ముఖ చిత్ర కవిత
కల్లలెరుగని పసి మనసులు
ఎల్లలులేని మసి మనుషులు
ఈ జనారణ్యపు మరో వేట దాడి
ఏదో నికృష్టతకు ఉదాహరణ
పాపాలు పాపాలు
పాపాయి అని చూడని కాంక్ష అకృత్యాలు
పాపాలు పాపాలు
హృదయం లేని రాక్షసుల అసంబద్ధ తాపాలు
కన్ను కత్తై
మాట మసిచేసే శకై
ఎప్పుడు సాయమవుతుందో
ఆ రోజే శాంతి నివాసమవుతుందీ జనారణ్యం
గ్రహావాసాలే గృహావాసాలై మీ గుండె సామర్థ్యం చూపే ఓ శాస్త్రవేత్తల్లారా
ఆడ అంటేనే వాడి మగ వికృతత్వం పేట్రేగే స్వభావ భావాల్ని పలిగట్టే
కొత్త మెషన్ ఏదైనా కనుగొనాలి
మగ పురుగు దగ్గరికొస్తే
మదమెక్కిన మృగమే అదయితే
అందరి అంతరంగాలకు అర్ధమయ్యే
అనంత శబ్ద తరంగాలనిచ్చే
మహా మిషన్నొకదాన్ని ఒంటికి అమర్చేలా
పాపలూ !పసి పాపలూ!
ఆధునిక పరిజ్ఞానం మొత్తం
అత్యవసరంగా ఒక్క త్రాటిమీదకొచ్చి
వచ్చే రోజుల్లో బీప్ యంత్రాలు మీకు కానుకగా ఇస్తారు
పాపా
నీ తల్లిదండ్రులు
కొత్త పాఠాలను నేర్చుకోవాలి
తేళ్ళు పాములు ఆకలిగొన్న జంతువులు ఎలా ఉంటాయో నీకు నేర్పగలిగే లెస్సన్స్ ప్రాక్టీస్ చేయాలి!
చేస్తారు!!
అంకెల గారడీలు
అడుగులకు చుట్టుకున్న
అయోమయం అమ్మా నాన్నలదయ్యిందని చింతించకు!!
– డా॥ కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు