భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు.
ఇన్ని ఏళ్ళు గడిచినా ఇంకా మన సంప్రదాయాలు చెక్కుచెదరకుండా కొనసాగుతున్నాయి అంటే అందుకు ముఖ్య కారణం మన సంస్కృతీ మన జీవన విధానంలో భాగం కావడమే. మన పద్దతులు అనేకం ఉన్నప్పటికీ మన నిండైన సంప్రదాయాన్ని ఒక మెట్టు ఎక్కించింది మాత్రం మన వివాహ వ్యవస్తే. అయితే ఈ పాశ్చాత్య సంస్కృతిలో పడి
మన లక్ష్యం కాస్తంత సడలింది అన్న మాట వాస్తవం అయినప్పటికీ మన పునాదులు
మాత్రం ఇంకా పదిలంగానే ఉన్నాయి. పెళ్లంటే ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించిన విషయం కాదు,
ఇరు కుటుంబాల కలయిక పచ్చని పందిరిలో వందల మంది అతిథులతో, ఆత్మీయులతో పంచభూతాలు సాక్ష్యాలుగా, ఏడు అడుగులతో (సప్త పది), మూడుముళ్లతో (తాళి) ముడిపడే అనురాగానికి ప్రతీక ఈ వివాహ వేడుక. అయితే కాలం మారింది పెద్దలు చూసే వివాహాలు కాదు ఇప్పుడు జరిగేవి.
ఈ జనరేషన్లో ఎవరికి వారే పెద్దలుగా వ్యవహరిస్తూ స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది
అందరికీ తెలిసిన విషయమే.
అరేంజ్ మ్యారేజెస్ కం లవ్ మ్యారేజెస్ తగ్గిపోయి లవ్ మ్యారేజెస్ కం అరేంజ్ మ్యారేజెస్ గా మారిపోయాయి. ఇలా ఎందుకన్నానంటే పిల్లలు లవ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ కి ఒప్పుకోకపోతే ఇంట్లోంచి వెళ్లిపోవడం లేదా ఏదో ఒక అఘాయిత్యాన్ని చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది అందుకే పెద్దలు కూడా పిల్లల ఇష్టాలకు తలవంచి వ్యవహరిస్తున్నారు. పిల్లల ఇష్టాలను గౌరవించే తల్లిదండ్రులు దొరకడం అదృష్టమేగా మరి.
అయితే అసలు తంటా ఇక్కడ వచ్చింది. అసలు పరిచయాలే లేని భిన్న వ్యక్తుల మధ్య పెద్దలు కుదిర్చిన వివాహాలు కనుక అభిప్రాయాభేదాలతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారంటే
ఏదో అర్థం ఉంది కానీ
వ్యక్తిగతంగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇష్టపూర్వకంగా చేసుకున్న వివాహాలే కదా ఈ లవ్ మ్యారేజెస్ అన్నీ కూడా. వీళ్లు కూడా విడాకుల వివాదాలు తెచ్చుకుంటున్నారంటే అందుకు కారణాలేమిటి? అసలు సమస్య ఎక్కడ ఉంది అని వెతకడం మొదలుపెడితే
మైండ్ సెట్ అనేది మొదటి ముఖ్య కారణం. ఇండివిజ్యువాలిటీ, ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్, ఫ్రీడమ్ పదాలు భిన్నమైనప్పటికీ అంతర్థాలు మాత్రం ఒక్కటే. నవతరం అంతా విద్యావంతులే కనుక
ఒకరిపై ఒకరు పెత్తనం చలా ఇస్తే ఊరుకోరు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటలతో దాడి చేసుకుంటారు. వారు ఊహించని విధంగా జీవితంలో
ఏ మాత్రం మార్పులు తలెత్తినా భరించలేరు. ఒత్తిడి కారణంగా చూపుతూ విడాకులకు సిద్ధపడి పోతారు.
నిజం చెప్పాలంటే నవ దంపతులు సహజీవనం చేస్తున్నారే తప్ప సంసారం చేయడం లేదు. సంసారం (సారముతో కూడినది సంసారం) అంటే బాధ్యతలను పంచుకోవడం, బాధ్యతగా వ్యవహరించడం అలాంటి వాతావరణం కనిపించడం లేదు అసలు. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తితే ఊరి పెద్దలు కూర్చొని
పసిపిల్లలకు సర్ది చెప్పినట్లు
దానిని పరిష్కరించేవారు. అందువల్ల చిన్నచిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా పెద్దల సమక్షంలో ఉంటారు కనుక కాపురాలు సజావుగా సాగేవి. ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి ఇంట్లో అమ్మానాన్న
వాళ్ల కొడుకుకి కోడలికి నచ్చ చెప్పబోతే “మైండ్ యువర్ ఓన్ బిజినెస్” అంటూ కోడలు,
“మా పర్సనల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు” అంటూ కొడుకు హద్దులు పెట్టే రోజులు ఇవి. అలాగైతే ఈ సమస్యలకు పరిష్కారాలు లేదా అంటే వుంది చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా పిల్లల పెంపకంలోనే చిన్నప్పటి నుంచే విలువలతో పెంచాలి ఆ బాధ్యతను తల్లే తీసుకోవాలి. అప్పుడే వారు
కట్టుబాట్లను గౌరవించి, క్రమ పద్ధతిలో వ్యక్తిత్వాన్ని మలచుకోగలుగుతారు. లేదంటే
వివాహాలన్నీ వివాదాలే…. విషాదలే…. చివరకు విడాకులే….