ఎదురింటి పిచ్చమ్మగారిని పొద్దటి నుండి తిరుపతయ్య చూస్తున్నాడు. పాపం దేనికోసమో ఎదురు చూస్తున్నది .ఆమె ఆరాటం చూస్తే చాలా బాధ అవుతున్నది కానీ ఏం చేయలేని పరిస్థితి అతనిది. ఏందమ్మగారూ! ఎవరికోసమో ఎదురుచూస్తున్నారని అడుగుదామంటే ఆమె చాలా అభిమానవంతురాలు. ఎంత కష్టమైనా తానే పడుతుంది కానీ ఒక్కసారైనా తన కష్టం ఇరుగుపొరుగుకు చెప్పుకున్నట్టు వినలేదు… చూడలేదు. పోనీ ఆమెకు ఏదైనా సహాయం చేద్దాం అంటే ఊరంతా పిచ్చమ్మగారి వలె కష్టాలలోనే ఉన్నారు. ఈ ఊరు ఏంది? ఈ జిల్లా మొత్తం గట్లనే ఉన్నది. మండ కరువాయె..
పైనుంచి పొరుగు దేశం తోటి యుద్దమాయె. ఎవరన్నా తమ కష్టాలు పక్కవాళ్లకు చెపుతుంటే “రోలు వచ్చి మద్దెలకు చెప్పినట్టే ఉన్నది”… ఎవరి కథ విన్నా ఏమున్నది? మళ్ళా తిరుపతయ్య పిచ్చమ్మ గారి ఇంటి వైపు చూశాడు.
పిచ్చమ్మ గారి భర్త సింహాద్రి పంతులు మంచి సదాచార సంపన్నుడు, కవి, పండితుడు కూడా.. అయితే వారి జీవనాధారం మాత్రం వ్యవసాయమే. పాండిత్యం మీద ఒక్క పరక కూడా రాదు. కానీ ఇంట్లో మాత్రం రోజూ పది విస్తర్లు వేయవలసిందే…
ఎటొచ్చి పొలం పనికి పోయే వాళ్లే తక్కువ.. సింహాద్రి పంతులు వృద్ధుడు కావడం, మిగతా జనాభా అంతా స్త్రీలే కావడం… ఇల్లు గడవడం కష్టం. పంట కళ్ళాలు (నూర్పిళ్ళు) సమయంలో పిచ్చమ్మ గారు నెత్తీ నోరూ బాదుకుని ఎవరూ పొలానికి పోకుంటే ఇల్లు ఎలా గడుస్తుంది? అని గోల చేయగా చేయగా పెద్ద కొడుకు ఒక ముద్దెర పలక, ఒక చద్దరూ, కాఫీ ప్లాస్కూ, మంచినీళ్ల మరచెంబు పట్టుకొని పోయి పొలం దగ్గర గడిమంచె వాల్చుకొని, డిటెక్టివ్ నవల యుగంధర్ పట్టుకొని కాసేపు కుప్పకొట్టడం చూసి, కాసేపటికి భంగిమ మార్చి, ఒరిగేవాడు. జీతగాళ్లు, కూలి వాళ్ళు మంచిగా పని చేస్తున్నారా? లేదా? అని చూస్తూ చూస్తూ కథా రసకందాయానికి
( క్లైమాక్స్) చేరగానే పుస్తకంలో లీనమైపోయి తనను తాను మరచిపోయి… కాళ్లు బారా చాచుకుని పడుకునేవాడు. ఈ లోపున జీతగాళ్లు వాళ్ల పని [ దొంగచాటుగా వడ్లు పక్కన బొరియల్లో పోసి గడ్డి కప్పేవారు] వాళ్లు చేసుకునేవారు. చుట్టుపక్కల పొలాల యజమానులు వచ్చి వరి కుప్పను చూసి, ఊళ్ళోకి వచ్చి పిచ్చమ్మగారితో అమ్మగారూ! ఈసారి కుప్పలు చాలా ఎత్తుగా పడ్డాయి… వడ్ల కైలు బాగానే అయ్యేటట్టు ఉంది అని చెప్పి పోతున్నారు. అమ్మగారు ఇంట్లో కూర్చుని లెక్కలు వేసుకుంటున్నది రెండు బర్తీబండ్లు టౌన్ కు పంపి, అమ్మి ఇంటికి కావలసిన సామాన్లు కొనితేవాలి. రెండు పుట్ల వడ్లు షావుకారుకు పోసి , పాత అప్పు తీర్చాలి… ఒక పుట్టి వడ్లు బట్టల దుకాణం వానికి పంపాలే… ఈసారి ఆడపిల్లలకు ఓ మోస్తరు బట్టలు కొనాలి…. జీతగాండ్ల జీతాలు… కూలీలకు కూలీ పోగా మిగిలిన వడ్లను పెద్ద గిర్నీకి పంపి బియ్యం పట్టించి ఏడాదికి సరిపడా బియ్యం బస్తాలు వానకు ఇల్లు కురువని చోట తడవకుండా సర్ది పెట్టాలి… ఈ కోతుల గోలొకటి… ఇంటి పెంకులన్నీ ఊడబీకాయి… ఏమన్నా వడ్ల గింజలు మిగిలితే ఇంటి పెంకులు సరి చేస్తే మంచిగా ఉండు… ఏమో? ఏమయితదో ఏమో? ఇద్దరు పిల్లలు పెళ్లికెదిగారు. మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేయాలి… ఈ సారన్నా సంబంధం కుదురుతుందో లేదో? ఆడబిడ్డ పురుడు కొచ్చింది… ప్రసూతై పిల్లకు బారసాలై అత్తగారింటికి పోయే దాకా ఎంత ఖర్చు అవుతుందో ఏమో? ఎవరిని ఏమని అనేటట్టులేదు. పురిటికి తీసుకురాకపోతే తల్లి లేని పిల్లాయే! అమ్మ ఉంటే తీసుకొని పోకపోవా? అని ఏడుస్తుంది… అత్తగారు ప్రాణం పోయేటప్పుడు ఈ పిల్లను నాకు అప్పజెప్పింది… ఏం చేయాలి? ఖర్చులేమో ఏటికేడు పెరుగుతూనే ఉన్నవి. ఇంటి యజమానికి రాసుడు, చదువుడు తప్ప ఇంకొక ధ్యాస ఉండదు. ఏ పని కావాలన్నా పొలం మీద వచ్చే పంట తప్ప మరొక ఆధారమే లేదాయె… ఆ పంట మీద ఎన్ని ఖర్చులని వెళ్ళుతాయి? ఆడపిల్ల పెళ్లి వరకు అన్నా ఇంట్లో కరెంటు పెట్టించాలి… దానికి ఎంత ఖర్చు అవుతుందో ఏమో? ఇంట్లో బావి లో నీళ్లు లేవు… ఎండాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది… వడ్డెరలను పిలిచి బావిని పూడిక తీయించాలి. ఏమో? పూడిక తీస్తే నీళ్ళు వస్తాయా? బావి ఇంకొంచెం లోతు తవ్వించాలా? అమ్మో! గజంలోతు బావి తీసినా పుట్టి వడ్లు అడుగుతారు… కానీ తీయించకుంటే ఇల్లిల్లు బిందెపట్టుకొని బిచ్చమెత్తు డేనాయె! ఏ ఇంటికి పోయినా ఎవరూ నీళ్లు లేవు అంటారు… ఏం చేయాలి? పెద్దకొడుకు అన్న ఏదన్న నౌకరి చేస్తే కాస్తా ఆసరైతడు అనుకుంటే వాడికి బాధ్యత తెలియడం లేదు… ఏమన్నా అంటే నాటకాలు, పేకాట, నవలలు చదువడంతోనే సరిపోతుంది… నాటకాలంటే ఉట్టిగానే అయితదా? దోస్తులు అందర్నీ కూడా పెడతాడు. రంగులు కావాలి అంటాడు… పరదాలు కావాలంటాడు… కుర్చీలు, పెట్రోమాక్స్ లైట్లు కావాలంటాడు… ఆడ వేషాలకు బందర్ నుండి