కనిపించని సంకెళ్లు

అరుణజ్యోతి

సక్రాంతి సంబరాలలో భరతనాట్యం చేసిన వారిలో మీనా పేరు విని జయ మనసులో తన చిన్న నాటి మిత్రురాలు మీనా గుర్తొచ్చింది. మీనా… అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది చూడగానే గుర్తుపట్టింది మీనా కూడా…అరే జయా… అని మెరిసే కళ్ళతో దగ్గరకు తీసుకుంది. చిన్న నాటి మిత్రురాలిని కలుసుకున్నందుకు జయ, మీనా ఇద్దరికి ఎంతో ఆనందంగా వుంది. మీనా అంది “వాటెలక్కిడె టుడే నిన్ను కలుసుకున్నాను జయా” అని. నాకు కూడా అలాగే వుంది మీనా అంది జయ. ఇద్దరి కుశలప్రశ్నల తరువాత ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. మా ఆయన కార్లో వెయిట్ చేస్తున్నాడు మీనా… నేను ఫోన్ చేస్తాను అప్పుడు తీరికగా మాట్లాడు కుందాం అని జయ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

జయ ఫోన్ రింగవుతోంది… అవతల మీనా. ఎన్నాళ్ళయింది జయా నీతో మాట్లాడి…హౌఆర్ యు అంది, బాగున్నాం మీనా దాదాపు 18 ఏళ్లయిపోయింది మనం కలసి మాట్లాడుకుని, మేము ఆ వూరినుంచి వచ్చేశాక మీ లాండ్ లైన్ కి నేను చాలా సార్లు ప్రయత్నించాను కాని ఎప్పుడూ నీతో మాట్లాడడం కుదరలేదు అంది జయ. చెప్పు జయా పిల్ల లెలావున్నారు, మీవారెలా వున్నారు, అమెరికాకి ఎప్పుడొచ్చావు అంది మీనా తన చిన్ననాటి మిత్రురాలి విషయాలన్ని ఒకే సారి తెలుసుకోవాలని ఆత్రుతగా… “అంతా బాగున్నాం, అమెరికాకొచ్చి పదేళ్ళయింది. న్యూజెర్సి కొచ్చి రెండేళ్లయిందిలే” అంది జయా… అసలు నన్నెలా గుర్తుపట్టావు అంతమందిలో అడిగింది మీనా…చిన్నప్పుడు నీగురించి బాగా తెలిసిన దాన్ని… నిన్ను గుర్తుపట్టకపోతే మన స్నేహానికి విలువుంటుందా అంది జయ…సో ట్రూ,  ఐ అగ్రి విత్ యు జయా. సరే ఈ వీకెండ్ మాఇంటికి లంచ్ కి రండి అందరూ… అంది మీనా. సరే నేను కన్ఫమ్ చేస్తాను మీనా అని జయ ఫోన్ పెట్టేసింది.

కాలింగ్ బెల్ మోగగానే ఎదురుచూస్తున్న వారొచ్చినట్లు ఒక్క ఉదుటున తలుపు తెరిచింది మీనా. జయ పరివారాన్ని ఇంట్లోకి ఆహ్వానించింది. ఇద్దరి భర్తల పిల్లల పరిచయాల తరవాత, వారి వారి కబుర్లలో మునిగిపోయారు. మీనా జయ సోఫాలో కూర్చున్నారు. చెప్పు జయా అమెరికా కొచ్చి పదేళ్లయినా మనం కలుసుకోడానికి  ఇన్ని రోజులు పట్టింది. అసలు నాకు నువ్విక్కడున్నావని తెలిస్తే ఎప్పుడో కలిసేదాన్ని అంది మీనా. నీగురించి నాకు తెలుసులే అయినా ఈ ప్రపంచమనే కుగ్రామంలో నువ్వునన్ను వెదికి పట్టుకోవాలంటే నేను అమెరికాలోనే వుండాలా ఏంటి అంది జయా. నన్ను టార్గెట్ చేశావా… ఏదోలేవే ఇప్పటికైనా కలుసుకున్నాంగా అని మీనా అనగానే ఇద్దరూ నవ్వుకున్నారు….ఇంతకీ అమ్మ నాన్న అన్నయ్య ఎలా వున్నారు అంది జయా.. అందరూ బాగున్నారు, అన్న దగ్గరే అమ్మ నాన్న వుంటున్నారు అంది మీనా…. నువ్వు అలాగే ఉన్నావు మీనా, అస్సలు మార్పులేదు, ఆ చలాకీ తనం, నీ మెయింటెనెన్స్, ఫ్యాషన్… చిన్నప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు అంది జయా మీనాని గమనిస్తూ… ఓ నిజంగా… అయితే  అందుకు  మా ఆయన కి నేను ధాంక్స్ చెప్పుకోవాలి. ఉద్యోగం పిల్లలు యాక్టవిటీస్ తో జీవితం అలా ముందుకు సాగుతోంది అని నవ్వింది మీనా. ఇంకా చెప్తూ… “ఆయన నా విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు… మొత్తం నీదే అంటారు. ఆయన ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు తనదైన ప్రపంచంలో బ్రతుకుతారు. ఇంటి పని, వంట పని, బయట పనులు,  పిల్లలు, నా యాక్టివిటీస్ అన్ని నా ఇష్టమొచ్చినట్లే జరుగుతాయి. ఇదిగో ఇలా ఇంటికెవరైనా వస్తె తప్ప స్నేహాల్లో కూడా ఆయనకి నాకు సర్కిల్ వేరే వేరే. పిల్లలతో ఇన్ని రోజులు చాలా బిజీగా ఉండేదాన్ని. ఇప్పుడు పిల్లలిద్దరూ వాళ్ళపనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే నాకోసం నాకు సమయం దొరుకుతోంది, అందుకే  చిన్నప్పుడు నేర్చుకున్న భరతనాట్యం మళ్ళీ మొదలుపెట్టాను. అలా మనం మళ్ళీ కలుసుకున్నాం…ఇద్దరూ నవ్వుకున్నారు….అందరూ హాల్లోకి రావటంతో భోజనాలు ముగించుకుని కొంత సమయాన్ని గడిపి జయ కుటుంబం వెళ్ళిపోయింది.

