కృష్ణలీలలు

( తెలుగు గడ్డ మీద పుట్టిన ఎవరైనా పోతన భాగవతాన్ని చదవని వారు బాలకృష్ణుడి బాల్య క్రీడలు తెలియని వారెవరుండరు.పండితులు పామరులు ఆ అమృత ధారను త్రాగి తరించిన వారే….
నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు దాశరథి..
పుట్టి పెరిగి నా జీవితం పూర్తిగా ఈ తెలంగాణ నేల మీదే గడిచింది…. ఎందుకో కృష్ణలీలలు తెలంగాణ మాండలికం లో రాయాలన్న తలంపు కలిగింది…. అదే ఈ చిన్న ప్రయత్నం.)

      సుగుణ అల్లాని

ఇంకా పూర తెల్లారలేదు.ఏగు చుక్క కానొస్తంది. కోడి కూతలు యినవడుతున్నయి.
రేపల్లె పచ్చటి పంటపొలాల దుప్పటి పర్చినట్టు ఉన్నది.ఏ యింటి ముంగల జూసినా పాడి పసరాల అంబా అంబా అన్న గోమాత అర్పులే….
సుయ్యిసుయ్యి మని పాలు విండిన సప్పుడు…. గోపెమ్మల కాల్ల కడియాలు పట్టగొలుసుల రాగాలు…గల్లగల్ల మనే గాజుల సప్పుడు తో జుగల్బంది లెక్క గొడుతుంది
నందయ్య ఇంట్ల
యసోదమ్మ నిలువెత్తు కవ్వం వంటసాల గుంజకు బందవస్తున్న పల్పుతోని గట్టింది… యాబై సేర్లు వట్టే పెద్ద మట్టి పేర్పుల మీగడ పెరుగు వోసి నడుము వొయ్యారంగ దిప్పుతూ సిలకవట్టింది….
నడుముకున్న గజ్జెల సప్పుడుకు చిన్ని క్రిష్ణయ్య లేచి వచ్చి తల్లి కాల్లను రెండు చేతులతోని పట్టుకున్నడు.
అయ్యో నా తండ్రి… లేస్తివా…అని కవ్వాన్ని వారకు నిలవెట్టి బిడ్డను రెండు సేతులతోటి ఎత్తి ముద్దాడింది.
యసోదమ్మ మెడ ఒంపుల మొకం వెట్టి గారం బోవట్టిండు కిట్టయ్య… లే కొడుకా మొకంగడుగు పాల్దాగుదువు…. అని అనంగనే వూ వూ అనుకుంట కల్లుమూస్కోని గుల్గవట్టిండు ……. లోకాలను ఒక్క తాటి మీద నడిపించి కాపాడె పరమాత్ముడు అమ్మ ఒల్లె మొకం దాసుకోని ఆడే ఆటను మీదికెల్లి దేవుల్లు ముక్కునేలేసుకొని జూడవట్టింన్రు.
***
పగటేల మొగోల్లంత పనికివోయినంక యసోదమ్మ అన్నం గిట్ల తిని ఎన్న కుండ కాడికి వొచ్చి ముక్కాలి పీట తీసికోని కూసోని కుండల చెయ్యి వెట్టి ఎన్న దీయవట్టింది….. క్రిష్నయ్య అన్న బలరామునితో గలిసి అంగనం ల ఆడుకోవట్టిండు….
యసోదమ్మ ఎన్నంత పొతంగ మూడు కుండలల్ల కెత్తింది
ఇంతల బలరాముడు దమ్మువట్టి ఉరుక్కుంట వొచ్చిండు.
“ఏంది కొడుకా గట్ల ఉరికొచ్చినవ్… ఏమైంది బిడ్డా “ అంట అడిగింది యసోదమ్మ
అమ్మా అమ్మా మన కిష్న … మన కిష్న … అంట ఎగదమ్ము దీసిండు… సెప్పు నాయినా ఏమైంరా తమ్మునికీ….. దుక్కమొస్తుండంగ… అన్నది
