ఎర్రరంగు బురద

3వ భాగం

జరిగిన కథ: పుష్ప పద్మ హాష్టల్ పిల్లలు. హోలీ పఃడుగ సమయంలో బళ్ళె పుష్పకు ఫిట్స్ వస్తయి. డాక్టర్ తండ్రిని పిలవమంటే. తండ్రి చచ్చిపోయిండని. తాత వస్తడు. డాక్టర్ పద్మను వివరాలు అడిగితే.. తండ్రితో కలిసి వచ్చి లావుపాటి నోట్స్ ఒకటి చేతికిచ్చి. “మా నాన్న చెపుతుంటె, నేను రాసిన, ఇదొక జాతి చరిత్ర” అంటది పద్మ.

————ఇక చదవండి——-

క్లినిక్ నుండి వచ్చిన డాక్టర్ ఆ రోజు క్లబ్బుకు వెళ్ళలేదు..

జ్వలిత

త్వరగా భోజనం ముగించి పద్మ ఇచ్చిన పుస్తకం చదవడం మొదలు పెట్టాడు.

**

అదొక పూరిగుడిసె వంటి, ఒంటి నిట్టాడు ఇల్లం. ఇంటి చుట్టూ చెట్ల మీద పచ్చులన్నీ రకరకాలుగా అరుస్తున్నయి.. పక్కనే పందుల గుడెసెల గున్నలు గుర్ గుర్ అంట అడ్డం పెట్టిన రాయిని ముట్టెలతో నెడ్తన్నయి. రాయిని నెట్టడానికి వాటిబలం సరిపోట్లేదు.. కోళ్ళ గూళ్ళ నుంచి గోలగోలగా అలుపులు మొదలైనయి.. మబ్బుల్ని తోసుకుంట సూర్యుడు తొంగిచూస్తున్నడు..

అప్పుడే లేసిన తండ్రీ కొడుకులు పందుం పుల్లేసుకొని, గుడిసె సూరు కింద అరుగు మీద కాళ్ళమీద కూసొని ఉన్నరు. తండ్రి సంగడు, వాని కొడుకు ఎంకడు.

“అయ్యా వాడు నిన్ను తిడతాండే ..” కొడుకు.

“కొత్తేంది కొడకా..” తండ్రి.

“కానీ.. నాకు అవమానమయితాందే.. దోస్తుల ముందల తల కొట్టేసినట్టయితాంది..” కొడుకు.

“నాకు సుత గట్లనే ఉన్నది. వాడి కూతలు తిట్లు నాకేమన్న సంబరం ఐయితందనుకున్నవా..” తండ్రి.

“తెర్లి తెర్లి గుచ్చుకుంటున్నయి.. కంటి మీద నిద్ర లేకుండయ్యింది” కొడుకు.

“వానికి అన్నాయమయింది.. మనవల్ల వాని తల్లి సచ్చిందని కోపం.. కడుపు మంటకు అనే మాటలు పట్టిచ్చుకోకు కొడకా..” అనుకుంట గుడిసెల నుంచి జాలారికెల్లి పోయింది ఆడమనిసి..

“గుడెసెకు అడ్డమున్న చెట్టును కొట్టేద్దామయ్యా..” అన్నడు కొడుకు.

మడతేసి కూసున్న తండ్రి కాలు ఒక్క సారి సాగింది. 

బిత్తర చూపులు చూసిండు, ఎవరన్న ఇన్నరా అని.. కొడుకు మొగంకేసీ ఓపాలి సూసి.. లేసి పార పోయిండు తండ్రి. 

కొడుకు కాసేపు ఆడ్నే కూసోని నెత్తిగోక్కుంట లేసి గోలెం కాడికి పోయిండు. జాలాట్లున్న తల్లి తన మాటిన్నదేమోనని.. తల్లిని పరికించిండు. తలొంచుకొని తల్లెలు తోముతాందంటే, ఇనలేదన్న ధైర్యంతో బైటకు నడిచిండు కొడుకు. 

*

ఊరంత ఎవలి పనిల వాల్లున్నరు… అంబటాలయింది. 

“మా అమ్మను సంప్పిండు, మరోదాన్ని మరిగి మాకు తల్లి లేకుంట సేసిండు…. మా అక్కను బొంబయికి తోలిండు.. నేనేకాకినయిన.. నాకు దిక్కూ లేకుంటయింది” సగం మత్తుల గునుక్కుంటాడు ఏదులు. 

గుడిసె నిట్టాడికి ఆనుకుని కూసున్నా, పక్కకు ఒరుగుతాండు..

