నా లాగ ఎందరో

సుమలత దేశపాండే

ఆరోజు మా అమ్మ తిథి. ప్రతిసారిలాగే వృద్ధాశ్రమానికి బయల్దేరాను.ఎందుకో అక్కడున్న వాళ్ళను,… వాళ్ళ పిల్లలకోసం… పడిగాపులు పడుతూ ఎదురుచూసే..వారి కన్నీళ్ళను చూస్తే నాకు అమ్మ నాన్న, వారి అంతులేని ప్రేమ గుర్తొస్తాయి. కని,పెంచిన తల్లిదండ్రులను చిన్న వయసులోనే పోగొట్టుకున్న దురదృష్టవంతురాలిని నేనైతె,.. ఉండికూడా లేనివాళ్ళలాగా.. ప్రవర్తించే వారి పిల్లలు నాకన్నా.. దురదృష్టవంతులే కాదు, నికృష్టులు కూడా… ఎంత ప్రేమగా వారి పిల్లల్ని పెంచుకున్నారో,.. ఎన్నెన్ని త్యాగాలు తమ పిల్లలకోసం చేసారో.. పాపం! ఎదిగిన పిల్లలు మాత్రం అవన్నీ మర్చిపోయి, బాధ్యతా రహితంగా, స్వార్థచింతన తప్ప మరేమీ లేని కృతఘ్నులుగా, ఇంత క్రూరంగా ఎలా మారిపోయారో? ఇదేనా.. మన దేశ పురోగతి??? అంటే.. ఏమో?
కారు వృద్ధాశ్రమం ముందు ఆగగానే ఆలోచనల్లోంచి తేరుకుని, చీరల బాగ్, స్వీట్ డబ్బాలు పట్టుకుని లోనికెళ్ళాను…
ఇదివరకటి పరిచయాన్ని పురస్కరించుకుని గేట్ కీపర్ దగ్గర్నించీ అందరూ సాదరంగా ఆహ్వానించారు.
అప్పుడే అక్కడ ఉన్న రామ మందిరంలో పూజ అయిపోయింది కాబోలు, నడవగలిగిన వాళ్ళు నడుస్తూ,మరి  కొందరు ఎవరో.. ఒకరి ఆసరా తీసుకుని నడుస్తూ…లోనికి వస్తున్నారు. నన్ను చూడగానే, ‘వచ్చావా తల్లీ ‘ అంటూ అందరూ ఆప్యాయంగా పలకరించారు. వారి గొంతులోని మార్థవంలో అమ్మ గుర్తొచ్చి నా కళ్ళు చెమర్చాయి.
అందరూ హాల్లో కూర్చోగానే, స్వీట్లు, పళ్ళు, చీరలు ఒక్కొక్కరికే ఇస్తూ వచ్చాను. చివరగా, కాస్త దూరంలో ఒక కుర్చీలో ముడుచుకుని కూర్చున్న ఒకావిడను చూడగానే, నా చేతిలోని బ్యాగ్ ఇవ్వడానికి కాస్త తడబడ్డాను…
నా తడబాటు చూసి ఆమె చిన్నగా నవ్వింది.
‘మీరు….ఇంత చిన్న వయసులో…?’
‘ఇక్కడెందుకున్నానని అనుకుంటున్నారా?’ పూరిచింది ఆమె.
‘అవును.’ నలభై అయిదేళ్ళకన్నా మించి ఉండవు ఈమెకు, అని మనసులో అనుకుంటూఉండగానే
‘ఈరోజు మీ అమ్మగారి తిథి అని విన్నాను. చాలా మంచిపని చేస్తున్నారు.మీ అమ్మగారి ఆత్మ శాంతిస్తుంది.’
‘థాంక్ యు. వీళ్ళందరూ దాదాపు మీ..అమ్మగారి వయసువాళ్ళు, లేక మరికొంచెం పెద్దవాళ్ళు. అందుకే అమ్మలాంటి వాళ్ళు.’
‘అవునా? మరి నేను? అక్కలాంటిదాన్నవొచ్చా?’అంది నవ్వుతూ..
‘తప్పకుండా,’ అన్నాను ఆమె స్నేహపూరిత వాత్సల్యానికి సంతోషిస్తూ.
‘నాపేరు జయ. అపుడప్పుడూ వస్తుండండి. మీతో మాట్లాడితే.. నాకు బాగుంది.’ అంది నేను సెలవు తీసుకుంటుండగా…
అలా జరిగిన మా పరిచయం స్నేహంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు.
ఒక ఆదివారం, ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు ధైర్యం చేసి అడిగాను, ఇంత చిన్న వయసులో ఆశ్రమంలో చేరడానికి కారణమేమిటని.
ఆమె ముఖం వివర్ణమై చిన్నబోయింది.
‘సారీ, అలా అడిగినందుకు. మీకు బాధ గలిగిస్తే క్షమించండి,’ అన్నాను నొచ్చుకుంటూ…
‘అయ్యో, అదేం లేదు లతా..నీతో కాకపోతే మరెవ్వరికి చెపుతాను.’
ఏదో నెమరు వేసుకుంటున్నట్లుగా ఆమె కళ్ళు శూన్యంలోకి చూడసాగాయి…
మౌనంగా ఆమెవేపే చూస్తూ.. కూర్చున్నాను, అడిగి ఉండకూడదేమో? అని మనసులో పశ్చాత్తాప పడుతూ… ఆమె చెప్పడం మొదలు పెట్టింది..
