సమీక్షా వ్యాసం

బోయకొట్టంబుల్వణ్డ్ఱెణ్డు బోయకొట్టములు పండ్రెండు
చారిత్రక నవల
రచయిత– భాషా ప్రవీణ-
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్లై.

బోయకొట్టంబుల్వణ్డ్ఱెణ్డు
అనేది రచయిత పెట్టిన శీర్షిక. పండరంగని అద్దంకి శాసనం క్రీస్తుశకం 848. ఈ శాసనం లో 12 వరుసలలో ఒక జాబితా ఉన్నది. ఒక్కొక్క వరుసకు ఒక్క తీరుగా రాసి ఉన్నది ఉదాహరణకు:-
1.పట్టంబు గట్టిన ప్రధమంబు నేణ్డు బలగవ్వన్.
2. …… భూపాల కుణ్డు
3. పట్టంబు గట్టిన ప్రధమంబు నేణ్డు బలగవ్వ౯౦
౪. పృగ బైలేచి సేన ( 1″) పట్టంబుగట్టిఞి ప్రభుం
౫. కొట్టంబు ల్వణ్డెండు(0*)బ(ణ్చి)న సామ(0)త్త పదువతో బోయ
౬. కొట్టంబు ల్వణ్డెణ్డు గొణి వేంగి నాట్టిం గొఱల్చియ
౭. త్రిభువనాంకుశ బాణ నిల్పి కట్టెపు దుగ్గ౯౦ గడు
౮. బయల్సేసి కణ్డుకు బ్బె౯జవాడ గావిఞ్చె మెచ్చి
౯. పణ్డరంగు తమ మహేస్వరుణ్డు అదిత్యబటరని
౧౦. కి ఇచ్చిన భూమి ఎనిమిది వుడ్ల అడ్లు పట్టునేల ద
౧౧. మ్మ పురంబును ౬ దమ్మువులు విని రక్షిఞ్చిన వారికి అస్వ
౧౨.మేదంబున పలం(బు) అగు

కాన్పింపనిక కథలు
…… భూపాల కుండు.
… ….. … ….. …
అద్దంకిలో శ్రీ కాళికా సమేత కమఠేశ్వరస్వామి దేవాలయం ముందర స్తూపముగా నిలబడిన ఈ శాసనం….. మామూలుగా మనలాంటి వారు ఒకసారి చూసి దేవాలయంలోనికి వెడతాం… కానీ రచయిత శ్రీ బాలసుబ్రమణ్యం పిళ్లై గారు మాత్రం దాన్ని పదేపదే చదివి ఈ శాసనంలోని వృత్తాంతాన్ని కథావస్తువుగా చారిత్రక నవల రాయవచ్చును కదా! అని ఆలోచించారు.
వారి ఏమన్నారంటే దేశంలో ఎక్కడైనా సరే కిందపడిపోయిన స్తంభం వెనుక ఒక చరిత్ర, కూలిన ఒక గోడ కింద ఒక కన్నీటి కథ ఉంటుందని, మరియు” రణరంగం కానీ చోటు భూమి మొత్తం వెదికినా దొరకదని” వేంగి చాళుక్యులలో రెండవ విజయాదిత్యుడు 12 వ సంవత్సరంలో 108 యుద్ధాలు చేశాడట. అంటే ఒకే చోట కాదు చూడండి ఎంత రక్తపాతం ఎంత మారణహోమం?

