ఎంతెంత దూరం ఇంకెంత దూరం అంటే కోడిగుడ్డు దూరం, కోడిగుడ్డు దూరం అంటూ కళ్ళకి గంతలు కట్టుకుని ఆటలాడే రోజుల నుండి ఎంతదూరం వచ్చానని ఎలా కొలవను?
అప్పటి ఆ చిన్న ప్రపంచంలో ఆవు, మేక, కోడి, పిల్లి, అక్కడక్కడా కొన్ని చెట్లు కూడా, అన్నిట్లో ఆడ మగ సహజం. మనుషుల్లో కూడా. మా ఊరినిండా, మా ఇంట్లో, అంతటా ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు. అదో ప్రశ్నించే అవసరంలేని జీవితసత్యం. అమ్మాయిల ఆటలు అనబడే అచ్చెన్నలు, తొక్కుడుబిళ్లలు ఆడుకుంటూ మేము ఉంటే, ఉప్పుగేరా, గిల్లీదండా ఆడుకుంటూ అబ్బాయిలు ఉండేవాళ్ళు. ఎండలుమండితే అందరం కలిసి ఇంట్లో వామనగుంటలు, అష్టా చెమ్మా, బారకట్ట, పచ్చీసు ఇంట్లోనే ఆడుకుంటూ ఉండడమూ నిజమే. అచ్చం అలానే, యథావిధిగా, యుగయుగాలుగా ఇదే జీవతం అనిపించేలా సాగుతున్న పల్లె జీవితపు రోజులు.
బళ్ళో చదువులే నేర్పాయో, బుర్రలో ఆలోచనలే తొలిచాయో, ఆట మీద వ్యామోహమే ఉసిగొల్పిందో ఒకసారి మా రానెమ్మతో “మీ అన్నయ్య వస్తున్నాడంటే అలా భయపడి ఆట వదిలేసి ఇంటికి ఉరుకుతావెందుకు? సొంతంగా వడ్డించుకొని తింటాడు లే” అన్నాను. దానికి ఆమె “మా అన్నయ్య తాళ్ళు ఎక్కి కల్లు గీయగలడు. మనం చేయలేం. మగవాళ్ళ మణికట్టులో ఉన్న బలం మన మోచేతికి కూడా ఉండదు బుజ్జమ్మా” అని విసవిసా వెళ్ళిపోయింది. అప్పటికి నాకు మహిళా దినోత్సవాలు, ఫెమినిజం వగైరా ఏమి తెలియదు. తెలిసిందల్లా కుటుంబం అన్నాక అందరూ ఉండాలి. ఒకరి కోసం ఒకరు. ఉంటారు. అంతే.
అటు తిరిగి ఇటు తిరిగి ఉద్యోగంలో చేరాక మహిళా దినోత్సవం పేరుతో అమ్మాయిలను అమ్మాయిల్లా అందంగా ముస్తాబై రమ్మని చెప్పి యాజమాన్యం వాళ్ళు ఇచ్చే ఉచిత తాయిలాలు చాక్లెట్స్ తీసుకుని “ఇదేలే మహిళా సాధికారత. మహిళలను ప్రత్యేకంగా, మూర్తీభవించిన స్త్రీత్వంగా, లాలిస్తూ చూడడమే మహిళా దినోత్సవం” అనుకున్నాను.
కానీ అసలు మహిళా దినోత్సవం జరుపుకునేది మహిళలు ఇంకా ఏదో సాధించడంలో వెనకే ఉన్నారు అన్న విషయం గుర్తు చేస్తూ ప్రపంచాన్ని మార్చాలన్న ఉద్దేశ్యంతో అన్నది తెలిశాక నిజంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అనడంలో ఔచిత్యం కన్నా వైచిత్రి ఎక్కువే అనిపించింది. అయితే ఈ ఏడు మహిళా దినోత్సవం “embrace equity” నినాదం ఒక ఆశా కిరణం. మహిళల కన్నా పురుషులు ఎక్కువా తక్కువా కాదు. మగువ ఆదిశక్తి కాదు, అబల అసలే కాదు. మనుషులు అందరూ సమానమే. ఎవరికి వారు వేరే కానీ అందరూ మనుషులుగా సమానమే.
ఎంతెంత దూరం? అప్పటికీ ఇప్పటికీ సమానత్వం కేవలం కోడిగుడ్డు దూరమే. ఆలోచన మారడమే ఆలస్యం.