“ఎన్ని పొద్దులు దుఃఖ పడతవు ఊకో యయ్యి.. నీకు ముగ్గురు పిల్లలయిన్రు కదా! నువ్వొంటరోనివెట్లయితవు.. ఊకో యయ్యి” అనుకుంట.. పొయ్యి కాడ కూసున్న ఏదులు భార్య మొగని కోసం తల్లెల ఉడుకుడుకు అన్నం ఏసుకొచ్చి ముందల పెట్టింది. రాతెండి సెంబుల నీళ్ళు తెచ్చి తల్లె దగ్గర పెట్టింది. పాలు తాగే పిల్లను వల్లేసుకుని ఏదులు పక్కనే కూసున్నది. ‘తల్లి తర్వాత తల్లోలె ఆకలి దూప అరుసుకొనేదే ఆలి’ అనే మాటను నమ్మింది నాంచారి.

“మనకొక కుటుంబమున్నది నీసుట్టు నీ బలగమున్నది. నువ్విట్ట దుఃఖపడితే పిల్లలు బెంగటిల్తన్రు. నాకు బుగులయితంది” అన్నది.

“నా దుఃఖం మరవలేనిది.. మా అవ్వ అన్నాయంగ సచ్చిపోయింది. మా అయ్య ఆ మచ్చల పొట్టిదానితోనే ఉండేటోడు. మా అవ్వ ఆ మనాదిల… మొగని అన్నాయం ఎవరికి సెప్పలేక కుమిలి కుమిలి పోయేటిది. ‘మనోవ్యాధిని మించి మరణం లేదన్నట్టు’ ఆ మనాదితోటే చేదగ్గు రోగమొచ్చింది.. మంచినాడే మంచి చెడ్డ అరుసుకోని మా అయ్య రోగ మొచ్చినంక ఆయింత ఇంటికొచ్చుడే మరిసి పోయిండు, మా పెద్దక్క బువ్వండి పెడుతుండె… ఈతాకు సమురుకొస్తుండె. మా అమ్మ మంచంల కెల్లి లేవకుంటయినంక. మీ నాయిన, అమ్మమ్మ వచ్చి దావఖాన్ల సెరీకు చేసిన్రు.. అప్పటికే రోగం ముదిరింది లాభం లేదన్నరు డాక్టర్లు, ఇంటికి గొంచబొమ్మన్నరు. ఇంటికి తెచ్చినంక నెలరోజులు నవిసి నవిసి పేగులు బయటికొచ్చేట్టు దగ్గి దగ్గి ఊపిరొదిలింది. మా అవ్వ… మామే దానం చేసిండు. అవ్వ సచ్చిన మూడోనాడొచ్చిండు కఠినాత్ముడు మాయయ్య. పాపిష్టోడు.. నల్ల బండరాయి గుండె వానిది. మా అవ్వను పొట్టన పెట్టుకున్నడు.. కాదు కాదు వాని సుఖానికి మా అవ్వను బలిచ్చిండు. మమ్ముల దిక్కులేని పచ్చుల చేసిండు. వాన్ని సంపుత ఎప్పటికైనా.. నా సేతులనే వాని సావు..” తనల తను మాట్లాడుకున్నట్టు మాట్లాడుతున్నడు ఏదులు. 

పక్కనే కూసున్న పెళ్ళాం ఒల్లె  ఉన్న పిల్లను పక్కకు జరిపి, మొగని కండ్ల నీళ్ళు తుడిసింది… 

“అత్తకు జరిగింది అన్నాలమే గని, నా బిడ్డలకు, నాకు అన్నాయం సేస్తవా… మీ అయ్యను సంపి నువు జైలుకు పోతే.. మాగతేంది ? నేను, నా పిల్లలు దిక్కు లేనోల్లం అయితం. జర సోంచాయించు.. నీ కొడుకు సుత నీ ఓతిగ మనాది పడడా…. మనసు శాంతం జేసుకో ఆడదాని మాటేంది ఇనేది అనుకోకు.. జర చిత్తంబెట్టి ఇచారించు.. ఊరటిల్లు.. గుండె ధైర్యం తెచ్చుకో…  మా మొగం చూడు.. నీకేమన్నయితే నేను పిల్లలు ఏం కావాలే.. మనాది ఒదిలి ఓ ముద్ద సోరు కుడువయ్యా..” అని అన్నం తల్లె చేతులకు తీసుకుని అన్నం కలిపి ముద్ద జేసి మొగని నోటికందించింది.

