తల్లిదే బాధ్యత…

 

డా.నీలం స్వాతి,

అమ్మ జన్మ ఎంత గొప్పదో వర్ణించాలంటే అక్షరాలను అరువడగాలి. అమ్మ ప్రేమ ఆ వెన్నెల కాంతి కంటే చల్లనైనది.
నవమాసాలు మోస్తునప్పుడు, ప్రసవ వేదనను అనుభవిస్తున్నప్పుడు
ఆ తల్లి పడే వేదనను అభివర్ణించాలంటే, అక్షరాలుగా మలచాలంటే సిరాకలంలో రక్తాన్ని నింపి, తనువెల్ల గాయాలతో రాతల రాగాలను పలికించాలి అప్పుడే అది సాధ్య పడుతుంది. పుట్టిన ప్రతి పసికందుకు అమ్మ ఒడే మొదటి ప్రపంచం. పాల చుక్కల తీయదనాన్ని, పాల బువ్వ కమ్మదనాన్ని అమ్మ పొత్తిళ్లలోనేగా ఆ చిన్నారులు రుచి చూసేది. చిట్టి పొట్టి పాదాలతో ఆ చిన్నారులు వేస్తున్న అడుగులను, బోసి బుగ్గల నవ్వులను చూస్తూ ఆ తల్లి కాలాన్ని మర్చిపోతుంటుంది. చిన్నారులకు వయసు పెరిగే కొద్దీ అవగాహన మెరుగుపడడం ప్రారంభమవుతుంది. పిల్లలు ఆటల పాటల సరదాలకు మరలగానే తల్లికి కాస్తంత వెసులుబాటు దొరుకుతుంది. ఎదుగుతున్న కొడుకుని, కూతురిని చూసుకుంటూ తాను తన బాల్య స్మృతులను నెమరువేసుకుంటుంది. అయితే ఇక్కడ సమస్య… ఎక్కడని అనుకుంటున్నారేమో?


అసలు సమస్య ఇక్కడి నుంచే మొదలయ్యేది. ఒక విధంగా చెప్పాలంటే తల్లి బాధ్యత కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది మరీ ముఖ్యంగా
ఆడపిల్లల పట్ల. అందమైన అమాయకత్వం తప్ప ఆ చిన్నారులకు ఏమీ తెలియదు. పిల్లలకు పరిచయాలు అవసరం లేదు ప్రేమగా పలకరిస్తే చాలు వారి ఒళ్లో వాలిపోతారు. కానీ పసి పిల్లలను పసిపిల్లలుగా చూసే రోజులు కావివి. ఆడపిల్ల కనిపిస్తే చాలు వయసుతో పని లేదు మీద పడి కామవాంఛలు
తీర్చుకోవడమే. ఒకడు చాక్లెట్ పేరు చెప్పి చేతులేస్తే, మరొకడు అక్షరాలను దిద్దిస్తూ
అవసరాలను తీర్చుకుంటాడు వావి వరసలు మరిచిపోయి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, అభం శుభం తెలియని పసికందుల అందమైన బాల్యాన్ని
భయానకంగా మార్చేస్తుంటారు.
ఇలాంటి యాతనను అనుభవించిన, అనుభవిస్తున్న పసి హృదయాలకు బాల్యమనేది ఒక పీడకల.
పసితనపు పరదాలు మెల్లమెల్లగా జాడవిడుస్తున్నప్పుడు శారీరక
అవయవాల పట్ల వారికి అర్థమయ్యేంత మేర, అర్థమయ్యేంత వరకూ ఓపికగ అర్థమయ్యేలా తల్లే
చెప్పాలి. పిల్లలకు “good touch bad touch” పట్ల అవగాహన పెంచాలి. ప్రైవేట్ పార్ట్స్ ( స్థనము, జననేంద్రియము, నితంబము) లాంటి ప్రదేశాలలో ఎవరైనా ముట్టుకొని ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు, వారిని వారు రక్షించుకునేలా, అలాంటి వారి ప్రవర్తనను ఖండించేలా తల్లే మెళకువలను నేర్పాలి. ఎందుకంటే ఇలాంటి సున్నితమైన విషయాలను తల్లి మాత్రమే తన పిల్లలకు వివరించగలదు. ఆడపిల్లలకు తల్లి దగ్గరే చనువు బాగా ఎక్కువ. అందుకే ఏ విషయాన్నైనా మొదట తల్లికి చెప్పడానికి ఇష్టపడతారు అమ్మాయిలు. తల్లి కూడా
ఆడపిల్లలతో ఒక స్నేహితురాలిగా మెలగాలి అప్పుడే వారు వారికి జరిగిన
ఘటనలను స్వేచ్ఛగా వివరించగలగుతారు.
తల్లి కూడా పిల్లల మాటలను పెడచెవిన పెట్టకుండా విశ్లేషించాలే కానీ, సమాజం గురించి ఆలోచించి మౌనంగా ఉండి పోకూడదు.
ఆడపిల్లలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ప్రస్తుత కాలంలో చాలా అవసరం. ఆత్మరక్షణ కోసం కరాటే లాంటివి నేర్చుకోక తప్పదు. ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలు కూడా వాస్తవిక వైనాలను బట్టబయలు చేసేలా రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు ఆడపిల్లలను కంటే ఖర్చులు కట్నాలు అని ఆలోచించేవారు కానీ విజ్ఞానం పెరగడంతో ఆడపిల్లలను కనడానికి కాదు వారిని కాపాడుకోవడమే పెద్ద సమస్యగా మారింది? అన్ని వేళలా తల్లిదండ్రులు వెంటే ఉండలేరు అందుకే వారిని వారు కాపాడుకునే విధంగా
వారిలో మనోధైర్యం వృద్ధి చెందేలా తయారు చేస్తూ, జాగ్రత్తలను నేర్పిస్తూ పెంచాలి.
లేకుంటే ఆడపిల్లలు అబలలుగానే మిగిలిపోతారు.
ఓసారి మీరు ఆలోచించండి….

Written by Dr.Neelam Swathi

చిన్న చెరుకూరు గ్రామం,
నెల్లూరు.
6302811961.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“నాతిచరామి”

ఆపాత మధురాలు part 6