సద్భావనలు

        మాధవపెద్ది నాగలక్ష్మీ

రామయ్య, సీతమ్మ అరణ్యవాసం ముగించుకుని, అయోధ్యకు తిరిగి వచ్చారు. పట్టాభిషేకం అయిపోయింది. ఇప్పుడు శ్రీరాముడు మహారాజు, సీతమ్మ మహారాణి. ప్రజలందరు సంతృప్తిగా ఉన్నారు. కొన్ని నెలలు గడిచాక సీతమ్మ ఒక శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నదని అందరు మహాదానందం పొందారు. సీమంత వేడుకలు చేశారు అత్తింటివారు, పుట్టింటివారు. ఊరంతా సంతోషించింది. మనకు యువరాజు రాబోతున్నాడని. రామయ్య ఉత్సాహం అడిగాడు సీతమ్మను, ఏదైనా కోరిక ఉంటే చెప్పమని, ఎంత కష్టమయినా తీరుస్తానని చెప్పాడు. ఆమె రాముడు ఊహించని కోరిక కోరింది. మరొకసారి అరణ్యాలకు వెళ్ళాలని ఉందని. ఆశ్చర్యపోయాడు రాముడు. ఇన్ని ఏళ్ళు తిరిగావు చాలదా అన్నాడు నిష్టూరంగ. స్వామీ, నా కోరిక తీర్చక తప్పదు దృఢంగ అన్నది సీతమ్మ.

ఆ జతపాతాల హోరు, ఆ చెట్ల ఊగులాటలు, ఆ పుష్పాల సౌరభాలు మరల మరల చూడాలని, ఆనందం పొందాలని ఉన్నది. అదీగాక నా బిడ్డ ఆ మునుల యజ్ఞాలు కడుపులో ఉండగానే చూడాలి, వారి వేదమంత్రాలు వినాలి. అప్పుడే వారు జ్ఞానంతో ఉంటారు. నాకు మునిపత్నుల ఆశీర్వాదం తీసుకోవాలని ఉన్నది.  నా బిడ్డ తండ్రిని మించిన తనయుడు కావాలంటే మునుల ఆశీర్వాదం తీసుకోవాలి. అదే నా కోరిక అన్నది.  అనుకోకుండా  చాకలివాడు రావటం, వాడి మాటల ప్రభావంతో రాముడు సీతమ్మను అరణ్యాలకు పంపటం, అక్కడే వాల్మీకి ఆశ్రమంలో ఆమెకు పిల్లలు పుట్టడం జరిగిపోయినాయి కదా. ఆమె పిల్లలు ఆమె కోరిక ప్రకారమే పుట్టినప్పటి నుంచి, ముందు నుంచి కూడా, వేదమంత్రాలు వింటూ, యజ్ఞయాగాదుల సువాసనలు పీల్చుకుంటూ, మునుల ఆశీర్వాదాలతో పెరిగారు కదా. వారి ఆశీర్వాదబలంతో, ధనుర్విద్యా పారంగతులై, తండ్రిని మించిన తనయులై చరిత్ర సృష్టించారు కదా మరి.

అదీ మునుల ఆశీర్వాద మహిమ. అదీ కన్న తల్లి కోరికల ఫలితం. మన భావాలే మనకు ప్రతిఫలాన్ని అందిస్తాయి. తల్లులు కాబోయేవారు, అయినవారు కూడా సద్భావనలలో ఉంటూ, సద్గ్రంథాలు చదువుతూ, వింటూ వుంటే సత్సంతానమే కలుగుతుంది. తల్లి తండ్రుల భావనల ప్రతిరూపాలే పిల్లలు. ఈ విషయం తండ్రులకు కూడా వర్తిస్తుంది. అది త్రేతాయుగం కాబట్టి సీతాదేవి అరణ్యాలకు వెళ్ళవలసి వచ్చింది. ఇది కలియుగం, కంప్యూటర్ యుగం కాబట్టి అడవులకు వెళ్ళవలసిన పనిలేదు. నిందనలు భరిస్తూ ఉండవలసిన పనిలేదు. ఇవన్నీ చూడటానికి, వినటానికి అరణ్యాలకు వెళ్లక్కరలేదు. ఇంట్లోనే ఉండి సులభంగ కంప్యూటర్ లో మంచి కథలు చూస్తూ, మంచి మంచి పుస్తకాలు చదువుతూ, వీలయితే గుళ్ళకు వెళ్తూ, ప్రకృతి సహజ సౌందర్యాలను వింటూ కంటూ సద్భావనలతో ఉంటే మంచి సంతానమే కలుగుతుంది. ఈ విధంగా తమ బిడ్డలకు, గర్భంలో ఉండగానే సన్మార్గబాటలు వేయవచ్చు. ఆదర్శపౌరులను తయారుచేసి భారతమాతకు కానుకగా ఇవ్వవచ్చు. కడుపులో ఉండగానే అభిమన్యుడు యుద్ధకౌశలము నేర్చుకున్నాడు కదా కృష్ణుడు సుభద్రకు చెప్తుంటే! దీనినిబట్టి తల్లులు ఏది వినినా, శిశువులు గ్రహిస్తారనేది తేలిసింది కదా. ఈ విషయం శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి కాబోయే తల్లులూ, జాగ్రత్తగా మనసులను అదుపులో పెట్టుకుని మంచి కథలు వింటూ, మంచి సినిమాలు చూస్తూ, మంచివారి వాతావరణంలో ఉంటే, మంచి కలలు ఊహించుకుంటూ వుంటే సద్భుద్ధులతో శిశువులు జన్మిస్తారు. అనేక రంగాలలో రాణిస్తారు దేశాన్ని ఎంతయినా ముందుకు తీసికెళ్ళగలుగుతారు.  ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు.

శ్రీరాముడు ఒక కారణానికి పంపినా , అది సీత కు ఎంతో ఆవేదనను కలిగించినా , గర్భవతిగా ఉన్నప్పుడు వాల్మీకి ఆశ్రమంలో ఉన్న కారణం వలన సీతమ్మ కు సద్భావనలు కలిగాయి. నిరంతర మంత్రోచ్ఛారణలతో , వేద ఘోషతో ప్రతిధ్వనించే వాతావరణంలో ఉండడంవలన సీతాదేవి జన్మనిచ్చిన కవలలిద్దరూ మాతృప్రేమతో బాధ్యతతో పెరిగి పెద్దయ్యారు కాబట్టి కాబోయే తల్లులు ఆలోచించుకోవాలి. మంచి పుస్తకాలు చదువుతూ మంచినే చూస్తూ, సత్ప్రవర్తన కలిగి ఉండే పిల్లలను కని దేశానికి అందించాలో, హింసాత్మక పుస్తకాలు చదువుతూ, హింసతో కూడిన నాటకాలు, సినిమాలు చూస్తూ, హింసా ప్రవృత్తిని కలిగి ఉండే పిల్లలను కని దేశానికి పనికిరాని పిల్లలను అందించాలో ఆలోచించండి. ఈ దేశ భవిష్యత్ భావి భారత పౌరుల మీదనే ఆధారపడి వుంది కదా మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అక్షరాలు నేర్పె గురువు

ఆహారంతో ఆరోగ్యం