మా ఇంట్లో నాయనమ్మ పడుకునే గదికి ఒక కిటికీ ఉండేది …అందులోంచి చూస్తే బంధువుల ఇళ్ళు రెండు కనిపించేవి . కిటికీ పక్కనే ఉన్న ఇంట్లో వాళ్ళు కిటికీ దగ్గరికి వచ్చి అస్తమానం అమ్మని పిలుస్తూనే ఉండేవాళ్ళు ఆ కిటికీ చేబదుళ్లు ఇవ్వడానికి… ఆ ఇంటి వాళ్ళు అమ్మతో చెప్పుకునే కష్టసుఖాలకి మధ్యవర్తిగా ఉండేది ..ఎన్ని సమస్యలను ఎన్ని ముచ్చట్లను విన్నదో ఆకిటికి.
అప్పట్లో స్కూల్లో మంచినీళ్లు తాగడం కూడా నిషేధం అని చెప్పింది మా నాయనమ్మ.. అందుకని స్కూల్ నుండి వచ్చి షార్ట్కట్లో కిటికీ దగ్గరికి వచ్చి అమ్మ గ్లాస్ తో నీళ్లు పోస్తే తాగి వెళ్లేదాన్ని ..ఇంకా ఆ కిటికీలో నుండి చూస్తే వెనక వీధి కూడా కొంచెం కనిపిస్తుంది మొత్తం మీద ఆ కిటికీ ఒక మంచి టైం పాస్ గా ఉండేది.
ఈ ఇల్లు దాటి కొంచెం ముందుకు వెళితే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉండేది. వాళ్లు కూడా ఇంటికి చుట్టూ తిరిగి రాలేక అప్పుడప్పుడు ఈ కిటికీలో నుండే మాట్లాడేవాళ్లు…..
అప్పట్లో అందరివి ఉండి లేని సంసారాలే అందులో మా ఇల్లు పెద్ద సత్రమే వచ్చి పోయే వాళ్లకి కొదవలేనే లేదు అయినా ఇటు కిటికీ పక్కన ఉన్న ఇంటి వాళ్ళు పెరట్లో గోడ వెనుక ఉన్న ఇంటివాళ్ళు.. ఉప్పని పప్పని వండిన కూరగాయలని చాయలోకి పాలని ఇలా ఏదో ఒక దానికి వస్తూనే ఉండేవాళ్ళు లేదనకుండా అమ్మ ఎట్లా ఇచ్చేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు అప్పుడప్పుడు మేమే గొడవ చేసేవాళ్ళు .
“ఎందుకు వండిందంతా వాళ్ళకి పెట్టేస్తావని “అమ్మ అనేది “అట్లా అనొద్దు ఉన్నదాంట్లో పెట్టాలి కొంచెం అయినా… లేదు అని ఎప్పుడూ అనొద్దు. ఏ మనిషి అయినా డబ్బులు ఇచ్చినా బంగారం ఇచ్చినా ఏది పెట్టిన చాలు అనరు కానీ భోజనం పెడితే కడుపు నిండితే చాలు అంటారు అందుకే భోజనం పెట్టి పెట్టినాము అనే మాట అనకూడదు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగానే ఇవ్వాలి “అని చెప్పేది. అయినా అంత విశాల భావాలు నాకైతే లేవు.
ఇక ఎక్కువగా బాపు కిటికీలో అద్దం పెట్టుకొని షేవింగ్ చేసుకునేవారు పాపం బాపును చూస్తే మాత్రం అందరికీ భయమే.. బాపు ఇంట్లో ఉన్నంతసేపు కిటికీ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు బాపు ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత మెల్లిగా కిటికీ దగ్గరికి వచ్చి అమ్మను పిలిచేవాళ్ళు అక్క ఇలా వస్తావా అని…
ఎంత బిజీగా ఉండని అమ్మ చెటుక్కున వెళ్ళేది వాళ్ళు అడిగినవి ఇచ్చేది లేదా కొంచెం సేపు కబుర్లు చెప్పుకునే వాళ్ళు… అప్పటికి నాయనమ్మ “ఎంతసేపే ఆ ముచ్చట్లు” అనేది..