‘నాకు పదిహేనేళ్ళు వచ్చినా పీరియడ్స్ రాకపోయేసరికి మా అమ్మ నన్ను లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది.’ నెమ్మదిగా మొదలుపెట్టింది. ‘అన్ని పరీక్షలూ చేసిన డాక్టర్ నాకు అసలు యూట్రస్ (గర్భసంచీ) లేదని తేల్చి చెప్పింది. పెళ్ళికి కూడా పనికి రానని.’ ఆమె గొంతు కాస్త వణికింది…
ఆమె చేయి నా చెతిలోకి తీసుకున్నాను సపోర్ట్ గా.. పదిహేనేళ్ళు వచ్చే వరకు నేనూ.. అందరి ఆడపిల్లల్లాగే ఆడుకుంటూ.. పాడుకుంటూ.. బడికి వెళ్తు హాయిగా ఉన్నాను.. ఆ తరవాత ఒక రోజు అమ్మ లేడీ డాక్టర్ వద్దకు తీసికెళ్ళింది.. అప్పట్నుంచి మొదలయింది ఇంట్లో టార్చర్..మానసిక క్షోభ నాలో.. “ఇది అందరు ఆడపిల్లల్లా.. కాదు దీనికి పెళ్ళి కాదు.. ఎవ్వరు చేసుకోరు.. ఛీ, ఛీ.. ఇది ఎందుకు పుట్టిందో.. నా ఖర్మ కాకపొతే.. జన్మతః వచ్చిన శారీరక లోపం.. నా తప్పేంటో.. తెలియదు.. ఇంట్లో ప్రతి ఒక్కరూ చీదరించుకునే వారే..ఎలాగో.. పదవతరగతి వరకు తిట్టకుంటూ, మొట్టుకుంటూ.. చదివించారు.. ఆ తరవాత కాలేజీ కి వెళ్ళి ఎవర్ని ఉద్దరిస్తావు?నీకు తిండి పెట్టడమే, దండగ.. పైగా, కాలేజీ చదువులు చదివించాలా?? ఇంట్లో ఉండి పనులు చేసుకో.. అని నాన్న కఠినంగా చెప్పేసాడు.. కొన్ని రోజులకు అన్నయ్యకు
పెళ్ళి కావడం.. వదినను తీసుకుని.. ఇంట్లోనుంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టడం.. వెంటనే జరిగిపోయాయి.. దానికి కారణం వదిన అని తెలిసినా.. నెపం మాత్రం నాపైనే.. వాళ్ళను చూసి ఓర్వలేక పోయానని.. చిలక, గోరింకల్లా ఉన్న.. అన్నా, వదినలను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నానని.. అభాండాలు వేసి సాధించారు.. తల వంచి నా పని నేను చేసుకుపోవడం తప్ప.. మరేం చేయలేక పోయాను.. కన్నవాళ్ళే నన్ను నమ్మలేక పోయినప్పుడు.. ఇంక పరాయివాళ్ళకెందుకుంటుంది??? మరికొంత కాలానికి చెల్లికి, తమ్ముడికి కూడా.. పెళ్లిళ్లు ఐపోయాయి.. ఏ పెళ్ళికి.. నేను వెళ్ళకూడదు.. నన్ను దూరంగా ఉంచారు.. నా తోబుట్టువులు బాగుండాలని.. సంతోషంగా ఉండాలని, తప్పితే.. ఏ మాత్రం అసూయ లేదు నాకు.. కానీ, వాళ్ళందరూ నన్ను అర్ధం చేసుకోకుండా.. లేని, పోనివి ఊహించు కుని, నన్ను సాధించడం మొదలు పెట్టారు.. రాను, రాను బ్రతుకు దుర్భరమైపోయింది.. ఐనా సరే.. మారు మాట్లాడకుండా.. అన్నీ దిగమింగి.. జన్మ నిచ్చిన తల్లి దండ్రుల.. ఋణం తీర్చుకోవాలని.. జీవితాంతం వారి సేవలో.. నా బ్రతుక్కి.. అర్ధం, పరమార్ధం వెతుక్కోవాలని.. అనుకున్నాను. కానీ.. విధి వక్రించి.. వాళ్లకు వంకర ఆలోచనలు వచ్చాయి.. అమ్మ, నాన్నలు ఎక్కడ నాపై జాలిపడి.. నాక్కూడా ఆస్తిలో వాటా రాసిస్తారేమో అనీ భయపడ్డారు.. అందరు కలిసి..నన్నీ వృద్దాశ్రమంలో.. చేర్పించారు.. చేతుల్లొ ముఖం దాచుకుంది.
ఆ షాకింగ్ విషయాలు విని, నా మనసు కూడా.. ఆమె పట్ల ఆర్ధ్రమయిపోయి కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. ఏం మాట్లాడాలో, ఎలా ఓదార్చాలో తెలియక ఆమె తల నిమురుతూ ఉండిపోయాను.
కాసేపటికి తనే ముందు తేరుకుని, ‘అదేంటి లతా, నీ కళ్ళల్లో నీళ్ళు. సారీ, నా కధచెప్పి నిన్ను.’ అంటూ పేలవంగా నవ్వింది. ‘ఏంచేస్తాం చెప్పు? విధి చేసిన అపహాస్యాన్ని.. సమాజం ఆమోదించలేకపోవడంఅంతే. నాలాగ ఎందరో???అంది.. భాధాతప్త హృదయంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రథమ వైద్యురాలు – ఆనందీబాయి జోషి

“నిజమైన పొందిక”