ఆడపిల్లలను తీసుకొస్తాడు వాళ్లకు భోజనాలు, ఉండేందుకు వసతికి అర్రలు, వాళ్లు కట్టుకోవడానికి పట్టుచీరలు అన్ని నా మెడకే చుట్టుకుంటాయి… చీరలంటే సరే నావే ఇస్తా! కుర్చీలు అంటే ఇంట్లోవే వేయిస్తా, భోజనాలు పెడతా, కానీ పెట్రోమాక్స్ లైట్ కిరాయి ఎక్కడించితేను? అందులో గ్యాస్ నూనె ఎట్లా? దానికో బత్తీ కావాలి… వద్దురా! నాయనా! ఇవన్నీ మనకొద్దు రా! బుద్దిగా చదువుకో! ఏదన్నా ఉద్యోగం సంపాదించు! ఇల్లు గడవడమే కష్టమవుతున్నది… ఎదిగిన చెల్లెళ్ళున్నారు… గీ నాటకాలు… గీటకాలు… బాగుండవు రా! అని నెత్తీ నోరు బాదుకున్నా విననే వినడు! కొంచెం గట్టిగా చెప్తే ఇల్లు వదిలి పోతే ఈ కళ్ళాలు చూసుకునే వాళ్ళుండరు… పదిమందిలో పరువు పోతదని నోరు మూసుకుంటున్న! గీసారి చేతినుండా పంటవస్తే కొన్ని వడ్లు అమ్మి, ఎవరి కాళ్ళన్నా పట్టుకొని… ఏదన్నా ఉద్యోగంలో పెట్టాలి. లేకుంటే లాభం లేదు… గిట్లనే ఊరోళ్ళ పోరగాళ్ల ను వెంటేసుకుని నాటకాలు, పేకాట, నవలలు చదువుడుతోనే పొద్దు గడుపుతాడు… ఇంకెన్నాళ్లకు వాణికి బాధ్యత తెలుస్తుందో? నా కష్టాలు ఎన్నడు తీరుతాయో? ఆ దేవుడికే తెలియాలి? ఇట్లా ఆలోచిస్తుండగానే ఇంటి ముందటికి బండిరానే వచ్చింది… సింహాద్రి పంతులు భార్య పిచ్చమ్మ వాకిట్లోకి వచ్చి, వాడ కొసదాక చూస్తున్నది. ఎన్ని బండ్లు వచ్చినయ్ ? అని కళ్ళు వెతుకుతున్నాయి… రాని బండ్ల కోసం…
అమ్మగారూ! అమ్మగారూ! అని పిలుస్తున్నాడు జీతగాడు.. ఏందిరా? అన్నది పిచ్చమ్మ.
ఏంది అమ్మ గారూ! మేము గీడ ఉంటే మీరు గటు ఛూస్తాండ్రు?
మిగతా బండ్లు ఏవి? అని అడుగుతున్నది పిచ్చమ్మ.
ఓసోసి! ఇంకా బండ్లు ఏంది? అమ్మగారూ! అయినకాడికి ఈ బోరంలోనే పోసుకొని తెచ్చిన! అనగానే ..
అదేందిరా? మొత్తం ఈ బోరంలోనేనా? అని అడిగేసరికి జీతగాడికి సర్రున కోపం వచ్చింది. ఏంది బాపనమ్మా? మేమేమన్నా వడ్లు బొక్కినమా? ఏంది? కళ్ళం కాడికి బాబు రానేవచ్చే! పొద్దటి నుండి ఆడనే కూసునే? వడ్ల కైలు చేయించే… వామ్మో!…. బాబు గనుక రాకుంటే.. గీ బద్ నామ్ మా మీదనే పడేది. సరే !పక్కకు జరుగమ్మా! మీరు ఎన్ని మాటలు అన్నా .. ఎంత అనుమానపడ్డా… మాకు పనులు చేయక తప్పుతదా? వడ్లు ముందు వరండాలో పోసి కూలోళ్ళ కూళ్ళు ఇచ్చి, మిగతా యి ఏడ బోయమంటవో చెప్పమ్మా?
అంటే ఈ బోరంలో ఉన్న వడ్ల లోనే మళ్లీ కూలి ఇవ్వాలా? ఉన్నది పిచ్చమ్మ.