వారం తరువాత మీనా జయ కు ఫోన్ చేసి అండిగింది. “నేను రేపు ఫ్యాషన్ ఫెయిర్ కి వెళ్తున్నాను నువ్వు కూడా రా, ఇద్దరం కలసి ఇంకా బోలెడు కబర్లు చెప్పుకోవాలి” అంది. జయ కాసేపు ఆలోచించి మళ్ళీ కన్ఫం చేస్తా అంది. కొంచెం సేపటికి జయ నుంచి మీనా పోన్ కి మెసేజ్… “నాకు వీలుపడదు మనం మళ్లీ ఇంకొకసారి కలుద్దాం” అని. మరో రెండు వారాల తరువాత మీనా ఫ్యామిలీని జయ ఇంటికి రమ్మంది. మీనా వాళ్లాయనకు ఏదో అర్జంట్ పని పడిందని చివరినిమిషంలో రాలేకపోయాడని చెప్పి జయ వాళ్లాయనతో ఫోన్ లో మాట్లాడించింది. ఆయన రాలేకపోయినందుకు క్షమించాలని మళ్లీ కలుద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. పిల్లలందరూ కలసి వీడియోగేం ఆడుతున్నారు. జయ వాళ్ళాయన మార్నెట్ చేసిన చికెన్ ని అవెలో పెట్టి టీవీముందు కూర్చున్నాడు. జయ మీనా హాల్ లో కూర్చున్నారు. జయ అడిగింది మీనాని మొన్న ఫ్యాషన్ ఫెయిర్ బాగుందా ఏమయినా నచ్చాయా తీసుకున్నావా అని… ఓ అదా దాని తరువాత మళ్లీ ఇంకొక జ్యువెలరి షోకి కూడా వెళ్ళాను, కాని ఎక్కడా అంత మంచి కలెక్షన్ లేదనుకో… అది సరే జయా…నేను అడిగిన ప్రతి సారి కన్ఫమ్ చేస్తానని చెప్తావు ఏంటి మీ ఆయన నిన్ను విడిచి ఒక్కక్షణం వుండలేడా అని కొంటెగా నవ్వింది… అదేం లేదే… “నేను అమెరికాకి వచ్చినప్పటినుంచి డ్రైవింగ్ లైసెన్స్ తీసిపెట్టుకున్నదే కాని ఇప్పటివరకు ఒక్కదాన్ని డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్లలేదు ఒక్కదాన్నేంటి అసలు డ్రైవ్ చేసిందే లేదు”. జయా మాటలకు మీనా ఉలిక్కపడింది. ఏమంటున్నావే… అమెరికాలో అసలు డ్రైవ్ చెయ్యకుండా ఇన్నిరోజులనుంచి ఎలా వున్నావు… మీ ఆయనేమైనా… అని ప్రశ్నలవర్షం కురిపిస్తోంది మీనా. అదేం లేదే మొదట్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు లైన్ మారుస్తూ తడబడ్డాను. ఇంక అప్పటినుంచి నేను ఎప్పుడు డ్రైవ్ చేస్తానన్నా ఆయన తరువాత చేద్దూలే అనేవారు. ఆతరువాత ఇప్పటి వరకు ఆయన తోనే ఎక్కడికి వెళ్ళాలన్నా. నేను ఖాళీగా కూర్చోలేక కష్టపడి ఆన్లైన్ జాబ్ వెతుక్కున్నాను, ఇంట్లోనుంచే పని చేస్తుంటా కాబట్టి ఉద్యోగానికి బయటికి వెళ్లే అవసరం కూడా లేదు. ఇక పిల్లల యాక్టివిటీలు, గ్రోసరీస్, ఫంక్షన్స్, గుళ్లు, పూజలు, స్నేహితులు అన్నీ ఆయనకు కుదిరినప్పుడే, ఆయనకు ఇష్టముంటేనే వెళ్తాం. “ఇంకా ఈరోజుల్లో ఇలాంటివారున్నారా జయా” అని మీనా ఆశ్చర్యంగా అడిగింది. అదేంలేదు మీనా… ఆయనకి మేమంటే చాలా ప్రేమ, ఆయన ఎప్పుడూ నన్ను డిపెండెన్సి అనుకోరు పైగా ఇంట్లో నాకు చాలా హెల్ప్ చేస్తాడు. నా డ్రైవింగ్ వియంలోనే తప్ప మిగతాదంతా బాగనేవుంది మీనా అని వాళ్ళాయన చేసే సహాయానికి తను చాలా లక్కి అంది జయా. “అంతా అక్కడే వుంది జయా” అంది మీనా. “అమెరికాలో డ్రైవింగ్ చేయకపోతే లైప్ లేనట్లే. అంటే పరోక్షంగా నీకు లైఫ్ లేకుండా చేశాడుగా”. అందుకే గదా ఇక్కడ మొదట్లో ఎంత కష్టమైనా డ్రైవింగ్ తప్పకుండా ప్రతిఒక్కరు నేర్చుకునేది. “నువ్వు కష్టపడి ఇంట్లోనుంచి పనిచేయడం వెతుక్కున్నావు, కాని అదే మొదట్లో కష్టమైనా డ్రైవింగ్ చేయటం నేర్చుకునింటే నీ ఇష్టమైన చోటికి నువ్వు వెళ్లేదానివి కాదా” అంది మీనా. మీనా…సరే నా విషయం పక్కన పెట్టు,  నేను డ్రైవింగ్ చేయట్లే నాకు స్వేఛ్చ లేదు అంటున్నావు. మీ విషయంలో చూడు, నువ్వుచలాకిగా వుంటావు, నీకు ఓపిక అందరికంటే రెండు రెట్లు ఎక్కువే. మీ ఇంట్లో అన్నీ నీ ఇష్టప్రకారమే జరుగుతుందనే విషయంలో నువ్వు చాలా తృప్రిగా వున్నావు కాని నీ ఇష్టం ఎక్కడుంది, నీకు తెలియకుండానే నీ మీద ఎంత భారం వుందో నువ్వెప్పుడైనా గమనించావా… ఇది కూడా అంతే అంది జయ. మీనా ఇంకా ఏదో చెప్పబోతుంటే…జయా అడ్డుపడింది. భోజనం చేద్దాం గ్రిల్డ్ చికెన్ వేడిగా వుందని పిల్లల్ని రమ్మని పిలిచింది.

