఎలాగో నాకు ఉరిశిక్ష పడక తప్పదు. అప్పుడు అన్నిటికీ ఒకే శిక్ష పడి ఉండేది.
చూశారా! నేను ముందే చెప్పాను. ఆమెది రాక్షస ప్రవృత్తి అని. ఆ హత్యలు కూడా ఆమె డబ్బు కోసమే చేస్తుంది. ఆమె విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. డబ్బున్న వాళ్ళనే ఎరవేసి పట్టుకొని ప్రయత్నం చేస్తుంది.
“అబ్జెక్షన్ యువరానర్! నా క్లైంట్ మనస్తత్వం ఏమిటో! ఆమె ఎందుకిలా ప్రవర్తించవలసి ఉన్నది ఆమెని అడిగి తెలుసుకుందాం అన్నారు లక్ష్మీ తరపు న్యాయవాది.
జడ్జిగారు అనుమతి ఇవ్వటంతో లక్ష్మి తన గుండెల్లో దాచుకున్న దావానలంలా ఉబికి వస్తున్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని నోరు విప్పింది.
“అప్పుడు నా వయసు సరిగ్గా 11 సంవత్సరాలు”ఆడపిల్ల మొదటిసారిగా రజస్వల అయిన నాకు 11వ రోజు వేడుక జరిపించాలని చుట్టాలని బంధువులని పిలిపించారు. కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు. మా నాన్నకి దూరపు బంధువు నారాయణ బాగా డబ్బున్న వాడు. అతని కన్ను నా మీద పడింది. నన్ను పెళ్లి చేసుకోవాలని మా నాన్నకి డబ్బు ఆశ చూపించాడు. నారాయణకు 30 ఏళ్లు ఉంటాయి. నల్లగా చింతమొద్దు లా ఉంటాడు. నేను చాలా అందంగా ఉండేదాన్ని. తెల్లగా బొద్దుగా ఉండటంతో చూసేవాళ్ళకి పెద్ద పిల్లలా కనిపిస్తాను.
మాది బీద కుటుంబం కావడంతో నారాయణకి నన్నిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు మా నాన్న. అతని రూపం నాకు నచ్చలేదు. 11 ఏళ్లకే పెళ్లి ఏమిటి అనుకున్నాను. నారాయణ ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక ఆ తెల్లవారుజామునే ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా బొంబాయి రైలు ఎక్కాను. అక్కడ ఒక అతను పరిచయం అయ్యాడు. తనతో వస్తే సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని మభ్య పెట్టాడు. నేను అతని వెంట వెళ్లాను. నన్ను ఒక గదిలో ఉంచి రోజు భోజనం ఏర్పాట్లు చూశాడు. ఒకటి రెండు వేషాలు ఇప్పించాడు. ఆ వచ్చిన డబ్బు కూడా నాకు ఇవ్వకుండా తనే వాడుకునే వాడు. ఆ తర్వాత నన్ను వేశ్యాగృహానికి అమ్మాలని చూశాడు. నేను పారిపోయి మద్రాస్ వచ్చాను. మళ్లీ అదే పరిస్థితి. నా అదృష్టం బాగుంది సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఒక ప్రొడ్యూసర్ నన్ను చేరదీసి పెళ్లి చేసుకుంటానని గుడికి తీసుకువెళ్లి నా మెడలో తాళి కట్టాడు. ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాను. నన్ను షూటింగ్లకు తీసుకువెళ్లటం తీసుకురావడం చేసేవాడు. నా డబ్బులు లెక్కలు అడిగితే చెప్పేవాడు కాదు. నేను నెల తప్పితే సినిమాల్లోకి నటించడానికి పనికిరానని అబార్షన్ చేయించాడు.
అలా పది సంవత్సరాలు గడిచాయి. డబ్బు బాగా సంపాదించాను. నా వాళ్ళని చూడాలనిపించింది. వెళ్లకుండా అడ్డుపడి నన్ను గదిలో నుంచి బయటకు రానికుండా చేశాడు. అప్పుడు కూడా అతను ఏమీ చేయలేదు. అతని భారీనుండి తప్పించుకొని వెళ్లాలని చూసాను. ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి. నా ప్రమేయం లేకుండానే ఒక్కొక్కరు నా జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. మా అమ్మానాన్న చనిపోయారని తెలిసింది. మా ఊరు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అప్పుడే చందూలాల్ తారసపడ్డాడు.. ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేననిపించింది. చందూలాల్ నాకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించడం మొదలుపెట్టారు. సినిమా చాన్సులు బాగా రావడంతో సంపాదన పెరిగింది. నా డబ్బు లెక్కలు అంతా చందులాల్ చూసేవాడు. అదే నేను చేసిన తప్పు. నా పేరు నా పెద్ద బిల్డింగు కొంటానని చెప్పి అది తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. చెక్కు బుక్కు మీద సంతకాలు చేయించుకొని నా డబ్బంతా తన భార్య పిల్లలకు పంపేవాడు.అదేమని నిలదీసినందుకు నా పేరు మీద రూపాయి లేకుండా చేసి నన్ను నానా చిత్రహింసలకు గురి చేశాడు. అందుకే అతను అంటే నాకు అసహ్యం వేసింది. ఆ కసి కోపంతోనే చందులాల్ ని హత్య చేశాను అని నిర్భయంగా చెప్పింది లక్ష్మి.