సమీక్షకురాలు : రంగరాజు పద్మజ

ఆ పాపపరిహారార్థ 108 శివాలయాలు కట్టించాడట. ఆ రక్త గాథలు, ఆ కన్నీటి కథలు తెలుసుకున్నప్పుడే మన చరిత్ర తెలుస్తుంది. అయితే ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున కాన్పించని కథలు చెప్పాలని అందుకు ఆ శిలాశాసనం మీద నవల రాయాలనుకున్నారట. అసలు శాసనంలో రాయబడిన దాని అర్థం ఏమిటంటే “పాండురంగడు అనే చాళుక్య సేనాధిపతి సామంత సైన్యంతో దండెత్తి… పం డ్రెండు బోయకొట్టములులను స్వాధీనం చేసుకొని , కట్టెపు దుర్గమును నేలమట్టముచేసి, కందుకూరును, బెజవాడ వలె పటిష్టము గావించెను. ఆదిత్యబటరనికి ధర్మ పురమున కొంత భూమి దాన మిచ్చెను”. ఇది ఈ శాసనంలోని విషయం. కొట్టమంటే తాటాకుల కొట్టమో, పూరి కొట్టమో కాదని, కొట్టమనగా ఒక పరిపాలనా విభాగమని (అంటే ఇప్పటి మండలం వలె) దమ్ము లో 12 అని చెప్పడంలో అర్థం ఏమిటి అంటే పన్నెండు కూటములు కలిస్తే ఒక ప్రాంతం అని కావచ్చు…. ఇప్పుడు కూడా ఇట్లాంటి వింటాం కదా” చత్తీస్ ఘడ్” ! 36 కోటలు అని అర్థం, 24 పరగణాలు… ఇవి కూడా అలాంటిదే. అయితే పండురంగడు బోయకొట్టములు మీదికి ఎందుకు దండెత్తి పోయాడు? అవి ఎక్కడ ఉన్నవి? కట్టెపు దుర్గం ఎక్కడిది? గెలిస్తే దానిని స్వాధీనం చేసుకొని, తన రాజ్యంలో కలుపుకొని, దానిని”గడీ దుర్గంగా”చేసుకోక, “కడుబయలు నేలమట్టం” చేయడానికి కారణాలు ఏమిటంటే? అనే రచయిత పరిశోధనలో ఆశ్చర్యం కలిగించేలాఎన్నో వింత విషయాలు బయటపడ్డాయి. అవే బోయలు ఆ ప్రాంతం వాళ్ళు కాదని, నల్లమల అడవుల నుండి వలస వచ్చారని, చరిత్రకారులు ఊహించారు. అయితే వాళ్లు ఎప్పుడు? ఏ ప్రాంతాల నుండి వలస వచ్చారని? ఒక సందేహం!
పాండురంగడు ఆదిత్య బటరనికి ధర్మవరంలో కొంత భూమిని దానం చేసినట్లు ఒక శాసనంలో ఉన్నది. అతను ఎందుకు ఇచ్చాడు? ఆ అవసరం ఏమిటి? ఆ బ్రాహ్మణుని ప్రాముఖ్యత ఏమిటి? వీటన్నిటికీ గల చారిత్రక కారణాలు ఊహించి తెలుసుకొని వ్రాసిన నవల” బోయకొట్టంబుల్వణ్డ్ఱెణ్డు”.
‌ ఇది క్రీ.శ. 614 సంవత్సరం మొదలై క్రీ.శ ఎనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరాల వరకు అంటే దాదాపు రెండు వందల ఇరవై సంవత్సరాల కాలంపాటు జరిగిన సుదీర్ఘ చరిత్ర. ఇన్ని సంవత్సరాలలో ఏడు లేక ఎనిమిది తరాలు వెళ్లిపోతాయి. ఎన్ని తరాల చరిత్రను ఎడతెరపి లేకుండా రాయడం సాధ్యమా? అని రచయిత తనను తానే ప్రశ్నించుకొని, వేయి పడగలు అనే నవలలో మూడు తరాల కథను, “రూట్స్” అనే అమెరికన్ నవలలో ఏడు తరాల కథలు రాయగా నేను మాత్రం ఎందుకు రాయనని రాయడం మొదలు పెట్టారట.
