పిల్లలే ప్రపంచంగా బతుకుతుంటారు తల్లిదండ్రులు. వారు అడిగినవన్నీ అందించాలని వారు సుఖంగా జీవించాలని
ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటారు. అందుకే పాపం పగలురేయి కష్టపడుతూ రూపాయికి రూపాయి కూడబెడుతూ వారి చదువులకు, సదుపాయాలకు ఖర్చు చేస్తూ ఉంటారు. అప్పటి రోజులు కాదుగా ఇవి తల్లి ఇంట్లో ఉండి పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉంటే తండ్రి వెళ్లి సంపాదించి కుటుంబాన్ని నడిపించేవాడు. కానీ ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి ఇద్దరూ విద్యావంతులే అందువల్ల తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగులకు వెళ్లి చేతినిండా సంపాదించి పిల్లలకు ఆస్తిపాస్తులను జమ చేస్తుంటారు. వారి ఆలోచనలు, భయాలు, ఆందోళనను తప్పని చెప్పలేము ఎందుకంటే నిస్వార్ధంగా పిల్లల బాగు
కోరుకునేవారు కేవలం తల్లిదండ్రులు మాత్రమే. అయితే వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అందమైన వారి బాల్యంలో భాగస్వామ్యాన్ని తీసుకోలేకపోతున్నారు నేటి తరం తల్లిదండ్రులు. ఖరీదైన కాన్వెంట్లలో పిల్లలను చదివించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప. అసలు వారి నిర్వర్తించవలసిన బాధ్యతను విస్మరిస్తున్నారని ఆందోళనగా ఉంది. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే తల్లి తండ్రి ఎవరు ఉండరు ఇంట్లో అమ్మానాన్నలు కొనిపెట్టిన స్నాక్స్ తిని, హోం వర్క్ చేసుకొని, టీవీలో బొమ్మలు చూస్తూ వారు వచ్చేంతవరకు బిక్కుబిక్కు మంటు ఒంటరిగా ఎదురు చూస్తూ ఉంటారు. తీరా తల్లిదండ్రులు వచ్చాక వారికి కాస్త అన్నం తినిపించి నిద్రపుచ్చి ఆ రోజుకి స్వస్తి చెప్పేస్తారు. అదే పిల్లలతో కూర్చొని సరదాగా వారు చెప్పే మాటలను వింటూ ఆనందంగా కొంత సమయం వారితో గడిపినట్లయితే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సంబంధాలు మరింత బలపడి కుటుంబ వ్యవస్థ పదిలంగా
ముందుకు సాగుతుందని నా భావన. ఆ చిన్నారులు స్కూల్లో జరిగిన విషయాలను తల్లిదండ్రులకు చెప్పాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే మీరు రాత్రి సమయానికి ఇంటికి చేరుకుంటే ఎలా? కాస్త ముందుగా వచ్చి వారి ముద్దు ముద్దు మాటలను విని ఆనందించండి అందులో ఉన్న సంతృప్తి మరి ఎందులోనూ ఉండదు. మరి పిల్లలకు చేరువై వారి ఒంటరితనాన్ని దూరం చేస్తారు కదూ….