మానవ మేధస్సు

మాధవపెద్ది నాగలక్ష్మీ

మనిషి పూర్తి అజ్ఞానం బయటపడేది మృత్యువులోనే. అవును ఇది నిజం.

కావాలంటే పట్టాభిరామయ్యగారిని అడగండి. మంచి గాఢ నిద్రలో ఉన్నారుట పట్టాభిగారు. ఇంతలో ఆయన కళ్లముందు యమధర్మరాజుగారు కనబడ్డారు. చేతిలో పాశంతో గర్జిస్తూ, రామయ్యా, రా నీ కాలము తీరింది అని కేక పెట్టారు.

అపుడు ఏడుస్తున్నాడు పట్టాభిగారు. అమ్మో ఇన్నాళ్లు ఏమీ సంపాయించలేదు, పిల్లవాడికి ఎమ్.ఎల్.ఏ సీటు ఇప్పించలేదు. పిల్లకు ఘనంగా అందరూ ఆశ్చర్యపడేలా పెళ్లి చేయలేదు. ఇంటిమీద ఇల్లు వేయలేదు. భార్యతో ఫారినం వెళ్లలేదు, ఇవన్నీ మనసులో మెదిలి యమధర్మరాజు కాళ్లు పట్టుకున్నాడు, ఆర్తిగా, భక్తిగా, దీనంగా, ఈ ఆర్తి, భక్తి, తిరుగుతున్న రోజులలో దైవము మీద రాలేదు. అదే మాయ అంటే.

స్వామీ నన్ను దయతలచి ఒక్క రేండేళ్లు బ్రతుకనియ్యి, అప్పుడు తప్పక వస్తాను అని బిగ్గరగా ఏడ్చాడు.

ఆ ఏడుపు చూడలేక సరేనన్నాడు యమధర్మరాజు.

ఈ రెండేళ్లలో ఆయన అనుకున్న పనులన్నీ పూర్తిచేశాడు.

మరల యమ దర్శనం అయింది. ఈసారి చాలా క్రోధంగా వచ్చారు యముడు.

ఇహ తప్పదు అనుకున్నాడు పట్టాభిగారు. అయినా ఒకసారి మళ్లీ అడిగి చూద్దామని ఇంకా గట్టిగా ఏడుస్తూ కాళ్లు పట్టుకున్నాడు.

ఇంకా ఎందుకు, ఇంకా నీవు బ్రతికి ఏం చేయాలి అని విసుగ్గా అడిగాడు యమధర్మరాజు.

స్వామీ ఈసారి సంఘసేవ చేయాలనుకుంటున్నాను. ఇన్నాళ్లీ జీవితం వృధా చేశాను. ఒక్క మంచి పని చేయలేదు. బావురుమని ఏడ్చాడు పట్టాభిగారు.

సరే, ఏం సేవ చేస్తావు? అని అడిగాడు యముడు.

అనాధ శరణాలయము, అన్నసత్రాలు పెట్టి అందరినీ పోషిస్తా ఆనందంగా చెప్పాడు.

చాలా మంచి పని. అయితే అంత డబ్బు ఉందా నీకు? అని అడిగాడు.

స్వామీ నేను కొద్దిగా పెట్టుబడి పెడతా, దాతలందరి దగ్గర చందాలు వసూలు చేస్తా, విదేశీయుల దగ్గర నుంచి కూడా తెప్పిస్తా. అన్నీ పెట్టి ఒకటి రెండు నెలలు సంస్థలు, సజావుగా నడిపిస్తా. మిగతా డబ్బుతో ఒకరోజు ఉడాయిస్తా.  నన్ను వెతకటానికి ప్రభుత్వం పోలీసులను పంపిస్తుంది. వారు నన్ను పట్టుకోవటానికి కొన్ని సంవత్సరాలు పడ్తుంది. వాళ్లు పట్టుకుని కేసు పెట్టగానే నేను ఇవి అక్రమ కేసులు అని మరల తిరుగుదావా వేస్తా. క్రింది కోర్టు, హైకోర్టు, సుప్రీమ్ కోర్టు ఇవన్నీ అయ్యేటప్పటికి కొన్ని ఏళ్లు పడుతుంది. ఈ లోపల నా ఆస్తులు లోపాయకారిగా మా పిల్లలకు రాసేస్తా. అపుడు ముసలివాడినైపోతా. నా పని నేను చేసుకోలేకపోతా. నా భార్య పిల్లలు, నాకు చేయలేక విసుక్కుంటారు. ఏదైనా వృద్ధ ఆశ్రమంలో చేర్పిద్దామంటాడు నా కొడుకు. అదే మంచిది అంటారు మిగతావాళ్లు, అందరు నేను నడిపిన వృద్ధాశ్రమం కూడా గుర్తొచ్చి. ఆ మాట వినగానే భయపడి నీ దగ్గరకు తప్పక వస్తాను స్వామీ అన్నాడు.

ఆశ్చర్యపోయినాడు యమ ధర్మరాజు.

అమ్మా, వీడి అతి మేధస్సు పాడుగాను, వీడిని తీసికెళ్తే అందరికి ఈ పాఠమే నేర్పుతాడు. మళ్లీ జన్మ ఎత్తినపుడు అందరూ ఇలాగే తయారవుతారు అని భయపడి మాయమైనాడు యముడు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి చిత్రం

ఊర్లోఉషోదయం