నిజం చెప్తే….

   రాపోలు శ్రీదేవి

కొన్ని, చిన్న అక్క తమ్ములు. ఓ రోజు వాళ్ళమ్మ పని మీద బయటకు వెళ్ళింది. ఇంట్లో ఇద్దరే ఉన్నారు కన్న కు ఏమన్నా తినాలని అనిపించింది .ఆగలేక వంటింట్లోకి వెళ్లి అన్నీ కలియ చూసింది .ఉప్పు ,కారం ,పప్పులు ఏవేవో కనిపించాయి .కానీ …అది అందుకోవడం ఎలా ?అని అనుకుని, చిన్న ను రా అని పిలిచి పై అరలో చక్కర ఉంది ఇద్దరం తిందాం ,ఎలాగైనా తీయరా !అన్నది వాడితో! వాడికి చక్కర చూడగానే నోరూరింది. అంతే !ఆ మూలన ఉన్న స్టూల్ లాక్కు వచ్చి, దానిపైకి ఎక్కి, నిక్కి నిక్కి చివరకు అందుకున్నాడు .ఇద్దరూ పిడికిళ్లతో చక్కెర తీసుకొని బుక్కారు .ఏమి ఎరగనట్టే ఆ డబ్బాను అలాగే అక్కడే పెట్టి, అమ్మ వచ్చేసరికి బుద్ధిగా కూర్చుని చదువుకుంటున్నారు.
అమ్మ కూరగాయలు వంటింట్లో పెట్టడానికి వెళ్లేసరికి చీమలు నేల మీద కనబడ్డాయి. చూస్తే, కింద చక్కెర కనిపించింది. డబ్బా చూస్తే అందులో చక్కర కొంచెం తగ్గినట్టు అనిపించింది.
“కన్నా !చక్కర తిన్నారా ?”అంటూ దగ్గరగా వచ్చేసరికి భయంతో “నేను తినలేదు” అన్నది కన్న.
“చిన్న !చక్కెర తిన్నారా?” అని చిన్న అని అడిగితే కాస్త తటపటాయించి” తిన్నాం” అన్నాడు .అంతే !”అబద్ధం చెప్తావా ?”అంటూ కన్నా ను చెంపపై కొట్టింది .”చిన్నా”అని పిలిచి ,”నా చిట్టి తండ్రీ” అంటూ దగ్గరగా తీసుకొని బుగ్గపై ముద్దు ఇచ్చి ,చేతిలో ఓ చాక్లెట్ పెట్టింది.
నిజం చెప్పి కొట్టించినందుకు కోపంగా ఉన్నా, సగం చాక్లెట్ కన్నాకు ఇవ్వగానే అది నోట్లో పెట్టుకుని “నిజం ఇంత తీయగా ఉంటుందా!” అని మనసులో అనుకోవడమే కాదు ,”నిజం నిర్భయంగా చెప్పాలి”మనసులో నిర్ణయించుకుంది కన్న!
*-నిజం వినడానికే చేదుగాని దాని ఫలితం మాత్రం తీయగా మధురంగానే ఉంటుంది.

Written by Rapolu Sridevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మగువే మణిహారం.

కథలపై విశ్లేషణ