 తలకాయ పక్కకు తిప్పుకున్నడు ఏదులు దుఃఖంతో..

“నీ బాంచెనయిత జరంత సోరుకుడు..” అంట బలవంతంగా రెండుముద్దలు తినిపిచ్చింది. మంచి నీల్లు తాగిచ్చి, “జర చల్లబడు… శాంతంగుండు.. కాసేపు అట్ట పండు..” అన్నది.

ఏదులు లేసి గుడిసె బయిటికెల్ల బారిండు. సంగడి మొదటి పెళ్ళాం కొడుకు ఏదులు.

            *  * *

ఎండ మటమట లాడుతాంది. పొద్దు నెత్తి మీదికెక్కింది. ఏదులు ఆలోచిస్త అడుగులేస్తున్నడు. నిజమే తన పెండ్లం చెప్పినట్టు… తనకు తండ్రికి తేడా ఏమున్నది. ఏదో అఘాయిత్యం చేసి తను జైలుకు పోతే పిల్లల గతేంది.. తనకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. వాళ్ల మంచి చెడు ఎవరు సూత్తరు. తన కొడుకులు సుత తనోతిగనే దుఃఖ పడతరు కదా.. అనుకున్నడు. ఆలోచిస్తూ నడుస్తున్న ఏదులు చెరువు గట్టుకు చేరిండు. చెరువుకు దిగువన, చెరువు కట్టెమ్మటి, జెండా పండగకు సోల్పుగ బడిపిల్లలు నించున్నట్టు వరసగ ఈత చెట్లున్నయి. రొంటిల దోపిన వంక కత్తితీసి ఈతమట్టలు చెలిగి మోపు కోసం కుప్పేసిండు. పక్కనే వరిపొలం గట్ల మీదన్న దుస్సేరు తీగలు మరిన్ని చెలిగి ఈత మోపు మీదేసిండు. రెండు తీగలు తీసి మోపు గట్టిండు. ఇంక జరంత ముందుకు నడిచి ముదిరిన సర్కారు తుమ్మలల్ల రాగోల తీరున్నదాన్ని ఎంచుకొని నరికిండు.. ఆ కొమ్మకున్న ముళ్ళను ఆకులను చెలిగి నున్నగా రాగోల తయారు చేసి ఈతమట్టల మోపుకు గుచ్చిండు, అమాంతం లేపి భుజానేసుకుని ఇంటి దారి పట్టిండు. ఎంత మోర్దోపుగ ఆలోసించిన ఇన్ని దినాలు. అయ్య మీది కోపంతోని, నా బిడ్డల అనాధల సేసుకుందును వుత్తపున్నానికి…. అనుకుంట ఇంటి దారిపట్టిండు.

మాట్లాడకుండా ఇంట్ల నుంచి బయటకు పోయిన ఏదులు యాడ తాగొచ్చి ఎంత లొల్లిసేస్తడోనని బిక్కు బిక్కు మనుకుంట కూసున్నది ఏదులు పెండ్లాము నాంచారి. అల్లంత దూరాన ఏదుల్ని సూసి దమ్ము తీసి వదిలింది గుండెలనిండా.. ఉప్పుస తీరిందామెకు. “దేవుడా.. ఎంకన్నసామీ..” అంట రెండు చేతులెత్తి మొక్కింది.

నెత్తి పట్టుకొని కూసున్నదల్లా ఏదులొచ్చేది చూసి దిగ్గున లేసి గుడిసెలకు పోయి రాతెండి లోటతో కుండల నీళ్లు ముంచుకొచ్చి మొగనికి అందిచ్చింది “ఎంటోసునవే.. జర తెన్నికుడు” అంట. (ఎక్కడికి పొయినవే.. గిన్ని నీల్లు తాగు)

ఎండకు అలిసి పోయిండో.. ఆలోచనలకు గొంతు తడారిపోయిందో.. ఎత్తిన లోట దించకుండా నీళ్లన్నీ తాగి ఖాళీ లోటా అరుగు మీద పెట్టి, అక్కడే కూలబడ్డడు ఏదులు. 

నాంచారి గుడిసెలకు దూరి పొయిల కట్టెలు ఎగేస్తంది.. బయటి నుంచి పెద్ద పెద్ద అరుపులు వినపడ్డయి..

——–సశేషం——

Written by Jwalitha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎంతెంత దూరం..కోడిగుడ్డు దూరం.

సారస్వత క్షేత్రంలో విరిసిన తెలుగు మహిళారత్నాలు