కృష్ణ లీల

( 3వ భాగం)

    సుగుణ అల్లాణి

యసోదమ్మ కిష్నయ్య ను రోటికైతే కట్టింది గానీ గుండెల్ల గునపం గుచ్చినట్టు బాదతోని గిల్లగిల్ల కొట్టకుంది.
ఎన్కనించి “అమ్మా ! అమ్మా! నేనేం సెయ్యలేదే! అందరు నన్ను బద్నాం జేస్తున్నరూ!! అని ఏడ్పు గొంతు జేసుకోని అనవట్టిండు
యసోదమ్మ పానమంత పిండినట్టయ్యింది.కొడుకును ఎత్తుకొని గట్టిగ ఎదకు అత్తుకోవాలని అనిపించింది.
“ లేక లేక పుట్టిన పండసుమంటి బిడ్డ ఊరోల్లు ఏదో అన్నరని గిట్ల దూరం జేసుకుందునా? ఏంది గిట్ల జేయవడ్తి… “ అనుకున్నది.
మల్ల అనిపించవట్టింది… ఎన్నడు ఎవ్వల్తోని ఒక్క మాట వడనోల్లం వూరోల్ల తోని గిన్ని మాటలువడ్తి??
నందయ్య ఊర్లె పేరుగల్ల ఆసామి. అందరికీ నాయం జెప్పెటోడు… ఆయన కొడుకు గిట్ల ఇండ్లమీదికి ఊరోల్లను దెస్తె ఎంత యిజ్జత్ వాయె…గది సరె గానీ గిదంత నిజమేన? గోపెమ్మలు నా కొడుకును జూసి ఓర్వలేక గిట్ల జెప్పిన్రేమో!!!అంటాలోచించుకుంట… పొయ్యి మీద పాల్వొంగుతయేమో నంట ఒండేయింట్లకువోయింది.
రోటి తాడు ఎప్పుడో తెంపుకోగల్గుతడు కిష్నయ్య. యసోదమ్మ తల్లి గద … ఆమెమాట దీసెయ్యెద్దు గద… గందుకనే రోటి కాడనే నిలవడ్డడు.
యసోదమ్మ సాటునించి కిష్టయ్య ను చూస్తనే వుంది.యసోదమ్మ సూస్తున్న సంగతి కిష్టయ్య కు తెల్వదా?అంతా ఆయన నాటకం గాకపోతే!!!!
పొద్దూకినంక రోటిమీద నిలవడి కునుకుతున్న కిష్నయ్యను చూసి యసోదమ్మ పానం ఆరివారమయ్యింది…. అయ్యో కొడుకా నిన్నెంత కష్టవెట్టినా? పాపిష్టి దాన్ని… అనుకుంట ఎత్తుకుని ముద్దాడింది…. తీస్కవోయి పాలిచ్చి పండవెట్టింది. నిద్రవోతున్న కిష్నయ్య ను జూసి యసోదమ్మ మురిపెంగ చేతులతో మెటికలు యిరిసి నా బంగారుకొండ…. అని నిద్రవోతున్న పసిపిల్లలను ముద్దాడొద్దనుకోని దప్పటిగప్పింది.
***
ఒకనాడు యసోదమ్మ పొద్దటేల వెన్నదీస్తుంది.
ఇంతల క్రిష్ణయ్య వచ్చి ఒడిలవండుకోని “అమ్మా ! పాలుదాగుత “అన్నాడు
యసోదమ్మ పిల్లగాణ్ణి మంచిగ పండవెట్టుకోని నిండ కొంగుగప్పి పాలియ్యవట్టింది.
ఇంతల పొయ్యి మీద పాలు పొంగుతుంటే పిల్లగాడిని దబ్బున కిందికి దింపి కూచోబెట్టి బిరబిర ఉరికి పాల చట్టి దింపనీకెవోయింది.
అమ్మా!! అమ్మా!! అంట పిల్వవట్టిండు కిట్టయ్య .
వస్తున్న బిడ్డా… జర్రాగు కొడుకా!! అన్నది తల్లి
నాకు ఆకలౌతున్నది… కడుపు నిండలే… రా!! అని గట్టిగ ఏడ్వవట్టిండు కిష్నయ్య …
పొంగిన పాలు న్యాల మీద వరదగట్టంగ యసోదమ్మ దాన్ని సుబ్రంగ తుడిచొద్దామని బట్ట వట్టకోనివోయింది