“ఇప్పుడు చెప్పండి! నేను చేసింది తప్పే! అడుగడుగునా నాలాంటి వాళ్ళని వాడుకొని వదిలేయడం న్యాయమా! మా ఆడవాళ్లకు స్వేచ్ఛగా బ్రతికే స్వతంత్రం లేదా? మా నుదుటి రాతలు ఆ దేవుడు ఇలాగే రాశాడా? చెప్పండి జడ్జిగారు! ఆడవాళ్లకు రక్షణ లేదా? పెళ్లి చేసుకుని మోసం చేసింది కాక నా డబ్బుతో అతని కుటుంబాన్ని పోషించుకోవడం న్యాయమా! మీ అందరి దృష్టిలో చందులాల్ మంచివాడు అతను సంపాదించిన ప్రతి పైసా అక్రమమే. ఎన్నో దుర్మార్గాలు చేసి పైకి వచ్చిన వ్యక్తి.
ఇప్పుడు నాకు ఎలాంటి శిక్ష విధిస్తారు మీ ఇష్టం! మరణ శిక్ష కైనా నేను సిద్ధమే!
“చూశారా యువరానర్”ఆమె ఏదో మంచి పని చేసినట్లు చెబుతున్నది. నేను మీకు ముందే వివరించాను.ఈమెది రాక్షస ప్రవృత్తి అని. ఈమె వాదోపవాదాలు విన్న తర్వాత కఠిన శిక్ష విధించడం న్యాయం అన్నారు డిఫెన్స్ లాయర్ గారు.
సమాజంలో నాకు జరిగిన అన్యాయాలు ఏ ఆడపిల్లకి జరగకూడదు. జీవితం మీద విరక్తి కలిగి ఈ హత్య చేశాను. అంతేగాని ఎవరి డబ్బు కోసం నేను ఆశపడలేదు నా డబ్బే నాకు దక్కకుండా పోయింది. నేను మనిషినే! మగవారి దౌర్జన్యాలు ఎంతకాలం ఎదుర్కోవాలి. నా స్థితిలో ఏ స్త్రీ ఉన్నా ఇలాగే చేస్తుంది. మగవాడు మోసం చేసుకుంటూ పోతే ఆడది జీవితాంతం భరించాల్సిందేనా! ఈ సమాజంలో నాలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తప్పించుకొని తిరిగే చందులాల్ వంటి వారు కూడా ఉన్నారు. శిక్షలు మాలాంటి వారికే గాని. చందూలాల్ వంటి వారికి శిక్షలు పడవు. ఎందుకంటే వాళ్లు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు.
నేను చెప్పదలుచుకున్నది చెప్పాను శిక్ష విధించడం మీదే ఆలస్యం! జడ్జి గారితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.
కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేశారు.
నేను పోగొట్టుకున్న జీవితం తిరిగి రాదు. హంతకురాలిగా ముద్ర వేయించుకొని జైలుకి వెళ్లి వచ్చాక కూడా మరో దుర్మార్గుడు అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. నన్ను చెరబట్టక మానుకోడు. ఆట బొమ్మతో ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు. అవసరం తీరిపోయాక విసిరి కొడతారు. ఈ ఆట ఇంతటితో ముగిసిపోవాలి.
మర్నాడు తీర్పు చెప్పక ముందే తన జీవితానికి తనే అంతిమ తీర్పు చెప్పుకొంది లక్ష్మి. కోర్ట్ ఆవరణలోనే కుప్పకూలిపోయింది. వెంటనే హాస్పిటల్లో చేర్పించిన ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. మరణశిక్ష తప్పదు అనుకుంది. పాయిజన్ మింగేసింది. ఇప్పుడు ఎవరూ తనకి శిక్షలు వేయలేరు. తన శిక్ష తనే వేసుకుంది.
ఆడదానికి ప్రాణ, మాన రక్షణ కోసం హత్య చేస్తుందే కానీ, కోపంతోను ద్వేషంతోను ఎవరిని హత్య చేసే మనస్తత్వం ఉండదు స్త్రీకి. సమాజంలో ఇలాంటి స్త్రీల జీవితాలు ముళ్ళ మధ్య గులాబీలే. ఆ ముళ్ళని ఎదుర్కోవాలంటే గాయపడితేనే తెలుస్తుంది. కొందరి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి.
చందూలాల్ వంటి ముళ్ళపొదలు ఎక్కడబడితే అక్కడ పెరుగుతూనే ఉంటాయి. వాటిని సమూలంగా నాశనం చేసిన నాడే గులాబీలకు రక్షణ ఉంటుంది. ముళ్ళ మధ్యలో చిక్కుకున్న గులాబీ సున్నితమైన రేకుల్ని ముళ్ళతో బాధించటం అది చందులాల్ లాంటి వారి నైజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కనిపించని సంకెళ్లు

శాంతిమంత్రం