అందమైనకళ్ళు ,ఆకర్షణీయమైన ముఖం ,మయూరాలను తలపించే నాట్య విన్యాసం, అద్భుతమైన నటనల కలబోత శ్రీమతి హేమమాలిని గారు. నిర్మాత, దర్శకురాలు, చలనచిత్ర నాయిక, రాజకీయవేత్త ఇలా ఎన్నింటనో అభినివేశం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
హేమామాలిని అక్టోబర్ 16, 1948న తమిళనాడులోని ‘అమ్మన్ కుడి’ ప్రాంతంలో జన్మించారు. పూర్తి పేరు హేమామాలిని చక్రవర్తి .ఈమె తల్లిదండ్రులు జయలక్ష్మి చక్రవర్తి, వి. ఎస్.ఆర్ .చక్రవర్తి, తల్లి సినీ నిర్మాత. వీరికి హేమ మూడవ సంతానం. తన ఆరవ ఏట నుండి భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టి ఎనిమిదవ యేట
నే ‘ఆరంగేట్రం’ ఇచ్చారు .శ్రీ కిట్టప్ప పిళ్ళై తొలి గురువు. ఢిల్లీలో సిక్కల్ రామస్వామి పిళ్ళై దగ్గర,’ కళాక్షేత్ర’ మద్రాస్ లో ఇందిర గారి వద్ద నాట్యం అభ్యసించారు. కూచిపూడి శ్రీ వెంపటి చిన్న సత్యం గారి వద్ద, మోహిని ఆట్టం కళామండలం గురువు గోపాలకృష్ణన్ గారి వద్ద అ భ్యసించారు. శ్రీ కిట్టప్ప పిళ్ళై అనారోగ్య కారణం చేత తదనంతరం భరతనాట్య గురువుగా తనకంటే వయసులో చిన్నవాడైన ఎస్ .ఎఫ్ .శ్రీనివాసన్ గారి వద్ద శిష్యరికం చేశారు.
చెన్నైలోని ఆంధ్ర మహిళా సభలో, డి.టి.ఈ.ఏ .మందిర్ మార్గంలోనూ విద్యనభ్యసించారు. 12వ తరగతిలో చదువుకు స్వస్తి చెప్పి సినీ రంగప్రవేశంచేశారు.
తమిళ చిత్రం ‘ఇందు సతియం’ తో సహాయ నటిగా ‘తెరంగేట్రం ‘ చేశారు. 1965 లో ‘శ్రీకృష్ణ విజయం’లో చిన్న పాత్రలో కనిపించారు.’ జోహారు శిఖిపించమౌళి ‘అనే పాటలో (సీనియర్ ఎన్టీఆర్ గారు) కృష్ణుడిని కీర్తిస్తూ అద్భుతంగా నృత్యాభినయం చేశారు. 1968లో ‘సప్నోంకా సౌదాగర్ ‘తో హిందీ సినిమా హీరోయిన్ అయ్యారు. అప్పుడే ప్రేక్షకులు ఆమెను’ డ్రీమ్ గర్ల్ ‘గా పిలవడం మొదలుపెట్టారు. 1977లో ‘డ్రీమ్ గర్ల్ ‘పేరుతో సినిమా కూడా చేశారు. బాలీవుడ్ లో మొదటి సినిమా చేసిన నాలుగేళ్లలోనే టాప్ హీరోయిన్ గా నే కాకుండా శాస్త్రీయ నృత్య కళాకారిణిగా కూడా విశేష ఖ్యాతి గడించారు. చలాకీ అయిన పాత్రల్లో చక్కని నటన ప్రదర్శించిన ఈమె విభిన్నమైన పాత్రల్లో జీవించి మెప్పించారు. దాదాపు 150 చిత్రాల్లో నటించారు. ధర్మేంద్రతో వీరి తొలి చిత్రం ‘షరాఫత్ ‘(1970) ఇతనితో 28 చిత్రాలలో కలిసినటించారు. ‘షోలే’ సినిమాలో బసంతిగా గ్రామీణ నేపథ్యపు పాత్ర లో చలాకీగా నటించారు.తర్వాత 1979లో వీరి జంట వివాహ బంధంతో ఒకటైంది .ధర్మేంద్ర తో పెళ్ళి అనంతరం ఎన్నో చిత్రాల్లో నటించి విజయం కైవసం చేసుకున్నారు.’ ఏ క్ నయీ పహేలి ‘(1984)లో రాజేష్ ఖన్నా సరసన శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగా ఈమె నటన ఎంతో ప్రాచుర్యం పొందింది. .ప్రముఖ పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ‘వీరిద్దరిని ‘టాప్ జంటగా’ ప్రకటించింది. హేమ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇషా డియోల్ ,అహనా డియోల్. వీరిరువురూ సినీ రంగంలోనే కొనసాగుతున్నారు.
షారుక్ ఖాన్ ,దివ్యభారతి జంటగా ‘దిల్ ఆశ్నా హై’ సినిమాకు దర్శకత్వం వహించారు. తదనంతర టీవీ ,నాట్య రంగాలపై దృష్టి సారించారు. హేమ భరతనాట్య కళాకారిణిగా దర్శకత్వం వహించి నటించిన టీవీ సీరియల్ ‘నూపుర్ ‘
అత్యంత ప్రజాదరణ పొందింది.
జంతు ప్రేమికురాలు అయిన ఈమె ‘అనిమల్ రైట్స్ ఆర్గనైజేషన్’ సపోర్టర్, పి .ఈ .టి .ఏ .ముంబైలోని రద్దీ ప్రదేశాలలో గుర్రపు బగ్గీల రవాణాను నిషేధించాలని అలాగే తమిళ నాడుకు చెందిన ‘ జల్లికట్టు’ క్రీడను రద్దు చేయాలని బలంగా గొంతెత్తారు.