వస్తవా రావా!! అమ్మా!!
యసోదమ్మ పలకలే!
కిష్నయ్య కుండల ఎన్నముద్దలు దీసి ఆవులమీదికి దూడల మీదికి యిసిరిండు… తాను తిన్నంతదిన్నడు.
పారేసినంత పారేసిండు… ఆ చోటంత రనరంగం లెక్క చేసి రోటి మీద ఎక్కి నిలవడిండు.
తల్లి యసోద వచ్చి చూసింది కోపంతోటి అగ్గోత్రమైంది.
రోటిమీద నిలవడి సూస్తున్న కిష్నయ్య దగ్గరికొచ్చి చెయ్యి వట్టి గుంజి …. గట్లయితే ఊరి ఆడోల్లు జెప్పిందంత నిజమన్నమాట… గింత దూం జేస్తవా నని
కవ్వానికున్న తాడు యిడిసి రోటికి కిష్నయ్య ను గట్టనీకె వోయింది… మూరెడు తాడు తక్వయింది… ఇంకో కవ్వం తాడు దీసి కట్టింది మల్ల మూరెడు తక్వాయె… అట్ల ఎంత తాడు ముడేసినా తక్వవుతుందని పొట్టకు గట్టిగ గట్టి … ఈడనే పడుండు… అనిజెప్పి లోపలికి పోయింది…..
అన్ని బందాలను మనకు ముడేసే పరమాత్ముడు గా తాడు ముడికి కట్టువడ్డడని ఆకాసం మీదకెల్లి దేవుల్లంత చిత్రవోయింన్రు…. నాటకం చూసినట్టు జూడవట్టిన్రు…
బాలకిష్టయ్య తాడుకున్న రోటిని గుంజుకవోనీకె జూస్తన్నడు… లేచినడుదామనుకుంటే… నడుముకు గట్టిగున్నది… మెల్లెగ అటుదిరిగి ఇటుదిరిగి అంబాడుకుంట పెరట్లకు వేయిండు….
పోతా పోతా… మోకాల్లకు మట్టంటంగ …. రెండు మద్దిచెట్ల నడిమినించి పోయిండు.రోలు చెట్ల నడిమినుంచి రాకపాయె… గట్టిగ గుంజిండు … రాలే…
ఇటుదిరిగిండు ఎట్ల చేసిన రోలు రాలే …. ఇగ తన బలాన్నంత వట్టి ఒక్కసారి లాగిండు…. ఉరుములు ఉరిమినట్టు పిడుగులువడ్డట్టు…. పెద్ద సప్పుడుతోటి రెండు మద్దిచెట్లు కూకటేల్లతోటి మీదికి లేచి కింద వడ్డయి….. ఆ చెట్లనుంచి ఇద్దలు గందర్వులు బయటకొచ్చి కిట్టయ్య కు దండం బెట్టి మాయమయిరి.
ఆ సప్పుడు యిన్న నందయ్య యసోదమ్మ బలరాముడు సుట్టుపక్కనున్నోల్లంత పరుగుల్వెట్టి రావట్టిన్రు…. మల్లేం జేస్తివిరో నా కొడుకా అని ఏడుసుకుంట యసోదమ్మ ఉర్కొచ్చింది…..
వచ్చి చూసెటల్లకి … పెద్ద మద్దిచెట్లు న్యాలకొరిగున్నయి రెంటి నడుమ కిష్నయ్య నవ్వుకుంట కూసున్నడు….
అందరు ఎంత గండం తప్పె పిలగానికి … అని
ఓ యసోదమ్మా !! పిల్లలు గాక నువుజేస్తావమ్మా దూము…. పసిపిల్లలన్నంక గిట్ల నే ఉంటరు… గందుకని రోటిగట్టి సిచ్చలేస్తారు…. బాగున్నవమ్మా!! అనవట్టిరి ఊరోల్లు… ఎవ్వరి మాటలు యసోదమ్మ సెవుల వడ్తలేవు…… యసోద దుక్కం తోని కిట్టయ్య ను కావలించుకోని అట్లనే కూసుండిపోయింది….

Written by Suguna Allani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అవనికి వేడుక

ఏడడుగుల బంధం