ఆ… లేకుంటే… కూళ్ళు కళ్ళంల్లో తీసినమా? ఆడ తీస్తే బాబుకు లెక్క తెలవదాయె! ఎన్నితీసిండ్రో అని మీకు అనుమానం వస్తదని కూలోళ్ళను ఈడికే రమ్మన్న అని అనడం ఆలస్యం గంపలు పట్టుకొని రానే వచ్చిండ్రు కూలోండ్లు. వారెవరంటే ఎవరంటే జీతగాడి భార్య, జీతగాడి తల్లి, ఇద్దరు బిడ్డలు, ఒక చెల్లె, జీతగాడి ఇద్దరు మరదండ్లు.. ఒక్కొక్కళ్ళకు రెండేసి కూళ్ళు… ఉసూరుమంటూ లోపలికి పోయి కొలిచే సోల పట్టుకొని ఇవతలకి వచ్చింది. అమ్మగారూ! అమ్మగారూ!! సందె పడుతున్నది… జర తొందరగా రండి! ఇగో! ఈ బుట్టతోటి కూళ్ళు కొలిచి పోయండి! ఇంటికాడ గొడ్డుగోదా ఏమాయెనో? పిల్ల జెల్లా ఎట్లున్నరో? పొద్దున వచ్చిన పొలం కాడికి… అని ఇంకా ఏదో చెప్పబోతున్నది… వ్యవసాయ జీతగాడి భార్య…మైదం లచ్చమ్మ…
ఏంది లచ్చమ్మా? ఇంత పెద్ద బుట్టనా? కూళ్ళు కొలిచేది? ఇగ వ్యవసాయం చేసినట్టే… అన్నది పిచ్చమ్మ.
ఏందమ్మగారూ! ఇగో పని ఎళ్ళదీసుకున్నంక గిట్లనద్దు… నా పెనిమిటి మీ ఇంట్ల జీతం ఉన్నడని, ఈ బుట్టతోటి ఒకటే బుట్ట పోస్తానం… వేరే వాళ్లకు కూలికి పోతే రెండు బుట్టలు పోస్తరు తెలుసా? అని ఒక పొడుగాటి బుట్ట తెచ్చింది జీతగాణి భార్య.
పిచ్చమ్మ గారు పట్టుకొచ్చిన సోల తోటి నాలుగు సోలల వడ్లు ఆ బుట్టలో పడతాయి.
లచ్చమ్మ నాటుకూళ్ళు10, కలుపుకూళ్ళు15, కోతకూళ్ళు 20 , మెదకట్టిన కూళ్ళు, మెద కళ్ళంకాడికి మోసుకొచ్చిన కూళ్ళు, వడ్లు దులిపిన కూళ్ళు అని కూళ్ళ లెక్క చెపుతూనే ఉన్నది.
తన చేతిలో సోలను చూసి, పక్కనే ఉన్న దీగూట్ల పారేసి, వచ్చిన వడ్లు కూళ్ళకు అక్కడికక్కడి కైతయ్! ఇంక నేను నిలబడుడు ఎందుకు? వడ్లు మిగుల్తయా? ఏమన్ననా? చీకటి పడక ముందు ఇంట్లో పని అన్న చేసుకోవాలి… పొరుగు బాయికి వెళ్ళి పోయి నీళ్లు తేవాలి… “ఏ పాటు తప్పినా సాపాటు తప్పుతుందా”? అని నిస్సత్తువగా కొంగు మడిచి నడుము చుట్టూ చుట్టుకుని, చీర కుచ్చిళ్ళు బొడ్డులో దోపుకుంటూ చిల్లి బిందె తోటి నీళ్లు మోసుకొచ్చి, తొట్టి నింపితే, చీర తడుస్తుందని, బిడ్డను పిలిచి దూది తీసుకొనిరా! బిందె రంధ్రంలో పెట్టు! నాకు కండ్లు కనపడత లేవు.. ఏం చేయనే బిడ్డా! ఈ బిందె రంధ్రంలో దూదిపెట్టి కాల్చి పోదువుగానిరా! అని పిలిచింది.
అమ్మగారి లెక్కలకు… బిందెకు చిల్లి పడ్డట్టే అయింది. ఈ యేటి ఖర్చులకు ఏ పొలం , ఏ చెలుక అమ్మాల్నో ఇల్లు ఎట్లా ఎళ్ళదీయాల్నో ఏం తోచడంలేదు అనుకుంటూ దూది పెట్టిన బిందె తీసుకొని ఇవాళ నాలుగు బిందెల నీళ్ళకోసం ఎవరిని బతిమిలాడాలో? ఏందో? అని నిట్టూరుస్తూ వెళ్లింది పిచ్చమ్మ. తల్లి బాధ అర్ధమైనా ఏం చేయలేని నిస్సాహయతతో తోడుగా బుంగబిందె తీసుకొని బయలుదేరింది… నీళ్ల బిచ్చానికి… ఎప్పటికైనా మంచి రోజులొస్తయా? మా అమ్మ బాధలు తీరుతవా? అని ఏడుపు ఆపుకొని…
గుడ్లల్ల నీరు కుక్కుకుంటూ తల్లి చూడకుండా ముఖం పక్కకు తిప్పుకొని వెళుతున్న పిచ్చమ్మ, వాళ్ళు కూతురిని ఎదురింటి తిరుపతయ్య చూసి చాలా బాధపడ్డాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాడు ఆ ఊళ్ళో.