ఇంటికొచ్చాక మీనా మనసులో జయ గురించిన ఆలోచనలు, జయ అన్నమాటలు మెదులుతున్నాయి. చిన్నప్పటినుంచి చాలా ఒద్దికగా వుండేస్వభావం, నాలా ఏ రోజూ తన అభిప్రాయాన్ని ధృడంగా చెప్పేది కాదు. చిన్నప్పుడు తనలాగా భరతనాట్యం నేర్చుకోవాలని తనకున్నా వాళ్ళనాన్న ఒప్పుకోడని కోరిక తనలోనే దాచుకుంది. ఇప్పుడు మొగుడికి అదే అలుసైంది. కాని జయ నా గురించి ఎందుకలా అన్నదో అనుకుంటుండాగానే… జయ మాటల్లో నిజం అర్దమై వీపు మీద ఎవరో చాచి ఒక్కటి కొట్టినట్లనిపించింది మీనా కి. నా పరిస్ధితి కూడా అదే కదా అని మీనా ఆలోచనలో పడింది. ఇద్దరి పరిస్ధితి మగవాళ్లకు బానిసే. ఇద్దరివి కనిపించని సంకెళ్ళే… స్వేచ్ఛపేరుతో ఒకరివి, ప్రేమ పేరుతో ఇంకొకరివి. కనిపించి, కనిపించని సంకెళ్ళమధ్య సన్నని పొర బోధపడి కాళ్ళకింద భూమి కదులుతున్నట్లయింది మీనా కి!!.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జాగ్రత్త జాగ్రత్త

ముళ్ళ పొదలో గులాబి