ప్రకృతి లో ఎండా,వాన ,చలి సహజం గా వస్తుంటాయి .
పక్షులు ఆకాశంలో హాయిగా విహరిస్తాయి. అని మనం అనుకుంటాం ! వాటికేం ? అనుకుని పోలికలలో పక్షి కి ఉన్నత స్థాయి ని ఇస్తాం. అదంతా స్వేచ్ఛ నేనా ?అదంతా ఆనందం కోసమేనా ? పక్షి వైపున నిలబడి ఈ ప్రశ్నలను ఒకసారి మనం వేసుకోవాలి .ఆహారం కోసం ,బ్రతుకు పోరాటం కోసం కూడా!!ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ,ఒక పొద పైనుంచి నుంచి మరొక పొదకు పక్షులు తిరుగుతుంటాయి. వాటిని అవి రక్షించుకుంటాయి .వీటిలో భాగమే పక్షులు ఆకాశంలో ఎగరడం. అప్పుడే వాటికి జవాసత్వాలు ఉంటాయి. అప్పుడే అవి బ్రతకగలుగుతాయి.
మనం కూడా హృదయానందం కోసమే బ్రతకాలా? కాదు జీవన పోరాటం కోసం బ్రతకాలి. బ్రతకాలంటే తినాలి ,తినాలి అంటే సంపాదించాలి ,సంపాదించాలంటే తెలివి ఉండాలి. తెలివి ఒకటే ఉంటే సరిపోదు .తెలివికి సంస్కారం ,సౌశీల్యం, మంచితనం,మానవత్వం, సామాజిక వికాసం ఇవన్నీ ఉండాలి. అప్పుడే ఈ శరాఘాతానికి గురికాకుండా ఉండగలం, బ్రతకగలం ఆనందంగా ఎదగగలం.
ఎదుగుదల కష్టార్జితమై, స్వార్జితమై ,మనసుకు సంతృప్తిని ఇవ్వగలిగేదై ఉండాలి. నలుగురికి మేలు చేసేది గా ఉండాలి. ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం హక్కులుంటాయి అని అనుకోవద్దు ఉద్యోగం చేసే రిటైర్ అయ్యి ఇప్పుడేం చేస్తాం అని అనుకోవద్దు ఎవరికి ఏం చేస్తే ఏం లాభం అనీ , మనకేం లాభం అనీ అసలే అనుకోవద్దు.
ఒక చిరు ఉద్యోగి అయినా, ఒక ప్రముఖ సంస్థ అధినేత అయినా,మేధావి అయినా, సాధారణ మానవులైనా తన పరిధిలో ఇతరులకు హాని చేయకుండా ,ఇతరులకు తోచినంత సహాయం చేసి, తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ బ్రతికితే చాలు. మనసులో ఏమలినాలూ లేకుండా జీవిస్తే చాలు, గౌరవాన్ని పెంపొందించుకుంటూ రోజులు గడిపితే చాలు. ఎన్నో సాధించుకున్న వాళ్ళం అవుతాం. అప్పుడు పక్షులమూ మనమే అవుతాం , ఆకాశమూ మనమే అవుతాం!ఇక జీవనరాగం వెలుగులు విరజిమ్మదూ!!
__**__