ఈ కరువుకు తాగే నీళ్ళు కోసం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలని మెత్తని మనసున్న తిరుపతయ్య అనుకున్నాడు.
ఐదారు సంవత్సరాల నుండి వర్షాలు కురవక మండ కరువు వచ్చి ఊర్లన్నీ పాడి పంటలు లేక అల్లల్లాడి పోయాయి. పశువులు గడ్డి లేక నీరసించి పోయాయి. కాస్త మోతుబరి రైతులు పక్క జిల్లాలలో పన్నులు కట్టి పశువుల గడ్డి కోసం కంచెలు కౌలుకు తీసుకున్నారు… చిన్నాచితుకా వ్యవసాయ దారులు తమ పశువులను అగ్వ- సగ్వకు… అడ్డికి పావుశేరు అంగళ్ళలో అమ్ముకున్నారు. ఇంకా కొంతమంది చుట్టాల ఊర్లకు పాడి పశువులను పంపించారు గడ్డి మేసేందుకు… అటూ ఇటూ కాకుండా ఉన్న వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
ఈ సమస్యను ఎదుర్కొనేందుకే తిరుపతయ్య గరిశలల్లో, గుమ్ముల్లో ఉన్న వడ్లన్నీ అమ్మి, ఒక బావి తవ్వితే అటు పశువులకు, ఇటు మనుషులకు
తాగేందుకన్నా అక్కరకొస్తుంది అని బావి తవ్వించాలనుకున్నాడు మంచి మనసున్న మారాజు తిరుపతయ్య.
ఎందుకంటే చాలా కాలమైంది ఈ ప్రాంతంలో వడ్లు పండించక… సద్దలు, జొన్నలు, రాగులు మాత్రమే వర్షాధారంగా అక్కడక్కడ రైతులు పండిస్తున్నారు. ఎందుకంటే వరి పంటకు నీరు ఎక్కువ కావాలి. చంటి పిల్లలు, ముసలివాళ్ళు ఈ జొన్నలు తిని అరిగించుకో లేక అజీర్ణ వ్యాధుల పడి నానా ఇబ్బందులు పడుతుంటే… తిరుపతయ్య కొడుకు కూడా జొన్నలు రాగులు తినలేక కుంగి కృశించి పోతున్నాడు.. కొడుకు అంటే ఎంతో ఇష్టం తిరుపతయ్యకు… వాడి కోసమన్నా భావి తవ్వించాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు గుడిలో పంతులుగారు తన కొడుకు జాతకం బాగుందని, మహార్జాతకుడు అయితాడని, అతని చేతితో బావికి ముగ్గు పోయించి, ముహూర్తం సమయంలో బావితవ్వితే పుష్కలంగా నీళ్లు పడతాయని చెప్పాడు.
