క్షీరాబ్ది ద్వాదశి

   ఇంగువ అన్నపూర్ణ

ఏవండోయ్ ఈ రోజు ఏం రోజో తెలుసా! తెలిసే ఉంటుంది లెండి. ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి అని తెలియనివాళ్లెవరుంటారండీ నా పిచ్చిగానీ…..! ఈ రోజు పరమ పతివ్రత తులసికీ, శ్రీ మహా విష్ణువుకీ భూలోక వాసులు వివాహం జరిపించి పండుగ చేసుకునే రోజు. ఆ పురాణ గాథలోకి వెళ్దామా మరి……!
పూర్వం శంఖ చూడుడనే విష్ణువాంశ కలిగిన రాక్షషుడు ఉండేవాడు. అతని భార్య తులసి. తులసి మహా పతివ్రత. అందువల్ల ఆమె పాతివ్రత్య మహిమ వల్ల అతను చేసే అరాచకాలను దేవతలు ఎదుర్కోలేక పోయే వారు. ఇక అతనిని జయించటం తమ వల్ల కాదని నిశ్చయించుకున్న దేవతలు ఏకంగా శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి తమని రక్షించమని వేడుకుంటారు. అంతే కాదు ఎప్పుడైతే తులసి పాతివ్రత్యానికి భంగం కలిగుతుందో అప్పుడు ఆ శంఖచూడుడిని జయించవచ్చన్న రహస్యాన్ని విష్ణువుకి తెలియ చేస్తారు. అలా తులసి యొక్క పాతివ్రత్య భంగం చేయడానికి విష్ణు మూర్తి ఆమె భర్తయైన శంఖచూడుడి రూపంలో వెళ్ళి ఆమే శీలాన్ని హరిస్తాడు.
ఆ విషయాన్ని తన పాతివ్రత్య మహిమతో తెలుసుకున్న తులసి కృద్ధురాలై శ్రీ మహావిష్ణువును పాషాణం కమ్మని శపిస్తుంది. వాటిని సాలగ్రామాలంటారు. అప్పుడు విష్ణు మూర్తి మునుపు పూర్వ జన్మలో నీవు నన్ను భర్తగా కోరుకున్నావు కాబట్టి ఈ రోజు ఈ విధంగా నీ కోరిక తీర్చటమైనది అని తులసిని శాంతింప చేసి ఆమెకు కొన్ని వరాలు ప్రసాదిస్తాడు. అంతేకాదు నేను నీ భర్త రూపంలో వచ్చాను కాబట్టి అతడు కూడ నా అంశంతో కూడినవాడే కాబట్టి నీకు పాతివ్రత్య భంగ దోషం అంటదు అని ఆమెను ఓదారుస్తాడు. ఆ తరువాత ఇకనుంచీ భూలోకంలో స్త్రీలందరూ నిన్ను చెట్టు రూపంలో పవిత్రంగా చూసుకుంటారనీ, తమ తమ ఇళ్ళ బయట ఉంచి పూజలు కావిస్తారనీ వరం ప్రసాదిస్తాడు.
ఆ నాటినుంచీ శయన ఏకాదశినాడు శ్రీ మహా విష్ణువు యోగనిద్రనుంచి లేస్తాడు కాబట్టి మరునాడు ద్వాదశినాడు విష్ణు మూర్తికీ ( విసిరి కొమ్మకూ) తులసికీ ( తలసి చెట్టుకీ ) కల్యాణం జరిపించి తులసి కోట చుట్టూరా దీపాలు పెట్టి పూలు అలంకరించి స్త్రీలందరూ కలిసి నృత్యాలు చేస్తూ, గీతాలు పాడుతూ సంబరాలూ, వేడుకలూ జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అదే కాక చెరకు గడతో
తులసి కోట ముందర క్షీరాన్ని చిలికి ఆ పాలను తులసి నారాయణుల మీద చల్లుతారు. దీన్నే ‘చిలుకు ద్వాదశి’ అని అంటారు. ఇదండీ ఈ రోజు వైశిష్ట్యం!

Written by Inguva Annapurna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మహిళా తేజోమూర్తులు

బతుకు సూచీ..