తమ్ముడు మన్నుదింటున్నడే…. అన్నడు…
ఆ అయ్యో….. ఇదేం పాపమమ్మా!! ఈ పోరడు గిట్ల అయ్యిండు….
ఏడిరా వాడూ? ఎక్కడున్నడూ? అంట కాల్ల సందుల సీర వడుతుండంగ బిరబిర నడిసుకుంట పోయింది యసోదమ్మ .
వాకిట్లకు వొయ్యి సూస్తె ఏమున్నది… కిష్నయ్య ముద్దుగ మన్ను నోట్ల వెట్టుకొని మిటాయిదిన్నట్టు దినవట్టిండు.
యసోదమ్మ కండ్లు ఎర్రగ జేసుకోని కిష్నయ్య రెక్క వట్టుకోని గుంజుడు గుంజి నిలవెట్టి చెవు దిప్పుతూ
“ ఏం రా కిట్టయ్య!! నీకేం తక్వ జేస్న రా!
తిండివెడ్తలేనా ?పాలువొయ్యలేదా?
మన్నుదినుడేందిరా కొడుకా ….”అన్నది
“అమ్మా! నేనేం మన్ను దనలేదమ్మా!! అన్న నామీద తాకట్లు జెప్తున్నడు… నా నోరుజూడు కావాలంటే
ఏదీ నీ నోరుజూపు అనంగనె కిట్టయ్య నోరుదెరిచిండు
యసోదమ్మ నోట్లజూడంగనె …
ఏముంది……. యసోదమ్మ పెయ్యి తిర్గవట్టింది . నోరెల్లవెట్టి సూస్తావొయ్యింది…. కిట్టయ్య నేర్లె పొంగిన సముద్రాలు, గుట్టలు నదులు పచ్చటి సెట్లు సేమలు ఎగుర్తున్న పచ్చులు సూర్య సెంద్రులు వనాలు బూమండలము తొమ్మిది గ్రెహాలు పార్వతిపరమేశ్వరులు యిష్నుమూర్తి లచ్చుమమ్మ బెమ్మదేవుడు సరస్పతి… దిక్కులు మోసే దేవతలు…. అన్నీ ఒకటెనుక వొకటి కనబడవట్టినయి….. కిట్టయ్య మల్ల మామూలు పిల్లగాడా? సెంకము సెక్రము గద వొదిలిపెట్టి యసోదమ్మ ఒడిల ఆడనీకె వొచ్చిన ఆ యిష్నుమూర్తి కదా!!
ఏందిది? ఈ పిల్లగాడు నా కొడుకేనా లేక ఏ దేవుడైననా?… నేను యసోదనేనా యింకెవన్ననా ? అనుకుంటుండంగనే….
“ అమ్మా అమ్మా!! … కిట్టయ్య యసోదమ్మ ను బుజం మీదగొట్టిండు
ఆ ఏమైంది అంట అదురుకొని తెలివికొచ్చింది యసోదమ్మ …
గదే నేనంటున్న ఏమైంది అంట…. నేను మన్ను దినలేగదా!!! అన్నడు కొంటె కిట్టయ్య …
లేదు కొడుకా మన్ను దినే కర్మ నీకేంది నాయినా… నా బంగారు కొండ నా వరాల మూటవు ఎంతమంది కల్లు వడ్డయో నా బిడ్డమీద…..నరుల సూపుకు నాపరాయి పలుగుతదట…దిష్టన్న దీస్త… అంట ముద్దులు గురిపించుకుంట … లోపలికి కిట్టయ్యను ఎత్కపోయింది….
సూసినవన్ని మర్చిపాయె యసోదమ్మ … ఆమెకు కిట్టయ్య దేవుడని తెల్వనిస్తడా…తెల్వనిస్తె తల్లిలెక్క గార్వం జేస్తదా… పూజజేస్తది గాని… జగన్నాటకం ఆడెటోడు ఆయన…. ఆయనకిదేం లెక్క….

Written by Suguna Allani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కాలంతో సమానంగా….

ఉషోదయం