ముహూర్తం రోజు రానే వచ్చింది… తిరుపతయ్య ముందుగా కొడుకుతో మూడు పారలు మట్టి తీయించి, వడ్డెర్లతో తవ్వించడం మొదలు పెట్టాడు. అసలే ఈ ప్రాంతంలో బావులు తవ్వితే నీళ్లు పడవు… అందులో నాలుగైదు సంవత్సరాల నుండి వాన చినుకు లేక భూమి పొరలలో నీటి ఊటలు లేకుండా అయ్యాయి… ఎంత లోతు తవ్వినా ఒక్క చుక్కన్నది రానేలేదు. పట్టు వదలకుండా తిరుపతయ్య బావిని తవ్విస్తూనే ఉన్నాడు. చాలా లోతులో కొద్ది నీటి ఊట కనపడింది. అలా ఆ బావిలోనే మూడు పిల్ల బావులు తవ్వారు. పిల్ల బావి అంటే మొదలు తవ్విన బావి కాస్త వెడల్పు గాను, అందులో మరొక బావి కాస్త చిన్న గానూ, దానికన్నా మరొక బావి మరింత చిన్నగా తవ్వుతారు… అలా పిల్ల బావులు తవ్వితేనే పుష్కలంగా నీళ్లు పడ్డాయి. అప్పుడు బావికి ఇటుక గోడ కట్టేటప్పుడు ఒక ప్రమాదం కూడా జరిగింది. మేస్త్రీ వంగి ఇటుకలతో గోడ కడుతున్నాడు.. అయితే కూలీలు పైనుండి ఇటుకలు గంపలో పెట్టి తాడుకట్టి దాని ద్వారా అందిస్తున్నారు… ఆ తాడు తెగిపోయి ఇటుకల తట్ట ఆ మేస్త్రీ వీపు మీద పడింది. పాపం! అతనికి చాలా దెబ్బ తగిలింది. దాంతో ఎంతో భయపడ్డారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నందుకు ఫలితం మాత్రం మంచిగానే బావిలో నీళ్ళు పుష్కలంగా ఊరాయి. వరి పంట పండుతాయని అందరికీ సంతోషమైంది. అంతే కాదు ఎంతో కొంత డబ్బు తీసుకొని అవసరం ఉన్నవారికి నీళ్లు కూడా ఇస్తూ ఎందరికో సాయపడ్డాడు తిరుపతయ్య. ఈ ఊర్లోనే కాకుండా పక్కనే ఉన్న మాలపల్లిలోని వారు కూడా నీళ్ల కోసం వచ్చేవారు. అందరూ నీళ్లు తీసుకొని వెళితే బావిలో నీళ్ళు అయిపోతాయనీ, తీసుకోకుండా ఉండాలని నీళ్ళల్లో బురద కలిపేవాడువాడు తిరుపతయ్య కొడుకు అమాయకత్వంగా… అది అతనికి తెలియని తనంతోనే అలా చేశాడే తప్ప చెడ్డవాడు కాదు. గానుగ పనిచేసే లక్ష్మమ్మ చాలా తెలివైంది… ఆమెకు నీళ్ళు అవసరం ఉంటే ఆమె పని చేసే చోట నుండి కొన్ని వేరుశెనగలు తెచ్చి తిరుపతయ్య కొడుకు చేతిలో పోసి, బిందెల నిండా నీళ్ళు తీసుకొని పోయేది.
ఊళ్ళో బడి పిల్లలు అంతా వేసవి కాలంలో ఈ బావిలో ఈతకు వచ్చేవారు… అయితే తిరుపతయ్య కొడుకు కొంతమందిని ఈత కొట్టనిచ్చేవాడు… కొంతమంది పిల్లలను వద్దనే వాడు. అందులో ఒకడు ఒక పంజరంలో చిలుకను పట్టుకొచ్చి ఇతనికి ఇచ్చి బావిలో ఈత కొట్టేవాడు. తిరుపతయ్య తల్లి మనవడితో “పక్షులను అలా పంజరంలో పెట్టకూడదు… అవి స్వేచ్ఛగా తిరగాలి వాటిని పంజరంలో బంధిస్తే దేవుడు మనలను జైలుపాలు అయ్యేలా చేస్తాడు… కాబట్టి విడిచిపెట్టు “అని చెప్తే మనవడు విడిచి పెట్టాడు.
ఇంకొక ఆమె నీళ్ళు కోసం బత్తాయి పండ్లు తెచ్చి పిల్ల వాడికి ఇచ్చి నీళ్లు తీసుకొని పోయేది. ఇలా ఎందరికో దప్పి తీర్చిన ఆ బావి, వ్యవసాయానికి అక్కరకు వచ్చిన ఆ బావి అంటే తిరుపతయ్యకే కాదు ఆ ఊరి వారందరికీ ఎంతో ఇష్టం.