వివిధ నాట్యరీతులలో ఎన్నో నృత్య ప్రదర్శనలను దేశ విదేశాల్లో ఇచ్చి ప్రశంసలందుకున్నారు. 2007లో తులసీదాసు ‘రామచరిత మానస్’ లోని నరసింహ, రామ అవతారాలపై ప్రదర్శనలు ఇచ్చారు. మైసూరు ‘దసరా ఉత్సవాలలో’ సతి, పార్వతి,దుర్గాదేవిలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు .ఈమె స్వయంగా’ నాట్యవిహార్ కళా కేంద్రం’ నృత్యాలయం స్థాపించారు.
నదుల ప్రక్షాళన అవగాహన లో భాగంగా ‘గంగా నది’పై ప్రదర్శించిన సందేశాత్మక నృత్య కార్యక్రమం ఎంతో ప్రాచుర్యం పొందింది .ప్రదర్శన పై స్పందిస్తూ దివంగత నేత సుష్మా స్వరాజ్ గారు ఇలా వ్యాఖ్యానించారు: ఈ నాట్య ప్రదర్శన ద్వారా ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉందంటూ, ముఖ్యంగా వారణాసిలోని గంగా నది ప్రక్షాళన యొక్క ఆవశ్యకతను ఆమె బలంగా ఆకాంక్షించారు.
హేమ రెండు గంటల నిర్విరామ ‘రాధారాస్ బిహారి ‘నృత్య ప్రదర్శన న్యూఢిల్లీలో ప్రదర్శించి, ఆపై నాగపూర్ లో నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో” ఖస్ దళ్
సాంస్కృతిక మహోత్సవం’లో అదే ప్రదర్శన ఇచ్చారు. ఆమె వేషధారణ దేవతా స్వరూపంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆమె ను చూసి’ లివింగ్ మిరాకిల్’ గా గడ్కరి అభివర్ణించారు. జైపూర్ ఫిక్కీ ‘ఆధ్వర్యంలో ముంబై కి చెందిన 45 మంది సభ్యులతో కూడిన బృందంచే బిర్లాఆ డిటోరియంలో రాధాకృష్ణ బ్యాలె’ రా స్ లీల ‘ప్రదర్శించారు .
ద్వాపర యుగంలో కృష్ణుని జీవిత విశేషాలతో కూర్చిన ఈ ప్రదర్శనలో కృష్ణుని యవ్వన లీలలు, వేణు గాన మాధుర్యం, గోపికా బృందంతో చేసిన నృత్య రీతి ‘ రాస్ లీలా’ రాహుల్ డిసౌజా తో (కృష్ణుడు గా) కలిసి అత్యంత హృద్యంగా నర్తించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు.
తన ఇద్దరు తనయలతో
కలిసి ఒడిస్సీ నృత్య రీతిలో ‘పరంపర ప్రొడక్షన్ ‘తరఫున
‘ఖజురహో ఫెస్టివల్లో ‘అద్భుతంగా నర్తించారు.
హేమ వివిధ సందర్భాల్లో తన మనోభావాల్ని ఇలా పంచుకున్నారు:
నటనను నాట్యాన్ని సమన్వయం చేసుకోవడంలో ఎన్నోసార్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. పగలంతా షూటింగ్ లో పాల్గొని సాయంత్రం డాన్స్ ప్రదర్శనతో చాలా కష్టమైన సందర్భాలు ఎన్నో! అలాంటప్పుడు గురువులను అవుట్ డోర్ షూటింగ్ లకు తీసుకు వెళ్ళి అక్కడే నాట్య సాధన చేసేదాన్ని.
భరతనాట్యం ,కూచిపూడి, మోహిని ఆట్టం, కథాకళి ,బాలీవుడ్ డాన్స్ ఇలా అన్ని రీతులలో ప్రదర్శనలిచ్చి, నన్ను నేను నిరూపించుకునేలా నాకు చక్కటి తర్ఫీదు ఇచ్చిన నా గురువులందరికీ సదా కృతజ్ఞురాలిన అంటూ సవినయంగా విన్నవించుకున్నారు.
ఒక శాస్త్రీయ నృత్య కళాకారిణి అయిన ఈమె ఫిలిం డాన్సలను స్టేజీల పై ప్రదర్శించడానికి ససేమిరా అంగీకరించేవారు కాదట. ఈమెప్రతిభను మెచ్చి ఎన్నో పురస్కారాలు వరించాయి.
2012లో ‘సర్ పదం పత్ సింఘా నియా’ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.
భారతీయ సంస్కృతి ,నృత్య సంప్రదాయాలలో ఆమె సేవలకు గుర్తింపుగా ఢిల్లీకి చెందిన ‘భజన్ సపోరీ ‘సంస్థ ‘ విటస్టా’ పురస్కారంతో గౌరవించింది.
ఫిలింఫేర్ ‘లైఫ్ టైం అచీవ్ మెంట్’ అవార్డు 2000 సంవత్సరానికి గాను పొందారు.
ఇస్కాన్ సొసైటీ సభ్యురాలు.
జాతీయ సినిమా అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ గా వ్యవహరించారు.
2003 నుండి 2009 వరకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు.
సినిమా ,నృత్య కళలకు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది
నృత్యాభినయాలతో అలరించి విశేష సేవలు అందించినందుకు గాను ఆమెను నృత్య దినోత్సవం సదర్భంగా అక్షర పుష్పగుచ్ఛం తో అభినందించి గౌరవించడం ఒక బాధ్యత అని నా భావన