“మీ అత్త అసలు మాట్లాడుకోనీయదు” అని చెప్పి విసుక్కొని వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు.. కొన్నాళ్ళకి ఆ ఇంట్లో ఉన్న పెద్ద ముసలమ్మ చనిపోయింది …అప్పుడు మాకు కిటికీ దగ్గరికి వెళ్లాలంటే చాలా భయమేసేది 😨కిటికీ దగ్గరికి ఆమె వస్తుందేమో అని.. ఎక్కువసేపు ఆ కిటికీ దగ్గర గడిపే మేము తగ్గించాము.. ఆ గదిలోకి వెళ్ళినా కూడా కిటికీ వైపు చూసే వాళ్ళం కాదు ముఖ్యంగా రాత్రుళ్ళు.🌑
అటువైపు ఉన్న ఇల్లు మా బాబాయి ఇల్లు అని చెప్పాను కదా మధ్య మధ్యలో అతను వచ్చి మాట్లాడిస్తుండేవాడు ఒకసారి “నిన్ను పాస్ చేస్తా సెవెంత్ క్లాస్లో నాకు డబ్బులు ఇవ్వు “అని అడిగారు నిజంగానే అడుగుతున్నారేమో అనుకొని దీపావళి హారతికి వచ్చిన ఒక రూపాయి తీసి ఇచ్చాను అది తీసుకొని నవ్వుకుంటూ వెళ్లిపోయారు .ఆ తర్వాత మరొక రోజు వచ్చి ఆ కిటికీలో నుండి బిస్కెట్ పుడా ఇచ్చి “నీ రూపాయి నాకెందుకే ఊరికే అడిగిన” అని అన్నారు” అవునా🤔 నిజంగానా? నేను నిజంగా అడిగావు అనుకున్నా” అని చెప్పాను. నవ్వుకుంటూ బాబాయ్ వెళ్ళిపోయారు.
ఒకరోజు చీకటి పడింది ఆ కిటికీ తలుపులు (మూసేసుకున్నాము నాయనమ్మ పడుకుంటుంది కదా చలి వేస్తుందని …అయినా రాత్రులు ఆ కిటికీ వైపు చూడటం లేదు కదా..
కాసేపటికి కిటికీ చిన్నగా తట్టిన శబ్దం వినిపించింది ఆ తర్వాత మెల్లగా పిలిచినట్టు అనిపించింది భయంతో మెల్లమెల్లగా ఒక్క కిటికీ రెక్క చిన్నగా తెరిచాను బయటనుంచి “లక్ష్మి లక్ష్మి “అని పిలుపు వినిపించింది ఒక్కసారిగా భయపడిపోయి ఆ చనిపోయిన ముసలమ్మ వచ్చిందేమో అని భయంతో కేకలు వేసుకుంటూ అమ్మా! అమ్మా
చనిపోయిన ముసలమ్మ కిటికీ దగ్గరికి వచ్చింది “అని చెప్పాను…
“చనిపోయిన ముసలమ్మ రావడం ఏంటిది “అని అమ్మ వచ్చి కిటికీ మొత్తం తెరిచి చూసింది మా బాబాయి విపరీతంగా నవ్వుకుంటూ అక్కడ నిలబడ్డారు అది చూసి అమ్మ “చూడు ఎవరున్నారు అక్కడ అంత భయం అయితే ఎట్లా చనిపోయిన వాళ్ళు వస్తారా? ఎక్కడైనా” అని అన్నది అయినా నాకు భయమే చనిపోయిన ముసలామె ఇలా ఈ రూపంలో వచ్చిందేమో అని..
అలా అకిటికి ఎన్నో కథలకు సాక్ష్యంగా ఉంది ఆ తర్వాత కొన్నేళ్ళకు ఆ కిటికీలు మూసి వేసాము.