పట్నంలో పెట్టాలనుకున్న రసాయనాల కంపెనీకి వాతావరణ పరిరక్షణ శాఖ అనుమతివ్వడంలేదు… ఎందుకంటే బయటకు పంపించే వ్యర్ధ పదార్థాలు జీవకోటికి హానికారకమనీ, కడుపులో పిండదశ మీద సైతం అంతులేని ప్రభావం చూపెట్టి, అంగవైకల్యం కల సంతానం కలుగుతుందని పరిసర పరిరక్షణ శాఖ వారి వాదన. అందుకే ఈ బావి దగ్గర ఆ పరిశ్రమ (ఫ్యాక్టరీ) స్థాపించాలనీ , ఆ వ్యర్థాలన్నీ బావిలోకి పంపాలనీ వారి ఆలోచన. డబ్బు పలుకుబడి ఉన్న ఒకతను వచ్చి ఆ బావిని తనకు అమ్మమని, తిరుపతయ్యను బలవంత పెట్టాడు. అతను ఎంతగా బలవంత పెట్టినా బావిని అమ్మనని అన్నాడు… కరువు కాలంలో ఈ ప్రాంతానికి ఈ బావి నీరు అవసరమని, ఎన్నో కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయని నెత్తీనోరు బాదుకుంటున్నా వినక, రాజకీయ నాయకులతో , రౌడీలతో తిరుపతయ్యను బెదిరించి ఆ బావిని బలవంతంగా లాక్కొని, ఫ్యాక్టరీ తయారుచేయడానికి ఆ బావి పైన మూత వలె ఒక సిమెంటు బిళ్ళను చేయించడానికి సిమెంట్, ఇసుక , కంకర మొదలైన సామాను పోస్తుంటే తట్టాతట్టా మన్ను ఎత్తి, కష్టపడి బావిని తయారు చేసిన దృశ్యం ఇంకా తిరుపతయ్య కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది… ఆ బావి మీద ఉన్న మమకారంతో ఆపుకోలేని దుఃఖంతో తిరుపతయ్య అతలాకుతలం అయ్యాడు… తిండి లేదు… నిద్ర లేదు… ఒక అపస్మారక స్థితి వలె బావి దగ్గరకు వెళ్లి చూస్తూ కూర్చొని, బావి మీద కప్పుతో ఎప్పుడైతే పూడి పోయి నేలతో సమానం అయిందో తిరుపతయ్య మనసు చలించిపోయింది… ఆ బాధలో అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు… ఊరి వారందరికీ అతని కష్టం తెలుసు కనుక ఎవరో అతనిని చూసి కుటుంబ సభ్యులకు చెప్పి తీసుకొని వచ్చేవారు.. రానురాను తన కొడుకును కూడా గుర్తుపట్టారాని స్థితికి వచ్చి, బావి లో బావి… మూడు బావులు. …. మా మంచి బావి… బావి లో బావి… మూడు బావులు… నీళ్లు పుష్కలం… అక్క చెల్లెళ్ళారా… తల్లుల్లారా… మీకే కష్టం లేదు… పట్టినన్ని నీళ్లు తీసుకెళ్ళండి… బావిలో బావి… మూడు బావులు… మా మంచి బావి అని గొణుక్కుంటూ… ఊరంతా తిరిగే తిరుపతయ్యను చూసి కంట తడిపెట్టని వారు లేరు… కొడుకు ఎప్పుడూ తండ్రిని కనిపెట్టుకొని ఉండేవాడు కనుక ఆ మాత్రం ప్రాణాలతో మిగిలాడు… లేకపోతే బావి పూడినరోజే… ఆయన కూడా మట్టిలో కలిసి పోయేవాడు.
మేలు చేసే వాళ్ళు బావి తవ్వితే… స్వార్ధపరులు బావిని పూడబెట్టడం… వారి చర్యలు ఏమనాలో? కానీ రాబోయే తరాలకు మూడు బావుల చరిత్ర ఎప్పటికీ తెలిసేది కాదు.
ఎప్పటి వలనే పిచ్చమ్మ లాంటి మహిళలు బిందెలు తీసుకొని తిరుపతయ్య బావికి నీళ్లు తేవడానికివెళ్ళతే ఏముంది అక్కడ? తిరుపతయ్య బావి మీద మూత వేసి ఉన్నది. పాలవలె స్వచ్ఛమైన మంచి నీరు ఊరే ఆ పిల్ల బావి ఇక రాబోయే రోజులలో రసాయనాలతో నిండుతుంది ఊరి వారి ప్రాణాలు నిలబెట్టిన బావి, రాబోయే తరాలకు సమాధి కాబోతున్న ఆ బావి పక్కనే తిరుపతయ్య మా మంచి బావి! పిల్ల బావులు.. అక్కలారా నీళ్లు తోడుకొని పోండి!!… అంటూ కలవరిస్తున్న తిరుపతయ్యను చూసి, తిరుపతయ్య కు మతి చెలించిదని అర్థమై ఒక్కసారిగా గొల్లున ఏడుస్తూ కుప్ప కూలిపోయారు ఆ ఊరి మహిళలు…
రంగరాజు పద్మజ