సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఆమె కలం నుంచి కాగితం పై అక్షరాలుగా మారాయి. ఆమే వృత్తి ప్రవృత్తి రచనా వ్యాసంగమే. ఆమే ప్రఖ్యాత కవయిత్రి, కీర్తి పురస్కార గ్రహీత శైలజామిత్ర గారు. ఈ వారం తరుణి ముఖాముఖి లో భాగంగా సాహితీవేత్త శైలజా మిత్ర గారి గురించి తెలుసుకుందాం……
తరుణి: ఇటీవల కీర్తి పురస్కారం అందుకున్న మీరు తరుణి పాఠకుల తరపున అభినందనలు. మీ గురించి, మీ కుటుంబ గురించి కాస్త వివరిస్తారా ?
శైలజా మిత్ర : తరుణి పాఠకులకు ధన్యవాదాలు. నా పేరు శైలజామిత్ర. మాది చిత్తూరు. నేను పుట్టింది చిన్నగొట్టిగల్లు, చిత్తూరు జిల్లా, ఆంద్రప్రదేశ్. మా నాన్నగారు తెలికిచెర్ల శేషగిరిరావు, రిటైర్డ్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, పూతలపట్టు, చిత్తూరు జిల్లా. అమ్మ తెలికిచెర్ల అనసూయాదేవి. నాకు ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క, ఒక చెల్లి. భర్త మటేటి సత్యమిత్ర, వ్యాపారవేత్త. పిల్లలు కొడుకు,మటేటి వనమాలి(ముంబయి) కూతురు,సుచరిత విఘ్నేష్( మద్రాసు) ఇది నా చిరు పరిచయం. నాన్నగారు విద్యావేత్త కావడంతో ఇంట్లో అంతా చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము. అందరూ పోస్టుగ్రాడ్యువేషన్ చేసి ఎవరి వృత్తుల్లో వారు సముచితమైన స్థానంలోనే పనిచేస్తున్నారు. కానీ నేను ఎంఏ ఆంగ్లం( శ్రీవేంకటేశ్వరా విశ్వవిద్యాలయం), ఎంఏ తెలుగు(ఉస్మానియా విశ్వవిద్యాలయం) పిజిడిసిజె (రచన జర్నలిజం కళాశాల,) చదువుకుని జర్నలిస్టుగా, కాలమిస్టుగా నేటినిజం, ఆంధ్రభూమి, వార్త మొదలగు పత్రికలలో ఫ్రీలాన్సర్‌గా పనిచేసాను. వృత్తి, ప్రవృత్తి అంతా రచనా వ్యాసంగమే కావడం నేను అదృష్టంగా భావిస్తాను. సంగీతం, సాహిత్యం నాకు రెండు కళ్ళు.
తరుణి: మీరు సంగీతం నేర్చుకున్నారా? మరి ఎందుకు సాహిత్యం వైపు వచ్చారు?
శైలజా మిత్ర: శాస్త్రీయ సంగీతం ఐదేళ్ళు అభ్యసించాను. శాస్త్రీయ సంగీతం పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. అనేక పాటలు పాడేదాన్ని. గాత్రం పోవడంతో సాహిత్యానికే ఎక్కువ సమయాన్ని కేటాయించాను.
తరుణి:సాహిత్యంపై ఆసక్తి ఎలా కలిగింది?
శైలజా మిత్ర: నాకు చిన్నతనం నుండి సంగీతమన్నా, సాహిత్యమన్నా ఎంతో ఇష్టం. అలాగని మా కుటుంబంలో ఎవరూ సాహిత్యంలో లేరు. కానీ ఇంటికి అనేక పుస్తకాలు, తెలుగు, ఆంగ్లం అన్నీ వచ్చేవి. కానీ వాటిని చదవడానికి మా నాన్న అనుమతించేవారు కారు. కాకుంటే ఎక్కువ యద్దనపూడి, డి కామేశ్వరి, కోడూరి కౌసల్యాదేవి, యండమూరి, కొమ్మూరి వేణుగోపాలరావు, చలం వంటి వారు రచించిన రచనలపై అమ్మ, నాన్న ల మధ్య చర్చ జరిగేది. అపుడప్పుడూ వింటున్న నేను నాకే తెలియకుండా నాలోని భావాలను చదువుకుంటున్న పుస్తకాల వెనకాల రాసుకోవడం అలవాటుగా ఉండేది. రాయాలని ఆసక్తిగా ఉండేది. అది గమనించిన మానాన్న గారు చదువును పక్కకు పెట్టి ఇలాంటివి రాయడం మంచిది కాదని చెప్పడంతో రాయడం ఆగింది.
తరుణి: మీ మొదటి రచన ఎప్పుడు, ఏ పత్రిక లో వచ్చింది?