బోయలు అచ్చమైన తెలుగు వీరులు. ధైర్యం, ఆత్మాభిమానం కలవాళ్ళు. వీరి గురించి రాయాలంటే ప్రాచీన గ్రంథాల నుండి ఇప్పటి సమాజం వరకు పరిశీలించి చారిత్రక నవల రాయాలి. త్రిపురాంతకం నుండి ముస్సీ, గుండ్లకమ్మ నదుల మధ్య ప్రాంతానికి వలస వచ్చారనీ, బాదామి చాళుక్యుల గురించే కాక తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి ఉన్న స్థానం గురించి, పొన్ని దొర, కులమతాల ముద్దుపట్టి మలయప్ప సంస్కృత విద్వాంసుని గురించి, శివానందలహరి ప్రస్తావన మొదలైనవి చక్కగా తెలియజేశారు. మన తెలుగునాట శాస్త్ర సంబంధ పరిశోధనలు జరిగాయి అని చెప్పడం బాగుంది. జ్యోతిష్యం, వైద్యశాస్త్రం తెలుగు నేలపై ఎలా ఉండేది అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు రచించారు కరణం బాల సుబ్రమణ్యంపిళ్ళైగారు.
ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏనుగులను పట్టే విధానం, వాటికి శిక్షణ ఎలా ఇస్తారని, విలు విద్యా ప్రదర్శనం, యుద్ధతంత్రాలు, శిక్ష విధానాలు, సాతులూ,సంతలు, పన్నులు ,నాటక ప్రదర్శనలు, తోలు బొమ్మలాటలు, ఆలయనిర్మాణం, కోటల కట్టడం, ఊర్లో ఎట్లా ఏర్పడ్డాయి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు ఈ నవలలో…
ఈ నవలలో ఒక చోట వీరన్న బోయెడు వారసుడు ప్రయోజకుడు కాకపోవడంతో ఆయన మరణించిన తరువాత బోయ దొరసాని మంగసాని బోయలకు ఎలా నాయకత్వం వహించిందో? చక్కటి రాజనీతితో జయసింహడిని ఎలా ఎదుర్కొన్నదో ఆ సన్నివేశాన్ని చాలా చక్కగా వర్ణించి చిత్రీకరించారు. ఆ సన్నివేశం చాలా బాగుంటుంది.
ఇందులో తిరుమల తిరుపతి గురించి చక్కగా వివరిస్తారు ఈ రచయిత. ఇందులో వకుళమాత ను అపరశక్తిగా చూపించారు. పరమ భక్తురాలు గాను చూపించారు.
మనం తెలుగు వాళ్ళం అయినందుకు మన పూర్వీకుల చరిత్ర తప్పక తెలుసుకోవాలి. మనం ఎంతో ఇష్టపడే పద్యం పుట్టుక కథాకమామిషు ఈ నవలలో చక్కగా వివరించారు. ఈ బోయ కొట్టం పండ్రెండు చారిత్రక నవల తప్పక చదవ తగిన పుస్తకం.
చాళుక్యరాజుల నాటి కథ కాబట్టి ఆనాటి సామాజిక విధానాన్ని, వారి అలవాట్లు, ఆనాటి వస్తువులు ఎలా ఉండేవని? ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి… విశదీకరిస్తే ఇంకా బాగుండేది.
నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటి అంటే? చాళుక్య, పల్లవ రాజుల కాలక్రమంతో పాటు క్రమణికను పోలుస్తూ రాయడం ఎంతో కష్టమైన విషయం. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు రచయిత.
గ్రాంధికభాషలో రచించిన ఈ బోయకొట్టములు పండ్రెండులో భాష, కల్పనలు, శైలి ఎంతో బాగున్నాయి.
ఇతిహాసంలో చీకటి కోణములోని అట్టడుగున పడి కాన్పింపని కథలు రాయగలిగే వాళ్ళు రావాలి. దానికి ప్రేరణగా రచయిత పిళ్ళైగారు నిలిచారు. అప్పుడే చరిత్రలో మరిన్ని అంశాలు రాబోయే తెలుసుకునే వీలు ఉంటుంది.
ఒక మంచి చారిత్రక నవల చదవడం మన పూర్వీకుల గురించి తెలుసుకోవడం, మన తెలుగు వీరుల వీరత్వాన్ని రచయిత కళ్ల ద్వారా మనం చూడగలగడం మహద్భాగ్యంగా భావిస్తూ…

రంగరాజుపద్మజ

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చిత్రలేఖిని

సీతమాట – బంగారు మూట పద్య మాలిక