అంతర్జాతీయ మహిళా దినోత్సవం : మాలతితీచందూర్.

రాధికాసూరి

అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావ కారణాలు లింగ వివక్ష , పునరుత్పత్తి హక్కులు , ఉద్యోగం ,ఓటు హక్కు హింస ఇలా అనేక మహిళా సమస్యలే ప్రధానాంశాలుగా ఉద్యమ రూపం దాల్చి తదనంతర పరిణామ క్రమంలో ఏర్పాటయిందీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. తొలుత ఎలాంటి నిర్ణీత తేదీ లేనప్పటికీ వివిధ మార్పులు- చేర్పుల అనంతరం ఐక్యరాజ్యసమితి మార్చి8 ,1977 లో దీన్ని గుర్తించి అంతర్జాతీయ మహిళా సెలవుదినంగా ప్రకటించింది .ఈరోజున వివిధ రంగాలలో మహిళలు చేసిన కృషిని ,విజయాలను గుర్తించి ప్రోత్సహించడం ఒక రివాజుగా మారింది.
భారతీయ సంస్కృతి- సంప్రదాయాలలో ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో స్త్రీ మూర్తిదే అత్యంత కీలక స్థానం. ప్రతిరోజూ ఆమె నిర్వహించే పాత్ర ప్రధానమైనదే . మన దేశంలో ఎందరో మహిళామణులు తమ తమ రంగాల్లో అత్యంత ప్రతిభాపాటవాలు ప్రదర్శించి విశ్వవిఖ్యాతినొందారు . వారిలో ఒక మణిరత్నం శ్రీమతి మాలతీ చందూర్ గారు.

‘ప్రమదావనం’లో విరిసన ‘ సిందూర పుష్పం ‘ శ్రీమతి మాలతీ చందూర్. వీరు నూజివీడులో డిసెంబర్ 26,1928 న జ్ఞానాంబ ,వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించారు . 8వ తరగతి వరకు విద్యాభ్యాసం నూజివీడులోనే సాగించి తదనంతరం మేనమామ చందూర్ గారి వద్ద ఏలూరులో సెయింట్ థెరీసా స్కూల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించారు. అప్పుడే డి . కామేశ్వరి ఆనందరామం, శ్రీ శ్రీ , విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి నండూరి సుబ్బారావు మొదలైన వారిని కలిసే అవకాశం కలిగింది. 1947లో మేనమామ నాగేశ్వరరావు చందూర్ గారితో మద్రాస్ చేరుకుని వివాహానంతరం ప్రైవేటుగా ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. 1949 నుండి రచనావ్యాసంగంలోకి అడుగు పెట్టారు. అప్పట్లో వారు రేడియోలో రచనలు చదివి వినిపించేవారు. అక్కడే బుచ్చిబాబు , జనమంచి రామకృష్ణ, రాజమన్నార్ , మునిమాణిక్యం నరసింహారావు లాంటి సాహితీస్రష్టలెందరితోనో పరిచయాలు ఏర్పడ్డాయి.
సాధారణ చదువు కలిగిన అసాధారణ ప్రజ్ఞాశాలి. తెలిసింది చెప్పడం అతి తేలిక కానీ అవగాహన లేని అంశాల్ని సైతం కూలంకషంగా తెలుసుకుని ఓర్పుతో నేర్పుగా అర్థవంతంగా అద్భుతంగా వివరించడం ఆమెకే సాధ్యపడింది. తన ప్రతిభాదక్షతలతో ఎన్నో శీర్షికల్ని నిర్వహించారు. ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో 1952 నుండి దశాబ్దాల పాటు ‘ప్రమదావనం’ శీర్షిక నిర్వహించి ‘గిన్నిస్ ‘ రికార్డు సాధించారు. ఈ శీర్షికలో ఆమె స్పృశించని అంశమే లేదు. స్త్రీల సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడిందీశీర్షిక. ‘వంటలు – పిండి వంటలు’ వంటల పుస్తకం కొత్తగా పెళ్లయిన వారికి ఎంతో ప్రయోజనకారిగా ఉండి 30 సార్లు పునర్ముద్రింపబడింది .
వీరి ‘జవాబులు’ శీర్షికను మగవారు సైతం చదివేవారు.
‘మహిళ ‘ ప్రధానాంశంగా దాదాపు పాతిక నవలలు రచించారు . తెలుగు, తమిళం, ఆంగ్లభాషలపై పట్టున్న ఈమె 300కు పైగా ఆంగ్ల రచనలను అనువదించారు . జేన్ ఆస్టిన్ నుండి అరుంధతీరాయ్ రచనల వరకు ఇలా ఎందరివో అనువదించారు. 1970 నుండి కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా 11 సంవత్సరాలు పనిచేశారు. ఆ క్రమంలో తమిళ సినిమాల కోసం తమిళ భాష నేర్చుకుని అనువాదాలు చేసే స్థాయికి ఎదిగారు. ‘స్వాతి ‘ పత్రికలో ‘పాత కెరటాలు’ శీర్షికన ఆంగ్లానువాదలన్నీ దాదాపుగా
ప్రచురితమయ్యాయి.

వీరి తొలి కథ : ‘ రవ్వల దుద్దులు’

” నవల: ‘చంపకం – చెదపురుగులు’
ముఖ్య రచనలు :- భూమిపుత్రి , ఆలోచించు, హృదయనేత్రి , శతాబ్ది సూరీడు, శిశిర వసంతం మొదలైనవి.
అవార్డులు: 1987 : సమైక్య ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. (‘హృదయనేత్రి’)


1990: ప్రతిష్టాత్మక భారతీయ
విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్
1992: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (హృదయనేత్రి)
1996: రాజా – లక్ష్మీ అవార్డు
1996: తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు
2005: శ్రీ చందూర్ , యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గార్లు సంయుక్తంగా స్థాపించిన ‘లోక్ నాయక్’ మొట్టమొదటి అవార్డు
2005: పద్మావతీవిశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ మరియు ‘కళాప్రపూర్ణ ‘ బిరుదు ప్రదానం.
జిజ్ఞాస , పట్టుదల , అవిశ్రాంత కృషితో సాహితీప్రక్రియలెన్నింటినో సృజించి సారస్వత శిఖరాలను అధిరోహించి అనేక సన్మానాలు సత్కారాలు పొందిన వీరికి జీవన సహచరుడు అందించిన సహాయ సహకారాలు అసాధారణం . తన పేరుకు చివర చందూర్ గారిని ‘మకుటం ‘ గా దాల్చి విరాజిల్లిన ఈ ‘విద్వన్మణి ‘ఆగస్టు 21, 2013న వాగ్దేవి పాదాల చెంత శాశ్వతంగా విశ్రమించారు. ఈ విజ్ఞానభాండాగారానికి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించేదేముంటుంది
అక్షరసుమాంజలి తప్ప.

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

చదువుల చెట్టు