శైలజా మిత్ర: డిగ్రీ చదువుతుండగా ఒక కవితను ఈనాడు పత్రికకు పంపించాను. అది వెంటనే ప్రచురింపబడటంతో ఎంతో ప్రోత్సాహం కలిగింది. ఆ తర్వాత కాలేజీ మేగజైన్‌లో ఒక కవిత రాయడం, అపుడు అందరి నుండి ప్రశంసలు లభించడం నేను రాయగలననే నమ్మకం కలిగించింది. ఆ తర్వాత వివాహం, పిల్లలు వల్ల దాదాపు పది సంవత్సరాలు రచనలను జ్ఞాపకం కూడా చేసుకోలేదు. 1995 సంవత్సరంలో ఆంధ్రభూమి వారపత్రికకు కోయిలా కోయిల అనే శీర్షికకు కవితలు పంపాను. వారు సుమారు 15 కవితలను ప్రచురించి ప్రోత్సహించడం నన్ను నన్ను కవయిత్రిగా నిలబెట్టింది. అలాగే నా మొదటి కథ, నా మొదటి నవల కూడా ఆంధ్రభూమి ద్వారానే ప్రచురింపబడటంతో నాపై నాకు నమ్మకం కలిగింది.
తరుణి: ఇప్పటివరకు మీరు రాసిన ప్రక్రియలు?
శైలజా మిత్ర: సాహిత్యం లో అనేక ప్రక్రియల్లో రచనలు చేశాను. కవితలు, కథ, నవల, సమీక్షలు, విమర్శనా వ్యాసాలు, సాంఫీుక వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, మినీ కవిత్వం, దీర్ఘకావ్యం, అనువాదాలు, లేఖాసాహిత్యం, బాలసాహిత్యం వంటివి అనేకం నా సాహితీ ప్రయాణంలో చోటు చేసుకున్నాయి.
తరుణి: మీరు ఇప్పటి వరకు ప్రచురించిన పుస్తకాలు
శైలజా మిత్ర: పది కవితా సంపుటిలు( శంఖారావం, మనోనేత్రం, నిశ్శబ్ధం, అక్షరయుద్ధం, అంతర్మథనవేళ, రాతిచిగుళ్ళు, అగ్నిపూలు, సృష్టికేతనం, తడిసి ముద్దయిన కాలం, సిల్వర్ లైన్స్, మూడు కథా సంపుటిలు ( తరంగాలు, అడ్డా, ఆధునిక పంచ్ తంత్ర కథలు) 12 అనువాద గ్రంథాలు, దీర్ఘకావ్యం,(సృష్టికేతనం, మహిళా సమస్యలపై వచ్చిన మొట్టమొదటి దీర్ఘకావ్యం) మినీ కవిత్వం, ( అగ్నిపూలు) ప్రచురించాను.
తరుణి: ఇప్పటివరకు మీరు అందుకున్న అవార్డులు?
శైలజా మిత్ర: ఇటీవల
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ రచయిత్రిగా కీర్తి పురస్కారం అందుకున్నాను. అఖిలభాషా సాహిత్య సమ్మేళన్, భోపాల్ వారిచే ‘‘సాహిత్యశ్రీ’’ బిరుదు, ఉత్తమ కవయిత్రిగా శ్రీశ్రీ పురస్కారం, దాశరధి సాహితీ పురస్కారం, ఉత్తమ విమర్శకురాలిగా జోత్సకళాపీఠం వారిచే ఉగాది పురస్కారం, దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం, జ్వాలాముఖి సాహితీ పురస్కారం, ఉమ్మడిశెట్టి కవితా పురస్కారం, వంటి అనేక పురస్కారాలు ఇచ్చారు. ఉత్తమ కవయిత్రిగా, రచయిత్రిగా అనేక సత్కారాలు అందుకున్నాను.
తరుణి: ఇప్పుడు రాస్తున్న పుస్తకాల గురించి చెప్పండి.
శైలజా మిత్ర: జన్మించడమే కవిత్వం( కవిత్వం), వష్టి( కథా సంపుటి), శోధన( విమర్శనా గ్రంథం) శిశిరం శాశ్వతం కాదు( నవల) ప్రచురణకు సిద్దమవుతున్నాయి.
తరుణి: భవిష్యత్ ఎలాంటి రచనలు చేయాలన్న ఆలోచన ఉంది?
శైలజా మిత్ర: అనేక ప్రక్రియల్లో రచనలు చేశాను. అయితే మరిన్ని పరిశోధనా వ్యాసాలు రచించాలని, స్త్రీల సమస్యల పరిష్కార దిశగా నవలలు రచించాలని నా భవిష్యత్ ప్రణాళిక.
తరుణి: మీకు ఆనందాన్ని కలిగించే అంశం?
శైలజా మిత్ర: మహిళ అంటే ఒకరి కూతురుగానో, మరొకరి భార్యగానో, బిడ్డకు తల్లిగానో కాకుండా తనకంటూ తన ప్రత్యేక ఉనికి ఉండాలనేది నా ఆశయం. అందుకు ఎన్ని అవరోధాలు ఎదురైనా పట్టించుకోకుండా సాహిత్యరంగంలో నిలబడ్డాను. అదే నాకు ఆనందం.